Previous Page Next Page 
ఏటి ఒడ్డున నీటిపూలు పేజి 31

   
    భోజనాలు చేసి, చేతులు కడుక్కుని వచ్చి, మళ్ళీ అందరు ముందుగదిలో మాటలకి చేరారు. శంకరం మధ్యప్రదేశ్ విసేషాలనుగురించి, తన ఉద్యోగాన్ని గురించి చెబితే, చెల్లెళ్ళు కాకినాడ విశేషాలు, సినిమాలు మొదలయినవాటిని గురించి చెప్పారు.
    తెల్లగా ఉండే శంకరం గోధుమవర్ణానికి తిరిగాడు. సుకుమారంగా ఉండేవాడు కొంచెం మోటుదేరి, కొద్దిగా లావయ్యాడు. స్వశక్తి మీద పైకి వచ్చిన అతనిలో ఆత్మవిశ్వాసం, ధైర్యం స్ఫుటంగా కనిపిస్తున్నాయి. కదలికలో ఒక విధమైన హుందాతనం, మాటలో ఒక తరహా నిండుతనం ఉన్నాయి.
    'ఎంత మారిపోయాడు శంకరం" అనుకుంది చారుమతి, రెండేళ్ళలో అతనిలో కలిగిన మార్పు గమనిస్తూ.    
    శంకరం వచ్చిన వారంరోజులకే భగవతిని చూసుకోడానికి విశాఖపట్నంనించి పెళ్ళివారు వచ్చారు. పెళ్ళి కొడుకు బి.కాం. పాసై, హైదరాబాద్ లో ఎల్.ఐ.సి.లో ఉద్యోగం చేస్తున్నాడు. పిల్లవాడు, తల్లి భగవతిని చూసుకోవడానికి వచ్చారు. వారికి పిల్ల నచ్చింది. రెండు వేల కట్నము, ఆడబడుచు లాంఛనాలు కావాలని కోరారు.
    పెళ్ళివారు వెళ్ళిపోయాక శాంతమ్మ శంకరం తోను, పెద్ద కూతుళ్ళిద్దరితోను, రామారావుగారితోను పెళ్ళి విషయం చర్చించింది.
    "పెళ్ళి కొడుకు ఏం బాగా లేడమ్మా. భగవతిని ఇస్తే కాకిముక్కుకి దొండపండులా ఉంటుంది" అన్నాడు శంకరం.
    పెళ్ళి కొడుకుకి ఇరవై ఆరు ఏళ్ళు. నల్లని పెద్ద విగ్రహం. కొంచెం పళ్ళు ఎత్తు.
    "కాని భగవతికి నచ్చాడు. దాని దృష్టి అంతా అతని ఉద్యోగం మీదే" అంది చారుమతి.
    "డబ్బు మాట ఎలాగ?" అంది భానుమతి.
    "రెండువేలు, లాంఛనాలు అడుగుతున్నారు. పెళ్ళికి మళ్ళీ ఖర్చు ఉంటుంది. అన్నీ కలిపి తడిసి మోపెడు అవుతాయి. మనం ఈ సంబంధానికి తూగలేం" అంది శాంతమ్మ.
    "ఏ సంబంధమూ తూగలేమమ్మా. అందరు బావగారిలాగ, గోపాల్ లాగ ఉచ్తంగా కానీ ఖర్చు లేకుండా నీ కూతుళ్ళ మెడలో పుస్తె కట్టెయ్యటానికి అంగీకరించరు" అంది చారుమతి.
    "నిజమే నమ్మా అందరు మంచివాళ్ళే ఉంటారా? ఇప్పటి కాలంలో పిల్ల అందం చూసి ఎవరు చేసుకుంటున్నారు? డబ్బుకోసం ఆశపడతారు" అంది శాంతమ్మ.
    "ఆ విషయాలు తరవాత మాట్లాడుకుందాం. ముందర ఈ పెళ్ళి విషయం తేల్చండి" అన్నాడు శంకరం.
    "పిల్లవాడి తల్లి మంచిదిలాగే ఉంది" అంది భానుమతి.
    "నన్ను అడిగితే ఈ సంబంధం నిశ్చయం చేసేద్దామంటాను. ఇంతకుమునుపు చూసినవన్నీ ఎస్. ఎస్. ఎల్. సి పాసైన పెళ్ళికొడుకుల సంబంధాలే! వాళ్ళే వెయ్యి, రెండువేలు అడిగారు. అంతకంటే, కొంచెం డబ్బుఎక్కువైనా ఈ సంబంధం చేసెయ్యడమే మంచిది" అంది చారుమతి.
    "పిల్లవాడు ఉద్యోగంలో పైకివచ్చే అవకాశం ఉంది" అన్నారు రామారావుగారు.
    "సరే, అందరూ ఒప్పుకుంటున్నారు. భగవతి ఇష్టపడుతూంది కనక, ఈ సంబంధం ఖాయం చేసి, పెళ్ళి చేసేద్దాం" అన్నాడు శంకరం.
    అన్నిటికీ ముఖ్యం డబ్బు ఉండవద్దుటరా!" అంది శాంతమ్మ.
    "డబ్బు విషయం నేను చూసుకుంటాను. అది నాకు వదిలేయ్" అన్నాడు శంకరం.
    శంకరం అలా అన్నాడేకాని, మనస్సులో డబ్బు గురించి మథనపడుతూనే ఉన్నాడు. ముందర ఎవరేనా అప్పు ఇస్తే, తరవాత తను ప్రతి నెలా కొంత డబ్బు చొప్పున తీర్చెయ్యవచ్చును. కాని అప్పు ఇచ్చేవారెవరు?
    మరునాడు శంకరం ఒంటరిగా చారుమతిని పిలిచి అప్పు సంగతి ఎత్తాడు.
    "నాదగ్గిర కూడబెట్టినవి ఆరువందలు ఉన్నాయి. అవి తీసుకో, శంకరం తక్కినది సూరమ్మగారి దగ్గర అప్పు తెద్దాం" అంది చారుమతి.
    "నీ దబ్బు దాచుకోవే అంతా ఇంటికే వాడేస్తున్నావు" అన్నాడు శంకరం నొచ్చుకుంటూ.
    "ఇది ఎప్పటినించీ నేర్చుకున్నావు? నీ డబ్బు, నా డబ్బు అంటూ..." అంది నిష్ఠూరంగా చారుమతి.
    "బాధపడకే ఆడపిల్ల సొమ్ము తీసుకోవాలంటే సంకోచంగా ఉంటుంది. నాదగ్గిర ఒక ఆరువందల దాకా ఉన్నాయి. మనం ఎలాలేదన్నా రెండువేల అయిదు వందలేనా అప్పు తేవాలి" అన్నాడు శంకరం.
    సూరమ్మగారిని కలుసుకుంటానని వెళ్ళి, గంటలో ముఖం నేలవేసుకుని తిరిగి వచ్చింది చారుమతి.
    "ఏమైంది, చారూ?" అన్నాడు శంకరం ఆత్రతతో.
    "సూరమ్మగారు అంత డబ్బు అప్పు ఇవ్వడానికి వెనకతీస్తూంది. ఏదైనా తాకట్టుపెడితే ఇస్తుందిట. ఇల్లు కుదవబెట్టమంటూంది" అంది.
    శంకరం గుండెల్లో రాయి పడింది. ఎప్పుడో తాతలు సంపాదించిన ఇల్లు. అది ఉండటంవల్లే తలదాచుకో డానికి ఇబ్బంది లేకుండా ఉంది. ఇల్లు తాకట్టు పెట్టడమా? అని ఆలోచనలో పడ్డాడు.    
    "బావగారి సలహా అడిగితే బాగుంటుందేమో!" అంది చారుమతి.
    ఆ ఆలోచన వచ్చి శంకరం రామారావుగారి దగ్గిరకి వెళ్ళి అప్పు సంగతి, సూరమ్మ ఇల్లు కుదువబెట్టమవడం చెప్పి, "ఇప్పుడు ఏం చెయ్యమంటారు బావగారూ?" అన్నాడు.
    రామారావుగారు చాలాసేపు ఆలోచించారు. చివరికి, "శంకరం, మనం ఏదో తాకట్టు పెట్టందే ఈ కాలంలో మనకి ఎవరూ అంత డబ్బు అప్పుగా ఇవ్వరు. ఈ పెళ్ళి చెయ్యాలంటే తాకట్టుపెట్టక తప్పదు మరి" అన్నారు.
    శంకరం దిక్కు తోచనివాడిలా కూర్చున్నాడు. ఇల్లు తాకట్టుని గురించి వింటే తల్లి బాధపడుతుంది. కాని వేరే గతి లేదు.
    శాంతమ్మ కళ్ళనీళ్ళు పెట్టుకుంటూనే ఇంటి తాకట్టుకి ఒప్పుకుని, కాయితాల మీద సంతకం చేసింది.    మంచి ఉద్యోగస్థుడు భర్తగా లభిస్తున్నాడని మురిసి పోతున్న భగవతికి మాత్రం ఇంటి తాకట్టుని గురించి పెద్దవాళ్ళు తెలియనివ్వలేదు.
    భగవతి పెళ్ళికి ఏప్రిల్ ముఫ్ఫయ్యవ తారీఖున ముహూర్తం పెట్టారు. మంచి రోజు చూసి పసుపు దంపించి, ఇంట్లో పెండ్లిపనులు ప్రారంభించారు. ఇంటికి వెల్లవేయించి కొన్ని ఏళ్ళు దాటిపోయింది. ఎలాగా ఖర్చు అవుతూందని శంకరం ఇల్లు బాగు చేయించి, వెల్ల వేయించాడు. గుమ్మాలకి పసుపు రంగు రాసి, తెలుపు, ఎరుపు చుక్కలు పెట్టింది భానుమతి.
    శాంతమ్మకి పనులలో సహాయం చెయ్యడానికి శారదమ్మ రోజూ మధ్యాహ్నం వచ్చేది. పప్పులు, బియ్యం బాగు చేయడం, అప్పడాలు, వడియాలు పెట్టడం-వీటితో ఇంట్లో ఆడవాళ్ళకి ఊపిరి సలపని పని. రామారావుగారికి, చారుమతికి స్కూళ్ళకి ఇంకా సెలవులు ఇవ్వలేదు. పెళ్ళి ముందు పది రోజులు సెలవు పెడతానంది చారుమతి.
    బజారు పని అంతా శంకరమే చూసుకుంటున్నాడు. రోజూ బజారునించి రాగానే, "ధరలు మండిపోతున్నాయమ్మా. ప్రతి వస్తువు ఖరీదు పెరిగిపోయింది" అనేవాడు.
    "అవును, నాయనా, రోజురోజుకీ బ్రతకడం కష్టమైపోతూంది, ఎంత వచ్చినా చాలటంలేదు" అనేది శాంతమ్మ.
    ఒక రోజు ఉదయమే బూడిదగుమ్మడి కాయ వడియాలు పెడుతూంది శాంతమ్మ పొద్దున్నే మినపప్పు రుబ్బడానికి సాయంగా శారదమ్మ ముందురాత్రే వచ్చి పడుకుంది.
    మంచం మీద గుడ్డ పరిచి పొద్దున్నే ఇద్దరూ వడియాలు పెడుతున్నారు. వంటింట్లో భానుమతి రామారావుగారికి, శంకరానికి, చారుమతికి వడ్డిస్తూంది. బయటినించి శాంతమ్మ మాటలు వినిపించాయి.
    "ఏమిటోనమ్మా, శారదమ్మా! చారు పెళ్ళి కాకుండా భగవతి పెళ్ళి చేసెయ్యడం నాకేం బాగా లేదు. రేపు పెళ్ళికి వచ్చిన నలుగురు పెద్దలు, 'ఏమిటమ్మా, పెద్దపిల్లకి పెళ్ళి చెయ్యకుండా చిన్నదానికి చేస్తున్నారు?' అంటే ఏమని సమాధానం చెప్పను?"
    ఆ మాటలు తల్లి నోటినించి వింటూనే, చారుమతి గబగబా ఎంగిలిచేత్తోనే పైకి వచ్చి, విసురుగా అంది: "ఏం సమాధానం చెప్పాలో నేను చెబుతానమ్మా! 'మా చారుమతికి పెళ్ళి ఈడు ఎలాగూ దాటిపోయింది. రెండు మూడు సంవత్సరాలు ఇంకా ఆగినా ఫరవాలేదు. భగవతి కెనా ఈడు ఉన్నప్పుడే పెళ్ళి చెయ్యాలని ఇప్పుడే చేస్తున్నాం' ఈ జవాబే చెప్పు. మళ్ళీ మళ్ళీ నువ్వు నా పెళ్ళిమాట ఎత్తితే ఊరుకోను. భగవతి నేనా సంతోషంగా ఉండనియ్యి."
    "అమ్మ మాటలు ఎందుకు పట్టించుకుంటావు, చారూ! నువ్వు ముందర వచ్చి భోజనం చెయ్యి" అని చారుమతి ఎడంచెయ్యి పట్టుకుని బలవంతంగా లోపలికి తీసుకువెళ్ళింది భానుమతి.
    "చూశావా, శారదమ్మా! ఎంత లేసిమాట లంటూందో! వీళ్ళు నా కూతుళ్ళు కాదమ్మా, శత్రువులు! నేను దానికి పెళ్ళి కాలేదే అని ఎంత బాధ పడుతున్నానో భగవంతుడికి ఎరుక! నువ్వు అదృష్టవంతురాలివమ్మా. ఒక్క కొడుకుని కని ఊరుకున్నావు. కూతుళ్ళని కనలేదు." శాంతమ్మ మాటలు వినేవాళ్ళకి కష్టం కలిగించాయి.
    చారుమతి స్కూలుకి వెళుతూ తను తల్లితో అన్న మాట తప్పేమో అని బాధపడింది. తనకి ఇప్పటిదాకా పెళ్ళి కాలేదంటే తల్లి తప్పు కాదు. ఆవిడ మాత్రం ఏం చెయ్యగలదు? పరిస్థితులు అలాంటివి. తండ్రి చనిపోవడం, పేదరికం అన్నీ కలిసి వచ్చాయి.
    కాని రోజూ ఒకసారేనా శాంతమ్మ నోటినించి ఆ మాటలు వింటున్న చారుమతికి విసుగ్గా ఉంటూంది. రామారావుగారి ముందు, శంకరం ముందు అలా తొందరపడకుండా ఉండవలిసింది అనుకుంది చారుమతి. పైగా, అనవసరంగా తల్లిని బాధ పెట్టానని మనస్సులో ఎంతో కష్టపడింది.
    పెళ్ళిళ్ళని గురించి ఆలోచిస్తూంటే, పద్మ జ్ఞాపకం వచ్చింది. 'శంకరాన్ని పద్మని గురించి ఇవాళేనా అడగాలి' అనుకుంది.
    సాయంత్రం వస్తూనే ముందుగదిలో పేపరు చూస్తూన్న శంకరాన్ని అడిగింది, "అలా జగన్నాథపురం వంతెనదాకా వెళదాం, వస్తావా?" అని.
    "ఎందుకు?" అన్నాడు శంకరం.
    "నీతో మాట్లాడాలి" అంటూ చారుమతి లోపలికి వెళ్ళి ముఖం కడుక్కుని, కాఫీ తాగి వచ్చింది. శంకరం బట్టలు వేసుకుని తయారుగా ఉన్నాడు.
    "నేనూ, శంకరం అలా బయటికి వెళ్ళివస్తాం. అమ్మ అడిగితే చెప్పు" అని భగవతితో చెప్పి చారుమతి బయటికి వచ్చింది.
    ఇద్దరూ మసీదుదగ్గిర మలుపు తిరిగి,మెయిన్ రోడ్డుమీదికి వచ్చారు. మెయిన్ రోడ్డుమీద తిన్నగా ఒక మైలు నడిస్తే జగన్నాథపురం వంతెన వస్తుంది. అక్కడ ఉప్పుటేరు మీద పాతవంతెన స్థానంలో కొత్త వంతెన కట్టారు. ఈ వంతెన చాలా విశాలంగా ఉంది. పనిలేని యువకులు, సాయంత్రం కొంత దూరం వాహ్యాళికి వెళ్ళాలి అనుకునేవాళ్ళు జగన్నాథ పురం వంతెనదాకా నడిచి వెళుతూ ఉంటారు. వంతెనమీద నిలుచుని చూస్తే సూర్యాస్తమయం చాలా అందంగా కనిపిస్తుంది. ఏరులో పడవలు, ఏటికి రెండు పక్కలా చెట్లు, దూరదూరంగా కనిపిస్తుంది. పచ్చని పొలాలు, పైన ఎర్రని ఆకాశం-చిత్రకారులు సావకాశంగా కూర్చుని గీసిన వర్ణచిత్రంలా ఉంటుంది దృశ్యం.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS