రమాపతి మార్వాడీ దుస్తులతో తాను కాస్త రూపం మార్చుకుని వచ్చాడు.
అయిదు నిమిషాల తర్వాత.
లోకేశ్వరరావు శీతల్ రాణి, రమాపతి ఎక్కిన కారు బైలుదేరింది.
18
కారు శరవేగంతో ముందుకు సాగుతున్నది.
"ఇది పరీక్ష సరిగా అనుకోవాలంటే నా పాలిట అగ్నిపరీక్ష" ఈ మాట ఏ వందసార్లో అనుకుంది శీతల్.
లోకేశ్వరరావు చాలా తెలివికలవాడు. శీతల్ బైటికి వెళదామని అడగంగానే వప్పుకున్నాడు. శీతల్ పారిపోతుందా లేదా అని తెలుసుకోవాలంటే ఇలాంటి పరీక్ష ఏదో ఒకటి చేయక తప్పదు.
శీతల్ అడిగిందానికి తను వప్పుకున్నట్లు వుండాలి. శీతల్ పారిపోకుండాను వుండాలి. ఈ విషయంలో చాలా చక్కని చిక్కని ప్లాన్ వేశాడు.
లోకేశ్వరరావు ఈ ఆలోచనతో ముందుగా చక్కని చిక్కని ప్లాన్ తయారు చేసుకుని బైలుదేరాడు.
లోకేశ్వరరావు తెలివిగా ఆలోచిస్తుంటే అంతకన్నా తెలివిగా ఆలోచిస్తున్నది శీతల్.
'లోకేశ్వరరావుది గుంటనక్క తెలివి తేటలు నన్ను పరీక్ష చేయడానికి ఇదోరకం ప్లాను. వీడు నన్ను పట్టి బంధించాడు అంతవరకు ఖాయం. రాత్రింబవళ్ళు వెయ్యి కళ్ళు నన్ను కాపలా కాస్తున్నాయి. ఈ సమయంలో తను చాలా చాకచక్యంగా మెలగాలి. ఏ మాత్రం అనుమానంరానివిధంగా ప్రవర్తించాలి. ఈ పిల్లని వంటరిగా వదిలేసినా పారిపోదు అన్న నమ్మకం వాళ్ళకి కలగాలి. అప్పుడు గాని తను వీళ్ళందరి కళ్ళు గప్పి ఇక్కడ నుంచి పారిపోవడానికి చక్కని రాజమార్గం ఏర్పడదు.
"ఏంటి చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నావ్?" లోకేశ్వరరావు అడగడంతో శీతల్ చిన్న ఉలికిపాటుతో అంచనా స్రవంతి లోంచి వూడిపడింది.
లోకేశ్వరరావు అలా అడగంగానే "ఎస్ చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నాను అంకుల్!" అంది శీతల్.
"నీ ఆలోచన దేన్ని గురించమ్మా!" విషయం తెలుసుకుందామని అడిగాడు లోకేశ్వరరావు.
"నవ్వనంటే చెపుతానంకుల్!"
"ప్రామిస్ నవ్వను."
"నిజంగా నవ్వరుగా?"
"నవ్వను...నవ్వను....నవ్వను....సరేనా!"
"మనుషులా పశువులా! సినిమా చూశారా అంకుల్?"
"ఉహూ!"
"ఆ సినిమాలో హీరోయిన్ తన్ని రేప్ చేసిన విలన్స్ మీద పగ తీర్చుకోడానికి ఒక్కోసారి ఒక్కోరకం మారు వేషం వేస్తుంది. అనుకున్న ప్రకారం హత్యలు కూడా చేస్తుంది. నేనిప్పుడీ వేషంలో ఎవరినో హత్య చేయనక్కరలేదనుకో అంకుల్! కాని...ఆ సినిమాలో హీరోయిన్ ఓసారి సరీగా ఇప్పుడు నేను ఎలాంటి వేషంలో వున్నానో అలాంటి మారు వేషంలో వుంటుందన్నమాట. నేను మారు వేషంలో వున్నా కదా ఏమన్నా సరదాగా నాకు తెలిసిన వాళ్ళని ఆట పట్టిద్దామా అని వుంది."
"వద్దు వద్దు అలాంటి పనులు చేసి చిక్కుల్లో ఇరుక్కుపోవద్దు" కంగారుగా చెప్పాడు లోకేశ్వరరావు.
"అలా వుందని చెప్పాను గాని చేస్తానని చెప్పలేదుగా అంకుల్! సరదాగా ఆలోచిస్తున్నాను అంతే అయినా నేనేమన్నా చిన్న పిల్లనా తెలిసి తెలిసి చిక్కుల్లో ఇరుక్కోటానికి! పైగా వేషం అంటే మారువేషం వరకు కుదిరింది. కంఠం స్వరం మార్చటం రాదు కదా! పెదవి కదిపావంటే చాలు. నా హుళక్కి అవుతుంది. నాకు ఇష్టంలేని పెళ్ళి తప్పించుకోవాలని చూశాను. నా ప్రయత్నం కన్నాముందు మీ ప్రయత్నం ఫలించింది. ఆ పెళ్ళి మీరు తప్పించారు. ఏ ప్రమాదంలోను ఇరుక్కోకుండా నే వచ్చి పడింది అంకుల్ దగ్గరకే కదా! అమ్మ భయపడకుండా వుండడానికి అమ్మకి కూడా లెటర్ రాసేశాను. ఏదేమైనా అన్నీ చక్కబడిందాక నాలుగు రోజులు సద్దు మణిగిందాక, నే మీ దగ్గరే వుంటాను. కాకపోతే వంటరిగా వుండాలంటే బోర్ ఫీలవుతున్నాను అంతే!"
లోకేశ్వరరావు ఆలోచించుకోటానికి కూడా క్షణకాలం కూడా టైమ్ ఇవ్వకుండా అలా శీతల్ మాట్లాడుతూనే వుంది.
శీతల్ ఉపాయం ఫలించింది.
శీతల్ చెప్పింది లోకేశ్వరరావు నమ్మాడు.
మరో అయిదు నిమిషాల తర్వాత పెద్ద బజారు మొదట్లోకి వచ్చి కారు ఆగింది.
ముందు లోకేశ్వరరావు, ఆ వెనుక శీతల్ ఆ వెనుక రమాపతి కారులోంచి దిగారు.
చాలా బుద్దిమంతురాలిలాగా శీతల్ షాపింగ్ పూర్తిచేసింది. నాలుగైదు చిన్న చిన్న వస్తువులు కొన్నది.
ముగ్గురూ కలసి తిరిగి కారు దగ్గరకు వస్తుండగా శీతల్ ఆగి పేవ్ మెంట్ వేపు చూసింది.
"ఏమిటి శీతల్ ఆగిపొయ్యావ్?" తానూ ఆగిపోతూ లోకేశ్వరరావు అడిగాడు.
"రెడ్ చెక్స్ వున్న చూడీదార్ వేసుకున్న ఆ అమ్మాయిని చూడండి అంకుల్. అది నా ఫ్రెండ్ షాలినీ ఆ అమ్మాయిని చూపిస్తూ చెప్పింది శీతల్.
ఆ అమ్మాయిని చూశాడు లోకేశ్వరరావు. "వెళ్ళి మాట్లాడుతావా!" అన్నాడు మామూలుగా అడిగింది అడుగుతూ.
