ఆమెతో ఏం చెప్పాలో, ఆమెచూపించిన స్నేహానికి ఎలాగా ధన్యవాదాలు చెప్పాలో అతనికి బోధపడలేదు. ఆమెకి థాంక్స్ చెప్పి.
"పచ్చదీపం వెలిగింది...మీరు వెళ్ళండి - రైలు కదుల్తూంటే సెలవుతీసికోడం బాగుండదు నాకు" అన్నాడు గోపాలం.
"ఆల్ రైట్" అంది స్టెల్లా కష్టంగా. "మీరు వెళ్ళిపోయాక ఎప్పట్లాగ ఉండదు ఆఫీసు....జ్ఞాపకం - ఉంచుకోండి!"
అనుకోకుండా ఆమెతో కరచాలనం చేశాడు గోపాలం. ఆమె త్వరగా వెళ్ళి పోయింది. డిపార్చర్ అనౌన్స్ చేస్తున్నారు మైక్ లో.
అతను ఇంక ఎక్కుదామనుకుంటుంటే శశి రేఖ రామానంద్ త్వరత్వరగా వొస్తూ కనిపించేరు. వాళ్ళవెనుక - శేఖర్, వసంతా వొస్తున్నారు.
ఏం చెయ్యాలో బోధపడలేదు అతనికి.
నలుగురూ సుమారు ఒక్కసారే రావడంతో త్వరత్వరగా పరిచయం చేశాడు. "జామ్ వల్ల ఆలశ్యం ఐపోయింది. రావడం?" అన్నాడు రామానంద్.
వసంత, శశిరేఖ మాట్లాడలేదు.
హృదయ విదారకంగా రైలు కూతకూసింది. అతను ఎక్కేసరికి రైలు కదలసాగింది. రుమాలు ఊపుతూ ఆ నలుగురినీ చూస్తూ, కదలకుండానే దూరం ఐపోయాడు గోపాలం. ఒక్క నిమిషంలో వాళ్ళింక కనబడలేదు అతనికి.
ఇన్నాళ్ళు క్రమ క్రమంగా పేరుకుపోయిన అతని మనస్సు ఒక్కసారి దుర్భలం అయిపోయింది. తన జీవితంలో ఒక అధ్యాయం చేదుగా ముగిసిన విషయం కన్న, ఇద్దరి జీవితాల్లో కొత్త అధ్యాయాలు చేదుగా బాధగా తాను ప్రారంభించినందుకు.
మర్నాడు వాల్తేరులో దిగేసరికి రామం, వొదినా స్టేషన్ కి వచ్చారు.
అతను దిగగానే పలకరించి వసంత ఏదీ?" అంది లలిత.
"రాలేదు" అని, పోర్టరుకి త్వరత్వరగా సామాను ఎత్తి వాళ్ళతో బయటపడి రిక్షాలో ఇంటికి చేరేదాకా మరేమీ అతను మాట్లాడలేదు.
దిగి లోపలికి వెడుతూనే, "బాబు ఎలాగ ఉన్నాడు?" అని అడిగేడు.
"నిన్నటినుంచీ బడికి వెడుతున్నాడు - ఇవేళ నువ్వొస్తావని వెళ్ళనన్నాడు- కాని, పంపేను,"
స్నానంచేసి భోజనాలయాక రామం ఆఫీసుకి బయలుదేరుతూ "ఎన్నాళ్ళు ఉంటావు?" అన్నాడు.
మళ్ళీ కలకత్తా వెళ్ళడం లేదు" అన్నాడు గోపాలం.
చాలా ఆశ్చర్యంగా, "ఏం జరిగింది?" అన్నాడు రామం.
"చాలా ఉంది అన్నయ్యా తీరిగ్గా చెప్పాను" అన్నాడు గోపాలం. లలిత భోజనం చేసి వొచ్చి కూర్చుని, "ఉద్యోగం వొదిలేవా?" అంది.
"అవును వొదినా..."
"ఏం?"
"ఇంక భరించలేని అవమానం అనిపించి."
"వసంత?"
"ప్రస్తుతానికి, ఆమె మాట ఆమెదే!"
చాలా సేపు ఆలోచిస్తూ కూర్చుంది లలిత. అతనికి మళ్ళీ పూర్వంలాగే ఉంది.
"చాలా తప్పు పనిచేసేవు గోపాలం!"
"ఉద్యోగం వొదిలీడమా?- కాలేజీలో రేపు జాయిన్ అవుతున్నాను"
"మూర్ఖంగా మాట్లాడకు- వసంతని వొదిలి రావడం ఏమి మంచిపని కాదు"
"ఆమెని తీసికొచ్చేదీ లేనిదీ నా చేతిలో లేదు వొదినా.
"అదీ నీ తప్పే?"
బాధగా అంది లలిత. కాని అతను నవ్వాడు.
"ఎందుకు నవ్వొస్తూంది నీకు?"
"శశిరేఖ సరీగా అలాగే అన్నమాట జ్ఞాపకం వొచ్చి"
"అక్కడ ఉందా? తరుచు కనిపిస్తోందా?"
"అక్కడే ఉంది. రెండుసార్లు కలుసుకున్నాను."
"ఏమంది?"
"నిన్ను పదిసార్లు జ్ఞాపకం చేసుకుంది"
"నిన్ను?"
"క్షమాపణ అడిగింది"
లలిత నవ్వి, "ఎందుకని?" అంది.
అతను ఆరోజు జరిగిన సంభాషణ అంతా పూర్తిగా చెప్పి "అప్పుడు నువ్వే పొరపాటు పడ్డావు వొదినా!" అన్నాడు.
ఆమె చిరునవ్వుతో, "నీకింకా జ్ఞానం రాలేదయ్యా!" అంది.
"ఏం?"
లోతైన మనీషి శశిరేఖ - నీతో నాక్కావాల్సిన నిజం చెప్పింది."
"అలాగ కనపడలేదు వొదినా, ఆమె చాలా"
"ఉద్రేకంగా మాట్లాడింది. అవునా!"
"ఆఁ..."
"నిజం చెప్పడానికి ఉద్రేకం అక్కరలేదు"
ఇంతలో బాబు వొచ్చాడు. వాణ్ణి ఎత్తుకోబోతే వారించి, "పెద్దవాన్నయిపోయాను బాబయ్యా ఐదోకాసు తెలుసా?" అన్నాడు.
"అందుకేనా జ్వరం వొచ్చింది?"
"కాదు బాబయ్యా! నువ్వు వొస్తావని! అన్నట్టు నన్ను ఇటు పైనే శ్రీనివాస్ అని పిలూ బాబయ్యా
"అలాగేరా బాబూ"
"బాబుకాదు శ్రీనివాస్!"
"సరే శ్రీనివాస్!"
సూట్ కేస్ లోంచి రంగు పెన్సిళ్ళూ, పెన్నూ తీసి వాడికిచ్చి, కాఫీతాగుతూ చాలాసేపు వాడితో కబుర్లుచెప్తూ గడిపేడు గోపాలం మళ్ళీ ఇంటికి వొచ్చిన నమ్మకం అతనికి వొచ్చింది.
* * *
32
కొన్ని నెలల పాటు కొత్తజీవితంలో అలవాటు పడుతూ క్రమంగా మరొక మనిషి ఐ పోయాడు గోపాలం-ముందర కొన్ని వారాల పాటు లెక్చర్లివ్వడం, ఈ ఊరివీధుల్లో తిరగడం ఉన్న కొంచెంమంది పాతస్నేహితులతో మళ్ళీ పరిచయం చేసుకుని వాళ్ళతో కలవడం కొంత కష్టమే ఐనా. ఆర్నెల్లు దాటేసరికి చాలావరకు గడిచిన కథఅంతా మరచిపోగలిగేడు.
ఉన్న తీరికలో రచనా వ్యాసంగాం మళ్ళా మొదలు పెట్టేడు. కాలేజీ వొదిలేక అతను ఏమి రాయలేదు. కాని ప్రతిరోజూ ఏదో ఒకటి రాయటానికి ప్రయత్నం చెయ్యసాగేడు. కొన్ని విజయాలు కొన్ని అపజయాలు-కాని అవన్నీ అతని దైనందిన జీవితానికి ఒక అర్ధం ఇచ్చేందుకు దోహదం చేసేయి.
జరిగిన విషయాలన్నీ, వొదినతో అతను చెప్పేడు- చాలా రోజుల వరకూ ఆ జ్ఞాపకాలు అతన్ని మాటలో పెట్టనిచ్చేవి కావు - అర్ధం చేసుకుని లలిత అతన్ని ఎక్కువగా అడగలేదు. కాని క్రమంగా ఏదో సందర్భం వొచ్చేది.
ఆ మధ్య ఒకరోజు అన్నయ్య చాలా ఆలశ్యంగా వొచ్చేడు- రాత్రి పది దాటినా ఆమె భోజనం చెయ్యకుండా ఎదురుచూస్తూ కూర్చుంది.
గోపాలం ఏదో వాలకం చూడడానికి వెళ్ళి వొచ్చేసరికి ఆ వార్త తెలిసి ఎక్కడికి వెళ్ళేడు?" అన్నాడు.
"చెప్పలేదు గోపాలం-కాని చాలా ఆలశ్యంగా వొస్తానన్నారు."
"నువ్వు అన్నం తిను."
"మరికొంచెంసేపు చూడనీ,"
"ఒకటి రెండుసార్లు నేను ఇంటికి రావడం ఆలశ్యం ఐతే ఎంతో గొడవచేసేది వసంత."
"నువ్వంటే కిట్టక కాదు."
"నమ్మకం లేక..."
ఆ వివరాలన్నీ చెప్పేడు-విని, "నువ్వేం చేశావ్?" అంది లలిత.
మొదట ఆమెకు కాస్త జ్ఞానం కలుగ జేసేందుకు ప్రయత్నించేను. కాని....చివరికి విసుగు పుట్టింది."
"అదే అజ్ఞానం"
"ఎవరిది?"
"ఇద్దరిదీని"
విచారంగా అంది లలిత.
"ఇంకా ఇనాం నువ్వుకాని, శశిరేఖకాని. తప్పు అంతా నాదేనంటారు.....వసంతని పూర్తిగా క్షమించడం తప్ప ఆమెలో ఏమీ లోపం చూడరు!"
ఆమెలో తప్పులేదని కాదు: కాని-"
"అందరూ ఆడవాళ్ళు? ఏం?"
"అందరూ మనుషులు -అది కాదయ్యా....వసంత అలాగ ఎందుకుప్రవర్తించిందో ఆలోచించావ్?"
"చాలా ఆలోచించేను వొదినా! ఆమెకి సంసారం అంటే ఆట-నన్ను కొన్న విషయం మరిచిపోలేదు...తన సొసైటీ వేరు.....చివరికి ఎవరో ఆకాశరామన్న ఉత్తరం కూడా రాశారు"
"నీతిలేని మనుషులు సంతకంలేని ఉత్తరం రాస్తే దానికి మతిలేనివాళ్ళే బాధపడతారు-ఒక్క సంగతి ఆలోచించు గోపాలం! నిన్ను కావాలని చేసుకుంది వసంత.... నీ మీద ప్రేమ లేకపోతే, నువ్వేం చేసినా ఎందుకు పోట్లాడుతుంది?"
"ప్రేమ ఉంటే ఎందుకు పోట్లాడుతుంది?"
"ఉంది కనుక-"
"మిగిలిన ప్రవర్తన? ఆమె ఫ్రెండ్సు-"
"నువ్వు కేర్ చేస్తావేమోనని చూసింది..."
"స్టెల్లామీద శశిరేఖ మీద ఆమెకి అనుమానాలు!"
"కొంత మూర్ఖత్వం -చాలా వరకు నీమీద మమత."
"నువ్వంతా బంగారుపూతతో చూపెడతావు వొదినా వసంతని. కాని. ముందర నువ్వే చెప్పేవు ఆమెజోలికి పోవొద్దని....జ్ఞాపకం ఉందా?"
నవ్వి, "అది నీ పెళ్ళి ముందర- ఆమెని చూసే ముందర- నీ ఒంటరితనం ఏం బాగులేదు గోపాలం... ఆ అమ్మాయి ఉత్తరం రాయలేదా?" అంది లలిత.
"లేదు-"
"నువ్వు-"
"నేను రాయదలుచుకోలేదు వొదినా.... అక్కడికి ఆ కథ ఐపోయింది, ఆమెదారి ఆమెది. నా దారి నాది..."
"అలా అనుకున్నంతమాత్రాన పోయే బంధం కాదు పెళ్ళి."
"ఆ విషయం వాళ్ళ నాన్నగారు చూస్తారు"
"నాకు నమ్మకం లేదు గోపాలం.... ఆమె అక్కడా, నువ్విక్కడా బాధపడడంతప్ప..."
"నాకు బాధలేదు వొదినా - వసంతకీ లేదు."
"నన్ను కలకత్తా తీసికెళ్ళు... వసంతకి బుద్ధి చెప్పి తీసుకొస్తాను."
"ఆ అవమానం నీకెందుకు వొదినా? అంత బలవంతాన ఆమె ఇక్కడికి వొస్తే సుఖపడేది ఎవరు?"
"నీకు వయస్సొచ్చినా పెద్దవాడివవలేదు గోపాలం....శ్రీనివాసులాగే నువ్వూను!"
అంతలో అన్నయ్యవొచ్చి, సంభాషణ ఆగి పోయింది. ఆ తరవాత రెండురోజులు అతను కొంచెం బాధపడ్డాడు- లలితని నొప్పించానని.
"నే నన్నవి మరిచిపో వొదినా!" అన్నాడు మూడో రోజున.
"నే నన్నవి జ్ఞాపకం ఉంచుకో!" అంది లలిత.
అతను జ్ఞాపకం ఉంచుకున్నాడు. అప్పుడూ అప్పుడూ ఆమె మాటల్లో చాలా నిజం ఉందని అనిపించేది అతనికి. కాని, వెనువెంటనే, వొదినది మరీ మంచిమనసు- ఆమెకి వసంత అర్ధం అవదు అని అనుకొనేవాడు.
అలాగే అప్పుడూ అప్పుడూ లలిత అతన్ని మార్చేందుకు ప్రయత్నిస్తూ వొచ్చింది: అతను నిరాకరిస్తూనే వొచ్చాడు.
చివరికి ఒకనాడు, "చెప్పువొదినా.... నువ్వుచెప్పినట్టు చేస్తే నా గౌరవం ఏం ఉంటుంది?" అన్నాడు.
ఆమె నిజమేనంది. కాని, సంశయిస్తూ.
సముద్రంవొడ్డున కూర్చున్నప్పుడల్లా అతనికి పాత జ్ఞాపకాలు కెరటాల్లాగ వొచ్చి బాధించేవి...శశిరేఖని గురించి అతనింక బాధపడకుండా ఉండిపోగలిగాడు. కాని, వసంత అతనికి పదే పదే జ్ఞాపకం వొచ్చేది. ఆనాటి వసంత.
ఒకనాడు మేఘాలలో నిండిపోయిన ఆకాశం కింద సముద్రం నీలిరంగునించి నల్లగా ఐపోయింది. చూసి, గోపాలం వసంతని తలుచుకుని, ఆమె అలాగే మారిపోయింది అనుకున్నాడు. కాని, ఆ మేఘాలు తాను..... ఆ మారి పోయిన రంగు తనమూలాన, అనే భావం వొచ్చి. లేచి త్వరగా ఇంటికి నడిచి వెళ్ళిపోయాడు.
అలాగే గడిచిపోయింది ఒక సంవత్సరం.

ఆ రోజుల్లో అతనికి రామానంద్ నించి వొచ్చిన ఉత్తరం పాతజ్ఞాపకాలతో బాటు కొత్త సమస్యల్నీ తెచ్చింది.
రామానంద్ ఇలాగ రాశాడు!-
గోపాల్ గారికి!
నమస్కారాలు, మీకు ఉత్తరం రాయాలని చాలా కాలంనించి ప్రయత్నం. ముందర మీ అడ్రస్ తెలియక ఊరుకున్నాను. తరవాత అశ్రద్ధ ఐపోయింది. ఇక్కడ మధ్య తరగతి వాళ్ళ జీవితం ఎలాగ ఉంటుందో మీకు తెలుసు కదా!
నిన్న శశి కోపంగా అల్టిమేటమ్ ఇచ్చింది- మీకు ఉత్తరం 24 గంటల్లో రాయమని...
