20
విజయ పార్టికోలో వేసి ఉన్న కుర్చీలో కూర్చుని తీవ్రమైన ఆలోచనలో తేలిపోతుంది. పోర్టికో చుట్టూ అమర్చిన తోట్లలోని గులాబులూ, చామంతులూ విరగాబూచి సౌందర్యమూ, సంతోషమూ , రెండు తమనే అన్నట్లు నవ్వుతున్నాయి. నీరెండ పోర్టికో లో పడి వెచ్చగా విజయ పాదాలను తాకుతుంది. పశ్చిమాద్రిలో క్రుంగబోతున్న సూర్యుడు ఎర్రగా, మరీ అందంగా వెలిగి పోతున్నాడు. నాటక రంగం మీద నటునిలా ఆకాశం క్షణక్షణానికి రంగులు మార్చుకుంటుంది. చెయ్యి తిరిగిన చిత్రకారుని చిత్రంలా కళాత్మకంగా మనోహరంగా ఉంది ఆకాశ చిత్రం. శూన్యదృక్కులతో కాసేపు ఆకాశం వేపూ మరి కాసేపు పూలకుండిల వేపూ మార్చి మార్చి చూస్తుంది విజయ.
మరి కాసేపటికి సుధీర మెల్లగా అక్కడికి వచ్చి పోర్టికో గోడ నానుకు నిల్చుని గులాబీ పువ్వులోని సౌరభాన్ని ఆస్వాదిస్తూ ఆకాశ చిత్రం చూడసాగింది.
"ఇంతసేపూ ఎక్కడి కెళ్ళావు? మీ స్నేహితుని గదికేనా?"
సుధీర ఉలిక్కిపడి తలతిప్పి విజయ ముఖం లోకి చూసింది.
"జవాబు చెప్పవేం?"
"స్నేహితుడెవరు ?"
"స్నేహితుడు ప్రియుడయ్యాడు గాబోలు! నాకేం తెలుసు?" అంది విజయ విచిత్రంగా కళ్ళు తిప్పుతూ.
"శేఖరం విషయమేనా నువ్వంటుంట?"
"మరే!"
"శేఖరం గదికెళ్ళి చాలా రోజులయింది, నేనలా అతని గది కెళ్ళడం అతని కిష్టం లేదు" అంది సుదీర ముఖం చిట్లించి.
"నిజం చెప్పినంత మాత్రాన తలతీసే వాళ్ళెవరూ లేరిక్కడ!" ఎగతాళిగా అంది విజయ.
"ఆ విషయం నాకు తెలుసు!" విసురుగా తల తిప్పుకుని దూరంగా పశ్చిమ దిక్కు కేసి చూస్తూ కఠినంగా అంది సుధీర.
"తెలిసి కూడా అబద్ధం చెప్పడం లో అంతరార్ధం?"
'అంతరార్దాలేమీ లేవు. నేను వెళ్ళలేదని చెప్తున్నాను."
"మరి యింత సేపూ ఎక్కదున్నట్లో?"
"విశాలకు ఒంట్లో బాగాలేదంటే చూడ్డాని కెళ్ళాను."
విజయ సుధీర ముఖంలోకి పరిశీలనగా చూసి - "విశాలకేం ?" అంది కాస్త సౌమ్యంగా.
"బాగా లేదు. అంతే. ఏం జబ్బో తెలీదు."
"డాక్టరు దగ్గర కేళ్ళలేదా?"
"ఉహు....వట్టి పెడసరం కట్టె! అదే పోతుందిలే అని మొండి కేసింది! బాగా చదువు తుందేమో నీరస పడిపోయింది."
"ఏం చదువుతుంది? ఓ! బి.ఏ. కి వెళ్తుంది కదూ?"
సుధీర ఔననట్లు తల వూపింది.
"భాను విశాలను చేసుకోవడం నిజామేనా?" అంది దూరంగా ఎటో చూస్తూ విజయ.
"నూటికి నూరు పాళ్ళు!" అంది తలతిప్పి నవ్వుతూ సుధీర.
"విశాలను భాను అంతగా ప్రేమిస్తున్నాడా?" చిరునవ్వుతో అడిగింది విజయ.
"ప్రేమను గురించి నీకేం తెలుసక్కయ్యా!" అంది సుధీర ఫకాలున నవ్వి.
విజయ బరువుగా నిట్టూర్చి, బాధగా నవ్వింది.
సుధీర చెక్కిలి మీద చెయ్యి ఆన్చి కనురెప్పలు అల్లనల్లన అర్పి తమాషాగా - "కొంపతీసి నువ్వూ ఎవరన్నా ప్రేమించడం లేదు కదా?' అంది విజయ ముఖంలోకి చూస్తూ.
"ఏం? అందరికీ వున్న హక్కు నాకొక్కత్తికీ లేదా?" అంది విజయ కళ్ళు తమాషాగా తిప్పుతూ నవ్వడానికి ప్రయత్నించింది.
"లేకపోవడ మేం! అయినా నువ్వు అంతస్తుల్నీ , ఐశ్వర్యాన్నీ , హోదానూ, గొప్ప డిగ్రీలనూ , ముఖ్యంగా పుస్తకాలనూ ప్రేమిస్తావు! ఇన్నాళ్ళుగా నేను పరిశీలించి సిద్దాంతీకరించిన విషయం యిది! చూడబోతే నువ్వు దాన్ని దాన్ని తల క్రిందులు చేసేటట్లున్నావే!" అంది సుధీర గలగలా నవ్వి.
విజయ నవ్వలేక నవ్వింది. చెల్లెలి ముఖం లోకి ఓరగా చూసి - చిన్నగా నవ్వి - భారంగా నిట్టూర్చి -- గులాబీ పువ్వు మీద దృష్టి పెట్టి- "నువ్వు చెప్పింది నిజమే, సుధీ!' అంది మెల్లగా - అతి మెల్లగా.
సుధీర చిత్రంగా చూసింది అక్క ముఖం లోకి. గంబీరంగా ఉన్న ఆమె హృదయ సాగరం క్రింద అగ్ని పర్వతాలు ఉన్నట్లు సందేహించింది మొదటి సారిగా. "రక్షణ నిధి కోసం సినిమా వేస్తున్నారక్కయ్యా! అన్నయ్య వంద రూపాయలిచ్చాడు. మనల్నిద్దర్నీ వెళ్ళమని మరీ మరీ చెప్పాడు."
"నేను రాలేను. నువ్వెళ్ళు"అంది విజయ కుర్చీ వెనక్కు తలవాల్చి అదోరకంగా.
"నేనొక్కత్తినే?"
"శేఖరం రాడూ?"
"ఏమో? తెలీదు" అంది సుధీర కళ్ళు క్రిందకు వాల్చి.
"వస్తాడు! వెళ్ళు!' క్రూరంగా నవ్వి అంది విజయ.
విజయ కఠినత్వానికి సుధీర హృదయం చివుక్కుమంది. ఏం మాట్లాడక అలాగే పోర్టికో గోడ నానుకుని నిల్చుండిపోయింది.
"ఈ విషయంలో బాగా ఆలోచించడమే మంచిది. శేఖరాన్ని చేసుకున్నట్లయితే ఆస్తిలో నీకో చిల్లిగవ్వ కూడా రాదు. 'బెదిరింపుగా అంది విజయ.
"అక్కర్లేదు! అయినా ఎందుకు రాదో తెలుసుకోవచ్చా?' అంది సుధీర చివాలున వెనక్కు తిరిగి కోపంగా.
"ఆస్తంతా అమ్మ పేరుతోనే వుంది. దాని మీద సర్వ హక్కులూ ఆమెకే వున్నాయి. ఆ విషయం తెలీదు గాబోలు!' హేళనగా అంది విజయ.
"అమ్మ నాకు ఆస్తిలో భాగం యివ్వదు గాబోలు! అయినా శేఖరం నన్ను ఆస్తికోసం చేసుకోబోవటం లేదు! అమ్మకు నేనంటే యిష్టం లేదు గాబోలు!"
"నువ్వంటే కాదు. నువ్వు చేస్తున్నపనంటే!"
"అమ్మకీ ఆలోచన స్వతహాగా కలిగి వుండదు! బెదిరించి లొంగతీసుకోవడం మీకు చేతగాని పని! మీ డబ్బు నా కవసరం లేదు . అనురాగాలనూ, అంతః కరణలనూ నాశనం చేసే ఆ ఐశ్వర్యం కోసం నేను ప్రాకులాడ దలుచుకోలేదు. నా భాగమూ కావలిస్తే నువ్వే తీసుకో!' విసురుగా అని విసవిసలాడుతూ వెళ్ళిపోయింది సుధీర.
విజయ కోపంగా చూసింది సుధీర వెళ్ళుతున్న వేపు. భానుమూర్తే ఆ సమయంలో రానట్లయితే విజయ ఎంతసేపు ఆలోచనలో తెలిపోయేదో తెలీదు. భానుమూర్తిని చూడగానే -- "బొత్తుగా నల్ల పూసవై పోయావే!" అంది లేచి నవ్వును ముఖంలో తెచ్చి పెట్టుకుంటూ.
"ఏదీ? తీరికుంటేనా? కాంపు కెళ్ళాను" అన్నాడు తనూ నవ్వెందుకు ప్రయత్నిస్తూ.
విజయ మౌనంగా భానుమూర్తి ముఖంలోకి చూస్తుండి పోయింది.
"సుధీర ఎక్కడికో వెళ్తున్నట్లుందే?" అన్నాడు భానుమూర్తి చూపులు ప్రక్కకు త్రిప్పుకుంటూ.
"ఎక్కడో అడక్క పోయావా?" అని మళ్ళీ "సినిమా క్కాబోలు!" అంది విజయ.
'చాలా కోపంగా వున్నట్లున్నావే!" అన్నాడు భానుమూర్తి చిన్నగా నవ్వుతూ.
"ఎవరి మీద?" అంది విసురుగా కఠినంగా.
విజయ కోపం చూశాక భానుమూర్తి కి కొంచెం భయం వేసింది. మెదలకుండా పోర్టికో గోడ నానుకుని ప్రకృతి అందాన్ని తిలకించసాగాడు. అదృశ్యంగా ఉన్న చిత్రకారుడు ఆకాశం మిల కొత్త కొత్త వింత రంగులను పులుముతున్నాడు. పక్షులు గుంపులు గుంపులుగా గూళ్ళకు బయల్దేరాయి. ఇంటి ముందున్న తోటలోని బంతి, చామంతి చెట్లు విరగబూచి పచ్చగా, బొద్దుగా , ముద్దుగా ఉన్నాయి. ధనుర్మాసపు చలిగాలులు రివ్వుమంటూ వీచి నరాలను జివ్వు మనిపిస్తున్నాయి.
"అబ్బ! చల్లగా వుంది. లోపలకు పోదాం రా విజయా!" అన్నాడు గులాబి పువ్వొకటి తుంపుతూ.
విజయ అక్కడి నుండి లేచి మెల్లగా గదిలోకి వెళ్ళింది. భానుమూర్తి వెనకే వెళ్ళాడు.
"నీతో కొంచెం పనుండి వచ్చాను."అన్నాడు లైటు వేస్తూ.
కిటికీ లో నుండి ఎటో చూస్తున్న విజయ వెనక్కు తిరిగి "ఏవిటి?" అంది.
"కొంచెం వచ్చి విశాలను చూస్తావేమో అని....." అస్పష్టంగా అని మధ్యంతరం లోనే ఆగిపోయాడు.
విజయ క్షణం ఏం మాట్లాడక -- మృదువుగా నవ్వి - "ఇప్పట్నుండీ అంత గారభం చేస్తే కష్టమే భానూ!' అంది.
భానుమూర్తి తేలిగ్గా నవ్వుతూ - "ఇందులో గారాబ మేం లేదు. "నీరసం వల్ల అలా వుంది. పోతుందిలే' అని తను డాక్టరు దగ్గరకు వెళ్ళనంటుంది. మాస్టారు గారేమో పాపం ఊరికే గాబారా పడిపోతున్నారు. ఎవర్నో పిలిచే దానికన్నా నిన్ను పిలిస్తే మంచిదని నీ దగ్గరి కొచ్చాను. విశాలకు నువ్వు బాగా తెలుసు. కార్లో వచ్చావంటే ఐదు నిమిషాల పని. ఫీజు యిచ్చుకుంటాన్లె!"అన్నాడు విజయ ముఖంలోకి చూస్తూ.
"సరే! పద!' అంది విజయ ఏదో నిశ్చయానికి వచ్చినట్లు.
