'శారదా - శారదా' తలుపు తట్టాడు. తలుపుతీయలేదు - ఇంత మొద్దునిద్రా - 'శారదా - శారదా' తలుపు విరగొట్టాలనుకున్నాడు పక్కవైపుకెళ్ళి చూస్తే ఆ గదిలోకున్న వంటింటి వైపు తలుపు తీసుంది. గదిలో మంచం ఖాళీగా వుంది - శారద ఎక్కడి కెళ్ళిందో - ఛీ, అనవసరంగా రామాన్ని హోటల్లో కూచోపెట్టానే - ఎక్కడికెళ్ళి వుంటుందో - చెప్పి వెళ్ళచ్చుగా -ఏడుపొచ్చింది వేంకటేశుకి, తనెళ్ళి ఏం చేస్తాడు !!
హోటల్లో కూచున్న రామంతో అంది లలిత, నీకు నమ్మకముందా శారద ఒప్పుకుంటుందని"
'నాకు నమ్మకం లేదు - కానీ వాళ్ళ అన్నయ్యనేను కాంప్రమైజ్ కి ఇష్టపడటం లేదని నన్ను అనకుండా వచ్చాను. పాపం, అన్నగా అతను బాధపడుతున్నాడంతే. గ్లాసులో నీళ్ళు గబగబా తాగేసాడు.
"ఇంత అయ్యాక మళ్ళీ కలసి జీవించటం కూడా కష్టమేకదూ' లలిత రామం ముఖంలోకి చూసింది.
నిజమే - అయినా ఇది కుదరదు. ఎంత త్వరగా కేసుతేలిపోతే అంత మంచిదినాకు కూడా. నా బ్రతుకు నేను చూసుకుంటా' అన్నాడు రామం గడియారం వంక చూసాడు. అక్కడ కొచ్చి గంట అవుతోంది.
రామం, లలిత వెళ్ళిపోయారు.
వేంకటేశు ఆ గది ముందరే నిల్చున్నాడు. శారద గబగబ తోసుకొస్తోంది గదిలోకి.
"ఇమ్తఃలో ఎక్కడ మాయమయిపోయావు. ఎక్కడికెళ్ళావు చెప్పు" - "ఫోను చేద్దామని" - నసిగింది శారద.
'నిన్ను ఎవరూ బాగు చేయలేరు - రామాన్ని రమ్మన్నాను. రామం, లలిత, ఆహోటల్లో నాకోసం ఎదురుచూస్తూ వుంటారు. పద, వెడదాం శారదకి అర్ధమయింది. ఇందాక అన్న కాంప్రమేజ్ పిటిషన్ అర్ధం ఇదీ, రామాన్ని ఈ విషయాలు మాట్లాడడానికి పిల్చాడన్నమాట. తను అతని ముఖం చూడదల్చుకోలేదు. పైగా లలిత, రామం కలసి వచ్చారా. ఇంకేం లలిత ఇందుకోసమే ఎప్పట్నుంచో ఎదురు చూస్తోంది. రామాన్ని ఎలా తనవైపు తిప్పుకోవాలా అని చూసింది - ఆనాడు తను ఆస్పత్రి నుంచి వచ్చినపుడు ఇంట్లోవున్నదే లలిత - ఛీ ఛీ - శారద ఒళ్ళు ఉడికిపోయింది - అంతకుముందునుంచీ వున్న అను మానము వృక్షమై ఊడలు దిగిమరీ విస్తరించిపోయిందా క్షణంలో.
"నేను రాను" - చచ్చినా రాను - దాన్నే వేంకటేసుకు తిరగమను అరిచింది. వేంకటేశుకి కోపం కట్టలు తెచ్చుకుంది. "నువ్వురావా" అరిచాడు.
'రాను' - శారద చెంపచెళ్ళుమంది. శారద చెంపమీద దెబ్బ పడ్డతరువాత వేంకటేశు కళ్ళలో నీళ్ళు తిరిగాయి -
'దాన్ని కొట్టే అధికారం తనకేముంది - దాని జీవితం దాంది - అనవసరంగా చెయ్యి చేసుకున్నందుకు చాలా పశ్చాత్తాపపడ్డాడు. తన ఓర్పునసించిపోయింది. అయినా ముప్పయి ఏళ్ళొస్తున్న చెల్లెలు తన జీవిత మార్గం తను చూసుకోలేదా! - తనకెందుకు ! ఇక తను ఇక్కడుండటం అనవసరం - నాన్న, పిన్ని ఎల్లుండి రిజర్వుటిక్కెట్లతో రాగలరు - తను ఈక్షణమే ఏదో ఒక బస్సులో వెళ్ళిపోవాలి - వేంకటేశు నిశ్చయించుకున్నాడు.
"నేను ఊరెళ్ళిపోతున్నా - నాన్నని, పిన్నిని ఎల్లుండి బస్సెక్కించు" - శారదకి వినిపిస్తున్నాయి మాటలు వేంకటేశు సూట్ కేసుతో, బయటకి నడిచాడు. శారద వేంకటేశు వెళ్ళిపోతుంటే చూస్తూకూచుంది.
అంతసేపు ఫోను మోగినా నీరజ ఎందుకు తీయలేదో అర్ధంకాలేదు శారదకి. ఆ విషయమే ఆమె మనసుని పీడిస్తోంది - నాన్న పిన్ని కూడా వెళ్ళిపోతే బావుండును. రెండురోజులు నీరజతో గడిపివస్తుందితను అనుకుంటూ గేటువేసి లోపలకొచ్చింది శారద.
* * *
13
హోటల్ నుంచీ వచ్చేశాక రామం మనసు మరీగాయపడింది. రమ్మని చెప్పింది శారద అన్నయ్య. లలిత బలవంతం చేసింది తను అభిమానం చంపుకుని అక్కడికి వెళ్ళాడు - వెడితేరాదా మాట్లాడటానికి ఆడదానికి అంత అహంకారమైతే తనకేనా ఏమీ లేనిది - ఇంటికొచ్చిన రామం మళ్ళీ బయటకెళ్ళాడు తిన్నగా ప్లీడరు ఇంటికి -
"నేను నీకు కబురు పెడదామనుకుంటున్నాను. నాలుగు రోజుల్లో కేసువుంది - ఏం చేద్దాం - నువ్వు అసలు కనిపించటమే మానేశావు - ఆ ....నిన్నెందుకు పిలిపించానంటే వాళ్ళ ప్లీడరు నాతో మాట్లాడాడు - ఆ పిల్ల అన్నయ్య కలిసాడటకదా కాంప్రమైజ్ కోసం చూస్తున్నానన్నడట, - ఏమిటి మరి - నాకేం అర్ధంకావటంలేదు - నువ్వు ఏ విషయం నాతో చెప్పటం లేదు - ఒకవేళ కేసుపెండింగులో వుండగా, ఆ అమ్మాయితో హనీమూన్ వెళ్ళాలనుకుంటున్నవేమో - ఆ పకపకా నవ్వాడు ప్లీడరుగారు "ఆ గొడవ ఏం లేదు - కాంప్రమైజ్ అనేదికూడా వాళ్ళ అన్నయ్యగొడవే, అమ్మాయికి అక్కర్లేదు - మీరు కేసుపూర్తిచేసే సేయండి. ఇంక దయుంచి వాయిదాలు కోరదు - నా భవిష్యత్తు దీనిపైన ఆధారపడి వుంది" అన్నాడు రామం ప్లీడరును బతిమాలుతూ.
వకీలు, రామం మాటలన్నీ ఎన్నాడు. ఆ భవిష్యత్తు ఈ విడాకులపైన ఆధారపడి వుందా - అంటే, విడాకులవగానే పెళ్ళి చేసుకోవాలనే తొందరలో వున్నాడని అర్ధమైంది రామనాథానికి.
"ఎవర్ని చేసుకోవాలనుకుంటున్నావు" -
"అబ్బే - ఇంకా ఎవర్నీ అనుకోటం లేదు. ఈ కేసు తేలిపోతే మనసుకి విశ్రాంతి అంతే రామంతలవంచుకునే మాట్లాడుతున్నాడు "కేసు తేలిపోతుందిలే - అదెంతసేపు" - రామనాథం, రామం, వివరాలన్నీ కనుక్కున్నాడు.
'మీ నాన్నగారున్నారా'-
'లేరండీ - నా చిన్నతనంలోనే పోయారు. మా అమ్మగారు ఊళ్ళో వ్యవసాయం చేయిస్తూ వుంటారు"
"మరోలా అనుకోకు ఇది నా వృత్తికి సంబంధించినదికాదు - కాకపోతే, సంఘసేవకి సంబంధించింది. 'రామనాథం అంటుంటే, లయన్సు క్లబ్బులాటి డానికి దేనికో విరాళం అడుగుతున్నాడనుకొన్నాడు రామం "చెప్పండి" - ఉత్సాహంగా అన్నాడు.
'విడాకులయ్యాక పెళ్ళిచేసుకుంటావుగా"
"అనుకుంటున్నానండి"
"ఎవరైనా వున్నారా నీ దృష్టిలో - మరేం ఫరవాలేదు నాతోచెప్పచ్చు, నేను నీకు ఫ్రెండులాంటి వాన్నే" అన్నాడు రామనాథం.
