"హ... హ.... హ...
రాయుడి నవ్వుతో ఆ ప్రదేశం మారుమారుమోగింది.
"ఏంటంత హుషారుగా నవ్వుతున్నారు?"
ఈవేళ ఏ ఆడకూతురూ మీ సెంప పగలగొట్టలేదా?" రాయుడ్ని అడిగింది చిత్రాంగి.
"ఏంటి? నేను ఇరవైనాలుగ్గంటలూ ఆడపిల్లల చేతుల్లో చెంపదెబ్బలు తినే వెర్రిముండావాడిలా కనిపిస్తున్నానా నీ కళ్ళకి?" రాయుడు బుంగమూతి పెట్టాడు.
"మరి మీ సంతోషం చూస్తుంటే నాకు అట్టాగే అనిపించింది. ఇంతకీ మీ సంతోషానికి కారణం ఏంటో?"
"ఆ గోపీగాడికి గట్టిదెబ్బ కొట్టా. ఈపాటికి ఆడు గింజుకు సచ్చిపోతూ వుంటాడు" కసిగా అన్నాడు రాయుడు.
చిత్రాంగి బుంగమూతి పెట్టింది
"అంతేలే. మీ కుషీకోసం వేరేవాళ్లు కావాలి? నేనుమాత్రం మీ నడ్డిపట్టడానికి, తలకాయ్ పట్టడానికీ కావాలి!! హు!"
రాయుడి బుగ్గమీద ఓ పోటు పొడిచింది.
"హబ్బా! అసలు నువ్వేమంటున్నావో నాకు అర్థంకావడంలేదు. నా మాటలకి, నీ మాటలకి అసలు కనెక్షన్ ఏమైనావుందా అని" బుగ్గ రుద్దుకుంటూ అన్నాడు రాయుడు.
"ఎందుకు కనెక్షన్ లేదూ? మీరు ఆ గోపీగాడి పెళ్ళాన్ని రేప్ చేసొచ్చారు కదా?"
"హయ్యో రాతా! నేనంటి? గోపీగాడి పెళ్ళాన్ని రేప్ చెయ్యడమేంటి? అలాంటి పని నేనేం చెయ్యలేదు" నెత్తికొట్టుకుంటూ అన్నాడు రాయుడు.
"అదేకదా! మీకాపని చేతనవుతే కదా? నీగురించి తెలిసీ నేను మిమ్మల్ని ఆ విధంగా అనుమానించడం తప్పే!"
"హబ్బా!" బాధగా జుట్టు పీక్కున్నాడు రాయుడు.
"ఇంతకీ గోపీని దెబ్బకొట్టానని అన్నారే? ఏంచేశారేంటి?" అడిగింది చిత్రాంగి.
"మన పొలంలో పనిచేసేవాళ్ళంతా గోపీ మనుషులే. వాళ్ళకి గోపీ ఓ దేవుడు. ఆ,అంచేత వాళ్ళందర్నీ పొలంలోంచి మెడపెట్టి గెంటించా-" గర్వంగా అన్నాడు రాయుడు.
రాయుడిమాట పూర్తయిందోలేదో సంతానం అక్కడికి పరిగెత్తుకుని వచ్చారు.
"బాబూ...! రాయుడుబాబూ..!!" గగ్గోలుగా అరిచాడు సంతానం.
సంతానాన్ని చూస్తుంటే రాయుడికి చిర్రెత్తుకొచ్చింది.
"ఏంటాకేకలు? నీ పిండాన్ని ఎవరయినా పిల్లులకి పెట్టారా? అసలు నిన్నిక్కడికి రావద్దని చెప్పానా?" విసుక్కుంటూ అన్నాడు రాయుడు.
"రాక తప్పలేదు బాబూ! అవతల కొంపలంటుకుంటున్నాయ్ అంటూ ఏడవకపోతే అసలు జరిగిందేమిటో చెప్పరాదూ?"
"నేను చెప్పడం ఎందుకులే బాబూ - వాళ్ళే చెప్తారు. ఒరేయ్ రండర్రా" గది గుమ్మంవైపు చూస్తూ అరిచాడు సంతానం.
గదిలోకి బిలబిలమంటూ అరడజనుమంది రౌడీలు ప్రవేశించారు.
"ఓరి. మీ మొహాలుమండా, మీరిక్కడికి ఎందుకొచ్చార్రా... అయినా నేనిక్కడ వుంటానని మీకెవరు చెప్పారు?" రాయుడు మండిపడ్తూ అడిగాడు.
"ఎవరేంటి బాబూ... సంతానంగారే వెంటబెట్టుకుని తీస్కొచ్చారు"
"ఒరేయ్ సంతానం. అసలు నిన్నే ఇక్కడికి రావొద్దంటే ఊళ్ళో అందరికీ ఈ అడ్రసు ఇవ్వడమేకాకుండా దగ్గరుండి ఇక్కడికి తీసుకొస్తున్నావా? అసలు ఆ గోపీగాడిని కాదు, ముందు నిన్ను చితకామతకా తన్నించాలి!!" సంతానం వంకే కొరకొరా చూస్తూ అన్నాడు రాయుడు.
"అది బెస్టు బాబూ!మీరు సంతానం గార్ని తన్నాలంటే సెప్పండిబాబూ. పచ్చడికింద కొట్టేస్తాం. అంతేగానీ ఆ గోపీవాడ్ని తన్నాలంటే మావల్ల కాదుబాబూ"
అన్నాడు ఒక రౌడీ.
"అయినా ఇప్పుడు గోపీగాడ్ని తన్నమని ఎవరు చెప్పార్రా?"
"మీరు సెప్పలేదనుకోండి. కానీ ఆ గోపీగాడే మమ్మల్ని తన్నాడండి-"
"ఎందుకురా?" అరిచాడు రాయుడు.
పొలందగ్గర జరిగిన తంతుగురించి రాయుడికి చెప్పారు రౌడీలు.
అంతా విన్న రాయుడు గుండెలు బాదుకున్నాడు.
"అమ్మో అమ్మో... నా పొలంలోకి బలవంతంగా ప్రవేశించడం కాకుండా నా పొలాన్ని దున్నడంకూడా చేస్తున్నారా?"
"ఆ గోపి పొలం ఎలా దున్నుతాడో ఓసారి చూడాలనుందండీ" మెలికలు తిరుగుతూ అంది చిత్రాంగి.
"చాల్లే... నువు నోర్ముయ్..." మండిపడ్డాడు రాయుడు.
"ఒట్టిగా దున్నుకోవడం కాదండీ.... దున్నేవాడిదే భూమంట! అందుకనీ ఈవాల్టినుండి ఆ పొలాలన్నీ వాళ్ళవేనంట..." చెప్పాడు సంతానం.
"ఇది ఘోరం.. అన్యాయం!!..." అరిచాడు రాయుడు.
"మీవల్ల కాకపోతే చెప్పండి. ఆ గోపీని నేను లొంగదీస్కుని దారిలోకి తెస్తా" అంది చిత్రాంగి.
"ఎవరి దారిలోకి? నీ దారిలోకా? అసలే పొలంపోయి నేనేడుస్తుంటే, నువ్వుకూడా పోతానంటావేంటి? నువ్వు కాసేపు నోర్మూసుకో" అన్నాడు రాయుడు చికాకు పడిపోతూ.
26
గోపి రిక్షా తొక్కుకుంటూ వెళ్తున్నాడు. ఆరోజు అతనికి ఇంకా బోణీబేరం తగల్లేదు.
ఇంతలో మూడురోజుల క్రితం తనని బేరం కట్టమని అడిగిన తాత ఎదురయ్యాడు.
తాత రిక్షా ప్రక్కకి రాగానే బ్రేక్ కొట్టి రిక్షాని ఆపాడు గోపి.
"ఏంతాతా! ఆరోజు మీ అబ్బాయ్ దగ్గరికి వెళ్ళావా? ఇప్పుడు మీ అబ్బాయ్ కి ఆరోగ్యం ఎలావుంది?" అడిగాడు గోపి.
"ఏం బాబూ? నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతే నేనింక వెళ్ళలేనని అనుకున్నావా? నీకంటే పుణ్యాత్ముడు ఒకడు నన్ను పావలాకే మా అబ్బాయి దగ్గరికి తీస్కెళ్ళాడు బాబూ" నిష్ఠూరంగా చెప్పాడు తాత.
"ఆ... అలాగా? చాలా సంతోషం తాతా. ఇంతకీ మీ అబ్బాయికి ఎలావుంది తాతా?"
"ఎలాఉంటే ఏంలే బాబూ! అయినా మా బాగోగుల గురించి నీకెందుకులే బాబూ. నా దారిన నన్ను వెళ్లనియ్."
తాత రెండడుగులు ముందుకు వేశాడు.
అంతే... గోపి రిక్షామీంచి క్రిందికి ఒక జంప్ చేసి "తాతా!..." అంటూ ఒక గావుకేక పెట్టాడు.
ఆ అరుపుకి తాత తుళ్ళిపడ్డాడు.
"ఎందుకు బాబూ అలా అరిచావ్? ఇప్పుడు నిన్ను నేనేమైనా రిక్షా ఎక్కించుకుని ఫ్రీగా తొక్కమని అన్నానా?"విసుగ్గా మొహంపెట్టి అడిగాడు తాత.
"తాతా - తాతా - తాతా - నన్నెంత అపార్ధం చేస్కున్నావ్ తాతా" తలపైకెత్తి జుట్టు పీక్కుంటూ చెప్పాడు గోపి" ఈ నిష్ఠూరాలన్నీ ఆరోజు నిన్ను మీ అబ్బాయి యింటికి రిక్షాలో తీస్కెళ్ళలేదనే కదా? కానీ ఆరోజు నేను వెళ్లకపోయివుంటే కొన్ని వందల జీవితాలు వీధిన పడేవి తాతా"
"హవునా బాబూ?" కాస్త మెత్తబడుతూ అడిగాడు తాత.
"అవును తాతా. నేను రాయుడి రౌడీలని తన్ని తగలేసి వాళ్ళంతా పొలాలు దున్నుకొనేలా చేశానుతాతా. అంతేకాకుండా దున్నేవాడిదే భూమని చెప్పి వాళ్లని ఆ పొలాలు తీసేస్కోమన్నాను తాతా" గర్వంగా పలికాడు గోపి.
"బాబూ!" హఠాత్తుగా కళ్లనీళ్లు పెట్టుకుంటూ ఆక్రోశించాడు తాత.
"ఏంటి తాత? ఎందుకలా కళ్లనీళ్లు పెట్టుకుంటున్నావ్? ఎందుకలా ఉట్టి పుణ్యానికి ఆక్రోశించావ్? కొంపదీసి ఆ రాయుడుగానీ నీకు బంధువా తాతా?" అయోమయంగా అడిగాడు గోపి.
"కాదు బాబూ... కాదు"
"మరెందుకు తాతా అలా ఆక్రోశించావ్"
"ఏంలేదు బాబూ. ఆరోజు నన్నుకూడా ఆ మూకతో ఎందుకు తీస్కెళ్ళలేదు బాబూ?"
"ఏం తాతా అలా అంటున్నావ్?"
"నేను కూడా వచ్చుంటే కాస్తభూమి నాక్కూడా దక్కివుండేది కదాబాబూ" బాధపడ్తూ చెప్పాడు తాత.
"ఊర్కోతాతా.... ఊర్కో. మీ అబ్బాయికి జబ్బుతగ్గాక నీవుకూడా ఆ పొలంలోకి భూమిని దున్నుకుందువు గానీ"
"చాలా సంతోషం బాబూ! చాలా సంతోషం" ఆనందభాష్పాలు రాల్చాడు తాత.
"సరేగానీ ఇప్పుడు ఎక్కడికెళ్తున్నావ్ తాతా?"
"మావాడికి ఒంట్లో నలత ఇంకా తగ్గలేదు బాబూ. వాడిని చూడ్డానికి వెళ్తున్నా"
అలాగా తాతా! చాలా సంతోషం తాతా!"
