Previous Page Next Page 
నవ్వితేనవ్ రత్నాలు-2 పేజి 32

    "అబ్బాయి చెప్పిన మాటలన్నీ నేనూ విన్నానండీ. వాడు చెప్పిన ప్రకారమే అంతా నవ్యంగా జరిగితే ఏడుకొండలవాడికి మన తిమ్మా తలనీలాలు సమర్పించుకుంటాడని మొక్కుకున్నానండీ..."
    ఆ మాట వింటూనే తిమ్మారావు భయంకరంగా ఆర్తనాదం చేసి జుట్టు పీక్కున్నాడు:
    "అయినా ఇలా ఎందుకు చేశావమ్మా... గుండుతో ఉంటే నన్నెవరైనా మళ్లీ హీరోగా బుక్ చేస్కుంటారా?" అన్నాడు దీనంగా. భుజంగరావు కిసుక్కున నవ్వాడు.
    "హోరీ కుర్రసన్నాసీ... సినిమా హీరోలందరూ నెత్తిన గంపలా విగ్గు బోర్లించుకునే కదరా నటిస్తారూ... నువ్వూ విగ్గు విగ్గు పెట్టుకునే నటిస్తావ్. గుండుంటే కొంపలేం మునుగుతాయ్?" అన్నాడు కొడుకుతో.
    ఆ మాటవింటూనే తిమ్మారావు ఆనందంతో నాలుక్కొరుక్కున్నాడు. పర్లేదు తన తండ్రికి బుర్రకాయ్ లో అర్థఛటాకంత మెదడుంది.
    ఆ రోజు సాయంత్రమే తిమ్మారావు హాంఫఠ్  మూవీస్ వారి ఆఫీసుకి వెళ్లాడు.
    గుమ్మం దగ్గర అలికిడి వినగానే టేబులు మీద తలలు వాల్చుకుని పడుకున్న ఇద్దరూ వ్యక్తులూ చటుకున్న నిటారుగా లేచి కూర్చున్నారు.
    తిమ్మారావు వాళ్ళిద్దరికీ  తనను తాను పరిచయం చేస్కుని వాళ్లు తీయబోయే సినిమాలో నటించడానికి వచ్చినట్టు చెప్పాడు.
    "నేనే నిర్మాతని... నా పేరు దైవాదీనం.ఈయన డైరెక్టరు ఏకాంబరం" అన్నాడు దైవాదీనం తనని తాను పరిచయం చేస్కుని డైరెక్టర్ని పరిచయం చేస్తూ.
    "నమస్కారమండీ... నమస్కారమండీ..."ఉక్కిరిబిక్కిరి అయిపోతూ ఇద్దరికీ నమస్కారాలు చేశాడు తిమ్మారావు.
    దైవాదీనం,ఏకాంబరం ఇద్దరూ తిమ్మారావుని పైనుండి కిందదాకా కిందనుండి పైదాకా రెండుమూడుసార్లు చూసి తృప్తిగా కళ్లెగురవేశారు.
    "ఏది బాబూ... కాస్త ఈ చివర్నుండి ఆ చివరికి, ఆ చివర్నుండి ఈ చివరకీ నడువ్ చూద్దాం..."అన్నాడు డైరెక్టర్ ఏకాంబరం.
    తిమ్మారావు అటూ ఇటూ నడిచాడు.
    "ఎబ్బే!... దొడ్డి కాళ్లతో వంకరగా నడుస్తున్నాడు కదూ?..."అన్నాడు దైవాదీనం ముఖం చిట్లిస్తూ.
    తిమ్మారావు కంగారుపడిపోయాడు. అతని మనసు ఆందోళనతో కలవరం చెందిపోయింది.
    "మరేం పర్లేదు... ఇతను నడిచే సీనుల్లో ఇతనికి డూప్ ని ఉపయోగిస్తాం..."అన్నాడు డైరెక్టర్.
    తిమ్మారావు తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు.
    తరువాత తిమ్మారావుని ఏదైనా డైలాగ్ చెప్పమని అడిగారు.
    తిమ్మారావు తను ఇదివరకు నటించిన నాటకం ఒకదాంట్లోని డైలాగు చెప్పాడు.
    ఇద్దరూ ఒకర్నొకరు చూస్కుని కళ్లు కొట్టుకుని తరువాత తిమ్మారావుని చూసి తృప్తిగా తలలూగించారు.
    "బాబూ... నీకు అందం ఉంది... మంఛి పర్సనాల్టీ ఉంది... మాంఛి గొంతు ఉంది... నటనలో కూడా అనుభవం ఉంది కాబట్టి నిన్ను మా సినిమాలో హీరోగా బుక్ చేస్కుంటున్నాం .... నీకెలాంటి  వేషం కావాలో నువ్వే చెప్పు... హీరోనా, విలనా, కమెడియన్నా?"
    "హీరో వేషమే వేస్తానండీ..."ఉక్కిరిబిక్కిరి అయిపోతూ అన్నాడు తిమ్మారావు.
    "ఒకే...అలాగే...హీరోవేషానికి ఓ ముఫ్పైవేలు ఇవ్వాలి... రేపు తీస్కోచ్చి ఇవ్వు"అన్నాడు దైవాదీనం.
    తిమ్మారావు ఖంగుతిన్నాడు.
    "అదేంటండీ... నేను మీకు డబ్బులు ఇవ్వడం ఏంటీ? మీ సినిమాలో నటించినందుకు మీరే నాకివ్వాలిగా?..." అయోమయంగా అడిగాడు.
    వాళ్లిద్దరూ ఘెల్లున నవ్వారు.
    "ఎవరు బాబూ నీకు చెప్పింది. కొత్తవాడివి నీకు డబ్బులెవారిస్తారూ? నువ్వే మాకు ఎదురివ్వాలి! అసలు హీరోవేషానికి యాభైవేలూ, లక్షాఇస్తామని కూడా వచ్చినవాళ్లు ఉన్నారు.ఏదో నువ్వందంగాఉన్నావ్, మంచిపర్సనాల్టీ ఉంది కదాని నీకు తక్కువ డబ్బులకే ఒప్పుకుంటున్నాం... తరువాత నీ ఇష్టం..."అన్నాడు దైవాదీనం, ఏకాంబరంకేసి చూసి కన్నుకొడ్తూ.
    తిమ్మారావు దిగులుగా మొహం పెట్టాడు.
    "ఇలా ఎదురివ్వకపోతే నువ్వు చచ్చినా సినిమా యాక్టర్ కాలేవు... అయినా నువ్వు ఎదురు డబ్బులిచ్చేది ఒక్క సినిమాకేగా? ఈ సినిమా రిలీజై హిట్టయిందనుకో...అప్పుడు బాగా లాభాలొస్తే నీ డబ్బు నీకు వాపస్ ఇచ్చేస్తాం... అంతేకాదు నిన్ను సినిమాల్లో చూసి మిగతాడైరెక్టర్లూ ప్రోడ్యూసర్లూ ఎవడ్రా నాయనా ఈ కుర్రోడు ఇంత బాగా నటించాడు ఇంతందంగా ఉన్నాడని అనుకుని నీ మీదకి ఎగబడ్తారు... అప్పుడు నువ్వెంత డిమాండ్ చేస్తే అంతిస్తారు... ఇప్పుడున్న పెద్ద హీరోలందరూ ఇలా పైకి వచ్చిన వాళ్ళే..."అన్నాడు ఏకాంబరం.
    దైవాదీనం కూడా ఏకాంబరానికి తానతందనా అన్నాడు. వాళ్లమాటలకి తిమ్మారావులో ఆశరేకెత్తింది. ముఫ్పైవేలు ఇవ్వడానికి ఒప్పుకున్నాడు.
    ఇంటిదగ్గర తిమ్మారావు తనని డైరెక్టర్, నిర్మాత ఒప్పించిన విధంగా తండ్రిని ఒప్పించి ముఫ్పైవేలు తీస్కుని దాన్ని వాళ్ల చేతిలోపోశాడు.
    దైవాదీనం,ఏకాంబరం ఇలా అనేకమంది యువకుల దగ్గర సినిమాలో వేషం ఆశ చూపించి డబ్బు గుంజారు. ఆడపిల్లల్ని హీరోయిన్లని చేస్తా అని ప్రలోభపెట్టి వాళ్ల శీలంతో ఆటలాడుకున్నారు. ఆనక ఒక శుభముహూర్తంలో హాంఫఠ్ మూవీస్ ఆఫీసు అక్కడనుండి ఎత్తేసి డబ్బుతో ఎటో పరారైపోయారు.
    తిమ్మారావు ఇంకా అలాంటి వాళ్లందరూ గుండెలు బాదుకున్నారు.
                                                                            *   *   *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS