సగం నలిగినా పువ్వులా కనిపిస్తున్న కిన్నేరను చూసి కోపం తెచ్చుకోలేదు, నవ్వేశాడు.
"ఎందుకు నవ్వుతారు?"
"నిజమే!" బిడియంగా మరేటో చూస్తూ అన్నాడు_"ఇన్ని తెలుగు సినిమాలు చూసి కూడా తొలిరాత్రి తొందర పడ్డాను."
ఇప్పుడు విస్తుపోవడం కిన్నెర వంతైంది.
"సినిమాల్లో ఏం చేస్తారని?"
పట్టు చీరలో కనిపిస్తున్న కిన్నెరతో అన్నాడు గొప్ప ధియరీ ఏదో గుర్తుకొచ్చినట్టు-"రూలు ప్రకారం సరాసరి భార్యను మంచం మీదికి లాగేయకూడదు " అన్నాడు.
ఆమె వింటుంది- విడి విడని పెదవులపై చిరునవ్వును పంటి బిగువున దాచుకుంటూ.
"నువ్వు బిడియంగా ద్వారం దాటేక తల వంచుకుని నిలబడ్డావుగా! అప్పటికే నేను బయట వెన్నెల్ని చూస్తూ వుండాలి కిటికీ దగ్గర నిలబడి, ముందుగానే నిన్ను నేను చూడనన్నమాట! నువ్వు కొంత నిశ్శబ్దం తర్వత నెమ్మదిగా గొంతు సవరించుకుంటావు."
"ఎందుకు?"
"నువ్వు గదిలోకి ప్రవేశించినట్టు తెలుపుతూ, నేను నిట్టుర్పుగా వెనక్కు తిరిగి చూస్తాను. అప్పటికి నువ్వేం చేస్తుంటావో తెలుసా?"
"చెప్పండి."
"కాలి బొటన వేలితో నేలను రాస్తుంటావు."
"కష్టం."
"ఏం!"
"బొటన వేలు ఒక్కటి మడిచి రాయలేం. మొత్తం పాదం వెళ్ళన్నీ కదులుతాయి."
"అదేం కాదు." బొటన వేలిని మడిచి రాయాలని ప్రయత్నించాడు కుదరలేదు. మొత్తం వెళ్ళు మడిచినట్టుగా అయ్యేసరికి "మరీ అంత లిటరల్ గా తీసుకోకు" అన్నాడు.
"సరే!"
"ఈ ప్రపంచం తనదే కాబట్టి, ఇక్కడ తనే సార్వభౌముడు అన్నంత ఉత్సుకతతో మాట్లాడుతున్నాడు రాఘవ "అలా నువ్వు నేల చూపులు చూస్తుండగానే నేను నెమ్మదిగా నీ దగ్గరకు వస్తాను. నువ్వు సిగ్గుతో కుంచించుకుపోతుంటావ్."
"ఆ పదం నచ్చలేదు కిన్నేరకు. "కుంచించుకుపోవడమా? ఏం తప్పు చేశానని?"
"ఖర్మ!" ఆమె కల్పించుకోవడం భరించలేకపోయాడు.
"కుంచించుకుపోతుంటావు అంటే అర్ధం నా ఉద్దేశంలో ముడుచుకుపోతావు అని"
"సరే చెప్పండి."
"నేను సుతిమెత్తగా నిన్ను స్ప్రుశిస్తాను, అంటే ఇలా నీ నడుము మీద చేతులు వేసి " ఆమె దగ్గరికి రాబోయాడు.
"నన్ను తాకకుండా చెప్పండి అర్ధమవుతుంది."
"అప్పుడు నీ చెక్కిళ్ళు ఎర్రబడతాయి."
"తర్వాత?"
కొంచెం ఆగాడు ఆర్డర్ గుర్తు చేసుకుంటున్నట్టు "నిన్ను.....నడిపించుకుంటు తీసుకువెళతాను."
"ఎక్కడికి?"
"పక్క దగ్గరికి కాదు, కిటికీ దగ్గరికి."
విస్మయంగా చూసింది. "ఎందుకు?"
"ఆకాశంలో చందమామని చూపించటానికి."
"లేకపోతే?"
"ఏమిటి?"
"చందమామ కనిపించకపోతే?"
ఒళ్ళు మండిపోయింది రాఘవకు. "కనిపించి తీరాలా? పెళ్ళిలో అదిగో అరుంధతి నక్షత్రం అని పంతులుగారు మీదికి చూపించగానే కనిపించినట్టు సైలెంట్ గా తలుపేశావు. ఇప్పుడీ ప్రశ్న వేయడం బాగోలేదు?
"నాక్కనిపించింది."
"అబద్దం!"
"అదేం!"
"ఆ మూడ్ లో ఆడపిల్లకు కట్టుకున్న మొగుడి మొహమే కనిపించాలి తప్ప, 'నక్షత్రాలు కనిపించకూడదు' అది రూలు!"
"అలాంటప్పుడు కిటికిలో నుంచి చందమామను చూస్తే ఇది కనిపించకూడదు."
కావాలని అల్లరి పెడుతుందని అర్ధమైపోయింది రాఘవకు. "తప్పేముంది, కిన్నెరా? కనిపించొచ్చు. ఎందుకంటే చందమామ సైజు పెద్దగా ఉంటుందిగా!"
"సరే చెప్పండి."
"ఏమిటి?"
"ఇందాక మీరు చెబుతున్న దృశ్యం."
"అదే.....అలా చందమామ గురించి, వెన్నెల గురించి మాట్లాడి ముందు అమ్మాయిని మూడ్ లోకి రప్పించాలి సినిమా పక్కిలో."
