నూతన నటీనటులు కావలెను!
తిమ్మారావుని న్యూస్ పేపరులోని ఆ ఎడ్వటైజ్ మెంటు ఆకర్షించింది. ఆ అడ్వటైజ్ మెంటు సారాంశం ఇది!
నూతన నటీనటులు కావలెను.
"హాంఫఠ్ మూవీస్ వారు తీయబోయే తాజా చిత్రంలో నటించడానికి నూతన నటీనటులు కావలెను. ఉత్సాహం ఉన్న యువతీ యువకులు తమ పుల్ సైజ్ ఫొటోలతో కింది అడ్రసుని సంప్రదించండి"
కింద అడ్రసు ఇవ్వబడింది.అది చదివినవెంటనే అతని మనసు ఊహాలోకంలోకి వెళ్లిపోయింది.
తిమ్మారావు హాంఫఠ్ మూవీస్ నిర్మాతని కలిసినట్టూ వాళ్లు ఇతన్ని హీరోగా బుక్ చేసి సినిమా తీసినట్టూ ఆ సినిమా సూపర్ హిట్ అయినట్టు దాంతో తిమ్మారావు కోసం మిగతా నిర్మాతలు ఎగబడినట్టూ అతని సినిమాలు వర్సగా హిట్టయి సూపర్ స్టార్ గా మారిపోయినట్టు ఊహించుకున్నాడు.
ఆ ఊహవల్ల అతనికి కలిగిన సంతోషానికి గిజగిజలాడిపోయాడు.
తిమ్మారావు ఎదురుగా శ్రీదేవి క్యాలెండరు కనిపించింది.శ్రీదేవి నవ్వుతూ తననే చూస్తూ "మీ పక్కన నేను నటించడానికి అవకాశం ఇవ్వరా తిమ్మా?..." అని అడుగుతున్నట్టు అనిపించింది తనికి.
"అలాగే శ్రీదేవి... నా నిర్మాతలకి నిన్ను నా పక్కన హీరోయిన్ గా బుక్ చేయమనీ లేదా నేను వాళ్ళ సినిమాలో నటించననీ కండిషన్ పెడ్తాను... ఏం?... అట్టగేనా??...హిహి..."అని నవ్వాడు ముసిరిపోతూ.
ఇంతలో ఆ పక్కనే ఉన్న జయప్రద క్యాలెండరు గాలికి టపటప కొట్టుకుంది. అదలా కొట్టుకుంటుంటే జయప్రద ఉడుక్కుని గోడకేసి తలకోట్టుకుంటున్నట్లు అనిపించింది తిమ్మారావుకి.
"సర్లెసర్లె... అలా కొట్టుకోడం ఆపు... నీక్కూడా నా పక్కన నటించడానికి ఛాన్సిస్తాగా... అట్టగేనా?.... హి..."
జయప్రద కూడా మురిసిపోతూ నవ్వింది.
అలికిడి అవుతే తల మరికాస్త పక్కకి తిప్పాడు.
అక్కడో భీకరాకారం నిల్చుని ఉంది.
"సర్లేవోయ్... నీకు విలస్ పోర్షనిస్తాలే"ఆయన్ని అర్థనిమీలిత నేత్రాలతో చూస్తూ అన్నాడు తిమ్మారావు.
"ఏం మళ్ళీ సినిమాల్లో వేషాలేయడం మీదికి పోయిందా మనసు?... ఒళ్లు చీరేస్తాను పిచ్చివాగుడు వాగావంటే!" అందా భీకారాకారం.
ఆ భీకారాకారం ఎవరిదోకాదు. తిమ్మారావు తండ్రి భుజంగరావుది.
తిమ్మారావు నాలుక్కొరుక్కుని చెంపలేస్కున్నాడు.
"ఏరా అంట్ల వెధవా?... బుద్ధిగా చదూకోరా అంటే వెధవాలోచనలూ నువ్వూను. ఇప్పటికే డిగ్రీ అయిదేళ్లనుండి చదూతున్నావ్.ఈసారైనా పాసవ్వు.
తిమ్మారావు ఆశ్చర్యంగా తండ్రివంక చూశాడు.
"నాని బుద్ధితక్కువ ఆలోచనలా? నాన్నా... డిగ్రీపాసవుతే ఉద్యోగం వచ్చేస్తుందా?దేశంలో ఎంతమంది నిరుద్యోగులున్నారో నీకు తెల్సుకదా?... ఒకవేళ ఉద్యోగం వచ్చినా జీతం ఎంతుంటుంది? ముష్టి వెయ్యిరూపాయలు ఉంటుంది"
"అయితే ఏమంటావ్?" చిరాకుపడ్తూ అడిగాడు.
"హీరో ముద్దుకృష్ణ ఒక్క సినిమాలో నటించడానికి ఎంత తీస్కుంటాడో తెల్సా? పదిలక్షలు తీస్కుంటాడట. మరి పరంజీవి ఎంత తీస్కుంటాడో తెల్సా పదిహేనులక్షలు తీస్కుంటాడట!!
"అయితే ఏమంటావ్?..." మళ్లీ అన్నాడు ఇంకా విసుక్కుంటూ.
ఇంత చెప్పినా తండ్రికి అర్థంకాలేదంటే తిమ్మారావుకి చాలా ఆశ్చర్యం కలిగింది. తన తండ్రి ఇంత తెలివితక్కువ వాడైనందుకు అతని హృదయం ద్రవించిపోయింది. బాధకి కళ్లలోనీళ్ళు తిరిగాయ్. తన తండ్రికి ఛటాకు మెదడైనా లేదా తల్లో!...
"నేను నీ కడుపున చెడబుట్టాను నాన్నా..." కళ్లనీళ్లు తుడుచుకుంటూ అన్నాడు తిమ్మారావు.
కొడుకు అలా అనేటప్పటికి భుజంగరావు సిగ్గుతో చచ్చిపోయాడు. ఆయన కొడుక్కి మొహం చూపించలేక భుజంమీద ఉన్న తువ్వాలుని మొహంమీద కప్పుకున్నాడు.
"పోనీ నా కర్థం కాలేదు... నువ్వైనా చెప్పొచ్చుగా?" మెల్లగా గొణిగాడు.
తిమ్మారావు గొంతు సవరించుకుని సగర్వంగా చెప్పసాగాడు.
"నేనెట్టాగూ అందంగా ఉన్నాను. నాకు మంచి పర్సనాల్టీ కూడా ఉంది కాబట్టి హాంఫఠ్ మూవీస్ వారు నన్ను హీరోగా బుక్ చేస్కుంటారు. కాలేజీ నాటకాల్లో వేషాలేసే అనుభవం ఉంది కాబట్టి నేనెలాగు బాగా నటిస్తాను. దాంతో సినిమా సూపర్ హిట్ అవుతుంది. నాకు డిమాండ్ బాగా పెరిగి ఎన్నో సినిమాల్లో నటించి కొన్నాళ్లకి సూపర్ హీరో అయిపోతాను. అప్పుడు నాకు పరంజీవి కంటే ఎక్కువ రెమ్యునరేషన్ అంటే సినిమాకి ఏ ఇరవైలక్షలో ఇస్తారు. పరంజీవి ఘోల్లుమంటాడు. శ్రీదేవికి ఇంకా పెళ్లికాలేదు కాబట్టి శ్రీదేవిని పెళ్లి చేస్కుంటాను. శ్రీదేవికి హిందీ ఫీల్డులో ఒక సినిమాకి ఇరవై లక్షలిస్తున్నారట! ఆ విధంగా మా ఇద్దరికీ ఒక సినిమాకి తనకిరవై నాకిరవై మొత్తం నలభైలక్షలు వస్తాయ్... ఇంకా చెప్పాలా?"
"చాలు బాబూ చాలు... వింటుంటేనే కడుపునిండిపోతూ ఉంది."
ఇంతలో వెనకనుండి గంటమోగించిన శబ్దం వినిపించి ఇద్దరూ వెనక్కి తిరిగారు. తిమ్మారావు తల్లి పరమేశ్వరి దేవుడికి హారతిస్తూ గంటకొడ్తూంది.
"అదేంటే గంటక్రితమే పూజ చేశావ్ గా ఇప్పుడు మళ్లీ చేస్తున్నావేం?"ఆశ్చర్యంగా భార్యని అడిగాడు భుజంగరావు.
