Previous Page Next Page 
ఎలమావి తోట! పేజి 31


    
                                       22    


    సిటీలిమిట్స్ లోకి వచ్చేసింది కారు. అప్పటికి దాదాపు తొమ్మిది గంటలై వుంటుంది.
    "స్వప్నా!" పిలిచింది సౌందర్య.
    అంతదాకా ఆలోచనల్లో మునిగిపోయి, ఏమీ    మాట్లాడకుండా తార్రోడ్డు వెంట వేగంగా వెళుతున్న కారునీ, ఏకాగ్రతతో ఎంత వేగంగా వీలయితే అంత వేగంగా వేలయితే అంది వేగంగా కారుని హైద్రాబాద్ చేర్చటమే తన ధ్యేయ అన్నట్టుగా డ్రైవ్ చేస్తున్న మణినే గమనిస్తున్న స్వప్న సౌందర్య పిలుపుకి ఉలిక్కిపడింది.
    "మీ అమ్మమ్మ ఎందుకు పిలిపించి వుంటుందే!"
    "ఏముంది? ఎవరో రేపు పెళ్ళి చూపులకి వస్తానని ఫోన్ చేసి వుంటారు. ఆ విషయం చెపితే స్వప్న రాదది, తను కాక వెంకట్రామయ్యతో ఫోన్ చేయించివుంటుంది!" అంది గీత.
    "అంతేనంటావా?" నిస్పృహతో అడిగింది విజయ.
    "మరింకేం కొంప మునిగిపోయే అర్జంటుపనివుందే?" కిరణ్.
    "అదేం అయివుండదులేవే! ఏదో అర్జంటు పనిలేందే రింగ్ చేయించి వుండదు!" అంది షీలా.
    "అర్జంటా? నా తలశాయా? జెమినీ పులి లాంటి అమ్మమ్మగారికి ఆలాంటి మనస్తత్వం వుండే పెద్దలకి మనమంటే ఎలర్జీ. అసలు మనం వాళ్ళ మాటవింటామా? వినమా టెస్ట్ చేయాలని అలా చేయిస్తారు? అసలు మనం లొంగి వుంటే మనతో ఆటలాడిస్తారే ఈ పెద్దవాళ్ళు!" అంది సౌందర్య.
    స్వప్న సమాధానం యివ్వలేదు. నియాన్ లైట్లకేసి చూస్తూ వుండిపోయింది. ఓ సినిమా హాలు ముందుగా దూసుకెళుతోంది కారు.
    "స్వప్నా?" కెవ్వున కేకేసింది షీలా.
    "ఏమిటే?"
    "ఈ పిక్చర్ ఈ రోజ్ ఆఖరే! మైగాడ్! మొన్న వేశాడు. అప్పుడే ఛేంజ్ చేస్తాడా? చచ్చామే ఎలాగే?"
    "ఏం?"
    "ఇది చూచి తీరాల్సిన పిక్చరే! హోటల్లో టిఫిన్ దట్టించేసి సినిమా చూద్దాం."
    "స్వప్నా! సినిమా వద్దు ఏం వద్దు బోడి సినిమా పోతే పోయింది. ఇంకో టర్న్ లో చూడొచ్చు లేదా సిటీలో మరే థియేటరుకైనా మారిస్తే చూడొచ్చు. అమ్మమ్మగారు ఎందుకోసం ఫోను చేశారో ఏమిటో త్వరగా వెళదాంపద!" అంది వినయ.
    "కట్టిపెట్టే అమ్మమ్మ కబుర్లు సెకండ్ షో చూసి ఇంటికి వెళితే ఏం మునిగిపోదు. ఆ లోగా థర్డ్ వరల్డు వార్ రాదు. చైనాలో వాళ్ళో, పాకిస్తాన్ వాళ్ళో మెరుపుదారి చెయ్యరు. అంతగా అమ్మమ్మగారు కేకలేస్తే దారిలో కారు ట్రబులిచ్చిందని చెపుదాం!" అంది సౌందర్య.
    అంతదాకా ఆందోళనగా వున్న స్వప్నకి అలాగే చేద్దామనిపించింది. ఏ సమాధానమూ యివ్వకుండా "మణీ!" అంది.
    వెనక్కి చూడకుండా వేగం తగ్గించకుండా "అమ్మాయి గారూ! నామాట వినండి! నేరుగా యింటికి వెళ్ళిపోదాం. సినిమా చూసి వెళితే అమ్మమ్మగారు ఏమీ అనకపోవచ్చు. కారు దారిలో ట్రబుల్ యిచ్చిందన్నా నమ్మెయ్యొచ్చు. కానీ అమ్మాయి గారూ ఎందుకో నాకు అది నచ్చటంలేదు. మనం నేరుగా వెళ్ళిపోదాం. అంతగా అయితే యింటి వద్ద విషయం కనుక్కుని వెంటనే వచ్చేద్దాం!" అన్నాడు మణి.
    "ప్రతివాడూ మనకి గార్డియనే! సలహాలిచ్చేవాడే!" నసిగింది విజయ.
    "పోనీ థియేటర్ నుంచి ఫోన్ చేద్దాం. అదిగో హోటల్ వచ్చేసింది. ఇక్కడ టిఫిన్ తీసుకుంటూ యిక్కడి నుంచే ఫోన్ చేద్దాం. తర్వాత ఎలా అవసరమైతే అలా చేద్దాం" అంది సౌందర్య.
    "సౌందర్యా!"
    "ఏమిటే?"
    "నా మనసేం బాగులేదు. ముందు ఇంటికి వెళదాం!"
    "అందుకే పిక్చర్ చూద్దాం. రిలాక్స్ అవుదాం!"
    "నో!" దృఢంగా అందామె. కారు వెళుతూనే వుంది. ఓ నిమిషం ఆగి "అంతగా అయితే నువ్వు దిగెయ్. నీకు తోడుగా షీలానో విజయో, గీతో వుండి పోతారు!" అంది.
    బరువుగా ధ్వనించింది ఆమె గొంతు.
    చప్పున అంది సౌందర్య "స్వప్నా! నన్ను ఫూలనుకో వద్దు. నువ్వు లేకుండా సినిమాకి వెళతానటే! సరదాగా పిక్నిక్ అనుకున్నాం. అది మధ్యలో బ్రేకయింది. పిక్చర్ లాస్ట్ డే అనుకుని చూద్దాం అనుకున్నాం. అంతేకాని నిన్ను మధ్యలో డ్రాప్ చేసి పిక్చర్ కి వెళ్ళేంత ఫూల్ ని కాదు. పద అందరం ఇంటికే వెళదాం అంతా."
    నడిసముద్రంలో మునిగిపోతున్నట్టున్న మనిషి గడ్డిపోచ దొరికినా ఆలంబనంగా పట్టుకున్నట్టు ఫోన్ వార్త అందినప్పటి నుంచీ ఆందోళనతో వున్న స్వప్న, సౌందర్య ఆత్మీయ తానురాగాలు మూర్తీభవించినట్టుగా అలాఅనేసరికి ఆమె కరిగిపోయింది. చప్పున సౌందర్య చేయి అందుకుని ప్రేమగా నిమిరింది. ఆ స్పర్శలో స్వప్న మనస్సుని చదివేసింది సౌందర్య.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS