ఎక్కడి జలియన్ వాలాబాగ్, ఎక్కడి పంజాబ్? అక్కడ జరిగిన దురంతాలు దేశాన్నంతనీ ఎట్లా కదిలించాయి? కాలమహిమ! పంజాబుకూడా భారత దేశమే; అక్కడా బ్రిటిషు పరిపాలనే ఉంది. ఇవాళ అక్కడ జరిగిన సంఘటనలు రేపిక్కడ జరగవచ్చు, ఇక్కడ జరక్కపోతే అది ఇక్కడి వాళ్ళ దేశభక్తి దీక్షకు కళంకమవుతుందేమోగాని బ్రిటీషువాళ్ళ మంచి తనానికి నిదర్శనం మటుకు కాదు. ఈ దృష్టి చదువుకున్న వాళ్ళందరికీ పూర్వంకంటె ఇప్పుడు బాగా ఏర్పడింది.
రౌలర్ చట్టం, సత్యాగ్రహం, జలియస్ వాలాబాగ్, కాల్పులు డయ్యర్ అనేమాటలు సుందరం విన్నాడేగాని ఈ సంఘటన వెనుకవున్న రాజకీయాలు సుందరం ఎరగడు. అయినా ఈ సంఘటనవల్ల వాడిలో ఏదో వికారం కలిగింది. తొమ్మిదేళ్ళు నిండిన సుందరం ఈ సంఘటనకు తాత్వికంగా అవగాహన చేసుకోవటానికి ప్రయత్నించాడు. అధికారంలో వున్నవాళ్ళు ఇటువంటి పనులు ఎట్లా చేస్తారు? ఎందుకు చేస్తారు? మనుష్యులకు ఎరగని మనుష్యులమీద అంత ఆగ్రహం ఎట్లావస్తుంది? దొంగతనం చేసినవాణ్ణి పోలీసులు పట్టుకోవచ్చు, ఖైదులో పెట్టవచ్చు; కాని సభ చేస్తున్నవాళ్ళను చేతులారా ఎట్లా కాలుస్తారు? ఈ సంగతి ప్రపంచానికంతా తెలుస్తుందని వాళ్ళకు తెలీదా? ఈ ప్రశ్నలు వాణ్ణి బాధించాయి. చెడ్డతనమూ, చెడ్డబుద్దులూ అనేవి చదువుకున్న వాళ్ళలోనూ, ఉద్యోగాలు చేసేవాళ్ళలోనూ, అధికార్లలోనూ ఉండవనీ, తక్కువ కులాల వాళ్ళాలోనూ, కూలినాలి చేసుకునే అలగాజనంలోనూ, మర్యాదలేకుండా జీవించే భిచ్చగాళ్ళు, రౌడీలు మొదలైనవాళ్ళలోనూ మాత్రమె ఉంటాయనీ, సుందరానికి భ్రమ ఉండేది. ఆ భ్రమ ఒకంతట వదిలేది కాదు; అయినా బాగా దెబ్బతిన్నది.
* * * *
సుందరం సీతప్పగారి క్లాసులోకి వచ్చాడు. సీతప్ప గారు స్కూలు పెట్టినప్పటినుంచీ ఉన్న మేష్టరు. అప్పడిది హైస్కూలు కాదు, మిడిలిస్కూలు, ఇప్పుడున్నచోట ఉండేది కాదు, దయ్యాలమర్రి దగ్గరఉండేది.
స్కూల్లోఉండే మేష్టర్లందర్లోకీ మెత్తనివాడు సీతప్ప పిల్లల్ని "ఏమయ్యా" అని పిలిచేవాడు. సాంబయ్యగారల్లేనే ఈయనా దేశభక్తి పరాయణుడు. అయితే ఆదర్శవాది. ఎప్పుడూ బ్రిటిషువారిని తిట్టేవాడు కాదు. బ్రిటీషువాళ్ళమీద కోపంకొద్దీ సాంబయ్యగారు క్రాపు తీనేసి గుండు చేయిస్తే, సీతప్పగారు ఎప్పుడూ సనాతన ధర్మాన్నే అనుష్టించేవాడు. మత గ్రంథాల మీదా, వేదాంత గ్రంధాలమీదా ఆయనకు చాలా ప్రీతి, ముఖ్యంగా ఆయనకు భగవద్గీత అంటే చాలా ఇష్టం.
ఒకరోజు సీతప్పగారు క్లాసులోకి అడుగుపెట్టటమే విచారంగా అడుగుపెట్టాడు. ప్రార్ధన కాగానే ఆయన అటెండెన్సు కూడా తీసుకోకుండా చాలా ఖిన్నుడైపోయి, "చాలా గొప్పవాడు పోయినాడయ్యా!" అన్నాడు.
"ఎవరండీ పోయిందీ?" అన్నారు విద్యార్దులు.
"బాలగంగాధరతిలక్, మహానుభావుడయ్యా! అవతార పురుషుడు. ఆయన పోవడం దేశానికి పెద్దదెబ్బ. అటువంటి మహానాయకుడు దేశానికి మరి దొరకడు. గాంధీ' అని ఇంకో ఆయన ఉన్నాడు గాని_ ఎబ్బే . తిలక్ మహశయుడి కెవ్వరూ చాలరు. 'యదాయదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత, అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం' అంటూ చచ్చిపోయినాడు! మహానుభావుడు, మహానుభావుడు! ఇవాళ నిజంగా బడికి శలవివ్వటం ధర్మం" అని విద్యార్దులకు చెప్పాడు సీతప్ప.
ఇదే సాంబయ్యగారైతే, ఈ తిలక్ ఏంచేశాడో, ఎందుకు గొప్పవాడో పిల్లలకు చెప్పి, ఏదోవిధంగా బ్రిటిషువాళ్ళను తిట్టి ఉండేవాడే. సీతప్పగారి విచారంచూసి పిల్లలు విచారపడ్డారేగాని తిలక్ గారిని గురించి వాళ్ళు తెలుసుకున్నదేమీ లేదు.
ఆపీరియడ్ సీతప్పగారు పాఠం చెప్పలేదు, అటెండెన్స్ తీసుకోలేదు. పిల్లలతో జాస్తిగా మాట్లాడనూలేదు. విచార సముద్రంలో మునిగిపోయినాడు.
అదృష్టవశాత్తూ ఆరోజు బడికి శలవని నోటిసు రానే వచ్చింది కొంతసేపటికి.....
ఆరోజు శలవు రావటంతప్ప తిలక్ మహాశయుడి చావువల్ల చెప్పుగోదగిన వింతలేవీ జరగలేదు. జీవితపు మురికిగుంటలో ఒక చిన్న అలవచ్చి మాయమయింది. మళ్ళీ పాచి దాన్ని కప్పేసింది. దానికింద యధాప్రకారంగా బడీ, హోంవర్కూ, పరీక్షలూ, మార్కులూ, పాఠాలూ, మేష్టర్లు పిల్లల్ని కొట్టటమూ, మెత్తని మేష్టర్లను పిల్లలేడిపించటమూ జరుగుతూ పోయింది.
మేష్టర్లందరిలోకీ తెలుగు మేష్టర్లు లోకువ. ఇది అనాదిగా వస్తున్న ఆచారం. వాళ్ళకి ఇంగ్లీషురాదు. రాని ఇంగ్లీషు మాట్లాడకుండా వుండరు. పిల్లల్ని భయపెట్టలేరు. పిల్లలు మరీ పెచ్చుమీరిపోతే హెడ్మాస్టరుకి రిపోర్టిస్తారు. హెడ్మాష్టరు పేంబెత్తంతో నాలుగు తంతాడు. ఆ తరువాత తెలుగు మేష్టరుకు పశ్చాత్తాపం పట్టుకుంటుంది. పిల్లలు మరింత ఆకతాయి తనంచేస్తారు. ఇన్ స్పెక్టరు వస్తున్నాడంటే తెలుగు మేష్టర్లకి హడలు. వాళ్ళకి హెడ్మాస్టరన్నా హడలే.
అందరు పిల్లలల్లేనే సుందరానికికూడా కొందరు మేష్టర్లంటే ఇష్టమూ, కొందరిపైన నిర్లక్ష్యమూ, మరికొందరిమీద అసహ్యమూ వుండేది. అయితే ఏ విద్యార్ది కూడా అభిప్రాయాలు తన స్వంతమని చెప్పలేడు. ఈ అభిప్రాయాలు విధ్యార్డులలో ప్రచారమవుతాయి. కాని వీటివెనుక ఆధారం ఉండకపోదు. స్కూలు కమిటీవారు ఏటా రహస్య బాలట్ ఏర్పాటు చేసేటట్టయితే ఉపాధ్యాయుల్లో నిజంగా పనికివచ్చేవాళ్ళెవరో, బొత్తిగా పనికిరానివాళ్ళెవరో సులభంగా తేలిపోతుంది. కాని ఆపని చెయ్యటానికి ఎవరికీ తట్టలేదు.
సుందరానికి చదువు బాగా చెప్పే మేష్టర్లంటే ఇష్టం వాళ్ళుకొట్టేవాళ్ళయినా వాడికి అభ్యంతరంలేదు. కాని పాఠాలు సరిగా చెప్పలేని మేష్టర్లు ఎంత మంచివాళ్ళయినా, సాధువులైనా వాడికాటే ఇష్టంవుండేదికాదు.
సీతప్పగారి సెక్షనులో ఉండటానికి సుందరానికి మనస్కరించలేదు. సీతప్పగారు పాఠాలు సరిగా చెప్పక పోవటం ఒకటే కాదు. నాగేశ్వర్రావు ఇంకో సెక్షన్ లో పడ్డాడు. అందుచేత సుందరం తానుగూడా ఆ సెక్షను కే పోతానని సీతప్పగారిని అభ్యర్దించాడు. ఆ సెక్షనునుంచి ఈ సెక్షనుకు రాగోరే కుర్రవాణ్ణి కూడా సుందరం చూపించాడు. అయితే ఆ కుర్రవాడికి కిందటేడు మంచి మార్కులురాలేదు. సుందరం చాలా మంచి మార్కులతో పాసయినాడు. అందుచేత సీతప్పగారు మార్పుకు ఒప్పుకోలేదు. అయితే అదృష్టశాత్తూ ఒకటి జరిగింది. ఆయేడు సెకండుఫారంలోకి విద్యార్దులు విపరీతంగా వచ్చిపడ్డారు. ఒక్కొక్క సెక్షనులోనూ యాభయ్యేసి మందిదాకా తయారయినారు. అందుచేత అయిదో సెక్షను ఏర్పాటు చెయ్యవలసి వచ్చింది. సుందరమూ, నాగేశ్వర్రావూ కూడా ఈ కొత్త సెక్షనులోకి వెళ్ళారు.
