చెన్నమ్మ ఇన్ని మాటలు చెప్పి, "నా తల్లీ ఎక్కడున్నావే...?" అంటూ ఏడ్వటం మొదలుపెట్టింది.
"ఊరుకో, ఏడిస్తే వస్తుందా..!" అంది ధైర్యం చెప్పి జానకి.
"జానకీ, జానకీ నీకో మాట! ధైర్యంగా విను. పొద్దున్న నువ్వు, చెన్నమ్మా ఇంట్లో లేరు. ఓ కోయవాడు వచ్చాడు- బోడి ఈ దగ్గర్లోనే వుందిట. నాలుగు రోజులు తిరక్కుండా వచ్చేస్తుందన్నాడు. మళ్ళీ పదిరోజుల్లో వస్తానన్నాడు. నూరు రూపాయలిచ్చా- ఎంతిస్తే ఏమిటి- నాకెందుకో బాగా నమ్మకం కుదిరింది. జానకీ... బోడి వస్తుంది- నీ ఆరోగ్యం పాడుచేసుకోకు!" అన్నాడు మాధవరావు భార్యను ఓదారుస్తూ. "పోనీ, అది కాకపోతే మరోదాన్ని తెచ్చుకుందాం, అంతే!" అన్నాడు.
పక్కనున్న చెన్నమ్మ ఒళ్ళు భగభగ మండిపోయింది.
"ముందు ఈ పిల్లని రానీయండి బాబూ! ఎక్కడుందో, ఏమో....ఎక్కడికి పోయావే తల్లీ!" అంటూ మళ్ళీ ఏడుపు మొదలుపెట్టింది చెన్నమ్మ.
"ఊరుకో, దాన్ని పిల్లలగే నువ్వు చూసుకున్నావే- కానీ, దాని బుద్ది దాందే!" మాధవరావు ఆ పిల్లపై కోపంతో ఎదురుగా వున్న కుర్చీని తన్నాడు.
ఫోను గణగణా మోగుతోంది. చెన్నమ్మ ఫోను తీసింది- "ఎవరయ్యా..?" అంది.
"పాప ఎలా వుందీ..?"
చెన్నమ్మ ఫోను జానకికి అందించింది- 'సరిగ్గా వినబడటం లేదమ్మా..!' అంటూ.
ఆ గొంతు వినగానే జానకి చేతిలోంచి జారిపడిపోయింది ఫోను- రాజీవ్!!
"ఇంక ఏం దాస్తాం... చెప్పేద్దాం!" అంది భర్తతో.
"ఊరుకో....టైమొచ్చినపుడు చెప్దాం. మనమెందుకు ముందే చెప్పాలీ!" అన్నాడు.
"ఎవరికి టైము ఎప్పుడొస్తుందో, ఎవరు ముందు చెప్తారో ఎవరు వెనక చెప్తారో, ఆ భగవంతుడే చెప్పాలి!" అంటూ లేచి వంటింట్లోకి వెళ్ళిపోయింది.
కడుపునిండా భోంచేసింది చెన్నమ్మ.
* * *
రాజీవ్ గబగబా ఆటో దిగి మమత చెయ్యి పట్టుకుని లోపలకొచ్చాడు.
వెనకాల చిన్న సంచీతో రాజయ్య వచ్చాడు ఇంట్లోకి. గుమ్మంలో నుంచున్న సుధ గబుక్కున లోపలికెళ్ళింది- రాజీవ్ వైపు చూసి నవ్వి!
లోపలున్న సుమతి వంటింట్లోంచి గదిలోకొచ్చి అలా నిలబడిపోయింది. 'ఎవరో మళ్ళీ ఈ దరిద్రపు పిల్ల!' అని మనసులో అనుకుంటుంటే, అంతలోనే తన మనసు దారి తప్పుతోందని భయపడింది.
రాజీవ్ తననేమీ పట్టించుకోకుండా ఆ పాపని గదిలోకి తీసికెళ్ళాడు.
"ఇది నీది!" అన్నాడు. బోడికి ఏమీ తెలియటం లేదు. ఈ ఇంట్లో వున్న ఆవిడ తనని చూసిందా, లేదా!!- ఆ అబ్బాయి తనని చూడనట్టే ఊరుకుంటాడే?!- మమతకి టక్కున సతీష్ గుర్తొచ్చాడు. అమ్మగారూ, అయ్యగారూ ఎలా వున్నారో!
రాజీవ్ పిల్లని లోపలి తీసుకెళ్ళాడు...
ఇల్లంతా చూపించాడు. "ఈ గది నీది!" అన్నాడు మళ్ళీ.
"స్నానం చెయ్యి..." అంటూ నీళ్ళగది చూపించి "ఈ సబ్బు రాసుకో, ఈ షాంపూతో తల రుద్దుకో, ఇంద తుండుగుడ్డ!" అన్నాడు.
తన చిన్న సంచీలోంచి ఓ పాత గౌను తీసుకుని నీళ్ళగదిలో కెళ్ళింది మమత.
"సుమతీ..." అన్నాడు రాజీవ్.
చాలా నెలలతర్వాత ఆ పిలుపు తిన్నగా సుమతి గుండెల్ని తట్టింది. ఏదో తెలియని ఆనందం..... ఒక్కసారి భర్త ఒడిలో వాలిపోయింది సుమతి. వస్తున్న దుఃఖాన్ని ఆపుకుందుకు ప్రయత్నిస్తోంది.
"నేను చెడ్డవాణ్ణి కాదు సుమతీ- మనవత్వం కోసం పాకులాడే ఒక జీవిని. అంతే- చూడు, ఆ చిన్నపిల్లని రోడ్డున వదిలేసి బ్రోతల్ హౌస్ లోకి పంపటం న్యాయమా?!"
సుమతి కన్నీళ్ళాపుకుంటూ రాజీవ్ గుండెల్లో ఒదిగిపోయింది.
రాజీవ్ కి గొప్ప తృప్తిగా ఉంది. ఇక ఈ పిల్లని ఎవరింటికీ పంపక్కర్లేదు తను అని.
మమత నీళ్ళగదిలోంచి వచ్చింది. తన గదిలోకెళ్ళి పోయింది. తల దువ్వుకుంది.....పౌడరు రాసుకుంది....చిన్న బొట్టు పెట్టుకుంది.... జానకి దాచేసిన గౌను గుర్తొచ్చింది.
ఆ ఇంట్లోవున్న శశికాంత్ సందులోవున్న కిటికీలోంచి తొంగి చూశాడు.
"నీ పేరేంటి?"
"సుబ్బి! ఆ... అదే-బోడి!"
శశికాంత్ కు నవ్వాగలేదు.
"నాన్నా.... దీని పేరు బోడి అంట!" అన్నాడు నవ్వి.
"నీ పేరు మమత, ఇంకెప్పుడూ బోడి, సుబ్బి అని చెప్పకు!" అన్నాడు రాజీవ్.
"మమత.... మమత!" రెండుసార్లు అనుకుంది ఆ పిల్ల మనసులో.
మమతకి ఇప్పుడు ఈ ఇంట్లో తనేమి పనులు చేయాలో, ఎవర్ని కనుక్కోవాలో అనిపించింది. వీధి తుడవాలి, అంట్లు తోమాలి...
అలా అనుకుంటున్న మమతని రాజీవ్ పిల్చాడు. సుమతి, సుధ, శశికాంత్ ని కూడా పిల్చాడు.
"మమతా... మీ అమ్మ లేదనుకుంటున్నావు కదా!"
"ఇదిగో.... మీ అమ్మ!" అన్నాడు సుమతిని చూపిస్తూ.
మమతకి ఏదో చెప్పలేని భావం! తనకీ అమ్మ వుందా? నిజంగా, అమ్మ వుందా!!
"సుమతీ.... ఒక్కమాట, నీకున్న భయమేమిటో నాకు తెల్సు- ఎవరీ పిల్ల! అని అడిగితే ఏం చెప్పాలీ.... అనికదూ?"
"కాదు..!" అంది సుమతి.
"ఈ పిల్ల మా పెద్దమ్మాయి.... ఇన్ని రోజులు అది అమ్మమ్మ దగ్గర పెరిగింది. మావారు మన పిల్ల అక్కడ ఎన్నేళ్ళు ఉంటుందని తీసుకొచ్చేసారు"
సుమతి అప్రయత్నంగా ఆ పిల్లని దగ్గరికి తీసుకుంది. "భయపడకు - ఇది నీ యిల్లు- అమ్మని నేనుండగా నీకేం భయం? అంది. రాజీవ్ తన చెవులని నమ్మలేక పోతున్నాడు.... సుధ కళ్ళు ఆనందంతో చెమర్చాయి.
"సుమతీ.... ఇప్పుడే నువ్వు తల్లివయ్యావు. పూర్తిగా తల్లివయ్యావు...." రాజీవ్ సుమతిని కౌగిలించుకుంటుంటే సిగ్గుతో తల పక్కకు పెట్టుకుంది మమత.
శశికాంత్ వెళ్ళిపోయాడు అక్కడు నుంచి. సుధ నోటికి చెయ్యి అడ్డం పెట్టుకు నవ్వుకుంది. దూరంగా చూస్తున్న రాజయ్య- "మా పాపగారికి ఇక మంచిరోజులే!' అనుకున్నాడు మనసులో.
మమతను తెచ్చిన రాజీవ్ ను చూస్తూ "నిజంగా బావా, నువ్వు మనిషివంటే! ఓ అనాధ పిల్లని పరువుగా బతికేందుకు నువ్వు చేసిన ప్రయత్నం మాటల్లో నేను చెప్పలేను" అంది సుధ.
"పాటల్లో చెప్పు" అంది సుమతి.
మమత దొడ్లో పూసిన సన్నజాజులు కోసి మాల కట్టింది. పూలు మాల కట్టడం చెన్నమ్మ నేర్పింది. కట్టిన ఆ మాలను సుధకి, సుమతికి ఇచ్చింది.
"నీకు నేను పెడతా.... రా ఇటు!" అంటూ సుమతి చిన్న ముక్కని తుంచి సైడ్ క్లిప్ తో ఆ కాస్త జుట్టుపైన పెట్టింది. మమత అద్దంలో చూసుకు మురిసిపోయింది. రాజీవ్ అన్ని పనులకీ మమతని పిలుస్తుంటే చాలా కోపమొస్తోంది శశికాంత్ కి.
ఆరోజు కూరగాయలు కొనడానికెడుతూ మమతని స్కూటర్ వెనక కూచోపెట్టుకున్నాడు రాజీవ్. ఆ స్కూటర్ అలా కదలగానే. శశికాంత్ లోపల కొచ్చాడు. సుమతి వంటింట్లో ఏదో పనిలో వుంది.
"అమ్మా, ఇది నాకు అక్క అవుతుందా, చెల్లి అవుతుందా?"
"అక్క... అవుతుంది"
"నీవు అబద్దం చెప్తున్నావు....ఇంతకాలం అమ్మమ్మ దగ్గరుందా- నేను ఎన్నిసార్లు అమ్మమ్మ దగ్గర కెళ్ళలేదూ!" అన్నాడు.
సుమతికి ఏం చెప్పాలో తోచక క్షణం తికమకపడి, "అందుకే మరి, అమ్మమ్మ అంటే- నీ అమ్మమ్మ అనుకుంటున్నావా.... మీ నాన్న అమ్మమ్మ" అంది ఏదో సర్దుతూ.
అమ్మ చెప్తున్నది పచ్చి అబద్దం అని వాడికి తెలుసు. అంతేకాదు..... ఓ అనాధ పిల్లని తేవాలా, వద్దా.... ఇంటికి! అనే విషయంలో అమ్మానాన్నా చాలాసార్లు పోట్లాడుకోటం కూడా తెలుసు. మరెందుకీ అబద్దం? ఏమన్నాకానీ, ఇది పనిపిల్లే- నేను దీన్ని 'అక్కా...' అనను, 'చెల్లీ...' అనను- అనుకున్నాడు గట్టిగా మనసులో.
పక్కింట్లోకి కొత్తగా అద్దెకొచ్చిన శ్రీధర్ అడిగాడు- 'ఈ గుండు పిల్లెవరురా?' అని నవ్వుతూ.
"మా పనిపిల్ల!" అన్నాడు శశికాంత్.
శశికాంత్ మనసు ఒప్పుకోవటం లేదు- దీన్ని 'అక్కా...' అనటానికి! అంతేకాదు, ఈ పిల్లని అమ్మానాన్న తనతో బాటుగా చూడటం, అది మమ్మీ, డాడీ.....అని పిలవడం చూస్తుంటే దాన్ని ఎప్పుడెప్పుడు ఇంట్లోంచి వెళ్ళగొడదామా.... అని వుంది దానికి డాష్ కొట్టాడు.
"కళ్ళు కనిపించటం లేదా?" అరిచాడు. ఓ దెబ్బ వేయాలనుకున్నాడు కానీ, ఎదురుగా తండ్రి ఉండటం చూసి ఊరుకున్నాడు.
జానకి, మాధవరావుల గురించి తల్చుకుంటే చాలు- కసి గొంతుదాకా నిండిపోతోంది రాజీవ్ కి! లోకంలో ఇంత అన్యాయం వుంటుందా...అని ఆశ్చర్యపోతాడు. పోన్లే, నా తల్లి నా దగ్గర కొచ్చేసింది- అంటూ తృప్తి పడతాడు.
జానకీ, మాధవరావుల మధ్య ఇంట్లో రోజూ ఘర్షణే!
"అసలు- మీరే దాన్ని ఎక్కడికో పంపేసి వుంటారు!" అంది కోపంగా జానకి.
"ఏమిటీ, నా అనుమానం- నువ్వే దాన్ని ఎక్కడికో పంపేసి వుంటావు!" అన్నాడు మాధవరావు.
