ఇంత పచ్చిగా మాట్లాడుకోకపోవటానికి వాళ్ళేం భార్యాభర్తలు కారు, ప్రేమికులు కాదు.....అవకాశవాదం అనే జలపాతపు హోరులో కొట్టుకుపోతూ అదే శృంగారమని భావించే యాంత్రికతకి అలవాటుపడ్డ వ్యక్తులు.
"పిలిచింది యిందుకేనా?" అడిగాడు సుదర్శనరావు.
అతడు లేవబోతుంటే అవకాశం యివ్వకుండా యింకా పొదివిపట్టుకునే వుంది రమ్యశ్రీ. "సుకృతి గురించి మీతో మాట్లాడాలి"
అర్ధంకానట్టు చూశాడు. "కేరక్టర్ మొత్తం కట్ చేశానుగా?"
"కానీ ఆ పిల్ల అసాధ్యురాలులా వుంది.....కసితో మనల్ని నిలువునా కట్ చేసేట్టుంది."
"నాకేం బోధపడటంలేదు."
"నారాయణశెట్టితో వ్యవహారం మొదలుపెట్టిందట."
చురుక్కుమన్నట్టుగా చూశాడు. తను కావాలని అడుగుతున్నా తప్పించుకుంటూ యిప్పుడు ఆ ముసలాడితో సంబంధం పెట్టుకుందా? తనకీ, శెట్టికీ వయసులో పెద్ద తేడా లేదని మరిచిపోయిన సుదర్శనరావు "అయితే ఏమిటట.....నారాయణశెట్టి యిలా చాలామందితో పడుకుంటాడుగా?" అన్నాడు అసూయగా.
"కానీ ఆ పెద్దమనిషి చాలామందికి ఫ్లాట్స్ ని, కార్లని కొనిపెట్టలేదు."
దిగ్బ్రాంతిగా చూశాడు. అప్పు తీసుకుని అసలు చెల్లించినా వడ్డీ డబ్బుల కోసం సినిమా రిలీజ్ కాకుండా అడ్డంపడే నారాయణశెట్టి అంత ఖర్చుపెట్టాడూ అంటే మొత్తానికి సుకృతి బలంగానే వాటేసుకుందన్న మాట.
"కొంటే మాత్రం మనకేం నష్టం రమ్యా?"
తొలిసారి సుకృతి అందాన్ని చూసి కంగారుపడిన రమ్యశ్రీ యిప్పుడు ఆమె మేధస్సుకి ఆందోళన పడుతున్నది తన కారు డ్రయివర్ చెప్పింది విన్నాకనే. రామన్ కారు డ్రైవర్ నారాయణశెట్టి యింటి దగ్గర మొన్నరాత్రి జరిగింది రమ్యశ్రీ కారు డ్రైవర్ చెబితే అతడు రమ్యశ్రీకి పూసగుచ్చినట్టుగా అంతా తెలియచేశాడు. సొంత కారు డ్రైవర్ లతో చాలా మంది కథానాయికలు అంత చనువుగా వుండటానికి కారణం వాళ్ళ రహస్య వివరాలన్నీ ముందు తెలిసేది వాళ్ళకే కాబట్టి. ఏ రాత్రి ఏ హోటల్ కి వెళ్ళింది. ఎంతసేపు వున్నదీ బాగా తెలిసేది కారు డ్రైవర్లకే.
"తన తండ్రిమీద పగ తీర్చుకోవటానికి మాత్రమే శెట్టితో పడుకుందని నేననుకోవడంలేదు రావుగారూ. రామన్ సినిమా వచ్చే నెల ప్ర్రారంభం కాకుండా మిగతా ఫైనాన్సర్లనీ అదుపు చేస్తున్నాడట.....అంటే రామన్ పతనానికి మాత్రమేగాక చాలామందిని శెట్టిద్వారా సాధించబోతూంది."
"దాని మొహం" తేలిగ్గా తీసేశాడు సుదర్శనరావు.
"శెట్టి ఇండస్ట్రీ మొత్తంలో పెద్ద ఫైనాన్సరన్నమాట నిజమే కావచ్చు. రామన్ కి అప్పు పుట్టకుండా అతడు కంట్రోల్ చేయడమూ యదార్ధం కావచ్చు. కానీ మిగతావాళ్ళవి అదెం చేయగలదని?"
"నాకేదో అనుమానంగా వుంది రావుగారూ.... మీరోమారు శెట్టి గారితో మాట్లాడితే బెటరనుకుంటాను."
"అయినా మీరెందుకిలా ఆందోళన పడుతున్నారో బోధపడటం లేదు. ఎవరూ కదపలేని స్థాయి మీది."
ఆ వాక్యాలు అణువంత సంతృప్తిని కలిగించినాగాని సంబాళించుకో లేక పోయింది. సుకృతికి ఎంతమంది ప్రత్యర్ధులున్నా కాని నటి కావాలనుకున్న ఆమెకు తొలి శతృవు తను మాత్రమే అదికాదు ఆమెను భయపెడుతున్నది.....సుకృతి ఓ మూల కూర్చుని ప్రతిక్షణమూ తనని చూసే చూపు ఆమె అంత తేలిగ్గా మరిచిపోలేనిది. కళ్ళవెనుక నిద్రపోతున్న ఏ చైతన్య సర్పాలతో ఓ రోజు తూణీరాల్లా బయటికి సంధించి మీ అంతు చూస్తానని శపథం చేస్తున్నట్టు కనిపించే సుకృతి నేత్రాలు చాలా రోజులుగా ఆమెను ఆందోళన పరుస్తున్నాయి. తన స్థాయి నటి సుకృతి విషయంలో భయపడాల్సిన అవసరం లేకపోయినా ఆమె ప్రశాంతంగా వుండలేకపోతూంది. మిన్నాగు వుండేది మోచేతి పొడవులో అయినా ఒక్క కాటుతో యెంత మనిషినయినా నేలమట్టం చేస్తుంది.
"నా మాట విని మీరోసారి శెట్టిగారితో మాట్లాడండి" రెట్టించింది రమ్యశ్రీ.
మరోసారి ఆమెపై తన శక్తిని ప్రయోగించేవాడే కాని యిప్పుడు మూడ్ లేదు. తొలిసారి తను రుచి చూసిన సుకృతి ఆడతనం శెట్టికి అంకిత మయిపోయిందని తెలిసినందుకు అసహనంగా వుంది.
మరో అయిదు నిమిషాలలో డ్రెస్ చేసుకున్న సుదర్శనరావు గ్రీన్ రూంలోనుంచే శెట్టికి ఫోన్ చేశాడు- "నేను.....సుదర్శనరావుని మాట్లాడుతున్నాను."
"చెప్పండి డైరెక్టరుగారూ" శెట్టి కంఠం వుత్సాహంగా వినిపించింది. "ఎక్కడినుంచి?"
"స్టూడియోనుంచే....." క్షణం ఆగి అన్నాడు. "ఈ రోజు సెట్ కి వస్తారనుకున్నాను."
"ఎక్కడ.....తీరిక వుంటేగా?"
"ఎలా వుంటుందీ......వయసు పిల్లల్తో వ్యాపకాలు ఎక్కువయి వుంటాయి."
