Previous Page Next Page 
పిల్లలతో ప్రేమయాత్ర పేజి 31

 

    తరువాత సన్నగా ఏడుస్తూ మంచం మీద బోర్లా పడుకుంది. కాంతారావు ఆమె దగ్గరకు వచ్చి 'కళ్యాణి ! ప్లీజ్! ఏడవకు.' అన్నాడు భుజం మీద చెయ్యి వేసి.
    ఆడపులి లా ఒక్కసారిగా లేచి కూర్చుని భర్తను రెండు చేతులతో నూ ఒక్క తోపు తోసింది కళ్యాణి, ఆ ఊపు కి వెళ్ళి సోఫా లో కూలబడ్డాడు కాంతారావు.
    'జాగ్రత్త! నా దగ్గరకు రాకండి. నన్ను ముట్టుకోకండి. నేనెవరినో తెలుసా? కళ్యాణి ని. నా కిష్టం లేనప్పుడు నన్ను ఎవరైనా ముట్టుకుంటే వాళ్ళనే మైనా చేసేస్తాను . తెలిసిందా?' అంటూ హుంకరించింది.    
    కాంతారావు 'తెలిసింది' అన్నట్టు మౌనం గానే సమాధాన మిచ్చేడు.
    కళ్యాణి పడుకుని ఓ పది నిమిషాలు ఏడ్చి , మళ్ళీ లేచి కూర్చుంది. అక్కడనే సోఫా లో కదలకుండా అదే భంగిమ లో కూర్చున్న భర్త వంక చూసి ' పడుకుంటానికి యీ మంచం దగ్గరకు రావాలను కుంటున్నారేమో , ఆ ఆటలెం సాగవు. ఈ మంచాలు రెండూ నావీ, నా పిల్లల వీను. మీకిక్కడ స్థానం లేదు. మీరు ఈ రాత్రికి ఆ సోఫా లోనే పడుకోండి. కావలసి వస్తే యీ దిండును తీసుకుండి.' అంటూ ఒక దిండు తీసి అతని మీదకు విసిరివేసింది కళ్యాణి.
    మొహానికి తగలబోయిన ఆ తలగడ ను చేతులడ్డం పెట్టి అన్దుకుని ఒళ్ళో పెట్టుకున్నాడు కాంతారావు.
    కళ్యాణి వెంటనే దుప్పటి తో కాళ్ళ నుండి తల వరకు ముసుగు బిగించి పిల్లలిద్దరి మీద చేతులేసి పక్కకు వత్తిగిలి పడుకుంది.
    భర్త మీద కోపం వచ్చినప్పుడల్లా కళ్యాణికి పిల్లల మీద రెట్టింపు ప్రేమ పుట్టుకొస్తుంది. దానికి కారణం యేమిటో కళ్యాణి కే సరిగ్గా తెలియదు. భర్త మీద అలిగి , అతనికి బౌతికంగా, మానసికంగా దూరంగా ఉండటం వల్ల ఆ వియోగాన్ని భరించలేని ఆమె దుర్భలమైన మనసు తనలోని ప్రేమ నంతటి ని తన భర్తకు ప్రతి రూపాలయిన ఆ పసి పాపల మీద ఓలక బోసి తద్వారా కొంత ఉపశమనాన్ని పొందుతుంది. ఆ విషయం ఆమెకే అర్ధం కాదు.
    ఒక అరగంట నిశ్శబ్దంగా నడచింది. కళ్యాణి బింకం యేమాత్రం సడలలేదు.
    కాంతారావు ఆ అర్ధగంట లోనూ రెండు సిగరెట్లు పెట్టెలు కాల్చి పారవేశాడు. కళ్యాణి లో కదలిక లేకపోవటం గమనించి చిన్నగా నిట్టూర్చి , తలుపు తీసుకుని బయటకు వెళ్ళేడు.
    అతను నిట్టుర్చటం తలుపు తీయటం  అన్నీ విని కళ్యాణి దుప్పటి సందుగా కొంచెం వంగి చూసింది. అతను గదిలో లేడు, బయటకు వెళ్ళి ఏం చేస్తున్నట్లు? అని ఆలోచిస్తూ ముఖం మీద నుండి దుప్పటి తొలగించి వెల్లకిలా పడుకుంది కళ్యాణి.
    కాంతారావు బయట రూము ముందున్న అరుగు మీద కూర్చున్నాడు. అన్ని రూము లలోనూ లైట్లు అర్పి ఉన్నాయ్. అంతా నిశ్శబ్దంగా ఉంది. పిండార బోసినట్లున్న వెన్నెల చలిచలిగా శరీరాన్ని తాకుతున్న గాలులు. ఎదురుగా అమాయకంగా నవ్వుతున్న రంగు రంగుల పూలు, ప్రకృతి ఎంత అందంగా ఉంది! ఈ రాత్రి ఎంత   ప్రశాంతంగా ఉంది.
    కాని తనకి మాత్రం అందాన్ని అనుభవించే అవకాశం లేదు. తనలో ప్రశాంతత లేదు.
    చిన్నగా నిట్టుర్చేడు కాంతారావు.
    కళ్యాణిది అదేం మనస్తత్వమో! చూసి, చూసి రాత్రిళ్ళు పడుకోబోయే ముందు మరీ పోట్లాట పెట్టుకుంటుంది. అదేమని ఆమె మంచిగా ఉన్నప్పుడడిగితే
    'అలా బద్ద శత్రువుల్లా పోట్లాడుకుని, కొంతసేపు దూరంగా వుండి, ఆ వియోగం లోని బాధను అనుభవించిన తరువాత కలిగే సమాగమం లో ఎంత మాధుర్యముంటుందో మీకేం తెలుసు?' అంది వోసారి తన బుగ్గ మీద చిటికే వేస్తూ.
    మగవాణ్ణి , హింసించి, ఏడిపించి, దగ్గరకు తీసుకుంటే ఆడదానికి కలిగే ఆ ఆనందం ఎంత క్రూర మైనదో!' అనుకున్నాడు కసిగా కాంతారావు. క్షణాలు గడిచిపోతున్నాయ్. గంటలలోకి మారుతున్నాయ్. గేటు దగ్గర చప్పుడైతే తలెత్తి చూసేడు కాంతారావు. దూరంగా గేటు లో నుండి ఒక జంట, హోటలు రూముల వైపుగా నడచి వస్తోంది. ఇద్దరూ ఒకరి నడుం చుట్టూ ఒకరు చెయ్యి వేసుకుని యీ ప్రపంచాన్ని గురించిన ధ్యాస లేనట్లు ఏదో కలలోలా నడుస్తూ రూము లోకి వెళ్ళి లైటు వేసేరు. మరో ఐదు నిమిషాల్లో తలుపులు మూసుకున్నాయ్ . లైటారి పోయింది.
    కాంతారావు రెండు చేతులతోనూ తల  పట్టుకున్నాడు . అతని శరీరమంతా చల్లబడిపోయింది. తల దిమ్ముగా ఉంది. అలా ఎంతసేపు కూర్చున్నాడో!
    తన శరీరం మీద చెయ్యి వేసినట్లయి తలెత్తి చూసేడు . కళ్యాణి!
    కాంతారావు మాట్లాడకుండా మళ్ళీ తల వంచుకున్నాడు. 'లేవండి . లోపలికి పదండి.' అంది కళ్యాణి సౌమ్యంగా కొన్ని నిమిషాల వరకు కాంతారావు లో ఎలాటి కదలికా లేదు.
    'మిమ్మల్నే లేవండి.' అంది.
    ఇక తప్పదన్నట్లు లేచి లోపలికి వచ్చేడు. కళ్యాణి తలుపేసి వచ్చేసరికి అతను సోఫా లో కూర్చున్నాడు. 'ఇక్కడేందుకు ? వెళ్ళి మంచం మీద పడుకోండి.' అంది అతని చెయ్యి పట్టుకుని.
    'అ మంచం నీది, నీ పిల్లలిది అన్నావుగా. అక్కడ నాకు స్థానం లేదన్నావుగా?' అన్నాడు నిర్లిప్తంగా కాంతారావు. అప్పటి అతని కంఠస్వరాన్ని వింటూనే ఆమె చలించి పోయింది. సమాధానంగా అతని నుదుటి మీద చిన్నగా ముద్దు పెట్టుకుని ' ఆ పక్క మీద పడుకున్నాక అన్నీ మాట్లాడుకుందాం పదండి' అంది.
    ఇద్దరూ వెళ్ళి మంచం మీద పడుకున్నారు.
    కాంతారావు ఆమెను దగ్గరకు లాక్కుని 'యీ పని యిందాకనే చేస్తే మంచిగా ఉండేది కదా! అనవసరంగా మంచులో కూర్చుని తల దిమ్మేత్తించుకున్నాను.' అన్నాడు.
    ఆమె అతని తలను ముద్దు పెట్టుకుని పమిట చెంగును తొలగించి , దాంతో అతని తలను తుడిచింది. 'నువ్వు వట్టి ఫూల్ వి కాంతం!' అంది అతని తల వెంట్రుకలను లాలనగా నిముర్తూ.
    'ఎందుకేమిటి?' అన్నాడు తన ముఖాన్ని ఆమె వక్ష స్థలం లోకి దూర్చుకుంటూ కాంతారావు.
    'భార్యకి కోపం వచ్చినప్పుడు మగవాడు సిగరెట్లు తగలేస్తేనో, మంచులో తడిస్తేనూ ఆమె కోపం పోతుందనుకున్నావా?" అంది.
    'మరి ఏం చేస్తే పోతుంది భార్య కోపం?' అతని పెదవులు ఏదో మహాత్తరమైన అన్వేషణ లో ఉన్నందు వల్ల అతని మాటలు తడబడినాయ్.
    'అసలు ఆడదానికి మొగుడి మీద కోపం వచ్చిందంటే అర్ధం ఏమిటో తెలుసా?'
    'తెలియదు చెప్పు. ' ఎక్కడో నూతిలో నుండి వచ్చినట్టు అస్పష్టంగా ఉంది అతని స్వరం.
    'భార్య మొగుడి మీద కోప్పడింది అంటే ' నువ్వు నన్ను గాడంగా ప్రేమించూ.' అని అడిగిందని తెలుసుకో. ఆమె నీ మీద ఎంత కోపం చూపిస్తే, ఆమె నీనుండి అంత ఘటైన ప్రేమను ఆశిస్తోందని అర్ధం చేసుకో. అందుకే ఆవిడ కోప్పడి నప్పుడల్లా నువ్వు నవ్వాలి. ఆమె కసిరి నప్పుడల్లా నువ్వు ఆమెను బ్రతిమాలాలి. ఆమె నిన్ను విదిలించి కొట్టి నప్పుడల్లా మరింత దగ్గరగా ఆమెను తీసుకుని, గట్టిగా ముద్దు పెట్టేసుకోవాలి. తరువాత తరువాత.....' ఆమె నడుమును నలిపివేస్తున్న అతని దృడమైన హస్తాలు , భగభగ మండుతున్న తన బుగ్గల మీద, పెదవుల మీద అతను వదుల్తున్న నిట్టుర్పుల బుసలు ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే, ఆమె నరనరాల్లోకి మోహావేశం మత్తు మందులా ప్రవేశిస్తుంటే, యింక మాట్లాడలేక ఆపేసింది కళ్యాణి.
    ఆమె వాక్యం యింకా పూర్తీ కాకపోయినా, ఆమె చెప్పినవీ, చెప్పబోయేదీ, చెప్పదలచుకున్నదీ అన్నీ తుచ తప్పకుండా చేసేసేడు ఆదర్శభర్తయైన కాంతారావు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS