"కూర్చోండి" - అని మంచం చూపించింది.
మంచం మీద కూర్చోవడానికి మొహమాటం వేసి నిల్చున్నాం.
"నీ పేరేమిటి పాపా?" - అని అడిగాను.
"అమ్మాజీ" - అంది.
రెండు నిముషాలయ్యాక శ్రీశ్రీగారి భార్య వచ్చారు.
"నమస్కారమండీ" - అన్నాను.
రిప్లయ్ యివ్వలేదు సరికదా, ముఖాన చిరునవ్వయినా లేదు. 'మంచి సంస్కారమే' - అనుకున్నాను.
"మీ అమ్మగారా?" అనడిగారు.
"అవునండీ" అన్నారు.
"నీతోపాటు ఈవిడ కూడా ఎక్కడికి వెళ్ళినా వస్తూ వుంటారా?"
"అవును" - అని సమాధాన మిచ్చాను.
"ఇలా గొచ్చి కూర్చోండం"టూ అక్కడున్న మంచం చూపించేరు. దానిమీద ఆవిడ కూర్చున్నారు. నేను మంచంమీద కూర్చోడానికి మొహమాటపడ్డాను. అమ్మని మాత్రం కూర్చోబెట్టి పక్కనే వున్న స్టూల్ దగ్గరగా లాక్కుని కూర్చున్నాను.
"వీరి దగ్గరికి నువ్వు పనికొచ్చి ఎన్నాళ్ళయింది?" అన్నారు.
"మీకు తెలీదాండీ" అన్నారు.
"చెప్పారులే మైసూరు నువ్వుకూడా వెళ్ళావా?" అని మరో ప్రశ్న వేశారు.
"అది కూడా మీకు చెప్పలేదా?" అని అడిగాను.
నన్ను ఎగాదిగా రెండుసార్లు చూసి, "మీరు మీ అమ్మాయితో మైసూరు వెళ్ళారా?" అని మా అమ్మని అడిగారు.
"మా అమ్మాయిని ఒంటరిగా వాళ్ళ నాన్నగారు ఎక్కడికీ పంపరండీ. నేను తనతో కూడా వుండాల్సిందే" అని జవాబిచ్చింది మా అమ్మ.
"నీ పేరేమిటి?" అని అడిగారావిడ. ఈ ప్రశ్న రాగానే అడుగుతారనుకున్నాను. నా పేరు సరోజ అన్నాను.
"మళ్ళీ మైసూరు ఎప్పుడు వెళతారని ప్రశ్నించారు."
"భార్య అయివుండీ మీకే తెలియనప్పుడు నాకెలా తెలుస్తుందండీ" అన్నాను.
నా జవాబులకి ఆవిడ వొళ్ళు మండిపోతోందని నాకు తెలుసు.
శ్రీశ్రీగారు చెప్పిన మాట నిజమే. 'ఆవిడ నిన్ను ప్రశ్నలతో వేధిస్తుంద"ని చెప్పారు.
ప్రశ్నలు అడగొచ్చు. కాని అడిగే ప్రశ్నలకి అర్ధం పర్ధం వుండొద్దూ? తెలిసినా, తెలీకపోయినా తనేమీ ఎరగనట్టు పైవాళ్ళని అడిగితే తన గుట్టు తనే బైట పెట్టుకున్నట్టు లేదూ!
భార్య అయివుండీ ఇలా ప్రవర్తిస్తే, ఎదుటివారి దగ్గర చులకనయిపోరూ! 'శ్రీశ్రీగారు అన్ని విషయాలూ చెప్పే వుంటారు. వారికి అబద్దం ఆడడం చేతకాదు. ఈవిడే ఏదో మనసులో పెట్టుకుని క్రాస్ చేస్తున్నార"ని అనుకున్నాను.
ఆవిడ అడగదలచుకున్నవన్నీ ఓ క్వశ్చన్ పేపర్లా రాసి ఇచ్చినా బాగుండేది. సంధానాలు రాసిచ్చేదాన్ని, ఇంకా ఏం ప్రశ్నలు వేస్తారో అని అనుకుంటూనే వున్నాను.
"మైసూరు ఎప్పుడు వెళ్ళేదీ ఇంకా చెప్పలేదన్నమాట" అన్నారావిడ.
"బహుశా బయలుదేరేముందు చెప్తారేమోనండి" అన్నాను.
మా సంభాషణంతా పక్కరూములో నుండి శ్రీశ్రీగారు వింటున్నారని గ్రహించాను. వారు అక్కడే వున్నట్టు సిగరెట్ వాసన చెప్తోంది.
"మీ దేవూరు? బ్రాహ్మలేనా? ఎంతవరకూ చదువుకున్నావు?" అనడిగారు.
"చూడండి. ఆ వివరాలన్నీ శ్రీశ్రీగారితో ఏనాడో చెప్పాను. మీ రడిగితే చెప్తార"న్నాను నాకు తెగ విసుగ్గా వుంది.
"నిన్ను అడిగినప్పుడు చెప్పడానికేం?" అని ఆవిడ అంటూ వుండగా, శ్రీశ్రీగారు బైటకి వచ్చి -
"టైమయ్యింది. వెళదామా?" అన్నారు.
"మీదే ఆలస్యం" అని ఠక్కున లేచాను.
"మీరు వెళ్ళి కార్లో కూర్చోండి - వారొస్తార"ని అన్నారావిడ.
పెత్తనం అంతా ఆవిడదేనని గ్రహించాను. 'తప్పేంవుంది? నేచురల్' అనుకుంటూ ఆవిడ గురించే ఆలోచిస్తూ అమ్మతోపాటూ కారెక్కాను.
* * *

మనం అనుకున్నంత తేలికైన మనిషి కాదావిడ! ఎవరైనా యింటికొస్తే ముందు వాళ్ళని పలకరించి కూర్చోమంటాం. ఉంటే కాఫీ లేదా కనీసం మంచినీళ్ళయినా తాగుతారా అని అడుగుతాం. తర్వాత మాటామంతీను. కానీ ఆవిడవేమీ చేయలేదు. మనిషి చూడటానికి ఎంత సున్నితంగా కనిపిస్తారో మాటలు, మనసు అంత కటువుగా వున్నాయనిపించింది.
"కొత్తకదా - ముక్కూ మొహం ఎరగనిదాన్ని ఎర్రగా బుర్రగా వున్న చిన్నదాన్ని భర్త సంగతి తెలిసి తన జాగ్రత్త తను పడడంలో తప్పేంవుంది' - అనుకున్నాను. కానీ పద్దతి అంటూ ఒకటేడిసిందిగా!
పిల్లలు పుట్టలేదుకానీ, పుట్టివుంటే నేనామెను చూసిననాటికి నిస్సందేహంగా నా అంత కూతురుండేది.
భర్తమీద ఆవిడకి నమ్మకం వున్నట్టు కనిపించడం లేదు. మంచి గొడవే!
పోనీ మనకేం? మన మనస్సులో కల్మషంలేదు. పొట్టకోసం పనిలోచేరాం. అనుకుంటూ కూర్చున్నాను.
అట్టే ఆలస్యం చెయ్యకుండానే శ్రీశ్రీగారు వచ్చేశారు. "నిన్ను మళ్ళీ మధ్యాహ్నం రమ్మంది" అన్నారు.
ఏఁ "ఇంకా అడగాల్సినవేమైనా మర్చిపోయారా? మంచి ఓరల్ పరీక్షే" అన్నాను.
"నేను ముందే నీకు చెప్పానుగా" అన్నారు.
"నిజమే చెప్పేరు - ఏ విషయమూ మీరు ఇంట్లో చెప్పలేదనే అనుకోండి. భార్య అయివుండి పరాయివాళ్ళ దగ్గర అలా వెలితిపడిపోతారా? ఆవిడడిగే మాటలు నాకేం నచ్చలేదు" అన్నాను.
"నువ్వేమి సమాధానం చెప్తావోనని చాలా శ్రద్దగా గమనించాను. అబద్దం ఆడలేదు. ఐ లైక్ యూ వెరీమచ్" అన్నారు.
"ఏడిసినట్టుంది. అబద్దం ఎందుకు చెప్పాలి? బ్రతుకుతెరువు కోసం వచ్చిన దాన్ని నా పనేదో నేను చేసుకుపోతాను. ఆమాత్రం దానికి లొసుగులెందుకండీ" అన్నాను.
"అదుత్త పల్లెటూరి బైతు. నీమాత్రం చదువుకూడా దానికి లేదు. నేనంటే పడిచస్తుంది. ఉత్త అనుమానస్థురాలు. నా దగ్గరికి పనికివచ్చావు. నాతో పాటు నువ్వు కూడా దాని బాధపడక తప్పదు"
"మీరన్నమాట మరీ బాగుందండీ. నేను పనిచేస్తున్నది మీ దగ్గరా, మీ ఆవిడ దగ్గరా?"
"అవుననుకో అయినా..."
"మీ స్వవిషయాలు నాకు అనవసరం. మీ యింటికి వస్తేకదా బాధలు? నాకు రావలసిన అవసరం ఏముంది? పైగా అనుమానం మనిషని మీరే చెప్తున్నారు. నాకెందుకండీ బాబూ! లేనిపోని గొడవలు?
మళ్ళీ మీ యింట్లో అడుగుపెడతాననుకుంటున్నారా? మన పని కంపెనీల్లోనూ, స్టూడియోలోనేగా? గుడ్డిలో మెల్ల - బతికాను" అన్నాను.
"నిన్ను తీసుకురమ్మంది. రావా?" అనడిగారు.
"చచ్చినా రాను! నేను మీ అసిస్టెంట్ ని, చుట్టాన్ని కాను. మీ దగ్గర నాపని కంపెనీలోగాని మీ యింట్లో కాదు. దయచేసి మీ యింటికి నన్ను మళ్ళీ పిలిచి యిరకాటంలో పెట్టకండి. నా కిటువంటి తికమకలు అసలు తెలియవ"న్నాను.
సిగరెట్ దమ్ములాగుతూ పెదవుల సందులోనుండి గమ్మత్తుగా నవ్వారు.
"మనం చేస్తున్న రెండు పిక్చర్లూ అయిపోయినట్టేనా?" "అదెలా? రెండవ పిక్చర్ డబ్బింగింకా పూర్తి కాలేదుగా?"
"అదెంతసేపు? నాలుగు డబుల్ కాల్ షీట్లలో పూర్తి చేసేస్తాం. తర్వాత నువ్వేం చేస్తావు" అనడిగాను.
"భజన చేస్తూ కూర్చుంటా"నన్నాను.
ఎందుకో తెలీదుకాని నేనన్నమాటకి గొల్లున నవ్వారాయన. ఎంతో బాగా నవ్వారనిపించింది.
