తనకెందుకో గుండెజబ్బు వస్తుందని అనుమానం! అలాంటి అనుమానానికి ఆర్గుమెంటుగానీ, లా పాయింట్ గానీ ఏమీలేదు. పెద్దవాళ్ళకు గుండెజబ్బులొస్తాయి కాబట్టి! మిగతా జబ్బులొస్తే మందులతో వాటిని నయం చేయించుకోగలరు. గుండెజబ్బు మాత్రం మందులకు లొంగేదికాదుగా! అయినా ఈ ఆర్గుమెంటు ఏమీ బాగాలేదు. అయితే అదికూడా ఒక యాస్పెక్ట్ లో కరెక్టే!
విశ్వనాథంగారు తన ఆలోచనలకు కళ్ళెం వేయటానికి ప్రయత్నించారు. అసలు బుర్రవున్నవాళ్ళకుండే జబ్బే అది. ఎటుపడితే అటు ఆలోచనలు కాన్సర్ లా పాకిపోతాయి.
ఇద్దరు మనుషుల్నీ, ముగ్గురు పిల్లలనూ వేసికొని రిక్షా తొక్కుతున్నవాడికి ఇలాంటి ఆలోచనల బాధలేదు. నిజంగా వాడికి మానసిక ప్రశాంతత వుంటుంది. శారీరక శ్రమ తప్పించి వాడికి మరేబాధా లేదు. రిక్షా లాగడం అయ్యాక శరీరానికి విశ్రాంతి లభిస్తుంది. కాని ఆలోచించే వాడి బుర్రకు నిద్రలో కూడా పూర్తి విశ్రాంతి దొరకదు.
ఆ రిక్షావాడు.... అందులో ఏదో చట్ట వ్యతిరేకంగా ఉన్నట్లనిపించింది. రిక్షాలో ఇద్దరు పెద్దవాళ్లూ, ముగ్గురు పిల్లలూ.... ముగ్గురు పిల్లలూ కలిసి ఎంతమంది పెద్దవాళ్ళవుతారు! బరువులోనా? ఆలోచనల్లోనా? వ్యక్తిత్వంలోనా? ముగ్గురి వయస్సూ కలిపితే ఒక పెద్దవాడవడా? అసలు మనుషుల్ని కూడిక వేయవచ్చునా? కానీసిట్యూషన్ లా ఏమంటుంది? ఇది చాలా పెద్ద లిటిగేషన్! రిక్షావాడు కిందకుదిగి తోయటం మొదలుపెట్టాడు. రిక్షా తొక్కటానికి లైసెన్స్ గాని తొయ్యటానికి లైసెన్సు వుందా? తనలో తనే నవ్వుకున్నారు జడ్జీగారు. పార్కు గేటుముందు ఒదిగి నిలబడి ఇద్దరు చేతులు జోడించారు. తల ఆడించినట్లే ఆడించి విశ్వనాథంగారు పార్కులో ప్రవేశించారు.
ఆరున్నర దాటినా వాతావరణంలో వేడి తగ్గలేదు. అప్పటికే పిల్లలూ పెద్దలూ చాలామంది గార్డెన్ లో వున్నారు. విశ్వనాథంగారు వెళ్ళి చెట్టుకిందగావున్న ఖాళీ బెంచీమీద కూర్చున్నారు. దూరంగా పబ్లిక్ రేడియోనుంచి గ్రామస్థుల కార్యక్రమం విన్పిస్తున్నది. బెంచీకి దగ్గిరగా నడివయస్సు దాటిన ఒక ఆడమనిషీ, ఆమెపక్కగా నెత్తిన పళ్ళబుట్టతో ఓ కుర్రాడూ వచ్చి నిలిచారు. పళ్ళబుట్ట బరువును భరించలేని ఆ పసివాని మెడ అటూ ఇటూ కదులుతోంది. ఆడమనిషి పిల్లవాడి నెత్తినుంచి పళ్ళబుట్ట దించింది. అంతకుముందే నేలమీదవున్న పెద్ద పళ్ళతట్ట పక్కగా ఆ బుట్టను పెట్టింది. కుర్రాడికి పళ్ళమ్మి ఏదో పని పురమాయించింది. వాడు పరుగెత్తుకెళ్ళాడు. పళ్ళమ్మి రెండు గోతాలను పరిచి సైజులు వారీగా మామిడిపళ్ళను పేరుస్తూ వుంది.
అంతలో ఆ కుర్రాడు నెత్తిమీద మూడు ఇటుకల్ని పెట్టుకొని చిన్నగా అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చి నిలబడ్డాడు. వాడి నెత్తినుంచి ఒక్కొక్క ఇటుకే తీసి కింద పెట్టింది. కుర్రాడు చేత్తో నెత్తి రుద్దుకున్నాడు.
"ఇంకో మూడు తీసుకురారా నాగేషూ!"
కుర్రాడు మళ్ళీ పరుగెత్తాడు హుషారుగా. విశ్వనాథంగారు ఉరుకులు తీస్తున్న కుర్రాణ్ణీ, పళ్ళమ్మనీ చూసి ముత్తవా మనమడు అయి ఉంటారనుకున్నాడు. మళ్ళీ కుర్రాడి నెత్తిమీద ఇటుకలతో వచ్చాడు. పళ్ళమ్మి ఇటుకల్ని అందుకుంది. ఈసారి రెండు చేతుల్తో నెత్తి రుద్దుకుంటూ, ముఖం అదోలా పెట్టి కుర్రాడు "మల్లమ్మోయ్! ఇంక సాలా!" అన్నాడు.
మల్లమ్మ ఇటుకల్ని చక్కగా పేర్చి వాటిమీద కూర్చుంది. కుర్రాడు ఎదురుగా నిల్చొని పళ్ళవంకే చూస్తున్నాడు.
విశ్వనాథంగారు కుర్రాణ్ణి పరిశీలనగా చూశారు. వాడు ఆమె మనమడు కాడు, అయితే అలా పేరుపెట్టి పిలవడు. ఆమెకూడా అలాంటి పనులు చేయించదు. పైగా వాడి రూపం! కాళ్లూ చేతులూ సన్నగా నల్లగా ఎండిపోయిన పుల్లల్లా వున్నాయి. పెద్ద తలా, గుండ్రటి ముఖం, నిరుసోగకళ్లు. ఆ కళ్ళల్లో, బాల సహజమైన అమాయకత్వం, చాంచల్యం గోచరిస్తున్నాయి. వాడి పొట్ట, జీవితంలో తన ప్రాముఖ్యం ఎంతగా వుందో చూపించటానికి అన్నట్లు ముందుకు పెరిగివుంది లాగు కుడికాలు చిరిగి మోకాలు దగ్గరగా వేలాడుతోంది. చొక్కా ఎడం చెయ్యి భుజంవరకే వుంది. పళ్ళమ్మి ఆ కుర్రాణ్ణి మళ్ళీ "ఒరేవ్ నాగేషూ!" అని పిలిచింది.
కుర్రాడు ఉత్సాహంగా ముందుకు వెళ్ళాడు. జడ్జీగారు కుతూహలంగా వాళ్ళకేసి చూడసాగాడు.
మల్లమ్మ అందించిన ఓ పెద్ద కూజాను తీసుకొని కుర్రాడు పరుగు తీశాడు. ఓసారి పడబోయి తమాయించుకున్నాడు.
"ఒరేయ్ నాగేషూ! పడేవ్! కూజా జాగ్రత్త!" మల్లమ్మ హెచ్చరికలో 'కుర్రాడు పడితే' కూజా పగులుతుందేమోనన్న పాయింటే ముఖ్యం అని జడ్జీగారికి అర్థం అయింది.
అప్పటికే చాలాదూరం వెళ్ళిపోయాడు నాగేషు. నాగేష్ చక్కని పేరు. పిల్లవాడికి తల్లిదండ్రులున్నారా? వాడెవడు? ఎందుకిలా వుంటాడు? ఆలోచిస్తున్న విశ్వనాథంగారికి తన చిన్నతనం గుర్తొచ్చింది. అంతలో అతి వైభవంగా పుట్టినరోజు జరుపుకొంటున్న కొడుకు కళ్ళకు కనిపించాడు. నిండు కూజాను రెండు చేతులతో పొట్టకు అదిమి పట్టుకొని అతికష్టంగా ఒక్కొక్క అడుగే వేస్తూ అల్లంతదూరంలో, ఎదురుదెబ్బ తగిలి, బొక్కబోర్లా పడిన నాగేషును చూసి జడ్జీగారి మనస్సు కలుక్కుమంది. 'అయ్యో' నా కూజా అంటూ మల్లమ్మ పరుగుతీసింది నాగేష్ దగ్గరకు. ముక్కలయిన కూజాను దిగులుగా చూస్తూ, మల్లమ్మ వేస్తున్న మొట్టికాయల్ని ఇంటూ అపరాధిలా నిల్చున్నాడు. జడ్జీగారికి ఏంచెయ్యాలో తోచలేదు. సానుభూతితో చూశారు.
