Previous Page Next Page 
మట్టి మనిషి పేజి 31


    "ఆ మాట నిజమే అనుకో అయినా మనం చేయగలిగిందేమీలేదు వేంకటపతికి రెండోపెళ్ళి చేయడం మినహా." సాంబయ్య ఆలోచనకు కనకయ్య హడలిపోయాడు.
    "ఈ రోజుల్లో మళ్ళీ పెళ్ళి మాటలనుకున్నారా? మొదటి భార్యతో విడాకులు పొందాలి. ఆమెకు మనవర్తీ అదీ ముట్టజెప్పాలి. అవతలివాళ్ళు ఒప్పుకోకపోతే ఏడేళ్ళు ఒకళ్ళునొకళ్ళు సంబంధాలు లేకుండా వున్నారని కోర్టులో రుజువుచెయ్యాలి. అప్పుడే విడాకులు దొరుకుతాయ్ - తెలుసా? మళ్ళీ పెళ్ళంటే మాటలనుకున్నావా? నాలుగేళ్ళ తర్వాత వేంకటపతికి రెండోపెళ్ళికి పిల్ల దొరకటం అంత తేలికైనపనికాదు--" కనకయ్య సాంబయ్య ముఖంలోకి చూసి మళ్ళీ అందుకొన్నాడు.
    "ఇదుగో సాంబయ్యా, నీదొక చాదస్తం! కోడల్ని కాపరానికి తీసుకురాకపోవటంలో నష్టపోయిందెవరయ్యా? నువ్వే! బలరామయ్యకేం, హాయిగా కాలుమీద కాలు వేసుకొని కూతురిచేత ఊడిగం చేయించుకొంటున్నాడు. నువ్వేమో జీతగాడికి డబ్బులిచ్చి ఇంత ఉడకేయించుకు తింటున్నావ్. ఎంతకాలం ఇలా అవస్థ పడతావయ్యా? నువ్వు బలరామయ్యను సాధిద్దామనుకొని నువ్వే నష్టపోతున్నావ్. ఇంట్లో ఆడదిక్కున్నదారివేరు."
    కనకయ్య చెప్పినదాంట్లో చాలా నిజం ఉన్నట్లు అనిపించింది. అవును, తన కోడలుచేత బలరామయ్య ఊడిగం చేయించుకొంటున్నాడు. అసలీ మూడు సంవత్సరాలూ, తాను చాలా పొరపాటు చేశాడు. కోడల్ని కాపరానికి రానిచ్చి బలరామయ్య మీద ఒత్తిడితెస్తే తనకు రావాల్సిన కట్నంబాపతు కొంతవరకైనా వసూలయేదేమో! కనకయ్య ఈ సలహా ఇంతకుముందే ఇస్తే ఎంత బావుండేది?
    "అయితే చూడు కనకయ్యా! మా కోడలు బలరామయ్య దగ్గిర ఇంకొక్క రోజు వుండటానికి వీల్లేదు. రేపే తీసికెళ్తా! ఆ ఏర్పాటు చేయగలవా?" అన్నాడు సాంబయ్య.
    "శుభం! రేపు మంచిరోజుకూడా. ఉదయం వెళ్ళి బలరామయ్యగారితో మాట్లాడదాం?"
    "నేను రాను బలరామయ్య ముఖం నేను చూడను. నువ్వేవెళ్ళి మాట్లాడు."
    "అట్లాగే!"
    తెల్లవారి సాంబయ్యను తన ఇంట్లో వుండమని కనకయ్య బలరామయ్యదగ్గిర కెళ్ళాడు. సాంబయ్య కోడల్ని కాపరానికి తీసుకెళ్ళడానికి ఇష్టపడ్డాడని తెలిసి బలరామయ్య ఆనందపరవశుడయాడు. ఉన్నపాటున వెళ్తే నాన్నను ఎవరు చూస్తారని బాధపడింది వరూధిని.
    "అదంతా నేను చూసుకుంటా. ఏ పనిపిల్లనో పెట్టి వారి మంచిచెడ్డలు చూస్తా. అమ్మాయ్, త్వరగా ప్రయాణం కా!" అన్నాడు కనకయ్య.
    బలరామయ్య కళ్ళవెంట నీరు కారిపోతూంది. అది చూసి కనకయ్య కూతుర్ని వదిలి వుండలేక బాధపడుతున్నాడనుకొని "మీ రిట్లా సాచాతచేస్తే ఆ సాంబయ్య మళ్ళీ మనసు మార్చుకుంటాడు. భగవంతుడి దయ. రాత్రంతా కూర్చోపెట్టి నచ్చచెప్పితే ఒప్పుకొన్నాడు. వివాహం వెయ్యేళ్ళపంట. సాంబయ్య ఈ రోజున కట్నంకోసం వత్తిడి చేయకుండా అమ్మాయిని తీసుకెళ్తానికి ఒప్పుకున్నాడంటే అంతా నీ అదృష్టం అనుకో బలరామయ్యా!"అన్నాడు.
    "కనకయ్యా! నీ ఋణం తీర్చుకోలేను. ఇంతకంటే ఈ జన్మలో నాకు కావాల్సిందేమీలేదు. ఈ మంచిరోజుకోసమే నేనూ బ్రతికివున్నా! నేనే స్వయంగా వచ్చి అమ్మాయిని అత్తారింటి దగ్గర దిగబెట్టి వస్తా." ఆనందబాష్పాలు రాల్చాడు బలరామయ్య.
    "బలరామయ్యగారూ! మీరు కదలటం మంచిదికాదు. నేనూ తండ్రిలాంటివాడ్నే నేనే వెళ్ళి అమ్మాయిని అత్తారింటి దగ్గర దించుతా. పైగా, సాంబయ్యే స్వయంగా తీసుకెళ్ళాలని వున్నాడు. మళ్ళీ మీరు రావటం మంచిదికాదు. నా మాట వినండి."
    "అమ్మాయిని ఒట్టి చేతుల్తో అత్తారింటికి ఎట్లా పపిస్తాం కనకయ్యా? సారె పెట్టి పంపొద్దా?"
    మీరు అలా వుండండి బలరామయ్యగారూ! అంతా నేను చూసుకుంటానన్నానుగా?" అని కనకయ్య లేచాడు.
    కనకయ్య బలరామయ్యకు మరో ఐదువేలు ఇంటిమీద అప్పుగా ఇచ్చి, వరూధిన్ని కాపరానికి పంపించే ఏర్పాట్లన్నీ చేయించాడు. సాంబయ్యను మరోరోజు ఆపి తను ఇంట్లోనే వుంచుకొన్నాడు.
    మూడోరోజు ఉదయం కనకయ్య చిన్నకారు మాట్లాడి వరూథిన్ని ఎక్కించాడు. చీరెలూ, సారెలూ కార్లోనింపి బలరామయ్య దగ్గిర శెలవు తీసుకొని ఇంటికొచ్చి సాంబయ్యను ఎక్కించుకొని బయలుదేరాడు.
    కార్లో కూర్చున్న వరూధినికి అంతా కొత్తకొత్తగా వుంది. ఏదో తెలియని భయమూ, దిగులూ మనసును పిండేస్తున్నాయి. ముందు సీట్లో కూర్చున్న మామగారు ఒక్కసారైనా తిరిగి చూడలేదు.
    అన్నపు వేళకు కారు ఊరుచేరింది. సాంబయ్య ఇంటిముందు కారాపించిన కనకయ్య భార్యకు కబురు పెట్టారు. పదినిముషాల్లో కనకయ్య భార్యతోపాటు నలుగురు ముత్తయిదువులు పోగయారు. తతంగం పూర్తిచేసి అమ్మలక్కలు వరూథిన్ని ఇంట్లోకి తీసుకువచ్చారు. సాంబయ్య సావిట్లో బిగదీసుకొని కూర్చున్నాడు.
    వెంకటపతి పొలాన్నుంచి ఇంకా రాలేదు. కనకయ్య మళ్ళీ తిరిగి అదేకారులో బస్తీకి వెళ్ళిపోయాడు.
    వరూధిని ఇల్లంతా తిరిగి చూసింది. అంతా మురికికూపంలా వుంది. ఆడదిక్కులేని సంసారం. విడిచిన బట్టలేవో, ఉతికిన బట్టలేవో తెలియకుండా పడివున్నాయి. నట్టింట్లో చిట్టుబస్తాలూ, వడ్లబస్తాలూ వున్నాయి. వంటింట్లో అన్నీ మసిపట్టిన పాత్రలూ, కిలుంపట్టిన ఇత్తడి గ్లాసులూ వున్నాయి. దణ్ణాలు బూజుపట్టి వున్నాయి. ఉట్లు మసిపట్టి తెగి వరిగి వేలాడుతున్నాయి. ఎలుకలు ఎక్కడపడితే అక్కడే స్వైరవిహారం చేస్తున్నాయి. చీకటి మూలల్లో మనిషి వెళితే "బయ్" మని దోమలు లేస్తున్నాయి. ఆ కొంపలో అడుగువేసి అడుగు తియ్యాలంటే అసహ్యంగా వుంది. వరూధిని వంట గదిలో కాలుపెడితే డోకు వచ్చేంత పర్యంతం అయింది. అన్నం మెతుకులు కాలికి అతుక్కుంటున్నాయి. పీటలమీద ఎంగిలి అలానేవుంది. పడమటగదిలో అన్నిరకల సామానులతోపాటు ట్రంకుపెట్టెలూ, కొయ్యపెట్టెలూ అడ్డదిడ్డంగా పెట్టివున్నాయి. సర్ధటానికి ప్రయత్నించిన వరూధినికి అది తనవల్ల అయ్యేట్టు కన్పించలేదు. చిరాకుపడి పడకగదిలోనుంచి బయటకు వచ్చింది.
    పొలం వెళ్ళబోతున్న జీతగాడ్ని చూసి "నువ్విట్లారా." అని పిల్చింది.
    "ఏందమ్మగోరూ?" తలవంచుకొనే అన్నాడు.
    "ఇది మనుషులుండే కొంపేనా?"
    జీతగాడు బిత్తరపోయి వరూధినికేసి చూశాడు.
    "ఏంట్రా, అట్లా చూస్తావ్? మీరు తినేది అన్నమేనా?"
    జీతగాడు నోరెళ్ళబెట్టాడు.
    "మీరు మనుషులేనా?"
    జీతగాడు తల అడ్డంగా ఊపాడు.
    "ఒరేయ్  పశువా, మాట్లాడవేంరా?"
    జీతగాడికి చెమటలు పట్టాయి. వరూధిని ఆ వూరి షావుకారిగారి కూతురన్నది గుర్తొచ్చింది. బలరామయ్యగారి బిడ్డ!
    "అమ్మాయిగారూ, ఏంటయిందమ్మా!" భుజాన వున్న మూటను సర్దుకుంటూ అన్నాడు.
    "ఒరేయ్, ఆ భుజానవున్న దేమిట్రా?"
    "చిన్న దొరగోరికి వణ్ణం తీసుకెల్తున్నా!"
    వరూధిని వాంతి వస్తున్నట్లు ముఖం పెట్టింది.
    "ఇంటికి వచ్చి భోజనం చెయ్యరా?"
    "కొత్తకాలవపొలం నాటేత్తున్నారు. పొద్దుననంగా ఎప్పుడో సద్దెన్నం తినెల్లారు దొరగోరు. ఆలశం అయిపోయింది. నేపోవాలి." అంటూ జీతగాడు కదిలాడు.
    "సద్దెన్నమా?" వరూధినికి వళ్ళు కంపరం పుట్టింది.
    "ఒరేయ్! ముందా మూట అక్కడ పెట్టు!"
    జీతగాడు తెల్లబోయి చూశాడు.
    "నీకేరా చెప్పేది?"
    జీతగాడు అన్నంమూట బల్లమీదపెట్టి చేతులు నులుపుకుంటూ నిల్చున్నాడు.
    "నువ్వేనా వంట చేసేది?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS