అవకాశం దొరికితే ఎదురు దెబ్బ వస్తాడు, అందునించి అలా బంధించి తీసుకుపోయే పద్దతి గురించి ఆలోచించటం మానుకుంది మాలతి.
ఇంక మంచితనంతో ఆకర్షణతో అతణ్ణి తీసుకుపోవాలి. అటువంటి వ్యూహాలను గురించి ఆలోచించ సాగిందామే తన కోసం అతడు రావాలి. మనఃపూర్వకంగా రావాలి అతనిమనో వృత్తులకు విభిన్నమయిన అనుభవాలు ఎన్నో నాగరికుల మధ్య అతనికి ఎదురు అవుతాయి.
అవన్నీ తనతో మైత్రిని ఆశించి దాన్ని నిలుపుకు నేందుకు అతడు భరించగలగాలి. అతని త్యాగానికి అతడు సంసిద్ధుడు కావాలంటే అందుకు తగినంత ప్రాతిపదికపడాలి. అలాంటి అవకాశం కోసం ఎదురు చూడటం ప్రారంభించింది మాలతి. వెను వెంటనే తిరుగు ప్రయాణ సాధ్యం కాదని కూడ అర్ధమయిందామెకు. అవసరమయినంత సమయాన్ని వెచ్చించేందుకు నిర్ణయించుకుని మౌనంగా ఉండిపోయింది.
కొండ గుట్టల వెంట తిరుగుతూండడం ఒక సమస్య అయింది ఫిజోకి. ఎలాంటి పరిస్థితిలోనూ అర్ధమానవుడి దృష్టిలో పడకుండా తప్పుకు తిరగటం మరొక సమస్య అయింది. రాత్రి సమయాల్లో ఎముకలు కొరికే చలినించి తనను తాను కాచుకోవటం అన్నిటికన్నా ప్రధాన సమస్యగా మారింది.
అందునించి అతడు అర్ధమానవుడి అలవాట్లను అనుసరించాలని నిశ్చయించుకున్నాడు ఫిజో. కనికట్టుకుని వెళ్ళి ఒకల చమరీ మృగాన్ని వేటాడి చురికతో దాని చర్మాన్ని ఒలిచి తెచ్చుకున్నాడు. ఎండకాసే సమయంలో దాన్ని ఎండించి రాత్రి సమయాల్లోనూ గుహలో పడుకున్నప్పుడు దాన్ని దుప్పటిగా వాడుకోవటం ప్రారంభించాడు. వెలుపలకు వచ్చే సమయాల్లో శరీరం మీద ఆచ్చాదనగా దాన్ని ఉపయోగించసాగాడు.
దాని నించి వచ్చే దుర్గంధానికి అలవాటు పడిపోయిన తరువాత అది వెగటు అనిపించలేదు. ఎంతకాలమయినా కెప్టెన్ నించి ఎటువంటి ఆదేశాలు అందలేదు. అతనికి చాలా విసుగు అనిపిస్తోంది ఎలాగయినా ఈ వాతావరణం నించి బయట పడాలనే తపన అధికమవుతోంది.
తన బాధకు కెప్టెన్ కు లేవు. ఆమెకు కావలసిన ఆహారాన్ని అర్ధమానవుడు వేటాడి తెచ్చి యిస్తాడు రుచి తెలియకుండా ఆమె శరీర ఉష్ణోగ్రతను కాపాడగల మంచి బలమైన ఆహారాన్ని తినగలుగుతోంది.
రాత్రి సమయాల్లో మంచుకురుస్తున్న వేళ బాగా పిండి దుర్వాసన రాకుండా వడలిపోయిన చమరీమృగం చర్మాన్ని కప్పుకుని అర్ధమానవుడి డొక్కలో ముడుచుకుని పడుకుంటుంది. ఎక్కడికయినా బయటకు వెళ్ళాలనిపించినప్పుడు అర్ధమానవుడు అంటుకు తిరుగుతాడు సునాయాసంగా చేతులమీద ఎత్తుకుని త్రిప్పుతాడు.
అందునించి ఆమెకు ఆకలి బాధలేదు. చలిగాలేదు. ఆత్మ రక్షణబాధలేదు. ఎన్నాళ్ళయినా నిశ్చింతగా ఉండగలదు. తను అవస్థలు పడాలి.
అయితే యింతగా ఒక లక్ష్యాన్ని ఆశించి జరుగుతోంది. అందునించి సహనంతో ఎదురు చూడటం ప్రారంభించాడు ఫిజో.
ఒకసారి అర్ధమానవుడు వేటకని వెళ్ళిపోగానే పొంచి రహస్యంగా వెళ్ళి ఏకాంతంగా కెప్టెన్ మాలతిని కలిశాడు. తన గోడు వెల్లడించాడు.
"కెప్టెన్! నేనింక ఈ బాధ పడలేను. తిరిగి వెళ్ళే ముహూర్తాన్ని త్వరగా నిర్ణయించండి." అన్నాడు. మాలతి అతని అవస్థ గమనించి నవ్వుకుంది.
"ఫిజో! అటువంటి అవకాశంకోసమే ఎదురు చూస్తున్నాను. బలవంతంగా వలలో త్రాళ్ళతో బంధించి అయితే అతడ్ని సులభంగానే తీసుకుపోవచ్చు. కానీ అలా చేస్తే నన్ను ప్రత్యర్ధిగా భావిస్తాడు. ఇంకెన్నటికీ అతడు బందీగానే ఉండిపోవలసిన పరిస్తితి ఎదురు అవుతుంది. అందునించి తాను ఇష్టపడి వచ్చేలా చేయాలి. అటువంటి అవకాశం త్వరలోనే రాగలదని ఆశిద్దాం." అన్నది మాలతి అది ఎలా సంభవమవుతుందో వాట్శావానికి ఫిజోకి అర్ధం కాలేదు.
కాని అతడు ఇప్పటికీ మాలతిని తన కెప్టెన్ గానే భావించి గౌరవిస్తాడు, తాను విశ్వాసపాత్రుడయిన సభ్యుడుగానే ఆలోచిస్తాడు.
అందునించి "ఓకె," అని తల ఊగించాడు.
"కాని ఈలోగా నువ్వు అతని దృష్టిలో పడకు. అర్ధమానవుడి కోప దృష్టి నీమీద పడితే ఇంక నిన్ను రక్షించలేను. అందునించి జాగ్రత్తగా మసలుకో, ఇక్కడినించి త్వరగా వెళ్ళిపో, వీలయినప్పుడల్లా వచ్చి నేనే కలుస్తాను" అన్నదామె. ఫిజో వెళ్ళిపోయినాడు.
ఆ సాయంత్రం ఇంకా అంత ప్రొద్దు ఉన్నదనగానే అర్ధమానవుడితో కలిసి కొండచరియలమీద తిరిగేందుకుబయలుదేరింది కెప్టెన్ మాలతి.
అర్ధమానవుడు ఆమెకు ఇష్టమయిన పూలు, పళ్ళు తెచ్చి ఇవ్వడం ప్ర్రారంభించాడు. వాటన్నింటినీ తిరస్కరిస్తోంది ఆమె. అతడు ఇంకా ఏదో తెచ్చి ఇచ్చి ఆమెను సంతృప్తిపరచాలని ప్రయత్నాలు ప్ర్రారంభించాడు.
అతడేమి తెచ్చినా వద్దంటోంది మాలతి. ఆమెముఖంలో ప్రసన్నతా భావాన్ని చూడాలనేది అతని వ్యసనం. అందునించి ఏవో ప్రయత్నాలు చేయసాగాడు.
సరిగా ఆ సమయంలో ఒక గుహాముఖంమీద మాలతి దృష్టి నిలిచిపోయింది. అప్పుడప్పుడే అడుగువేయటం సాగించిన ఒక పులికూన కన్పించిందామెకు. అది అమాయికంగా అడుగులు వేస్తూ గుహవదలి బయటకు వచ్చింది. బాలెంతరాలయిన బెబ్బులి నిద్రించే సమయాన తప్పిజారి గుహ ముఖంనించి బయటపడిపోయింది.
వెలుపలి ప్రపంచం చూడటం దానికి క్రొత్త అయినా జాతి లక్షణాన్ని అనుసరించి గుర్రుమంది, అంతలోనే భయపడి గుహలోకి పరుగు తీసింది.
కెప్టెన్ మాలతి విభ్రాంత అయింది, ఆమెతోపాటుగా చూపు నిలిపిన అర్ధమానవుడు గ్రహించాడు.
గుహలోపల బాలెంత రాలయిన బెబ్బులి ఉండి తీరుతుంది, పురుడు పోసుకున్న బెబ్బులులకు ఆకలితో పాటుగా పరాక్రమం ఇంతింతయిపోతుంది.
ఆ సమయంలో దాని దృష్టినించి తప్పుకోవడంక్షేమం. లేకపోతే చీల్చీచెండాడుతాయి.
ఆటవికమయిన న్యాయం తెలిసిన అర్ధమానవుడు తిరిగి వెళ్ళి పోయే ప్రయత్నం ప్రారంభించాడు. అయితే అందుకు మాలతి అంగీకరించలేదు.
