"షటప్- పిల్ల తప్పిపోయి నెలరోజులవుతుంటే పట్టించుకోరా?-మీరు మనుషులా? మీమీద నేనే కంప్లయింట్ ఇస్తున్నా.... బి రెడీ!" ఫోను పెట్టేశాడు.
మాధవరావు ముఖాన పట్టిన చెమట తుడుచుకుంటూ సోఫాలో కూలబడిపోయాడు.
"జానకీ..." అరిచాడు.
ముఖం వెలతెలపోతుంటే, చీర కొంగుతో కన్నీళ్ళు తుడుచుకుంటూ, "ఏమిటీ..." అంది.
"బయల్దేరు, అర్ధగంటలో బయల్దేరుదాం- ఇంక దాగదు- ఆ పిల్ల నా ప్రాణానికి శని... దాన్ని తెచ్చి నా బతుకును అవమానపరిచావే- వాడు నన్ను పోలీసులకి పట్టిస్తాడట! పిల్లని ఎవరికి అమ్మామో చెప్పాలట. చూసావా జానకీ, నా మాట వినలేదు- దరిద్రపు పిల్లల్ని తెచ్చుకుంటే మనకీ దరిద్రం పడుతుందంటే-" అంటూ భార్యతో ఎక్కడి కెడుతున్నామో చెప్పాడు.
వంటింటి గుమ్మంలో నుంచున్న చెన్నమ్మకి చాలా సంతోషంగా వుంది ఎందుకో! వేడిగా కాఫీ కలుపుకు తాగింది.
"ఏముందీ.... వాడి కాళ్ళు పట్టుకుని పిల్లని వెతికే ప్రయత్నంలో సహాయం కోరదాం అవసరానికి గాడిద కాళ్ళు పట్టుకోవాలన్నారుగా!" చెన్నమ్మ చీర కొంగుతో మూతి తుడుచుకుంది. జానకి హడావిడిగా చిన్న సూట్ కేసులో రెండు చీరలు, భర్తవి రెండు జతలు బట్టలు పడేసింది.
"అమ్మా, నన్ను తీసికెళ్ళండి..... హైదరాబాద్ చూడలేదమ్మా!" అంది.
"నోర్ముయ్.....హైదరాబాద్ చూడ్డానికా వెడుతోంది!" అరిచాడు మాధవరావు.
"నేనొస్తానమ్మా.... మీకు కొంత సాయంకదా- నేనొస్తే!" బతిమాలింది చెన్నమ్మ.
* * *
రాజభూషణరావు ఆశ్రమ విషయంలో చాలా బాధ్యత వహించాలని నిశ్చయించుకున్నాడు.
కానీ-చంద్రయ్య తిరుపతమ్మల పెత్తనం భరించటం కష్టంగా అనిపిస్తోంది అక్కడి వాళ్ళందరికీ వంటింటి పెత్తనం థేఉస్కున్న తిరుపతమ్మ చేసే అక్రమాలకి లెక్కలేదు. రాజభూషణరావు వచ్చినపుడు అతి వినయంగా నటిస్తూ ఆయన అటు వెళ్ళగానే చంద్రయ్య గదిలో సీసాల ముందు కూర్చుంటాడు.
చంద్రయ్యకి తోడు- మరొకన్ని ఆశ్రమంలోకి తెచ్చాడు. ఇద్దరూ కలిసి పేకాట ఆడటం, తాగటం బాగా ఎక్కువైంది. వీళ్ళతో దోస్తీ బాగా పెరిగింది తిరుపతమ్మకి! ఆశ్రమంలో వున్న ఎవరూ ఏమీ అనకుండా- ముందే ఏదో వంకతో పోట్లాడటం ప్రారంభించింది. ఆశ్రమంలో అవినీతి పెరిగిపోతుందని అక్కడున్న వాళ్ళందరి మనసులూ బాధపడుతున్నాయి. పైగా.....తిరుపతమ్మ రాత్రిళ్ళు కూడా చంద్రయ్య గదిలో వుంటోందనే విషయంలో గుసగుసలు మొదలయ్యాయి. ఎవరికి ఏం చేయాలో తెలియటం లేదు. కొందరు ఆశ్రమాన్ని వదిలి మరోచోట కెళ్ళిపోయారు. రాజభూషణరావుకి మెల్లమెల్లగా విషయాలు తెలుస్తున్నాయి. ఆశ్రమ నిర్వాహణలో అన్నీ అవకతవకలే.....చంద్రయ్యని పంపేయాలని నిశ్చయించుకున్నాడు.
కానీ, ఆమాట ఆనోటా ఈనోటా తెలిసింది చంద్రయ్యకి. వారంరోజులయ్యే సరికి చంద్రయ్య భార్య తీర్ధయాత్రలకి చుట్టాలతో కలిసి వెళ్ళింది.
రాజభూషణరావు కొడుకు వచ్చాడని విన్న కొద్దిమంది ఆశ్రమంలో వుండే స్త్రీలు చాలా సంతోషించారు. ఆ బాబుతో చెప్పి ఈ చంద్రయ్యని వెళ్ళగొట్టించాలి త్వరగా అనుకున్నారు.
రాత్రి భోజనాలయ్యాయి. చంద్రయ్య, తిరుపతమ్మా రోజుకన్నా ఉత్సాహంగా, రకరకాల జోకులు చెప్పుకుని నవ్వుకుంటుంటే, అసహ్యమేసింది అక్కడి వాళ్ళకి. లీల మరణించాక ఆశ్రమంలో భక్తికి సంబంధించిన ఏ ఉపన్యాసం కానీ, పూజా కార్యక్రమం కానీ జరగటంలేదు. రేపు అందరూ కలిసి రాజభూషణరావు దగ్గరకెళ్ళి, ఆశ్రమంలో జరుగుతున్న అక్రమాలు చెప్పి రావాలని నిశ్చయించుకున్నారు స్త్రీలు. ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో, ఎవరెవరు ఏ విషయం చెప్పాలో కూడా అనుకున్నారు. చంద్రయ్య భార్యని తీర్ధయాత్రలకని చుట్టాలతో పంపేశాక, చాలా హాయిగా వున్నాడు. అతనికి ఎదురుచెప్పేవారు లేకపోయారు ఆశ్రమంలో.
తెల్లవారింది. వంటింట్లో ఏ సందడీ లేదు. ఎవరి పనులు వారు పూర్తి చేసుకుని వంటింట్లోకి వస్తే, తిరుపతమ్మ లేదు, వంట మనిషిలేదు, చంద్రయ్య లేడు.
ఏ అర్దరాత్రో తిరుపతమ్మా, చంద్రయ్య ఆశ్రమంలో వున్న వస్తువుల్లో వీలైనన్ని దోచుకుని పరారయ్యారు! వృద్దాశ్రమానికి రక్షణలేదు.
కాలం ఎవరికి ఏమీ చెప్పదు కదా! రాజభూషణరావు కొడుకు ఆ ఆశ్రమాన్ని కూలగొట్టి ప్లాట్స్ చేసి అమ్మేందుకు కాంట్రాక్టరుతో మాట్లాడాడు ఆ రాత్రే!
* * *
ఆశ్చర్యపోయాడు రాజీవ్ వాళ్ళను చూసి.
ఇంట్లో అడుగుపెడుతుంటే కాళ్ళు గజగజా వణికాయి జానకికి, మాధవరావుకీ!
ఇంట్లో అడుగుపెట్టగానే అటు ఇటు చూస్తోంది చెన్నమ్మ. సుమతి వచ్చి "టిఫిన్ తిందాం రండి" అంది. ముఖాలు కడుక్కోటమైంది....అంతా డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నారు.
వేడి ఇడ్లీలు, పెసరట్లు బల్లమీద పెట్టింది సుమతి. ఏవీ గొంతు దిగటంలేదు జానకికి. శశికాంత్ తలుపు పక్కన నిలబడ్డాడు వీళ్ళని చూస్తూ. 'ఏం చేద్దాం అంటారూ..!' అన్నాడు మాధవరావు గొంతు సర్దుకుంటూ, జానకి రాజీవ్ ముఖంవైపు చూడలేకపోయింది.
"ఇప్పుడేం చేస్తాం" అన్నాడు చెన్నమ్మ వైపు చూస్తూ.
"అదేనండీ - నేను ఊరికే మొత్తుకున్నానండీ - పోలీస్ స్టేషన్ లో చెప్పండీ- అని! ఎక్కడ పోయిందో, తల్లీ బోడీ - ఎక్కడున్నావ్..?" అంటూ మళ్ళీ ఏడుపు లంకించుకుంది చెన్నమ్మ రాజీవ్ వైపు చూస్తూ.
కళ్ళతోనే వారించాడు మాధవరావు- చెన్నమ్మని కళ్ళు తుడుచుకుంది అటు గదిలోకి చూస్తూ. మాధవరావు ముఖం కందగడ్డలా ఎర్రబడింది. మానవత్వం లేకుండా డబ్బు మాత్రమే జీవితమానుకుని క్లబ్బులని, పార్టీలనీ వెడుతూ కాలం గడిపేవాళ్ళు మనుషులా? వాళ్ళిద్దరినీ ఇక్కడికిక్కడే షూట్ చేస్తే పాపమొస్తుందా తనకి! రాదు.
"మీరేదయినా ప్రయత్నం చేస్తారేమోనని!" - నసిగాడు మాధవరావు.
"మీరు వచ్చారు, సంతోషం! కానీ, ఆ పిల్లని వెతికే ప్రయత్నం నేనేమీ చేయను. ప్రాప్తం వుంటే తిరిగి వస్తుంది- లేకపోతే లేదు. అయినా....అనాధపిల్ల గురించి ఎందుకండీ.....అంత గొడవ?!" అన్నాడు రాజీవ్ చాలా తేలిగ్గా.
ప్రతిమాటా జానకి గుండెల్లో వాడిగా దిగుతోంది. రోడ్డు పక్కన కుక్కపిల్ల ఏడుస్తుంటే, ఎందుకో అని జాలపడతాం కదా.... దాన్ని రాళ్ళేసి కొట్టి చంపుతామా, ఊరికే చెప్తున్నా....అనాధ పిల్ల కదా, దానికెవరున్నారులే...అని దాన్ని కొట్టి తిట్టి చేస్తే!"
"మేమెంత ప్రేమగా చూసామో తెలియదా రాజీవ్! ఒక్కనాడు కూడా దాన్ని కొట్టలేదు" అంది జానకి.
"మీరు కొట్టారని కాదు- ఊరికే చెప్తున్నా- అనాధ బాలికల్ని ఆదరించటమే పుణ్యం...వాళ్ళని కొట్టి బోడిగుండు చేయించా..."
"ఏమిటీ.....బోడిగుండా - ఛీ... ఆడపిల్ల ఎవరైనా సరే- జుట్టు ఎంత అందాన్నిస్తుందీ!" అంది జానకి. మాధవరావు, చెన్నమ్మ వైపు చూస్తున్నాడు.
"ఊరికేనా, అదీ ఉదాహరణగా అంటున్నా- వాళ్ళకీ ప్రాణం వుంది, వాళ్ళలోనూ ప్రవహించేది రక్తమే- వాళ్ళకీ అభిమానముంది- వాళ్ళకీ..." ఆపైన రాజీవ్ మాట్లాడలేక పోయాడు. గొంతు వణికింది.
"నిన్ను నమ్మి నేను నా పిల్లని అప్పగించా- జానకీ... నువ్వూ, మీవారు దాన్ని అమ్మేశారా?"
జానకి నోటమాట రాలేదు. మాధవరావు ఠక్కున లేచాడు. "లే... పద పోదాం- మీకిష్టమైతే వెతకండి- లేకపోతే ఊరుకోండి- ఓ దిక్కుమాలిన పిల్లకోసం మమ్మల్ని మాటలంటున్నారే! -పద జానకీ!"
జానకి దీర్ఘంగా నిట్టూర్చింది. దాన్ని ఈపాటికి ఏ వ్యభిచార గృహానికో ఎవడో చేర్చే వుంటాడు. రాజీవ్ కి ఎలాగైనా మాధవరావుని ఏడిపించాలని వుంది. "చాలా అగౌరవంగా మాట్లాడుతునంరు- నువ్వు బయల్దేరు" అన్నాడు చెన్నమ్మతో.
"నేను రానయ్యా, ఆ పిల్లని ఎలాగైనా వెతికి తెచ్చి, చూస్తేకానీ నేను రాను" అంది మొండిగా చెన్నమ్మ. "ఎక్కడుంటే ఏమిటీ- ఇక్కడే పడుంటా- అంత చాకిరీ చేసి ఇంత గుప్పెడన్నం తింటా!" అంటూ నేలమీద చతికిలబడింది. జానకి ముఖాన నెత్తురుబొట్టు లేదు. ఆ ఇంట్లో వున్న అబ్బాయి గుమ్మంలో నిలబడి చూస్తున్నాడు.... 'వుందిగా చెప్పరేం' అనుకుంటున్నాడు మనసులో! తను చెప్పేస్తే? తండ్రి తనని బతకనీయడు! ఈ బోడిగుండుది పోతేనే బాగుంటుందిగా! 'భోజనం చేసి వెళ్ళండి' అన్నాడు రాజీవ్.
"క్షమించండి- నా మనసులో బాధతో అలా అన్నాను. అయినా మీరెవరని, దానిని కన్నవాళ్ళా, పెంచినవాళ్ళా? పనిమనిషి మీద ఎవరికైనా ప్రేమ వుంటుందా!"
ముళ్ళమీద నుంచున్నట్టుంది జానకికి.
చెన్నమ్మ రాననటం మరీ బాధగా వుంది మాధవరావుకి.
రాజీవ్ "సుమతీ..." అన్నాడు గట్టిగా, జానకీ, మాధవరావు చూస్తున్నారు.
పళ్ళెంలో పళ్ళు, జాకెట్టు బట్ట, కుంకుమ్మ బరిణ పట్టుకొచ్చింది...జానకికి బొట్టుపెట్టి అందించింది. అంతే! గబుక్కున వచ్చి చెన్నమ్మ ఒడిలో దూరిపోయింది మమత! జానకి కళ్ళని నమ్మలేకపోతోంది...మాధవరావు నిశ్చేష్టుడయ్యాడు.
దొంగల్ని, హంతకుల్ని చూసి బెదిరిపోతున్నట్లుగా, చెన్నమ్మని గట్టిగా కావలించుకుంది మమత.
జానకి కన్నీళ్ళాగలేదు.
సింహాన్ని చూస్తున్న జింక పిల్లలా వణికిపోతోంది మమత.
సుమతి కన్నీళ్ళు తుడుచుకుంది.
"మా పెద్దమ్మాయి!" అంది రాజీవ్ వంక చూస్తూ.
జానకీ, మాధవరావు తల దించుకున్నారు. "నేను వెళ్ళను" అంది మమత- తనని వాళ్ళతో పంపుతారేమోనని భయంగా... తల్లి సుమతి వెనక దాక్కుని.
"అయ్యకి,అమ్మకి దణ్ణంపెట్టు" అంది చెన్నమ్మ.
మమత వంగి నమస్కరిస్తుంటే, జానకి కన్నీళ్ళు మమత గుండుపై పడ్డాయి.
కాలం అతి వేగంగా పరిగెత్తింది. ఎవరికోసం ఆగకుండా.
14 ఏళ్ల శశికాంత్ ని రెసిడెన్షియల్ స్కూల్లో చేర్పించాలని నిశ్చయించారు తల్లీతండ్రి. "మీరేమన్నా చెప్పండి - దాన్ని చచ్చినా అక్క అని పిలవను" అన్నాడు ఎత్తుగా ఎదిగిన శశికాంత్- హాస్టల్ లో చేరినరోజు తండ్రితో!
చుడీదార్, పైజమాతో పొడుగైన జడతో యవ్వన శోభతో....వికసించిన పుష్పంలా వున్న మమత-తండ్రి రాజీవ్ స్కూటర్ పై స్కూలు ముందు దిగి నడిచి లోపలకెళుతూ-
"డాడీ...బై!" అంది.
రాజీవ్ కళ్ళలో, ఆ నడక, ఆ జడ ఎవరో గుర్తుచేస్తుంటే కళ్ళు చెమర్చాయి. ఇంట్లోకొచ్చిన రాజీవ్ గుమ్మంలో పడున్న ఉత్తరం చదివి, కళ్ళని నమ్మలేనట్టుగా ఆశ్చర్యపోయాడు. మళ్ళీ మళ్ళీ చదువుకున్నాడు. తనని 'అన్నయ్యా...' అని సంబోధించడం! మాధవరావు చాలా సుస్థిగా వున్నాడట...అమెరికాలో అతని తమ్ముడు వాళ్ళిద్దరినీ అక్కడికి రమ్మంటున్నారడుట - చివరి విషయం ఏమిటంటే, హైదరాబాద్ లో వున్న ఆ పెద్ద భవనం మమత పేర రాసేసాడు..... విల్లు రాసి రిజిష్టర్ చేసేసాడు. ఆ కాగితాలు త్వరలో వస్తాయి నీ దగ్గరకి.
'మమ్మల్ని క్షమిస్తావుకదూ' - జానకి
రాజీవ్ గుండె పట్టుకున్నట్టయింది. విల్లు రాసేసి, అమెరికా వెళ్ళిపోతున్నాడు. పెంచిన మమత ఇంత గొప్పదా!! కాలేజీ నుంచి గబగబ లోపలికొస్తున్న మమతకి, ఉత్తరం అందించాడు రాజీవ్! నీళ్ళు నిండిన కళ్ళు రహస్యంగా తుడుచుకుంటూ!
"ఎవరూ అమ్మాగారా!" అంది ఏమిటో అర్ధంకాక మమత, సుబ్బి, బోడి!! ఉత్తరం అటు ఇటు తిప్పింది నవ్వుతూ.
.........అయిపోయింది.........
