12
మీర బొట్టు పెట్టుకొని వంటింట్లోకి వచ్చింది. వెంకమ్మగారితో.
"అరటికాయ చిప్స్ చేద్దాం. నేను తరిగిస్తాను" అంటూ అరటికాయలు, కత్తిపీట ముందేసుకొని కూర్చుంది. చేతికి నూనె రాసుకుని అరటికాయ తొక్కు తీస్తుంటే మళ్ళీ కళ్ళు తిరిగాయి. చేతిలోని అరటికాయ క్రింద పడేసి మోకాలిమీద తల ఆన్చి కూర్చుంది. పొయ్యి మంట వేస్తున్న వెంకమ్మగారు,
"మీరా బొగ్గుల డబ్బా ఇలా ఇవ్వు?" అన్నారు.
మీరనుండి బదులు రాకపోయేసరికి తిరిగి చూశారు.
"ఏమిటమ్మా, వేలు కోసుకున్నావా? అరటి కాయ నేను తరుక్కుంటాను గాని లే" అన్నారు.
"లేదు"
"మరి అలా ఉన్నావేం?"
"ఎందుకో కళ్ళు తిరుగుతున్నాయి."
"అయితే వెళ్ళి కాస్సేపు పడుకో శామన్న వచ్చాక భోంచేద్దువుగాని."
మీర లేచి నుంచుని, "అరటికాయ పల్చగా తరిగి ఎర్రగా వేయించి ఉప్పూ కారం వేయండి. నాకు చాలా ఇష్టం." అని గదిలోకి వెళ్ళి కప్పుకుని పడుకుంది.
శాము వచ్చి దగ్గర కూర్చుని "మీరా, మీరా" అని తట్టిలేపినపుడే మెలకువ వచ్చింది.
"టైం ఎంతండి?"
"ఒకటిన్నర - భోంచేద్దాం పద. ఇప్పుడెందుకూ పడుకున్నావ్? ఒంట్లో కులాసాగా ఉంది కదా?
"ఊఁ. వూరికేనే పడుకున్నా."
ఇద్దరూ భోజనాలకు కూర్చున్నారు. శాము చిప్స్ ఓ ముక్క నోట్లో వేసుకొని, 'బ్రహ్మాండంగా ఉంది' అన్నాడు. మీరకు ఒక ముక్క నోట్లో వేసుకోగానే డోకొచ్చినట్టయింది. ఆసహ్యంతో ప్రక్కకు నెట్టింది.
"చిప్స్ సయించలేదా మీరా?"
"సయించకేం? ఈ రోజేమిటో ఒద్దని పిస్తోంది" అంటూ చారన్నం కలిపి, సయించక పోయినా, బలవంతాన ఒక్కో మెతుకే తినసాగింది. వెంకమ్మగారు సందేహంతో మీర భోజనపు తీరును పరీక్షిస్తున్నారు. ఆమె అనుభవపు బుద్దికి మీర అనారోగ్యపు కారణం ఇట్టే తెలిసిపోయింది. శాము లేచి వెళ్ళగానే,
"ఏమిటమ్మాయ్, ఏదీ సయించనట్టుందే?" అనడిగారు.
"ఎందుకో సయించటంలేదు."
"ఇష్టపడి చిప్స్ చేయించావు. మరి"
"అవును, కాని ఇప్పుడు తినబోతే డోకొస్తూంది."
"అన్నీ మంచి లక్షణాలు."
మీర ఆశ్చర్యంతో తలెత్తి చూసి "మంచి లక్షణాలా? అంటే.....?" అంది.
వెంకమ్మగారు అర్ధ గర్భితంగా నవ్వి "ఎంత చదువుకుంటే ఏమిటి చెప్పు. మంచి లక్షణాలంటే నీకు అమ్మాయో, అబ్బాయో కలగ బోతున్నా రన్నమాట." అన్నారు.
మీర కళ్ళు ఆశ్చర్యంతోనూ, భయంతోనూ పెద్దవయ్యాయి. అసలు సంగతి తెలుసుకొని కృంగిపోయింది. క్షీణకంఠంతో "ఇంత తొందరగా పిల్లలు కావాలని ఎవరేడ్చారో" అంది.
"మన మెవరమమ్మా కావాలీ, ఒద్దు, అనడానికి? దేవుడిస్తే వద్దనగలమా!"
ఇంత త్వరగా తల్లి కావాలన్న ఆపేక్షలేదు మీరకు. పెళ్ళయిన సంవత్సరం లోపుగానే పిల్ల ల్నెత్తుకున్న తన స్నేహితురాళ్ళను హాస్యం చేసి ఏడిపిస్తూండేది తను. అలాటి తనకే పెళ్ళయిన ఎనిమిది మాసాలలోనే తల్లి కాబోతున్న సూచనలు కనిపించి అధీరు రాలయింది. మాతృత్వపు కాంక్ష ఆమెలో ఇంకా పొడ సూపనే లేదు. పిల్ల లంటే స్త్రీలను స్వాతంత్ర్యం నుండిదూరం చేసే బంధనంగా అనిపించే దామెకు. పిల్లలకోసం, తీర్ధయాత్రలూ, నాగ ప్రతిష్ఠలూ చేసేవారిని చూసి, "ఛా, బుద్దిలేక పోతేసరి, వీరికి" అనుకునేది. చిన్నపిల్లలను ఎప్పుడూ ఎత్తుకుని లాలించి ఎరుగదు. పెదనాన్న ఇంటిలో అందరికన్నా తనే చిన్న. స్నేహితురాళ్ళ, చిన్నారి చెల్లెళ్ళనూ, తమ్ముళ్ళనూ చూసినపుడే వూరికే వోసారి బుగ్గగిల్లి నవ్వించటం తోనే ఆమె ముచ్చట ఆఖరయ్యేది. గోపన్నయ్య కొడుకు మూడు నెలల కిశోరుని చూసిన గుర్తు బాగా ఉంది. మీరకు. ఎర్రగా మృదువుగాఉన్న శరీరం, ఇంకా ఆకారం రూపొందని మాంసపుముద్ద, ఆమెను ఆకర్షించలేదు. ఇప్పుడు తను తల్లి కాబోతున్న సంగతి ఆమెను బెదరిపోయేటట్టు చేసింది.
మీర శాముతో ఈ విషయం చెప్పలేదు. "నిజమవునో కాదో ఇంకా కొద్దిరోజులు చూద్దాం అని వూరుకుంది. ఇంకోవారం గడిచేసరికి వేవిళ్ళ బాధతో సగమయింది మీర. తిన్న అన్నం దక్కేది కాదు. ఎక్కువ కాలం బయటే గడిపే శాముకు ఇదేం తెలియదు. కాని మీర చిక్కిపోతూండటం గమనించి అడిగినప్పుడు మీర లేని నవ్వు తెచ్చుకొని మాట మార్చేసేది.
ఒకరోజు శాము టిఫిన్ కొచ్చినప్పుడు వెంకమ్మ గారు రాగి రొట్టె. వెన్న, చట్ని, పళ్ళెంలో అతని ముందుంచి అక్కడే నుంచున్నారు.
"మీర ఆరోగ్యం గురించి కాస్త శ్రద్ధ వహించాలి శామన్నా. ఆమెకు ఎందులోను కొదవ చేయకు."
శాము రొట్టెను ముక్కలు చేస్తూ,
"నే నడిగితే కులాసాగానే ఉన్నానని చెప్పిందే, ఆమెకు నే నెందులో కొదవ చేశానత్తయ్యా?"
"అలా కాదయ్యా. మీర చాలా నీరసంగా ఉంది. పండితులకు చెప్పి ఏదైనా కషాయమో, లేహ్యమో చేయించి తెచ్చిపెట్టు. వంట్లో రక్తమే లేనట్టు తెల్లగా పాలిపోయింది."
"పండితులను పిలిపించేటంత ఆరోగ్యం బాగా లేదా?"
వెంకమ్మగారు నవ్వి, "చెబితేకాని తెలియదు కదా నీకు? నీకు వంశోద్ధారకుడు కలుగబోతున్నాడు. జాగ్రత్తగా చూసుకోవాలి మీరను" అన్నారు.
శాము మొహం సంతోషంతో ఇంతైంది. వూళ్ళో పిల్లలందరిని దగ్గరకు తీసుకొని తినుబండారాలు పంచిపెట్టి ఆనందించేవాడు. వాళ్ళలో తనూ ఒకడై ఆడుకునేవాడు. ఇప్పుడు తమ తండ్రి కాబోతున్నాడని తెలియగానే, అతని ఆనందానికి పట్ట పగ్గాలు లేకుండా పోయింది. కాఫీ ఒక గుక్కలో నోట్లో పోసుకుని,
"నిజంగా!" అన్నాడు.
"అవును నాయనా"
శాము లేచి నుంచుని "మీర ఏది?" అనడిగాడు.
"గదిలో ఉందేమో చూడు."
మీర గదిలో లేదు. శాము ఆమెను వెతుక్కుంటూ పెరటివేపు వెళ్ళాడు.
విశాలంగాఉన్న పెరట్లో కొబ్బరి, మామిడి చెట్లున్నాయి. మామిడిచెట్టు వెనక ఆకుపచ్చ వాయిల్, చీరకొంగు రెపరెపలాడుతూ, 'నువ్వు వెతుకుతున్న మనిషి ఇక్కడుంది' అని చెప్పింది. శాము చప్పుడు చేయకుండా పిల్లిలా అడుగులు వేసుకుంటూ, ఆమె వెనుకనుండి ఆమెను సమీపించాడు. మామిడి చెట్టు మొదట్లో ఓ పుట్ట ఉంది. శాము చూస్తూండగానే మీర వంగి, పుట్టమీదనుండి ఓ మట్టి పెళ్ళ తీసుకుంది. తన అర చేతిలో పెళ్ళనుంచి, కుడిచేతి వేలితో నలిపి పొడి చేసింది. నోటితో వూది, మిగిలిన మెత్తటి మన్ను కాస్త నోటిలో వేసుకుంది.
