Previous Page Next Page 
సంపెంగలూ - సన్నజాజులూ పేజి 31


    కామేశ్వరి క్షణంలో తన సామాను సద్దేసుకుంది. నేను బతిమాలిన కొద్ది రెచ్చిపోయింది. రిక్షా వాణ్ణి కేకేసి సామాన్లు అందులో పెట్టింది. నాకు ఏమీ తోచలేదు.
    'ఏమండీ మీ కామేశ్వరక్క వెళ్ళిపోతున్నారు. ఒక్కసారి దిగిరండి.' అని క్రింద నుంచి కేకేశాను. అయన పలకలేదు.
    'పోతున్నదానివి పోనిద్దూ , శని వదిలి పోతుంది' అంటున్న మధురిమ నోరు నొక్కి నాలుగంగల్లో నేను మేడెక్కెను.
    'ఏమండీ మీ అక్కయ్య వెళ్ళిపోతున్నారు. సామాన్లు కూడా రిక్షాలో పెట్టించేశారు. మీరు ఉండమని చెబుతే ఉంటారు-- రండీ.'
    అయన మాటాడలేదు. ఇటు  తిరగలేదు. అటు వైపు తిరిగి నుంచుని సిగరెట్టు కాలుస్తున్నారు. నేనే అయన ఎదురుగా వెళ్ళెను.
    'మాటాడరెందుచేత? ఎలాంటిదయినా ఆవిడకూ మనకూ తప్పే సంబంధం కాదిది. నేనొచ్చిన రోజునే ఆవిడ వెళ్ళిపోతే నలుగురూ ఏమనుకుంటారో? ఇంతవరకూ వస్తుందని నాకు తెలీదు. లేకపోతె నేను ఆ మాటయినా ఆడి ఉండేదాన్ని కాదు. రిక్షా కూడా కదులుతున్నట్టుంది. ఇక్కడ్నించి మీరు ఒక్క కేకేస్తే ఆవిడ ఆగిపోతుంది మాటాడరేం?'
    "ఏం మాటాడను.? చేతులు కాలేక ఆకులూ పట్టుకుంటే ఏం లాభం? ఈ జ్ఞానం నీకు ముందే ఉండవలసింది. ఇప్పుడు ఏమనుకున్నా కలిసి వచ్చే దేముంది?'
    'మీరు రాకముందు నుంచీ నన్నావిడ దుమ్మెత్తి పోస్తోంది. మీరు వచ్చాక కూడా అనవసరంగా కల్పించుకుని ఏవేవో అనబోయింది.'
    'ఆవిడ నోటి దూకుడు మనిషని ఎవరికి తెలీదు? వూరుకుంటే తీరిపోదూ? పది మాటలకు ఒక్క మాట సరిపోయేలా మన పాండిత్యం అంతా ఆమె ముందు ఒలకబోయ్యాలా? మనం చదువు కున్నామని నలుగురికి మనమే చాటుకోవాలా?'
    లేదు. ఇటువంటి జవాబు నేను ఆశించలేదు. ఇలాంటి దెప్పి పొడుపులు సహించే శక్తి కూడా నాకిక లేదు. నేను వెనుదిరిగి వచ్చేయబోయాను. ఆయన పిలిచారు. నేను వినిపించుకోలేదు. గబగబ మేడ మెట్లు దిగి వెళ్ళిపోబోతుంటే దారిలో మెట్ల మీద నా చేతులు పట్టుకు ఆపేశారు.
    'మంజూ , అంత కోపం దేనికి? నేనేమన్నానని?' నా కంట్లో ముత్యాల్లా నీటి బిందువులు నిలిచాయి. అయన నా గెడ్డం పట్టుకు పైకేత్తేరు.
    'మా కామేశ్వరక్కను నువ్వు వెళ్ళగొట్టేశావని నేను అనుకుంటున్నానెమో అని బాధపడుతున్నావా?  అదేం లేదు. ఒక విధంగా అది వెళ్ళిపోడమే మంచిది, ఇల్లు చల్లగా ఉంటుంది.!
    నేనేం మాటాడలేదు.
    'ఈ పదిహేను రోజులూ ఎలా గడిపానో తెలీదు. నువ్వు మన ప్రాంతానికి వచ్చి కూడా అక్కడ ఆగిపోయావని తెలిసి మరింత బాధపడ్డాను. నిన్నోక్కసారి చూడగానే ఆ బాధంతా మటు మాయమైపోయింది. నీ చక్కటి కాఫీ కోసం ఇంకా ఎన్నాళ్ళని ఎదురు చూడమంటావా? నీ వెచ్చని....'
    'ఆగండి' నేను క్రిందికి చూపించాను.
    'మీ రిద్దరూ యిక్కడ ఏం చేస్తున్నారూ? మీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను. ఇక్కడ ఉన్నారూ?' అంటూ మా మధురిమ రబ్బరు బొమ్మను ఎత్తుకుని పైకి వస్తోంది. చిట్టడవిలా ఉన్న యింటిని సర్దడానికి ప్రయత్నిద్దామని నేను క్రిందికి దిగెను.
    ఆ మూడో రోజు మధ్యాహ్నం సరళ నాకోసం వచ్చింది.
    'మీకు యిబ్బంది లేకపోతె ఆ ఇరవై రూపాయలూ అడిగి రమ్మన్నారు.' అంటూ. నాకేం బోధపడలేదు, వాళ్ళ దగ్గర యిరవై పుచ్చుకోవలసినంత అవసరం ఆయన కేమొచ్చిందో నాకు అర్ధమవలేదు. నిజానికి నా దగ్గిరప్పుడు పదిహేను రూపాయలకు కొంత చిల్లర తప్ప ఏం లేదు. అందులో పది రూపాయలు యిచ్చాను. మిగిలింది ఆయనని అడుగుతానని. ఉండబట్టలేక ఆయనేప్పుడు పుచ్చుకున్నారని అడిగాను.
    'ముందే బావగారు ఖర్చు మనిషి తరువాత కామేశ్వరి లాంటిది వచ్చి కూచుందాయే. ఇక అప్పులకు బయల్దేరడం లో ఆశ్చర్య మేముందీ?'
    'ముందే ఖర్చు మనిషి' అన్న మాట ఆయనకి కాదు గాని నాకే తగిలింది. కనీసపు అవసరాలు తీరని ఆర్ధిక బాధ ఏమీ నేను పుట్టింటి దగ్గిర అనుభవించలేదు గాని అనవసరపు ఖర్చు చేసి ఎరుగను. ఇక్కడికి వచ్చాక  వీరు కొంచెం దుబారా ఖర్చులు చేస్తున్నట్టు చాలాసార్లు అనిపించింది.
    మొట్టమొదట సిగరెట్లు మాన్పించడానికి విశ్వప్రయత్నం చేశాను. వాటివల్ల పెదవులు ఎలా మాడి పోతాయో , గుండె ఎలా దెబ్బతింటుందో ఊపిరితిత్తుల వ్యాధులు ఎంత సుళువుగా సంక్రమిస్తాయో- యిలాంటివి నచ్చ చెప్పటానికి గట్టిగా ప్రయత్నం చేశాను. 'ఆ కంపు నాకు పడదు. ఆ వాసన భరించలేను. అలా అయితే ఇటువైపు రావొద్దు' అని చెప్పి చూశాను. మొట్టమొదట నవ్వి వూరుకునేవారు. తరువాత లెక్క చెయ్యడం మానేశారు. ఆఖరికి కోపంగా చూసేవారు. అంతే. కాల్చే సిగరెట్ల సంఖ్యలో ఒకటీ తగ్గించేవారు కాదు. ఒక్కొక్కప్పుడు అగ్గిపెట్టె దాచేసేదాన్ని. మరొకప్పుడు పెట్టెలో సిగరేట్లున్నా తీసి మండుతున్న పొయ్యిలో పారెసేదాన్ని. మౌనంగా కార్యాలను సాధించేవారికి అపజయమేముంది? మూడ్నిముషాల్లో కొత్తవి తెప్పించుకునేవారు. ఇంక అయన మార్గానికి అడ్డు తగబడం' అనవసరం, అవివేకం అనిపించింది. అదీగాక ఈ అలావాట్లు నిన్నా మొన్నా అయినవి కావు, రేపూ ఎల్లుండీ పోవడానికి.
    అలాంటిదే మరొకటీ కాఫీ హోటలు అలవాటు. ఇంట్లో పదిమంది పిల్లలతో సతమత మౌతుంటే తెల్లవారేసరికే ఏ పిల్లాడో 'నాన్నా నేనూ వస్తాను' అని వెంట పడకుండా పెరటి దారిని హోటల్ ప్రవేశం చెయ్యడంలో న్యాయం లేదు గాని సమర్ధించుకోడానికి అవకాశం ఉంది. మరి యీ వ్యసనం ఈయన ముందు ఎందుకు మానరో మానవ మాత్రులకి అర్ధం కాదు. అక్కడ తయారయే పదార్ధాలన్నీ శాయశక్తులా ఇంటి దగ్గర చెయ్యడానికి ప్రయత్నం చేసేదాన్ని. హోటలు నుండి యిడ్దేన్ల పొట్లం తెప్పించి యింట్లో చేసిన వాటితో పోల్చి తేడా తెలుసుకోడానికి గట్టి ప్రయత్నం చేసేదాన్ని. బల్ల ముందు కుర్చీ వేసి బల్ల మీద ప్లేటులో టిఫిన్ పెట్టి సర్వరులా నేనక్కడ చేతులు కట్టుకుని నిలబడితే వారికి నవ్వు ఆగేది కాదు. నువ్వింకో అన్ని ప్రయత్నాలు చేసినా ' జూ' లో వన్య మృగాలలాగ నేచురల్ సరౌండింగ్స్ ఏర్పరచి నన్ను సంతుష్టి , పెట్టలేవు. ఆ ఫ్లేవర్ వేరు, ఆ అనుభవం వేరు .' అనేవారు. అవును మరి, 'మాసిపోయిన లుంగీ గుడ్డ కట్టుకున్న సెర్వరూ, బొత్తాలు పడి మురికి వోడుతున్న అల్యూమినియం పెళ్ళేలూ నేనెక్కడ తెగల్ను!' అనేదాన్ని. ఇంట్లో ఎన్ని చేసినా వారి కాఫీ హోటలు ఖర్చు రూపాయికి తగ్గేది కాదు. కొన్నాళ్ళు పర్సు దాచేసేదాన్ని. ఏం లాభం? 'అరువు లేదు' అని బోర్డు రాసి తగిలించినా అరువు వల్ల కలిగే అదాయాలే వాళ్ళకి ఎక్కువ. నా ప్రాణం విసుగెత్తి 'మీరలా సొమ్ము మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు పెడుతుంటే ఇంట్లో నా శ్రమ కూడా ఎందుకు దండగ! నేను మళ్ళీ యింట్లో చెయ్యడం కూడా ఎందుకు మీరు తినక పోయాక! మీరు సాయంకాలం వచ్చేటప్పుడు, ఆ చేత్తో రెండి తీపి , రెండు కారమూ పొట్లాం కట్టించుకొస్తే సరే అన్నాను సగం వేళాకోళం గా సగం నిజంగా. 'అలా నువ్వే దార్లోకి రావడం అన్ని విధాల శేయస్కారం' అన్నారు అయన గెలుపొందిన వారి మొహాని కుండే సహజమైన వెలుగుతో.
    మూడోది పేకాట. ఇదంత రెగ్యూలర్ గా ఆడే వారు కాదు. అప్పుడప్పుడు క్లబ్బులో వెలిగించే వారు. 'ఒళ్ళు చెడని మత్తు మందు, ఇది ఎవరైనా జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు సేవించక తప్పదు' అని అయన పేకాటని నిర్వచించేవారు, డబ్బు లేకుండా పేకాడడం, నీళ్ళు లేకుండా స్నానం చెయ్యడం లాంటిదట. ఆడినప్పుడు మాత్రం గంటలు గంటలు కూచునేవారు.
    ఒకసారి అన్నయ్యకు వీటి గురించి రాస్తే ,
    'ఇవి ఉదహరించవలసినంతటి వ్యసనాలటే వెర్రి చెల్లి ! చీటికి మాటికీ విసుక్కునే దుమధుమల కన్న ధూమ పానం ఏమంత బాధించేది కాదు. ఎన్ని చేసినా అది చెయ్యలే ఇది  చెయ్యలేదని కాల్చుకు తినేకన్నా కాఫీ హోటళ్ళ చిరుతిండి ఘనాపాటి నేరమేమీ కాదు. ఇళ్ళూ, వాకిళ్ళూ తాకట్టు పెట్టె జులాయితనం కన్న అప్పుడప్పుడు ఈ పేకాట వేసుకోడం అదేమీ అంత అపరాధం కాదు. ప్రతి మాటకీ ఎదుటి వారిని నొప్పించడమనేది అన్ని వ్యసనాలలోకి అధమ వ్యసనం. అది లేనివాడు, ఒకరి ఖర్చు మీద మరొకరు ఆచూకీ అజమాయిషీ చెయ్యని వాడు యివి చిర్వసనాలే కాని దుర్వసనాలు కానేకావు.'
    అని జవాబు.!


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS