Previous Page Next Page 
బేబి!ఓ బేబి!! పేజి 31

    "అవున్సార్! మొన్న ఆ మధ్య జరిగిన పాతబస్తీ హత్య కేసులో ఆధారాలు దొరికాయి గానీ, హంతకుడు బెంగుళూర్ లో వున్నట్టు అర్ధమవుతోంది. నిన్న నా అసిస్టెంట్ ను పంపి ఈరోజు నేను వెళుతున్నాను. మీ క్కూడా బెంగుళూర్ లో పనా?" అన్నాడు ఉత్సాహంగా.

    అతని వుత్సాహం చూసి "మీకు వేటంటే ఇష్టమన్నట్టుగా వుంది" అన్నాడు శరత్.

    "అవునూ! హంతకుల వేట!"

    "నాక్కూడా ఇండస్ట్రీయల్స్ కు సంబంధించిన ఒక సెమినార్ అటెండ్ కావాలి అద్సరే! భార్గవ కేసులో ఏమయినా తేలిందా?"

    విమానం హైద్రాబాద్ ను దాటి మరింత పైకి ఎగిరింది.

    "లేదండీ! చాలా బిజీగా వుండటం వల్ల ఒకే 'వే'లో ఇన్వెస్టిగేషన్ చేయలేకపోతున్నాం కేవలం భార్గవకు తెలిసిన మీలాంటి వాళ్ళను కలువటం తప్ప ఇంకా డీప్ గా మూవ్ కాలేదు. అఫ్ కోర్స్! ఆ అమ్మాయి తప్పక పట్టుబడుతుందనే నా నమ్మకం" అన్నాడు అమితేష్ నమ్మకంగా.

    కొద్దిసేపు మౌనం తర్వాత__

    "ఈ మధ్య హైజాక్స్ బాగా జరుగుతున్నాయి కదా..." అన్నాడు శరత్ వూరికే వుండలేక.

    "అవునూ! హైజాకింగ్ మీద జోక్ చెప్పమంటారా?" అని "కరీంనగర్ కు చెందిన యిద్దరు హైజాకర్లు బెంగుళూర్ నుండి హైద్రాబాద్ వస్తూ, హైద్రాబాద్ ఏరియాలోకి ప్లేన్ ప్రవేసించగానే ఫైలట్ రూమ్ లోకి చొరబడి బెదిరించారట...."

    "ఏమని..."

    "మా నేటివ్ కరీంనగర్, హైద్రాబాద్ లో దిగి కరీంనగర్ వెళ్ళడానికి డబ్బుల్లేవు. మర్యాదగా విమానాన్ని కరీంనగర్ లో దించు, లేకపోతే చంపేస్తామని బెదిరించారు ఫైలట్ ఈ విషయాన్ని కంట్రోల్ టవర్ కు అందించి హైద్రాబాద్ చుట్టూ తిరిగి....చివరికి కరీంనగర్ లో ప్లేన్ ని ఓచోట దించాడు జాగ్రత్తగా. హైజాకర్లు సంతోషంగా బయటపడగానే, స్పెషల్ పోలీసులొచ్చి అరెస్ట్ చేసి మళ్ళీ హైద్రాబాద్ తీసుకొచ్చి విడిచిపెట్టారట. పాపం హైజాకర్లు" అన్నాడు చేరగిలబడుతూ అమితేష్.

    శరత్ చిన్నగా నవ్వుకొని....

    "మిస్టర్ అమితేష్! అడక్కూడదేమో మీ డిటెక్టివ్ ని, కానీ అడుగుతున్నాను. ఒక విషయం చెప్తారా?" అన్నాడు ఏదో అనుమానంగా.

    "అడగండి...తెలిపిందయితే చెప్తాను."

    "మీ అసిస్టెంట్ శ్రీను..."

    "శ్రీను కాదు....వేణు...వేణు" అన్నాడు గుర్తుచేస్తూ.

    "ఎస్ మీ వేణు....నిన్న నాతో కరచాలనం చేసినపుడు రెండు నిమిషాల వరకూ నా కళ్ళల్లోకి చూసి నా చేయిని విడువలేదు. చివరికి నేనే విడిపించుకొన్నాను చివర్లో కూడా అంతే! అది ఆయన ప్రవర్తనా? లేక మీ పరిశోధనలో ఏదయినా ట్రిక్కా?" అన్నాడు శరత్.

    "వేణు....హీ ఈజ్ ఏ సైకో మెట్రిక్ పర్సన్! అందుకే అతన్ని నా అసిస్టెంట్ గా వుంచుకున్నాను."

    ఆ మాటకు విమానంలోనే ఉలిక్కిపడ్డట్టు చూశాడు శరత్.

    (సైకో మెట్రి అంటే ఒక వస్తువుగాని, వ్యక్తిని గాని తాకి వాళ్లకు సంబంధించిన విషయాలు చెప్పటం)

    "ఏమిటి? మీరు అతీంద్రీయ శక్తులని నమ్ముతారా? ఇంపాజిబుల్....మీరు నామీదే ఏదో ట్రిక్ చేయాలని ప్రయత్నించారు...." అన్నాడు శరత్ అనుమానంగా.

    "లేదండీ! మీరు రీజనింగ్స్ చూడకపోతే నమ్మరేమో-ఈ సృష్టిలో ఏదయినాసరే, సంపూర్తిగా రీజనింగ్ ఇవ్వబడితే సైన్స్ అంటారు. రీజనింగ్ దొరక్కపోతే క్షుద్రమంటారు. ఏదైనాసరే-మొత్తానికి అలాంటి అతీంద్రియ శక్తులు కలిగి వున్న వ్యక్తులు నూటికో - కోటికో ఒక్కరుంటారు....అలాంటి "సైకో మెట్రి" అతనిలో కన్పించి, నా పరిశోధనకు ఏమయినా క్లూస్ యివ్వగలడనే....అతన్ని నా అసిస్టెంట్ గా ప్రత్యేకంగా పెట్టుకున్నాను"

    ఆ మాటల్ని నమ్మనట్టు చూశాడు శరత్.

    ఆ చూపులోని అపనమ్మకాన్ని గుర్తించిన అమితేష్, "మీరెప్పుడయినా పీటర్ హర్కోస్ పేరు విన్నారా?" అనడిగాడు.

    "లేదు విదేశీయుడై వుండాలి"

    అమితేష్ అవునంటూ షర్ట్ లోపలిజేబులోంచి ఓ ఫోటో తీశాడు.

    "ఈ ఫోటో నా దగ్గర వుండటానికి కారణం....పీటర్ హర్కోస్ ఫోటోల్ని, ఆయన మీద జరిపిన పరిశోధనా వివరాల్ని సేకరిస్తున్నాను పీటర్ హర్కోస్ గొప్ప అతీంద్రియశక్తి కలవాడు. అతీంద్రియ శక్తి అన్న పదం మీకు రుచింపకపోతే ...మానసిక శక్తి అనుకోండి....అలాంటి శక్తి వేణులో కన్పిస్తుంది" అని శరత్ కు ఆ ఫోటో అందించాడు అమితేష్.

    "ఈ సైకోమెట్రిస్ట్ లు ఒకదాన్ని కనీసం నిమిషం లేదా రెండు నిమిషాలపాటు తాకి ఆ వస్తువైనా, ఆ వ్యక్తికి సంబంధించిన గత వివరాలు చెప్తారు. వాటి ఆధారంగానయినా మేము శోధించినా ఏవయినా బయటపడవచ్చు. అందుకే వేణు కూడా కరచాలనం పేరుతో మీ చేతిని రెండు నిమిషాల సేపు పట్టి వుంచాడు. మీ నుండి ఏదయినా ప్రకంపనాలు వస్తాయేమోనని....కాని రిజల్ట్స్ ఏమీ రాలేదట మీనించి" అన్నాడు నవ్వుతూ.

    శరత్ కూడా నవ్వి చేతిలోని ఫోటోవైపు చూస్తూ.

    "ఈ పీటర్ హర్కోస్ కూడా డిటెక్టివ్ గా పని చేశాడా మరి?" అనడిగాడు.

    "లేదు, నేర పరిశోధకులకు సహకరించాడంతే! రష్యాకు చెందిన డాక్టర్ గెనాడి సెర్గయేన్ థియరీ ప్రకారం మన శరీరంనించి ఏవో ప్రకంపనాలు వస్తాయి. ఆ ప్రకంపనాలను, వాటి పరిస్థితులను గుర్తించేంతటి సూక్ష్మ పరిజ్ఞానం "సైకోమెట్రిస్ట్" లకు వుంటుంది. ఎదుట వ్యక్తినుండి ఈ ప్రకంపనాలను గ్రహించేటప్పుడు ఏదో ట్రాన్స్ లో వున్నట్లు ఫీలవుతారు వాళ్ళు. ఇది కేసుల్లో వేణు చూసిన నిజం శరత్ గారూ!"

    "ఈ 'శక్తి' పుట్టుకతోనే వస్తుందా?"

    "పుట్టుకతోనే వస్తే దేవుడినే పూజిస్తారు మనవాళ్ళు...అప్పుడే దేవుళ్ళ పరిజ్ఞానం ఆజ్ఞానుల మీదే ఆధారపడి దేశం మరింత చీకట్లోకి పోతుంది అయితే ఈ అతీంద్రియ....సారీ...మానసిక శక్తి మనిషికి ఏ దశలోనయినా అకస్మాత్తుగా రావచ్చు. పీటర్ లో కూడా అంతే! 1943 లో ఈ హర్కోస్ నిచ్చెన మీద నుండి పడ్డప్పుడు మెదడుకు దెబ్బ తగిలిఅనుకోకుండా అతడిలో విచిత్ర మానసిక శక్తి వచ్చింధన్నట్లు చెపుతారు."   


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS