Previous Page Next Page 
నరుడా ఏమి నీ కోరిక పేజి 31

 

    "ఊహూ! మా ఆవిడ దద్దోజనం, పులిహొరా, చక్రపొంగలి మాత్రమే చేస్తుంది. అవే తెలుసు" చెప్పాడు గరుడాచలం.


    "ఛ....ఛ......నువ్వు చూస్తే ఇంత స్మార్ట్ గా వున్నావు . అవేంటి తినడం. నీలాంటి హ్యాండ్ సమ్ పిజ్జాలు, బర్గర్ లు తినాలి" అంది.


    ఈలోగా చికెన్ పిజ్జా వచ్చింది.


    అది తింటూ ఎక్కడెక్కడో విహరించాడు ఉహల్లో గరుడాచలం.


    "గరుడా డియర్. మనం లేచిపోదామా?" చాలా తాపీగా అడిగింది పీలూ.


    ఉలిక్కిపడ్డాడు గరుడాచలం.


    "అదేంటి డియర్! నువ్వు పొన్నాంబళంలా ఉలిక్కిపడ్డావేంటి?" అడిగింది పీలూ.


    " పొన్నాంబళం ఎవరు?" అడిగాడు అర్ధం కాక గరుడాచలం.


    "మా ఇంటి వోనర్!"


    "అతనేందుకు ఉలిక్కిపడ్డాడు?" మరింత అయోమయంగా అడిగాడు గరుడాచలం.


    "అతడ్ని....ఇలాగే లేచిపోదామా?" అని అడిగినందుకు.


    ఈసారి చికెన్ పిజ్జా గొంతుకు అడ్డం పడ్డట్టు అనిపించింది. భయంగా పీలూ వైపు చూసాడు.


    తర్వాత శాంతంగా "తప్పు పీలూ.....నువ్విలా ఎవర్నిపడితే వాళ్ళని లేచిపోదామా? అని అడక్కూడదు" అంటూ అనునయించాడు.


    "హబ్బ.....నువ్వూ మా ఆయనలాగే మాట్లాడతావు. పోనీలే.....అన్నట్టు నాకు డిస్కోదేక్ కు వెళ్ళే టైమయింది. బై గరుడా!" అంటూ లేచి బయటకు నడిచింది.


    గరుడాచలం తనూ లేచాడు తప్పదన్నట్లు!" అతనికి ఇంకా కాసేపు పీలూతో కలిసి కూర్చోవాలని వుంది. కానీ కూర్చుంటే ఏదో ఒకటి అర్ధర్ చేస్తూనే వుంటుంది పీలూ, డబ్బులు వేస్ట్ అనుకున్నాడు.


    "మేడమ్ బిల్లు.....వెయిటర్ వచ్చి బిల్లు టేబుల్ మీద పెట్టి వినయంగా అన్నాడు.


    "గరుడా....బిల్లట, కట్టేసిరా......నేను ఈలోగా బయట కలకత్తా పాన్ తీసుకుంటాను" అంది.


    "ఛ.....అడ రౌడిలా పానేమిటి?" అందామనుకున్నాడు. కానీ పీలూకి కోపం వస్తుందేమోనని ఊరుకున్నాడు.


    బిల్లు డెబ్బయి అయింది. రెండు పిజ్జాలకు. ఒక కేక్ కు అంతయ్యేసరికి గుండెలు బాదుకుని జేబులోని ఏడు పది రూపాయల కాగితాలు తీసిచ్చి ఏడుపు మొహంతో బయటకు వచ్చాడు.


    టిప్పు ఇవ్వకుండా సరిగ్గా బిల్లు అమౌంట్ ఇచ్చిన గరుడాచలం వైపు కంట్రీ బ్రూట్ లా ఉన్నాడే అన్న ఫీలింగ్ వచ్చేలా లుక్కేసి వెళ్లిపోయాడు వెయిటర్.


    గరుడాచలం బయటకు వచ్చేసరికి పాన్ నములుతూ స్కూటర్ బయటకు తీస్తోంది పీలూ.


    "గరుడా! ఆ పాన్ షాప్ లో డబ్బులిచ్చేసి వెళ్ళు. రేపు ఇక్కడే ఇదే సమయానికి కలుద్దాం" అంది గరుడాచలం బుగ్గమీద చితికేస్తూ.


     ఆ మాత్రానికే తెగ ఇదయి మెలికలు తిరిగిపోయాడు గరుడాచలం.


    డిస్కోతెక్ అంటే ఏంటని అడగాలని నోటిదాకా వచ్చినా అడగలేకపోయాడు గరుడాచలం.

 


                                                           * * *


    "గురూ! ఇందాక నాకో వెరైటీ ఆలోచన వచ్చిందని చెప్పాను గుర్తుందా?" అడిగాడు సత్తిపండు శ్రీచంద్రను.


    "గుర్తుంది గానీ అదేంటో చెప్పి చావు" అన్నాడు విసుగ్గా.


    "మరేం లేదు గురూ! నువ్వు కాసేపు గుడ్డివాడి పాత్ర వేసావనుకో....."


    "వేస్తె...." అనుమానంగా అడిగాడు శ్రీచంద్ర.


    "నీ పక్కన నిలబడి లేదా నిన్ను నడిపిస్తూ" నడిపించు నా నావ" అని పడుతూ వెళ్తాను. గుడ్డోడంటే సింపతి ఎక్కువ వుంటుంది. కాబట్టి డబ్బులు బాగా పడతాయి. నేను నీ చొక్కా విప్పి అడుగుతాను. ఆ తర్వాత మరో సెంటర్ కు వెళ్లి నిన్ను కూచోబెట్టి బాబూ మా గురువు పుట్టుగుడ్డోడు అయ్యా! ఓ వన్ రూపి దానం చేయండయ్యా అని అడగుతా. నో శ్రమ. నో రిస్క్. ఓన్లీ ప్రాఫిట్. ఎలాగుంది గురూ" అడిగాడు.


    శ్రీచంద్ర సత్తిపండును తిట్టే ఓపిక లేక కళ్ళు మూసుకున్నాడు. అయినా సత్తిపండు చెప్పిన దృశ్యాలే కళ్ళ ముందు విజువలైజ్ అయి కనబడుతున్నాయతనికి.


    
                                                                     * * *


    శ్రీచంద్ర గుడ్డివాడికి మల్లే తడబడుతూ నడుస్తున్నాడు.


    సత్తిపండు శ్రీచంద్ర చేయి పట్టుకుని 'నడిపించు నా నావ' అంటూ పాడుతూ టాంక్ బండ్ నుంచి వచ్చిపోయే వాళ్లని ముష్టి అడుగుతున్నాడు.


    "చూడ్రా! పాపం గుడ్డి ముష్టివాడికి సాయంగా మరో పొట్టి లాగు ముష్టివాడు" అంటూ జనం పావలా, అర్ధ దానం చేస్తున్నారు.


    కాసేపయ్యాక టాంక్ బండ్ కు ఓ మూల శ్రీచంద్రని కుచోబెట్టాడు. శ్రీచంద్ర మొహానికి కాసింత ఆయిల్ పూసాడు.


    "బాబూ....పుట్టు గుడ్డోడు. ఈడ్ని నేనే పోషించాలయ్యా. ఒక్క పైవ్ రుపిస్ వుంటే దానం చేయండి. అమెరికాలో కంటాపరేషన్ చేయిస్తాను బాబూ" అంటూ సౌండ్ పెంచి అరుస్తున్నాడు.


    అదంతా వింటున్న అక్కడున్న ఒకతను "ఏం బాబూ! కంటాఫరేషన్ అమెరికాలో చేయించాలా? ఇక్కడ చేయించకూడదా?" అన్నాడు వెక్కిరింతగా.


    "ఇక్కడ సేయిత్తే గ్లామరెటుంటదయ్యా! అమెరికాలో అయితే కాస్త రిచ్ గా వుంటాది" అన్నాడు వళ్లు మండుతున్న సత్తిపండు.


    "ఏడవలేకపోయావు!" అంటూ వెళ్లిపోయాడు అతను.


    "డబ్బులు వెయ్యాలేదు గానీ డౌట్స్ క్లియర్ చేసుకుంటారు ఎదవనాయాళ్ళు" అనుకున్నాడు సత్తిపండు.


    శ్రీచంద్ర ముందు తన చొక్కాను పరిచాడు. వచ్చిపోయేవాళ్ళు చిల్లర వేస్తున్నారు.


    సమీర అటే వెళ్తూ వీళ్ళని చూసి ఆగింది. సీన్ అర్ధమయి "ఒరే పోట్టిలాగు! పాపం మీ గురువుకు కళ్ళు పోయాయా? అయితే మీ గురువుకన్నా నువ్వే బెటర్. పోట్టిలాగు నైనా పొడవుబుద్ది వుంది" అంది.


    శ్రీచంద్ర సమీర గొంతువిని కోపంగా కళ్ళు తెరిచాడు.


    
                                                              * * *


    "అదేంటి గురూ! అలా సీరియస్ గా చూస్తున్నావు?" అడిగాడు సత్తిపండు ఏదో డేంజర్ సిగ్నల్ అందడంతో.


    చుట్టూ చూసాడు సమీర లేదు. తను గుడ్డి, ముష్టి గెటప్ లో లేడు. ఇదంతా తన వుహ అన్నమాట. హమ్మయ్య.


    సత్తిపండు మాటలు విని తను అలా ఉహించేసుకునే సరికి భరించలేకపోయాడు.


    "సత్తిపండు .....ఇలా రారా" శాంతంగా పిలిచాడు శ్రీచంద్ర.


    "ఎందుకు గురూ!" భయంగా అడిగాడు శ్రీచంద్ర రియాక్షన్ గమనిస్తూ.


    "ఒసారిలా రారా నా చిట్టికన్నా" అన్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS