Previous Page Next Page 
వెన్నెల వాకిళ్ళు పేజి 31

 

    ఒక్క పాఠశాల పైకప్పు రాయడమేకదండీ! అన్నిటిలోనూ ఇలాగే పనులు చేయకుండానే చేయించినట్లు రాసుకోవటం డబ్బు కాజేయటం" అన్నాడు పంతులు.

    "గోపాలరావు మోసగాడని తెలుసుగానీ మరీ ఇంత మోసానికి పాల్పడుతూ పంచాయితీ సొమ్ము తన జేబులో వేసుకుంటాడని తెలియదే" అన్నాడు సర్వోత్తమరావు.

    ఈ సంగతి ఊరంతా తెలుసండీ!.... మీకు తెలియకపోవడమేమిటి? మీరంతా అదో రకం మనస్తత్వంలెండి. ఎవరికి అపకారం తలపెట్టరు . అందరూ అలాగే ఉన్నారనుకుంటారు" అన్నాడు పంతులుగారు.

    సర్వోత్తమరావు తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. కొన్ని క్షణాల అనంతరం చుట్ట వెలిగించుకుని.....

    "సరే పంతులుగారు! మీరు వెళ్ళండి. నేను ప్రెసిడెంటుగారితో మాట్లాడతాలే" అన్నాడు.

    "అయ్యా! చిత్తం...మళ్ళి ఈ విషయాలన్నీ నేను చెప్పినట్లు ఆయనతో అనకండి. అది నాగుపాము " అన్నాడు భయంతో.

    "చెప్పన్లే! మీరు వెళ్ళండి" అన్నాడు.

                                                15
    సర్వోత్తమరావుని ఆ వూరి ప్రజలు ప్రెసిడెంటుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పోటికి నిలబడితే ఓడిపోవటం ఖాయమని తెలిసి గోపాలరావు కూడా తటస్థంగా వుండిపోవాల్సి వచ్చింది.

    ఆరోజు సర్వోత్తమరావు ఇంట్లో కుటుంబసభ్యుల ఆనందానికి అవధులులేకుండా పోయాయి.

    అన్నగారు రామశేషు ముందు వద్దని వారించినా ఊరంతా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం వల్ల తమ్ముడి నిర్ణయాన్ని కాదనలేకపోయాడు.

    "ఇక నుంచి మన కస్తూరిని ఊరంతా ప్రెసిడెంటుగారి పెళ్ళాం అని పిలుస్తారు కాబోలు! అమ్మో ఎంత హోదా!" అని మురిసిపోయింది భ్రమరాంబ.

    "నాకెందుకు వదినమ్మా....ఈ హోదాలన్నీ నేను ఎప్పటి కస్తురినే" అంది శాంతంగా.

    "నేను ప్రెసిడెంటుగారి అమ్మాయినా అత్తా?!" అంది జయంతి.

    "అవునే నువ్వు ప్రెసిడెంటుగారి అమ్మాయివే" అని మురిసిపోయింది భ్రమరాంబ.

    "ఆహా!...అయితే ఊరంతటిమీద పెత్తనం చెలాయించవచ్చునమాట" అంది జయంతి.

    "ఆ...ఇప్పుడు మామీద చెల్;చాలాయిస్తున్నావు. ఇక రేపటినుంచి ఊరుమీద చెలాయించు" అంది దాక్షాయణి నవ్వుతూ.

    "ఆ...అలాగే, ముందు ఏం చేయాలి? ఆ! గుర్తొచ్చింది. మన మంచినీళ్ళ చెరువులో గేదెల్ని కడుగుతున్నారు. అలా కడగొద్దు అని చెప్పాలి. కడిగిన వారికీ రూపాయి జరిమానా అనాలి" అంది గంభీరంగా.

    "ఏంటే! ప్రెసిడెంటునువ్వా, మీ నాన్నా?" అంది కూతుర్ని చూసి మురిసిపోతూ కస్తూరి.

    "నాన్నగారు ఉత్తిత్తి ప్రెసిడెంట్....అసలు అధికారమంతా నాదే అంది గంభీరంగా.

    "ఏడ్చావ్! మీ నాన్నగారు విన్నారంటే తన్ని తగలేస్తారు" అంది కస్తూరి.

    "ఏంటి కస్తూరి! ఏమంటుంది నీ కూతురు?" అన్నాడు అప్పుడే లోపలికి వస్తూ సర్వోత్తమరావు.

    "అమ్మో! నాన్నగారు" అంటూ పెరట్లోకి తుర్రుమని పారిపోయింది జయంతి. అది చూసి అంతా నవ్వారు.

    "చాలా సంతోషంరా తమ్ముడూ. నువ్వు ప్రెసిడెంటువి అయ్యావని తెలిసి మేము ఎంత సంతోషిస్తున్నామో తెలుసా? ఇకనైనా మన ఊరు బాగుచేయి నాయనా. ఆ గోపాలరావు ఊరంతా పదేళ్ళనుంచి పాడు పెట్టాడు. ముదనష్టపు వెధవ" అంటూ మెటికలు విరిచింది భ్రమరాంబ.

    ఆ మాటలకు అయన నిశ్శబ్దంగా నవ్వాడు.

                                                     16
    ఆగస్టు 15 !!

    స్వాతంత్ర్య దినోత్సవం.

    ఆ గ్రామానికి నిజంగా ఇప్పుడే స్వాతంత్ర్యం వచ్చినట్లు ప్రజలు సంబరపడిపోతున్నారు.

    సర్వోత్తమరావు ప్రెసిడెంటు అయినప్పటి నుంచి పంచాయితీ డబ్బుతో రోడ్లు వేయించాడు. పాఠశాల భవనానికి మరమత్తులు చేయించాడు.

    ఆరోజు ఆ పాఠశాలలో జెండా వందనానికి ఆయనే వస్తున్నాడు.

    ఆ పాఠశాల పంతులుగారి ఆనందానికి అవధుల్లేవు. ఎప్పుడో నాలుగు నెలల క్రితం అయన దగ్గిర పాఠశాల పైకప్పు పాడవటం మొరపెట్టుకున్నాడు. ఇప్పుడు అయన అన్నమాట నిలబెట్టుకుని పాఠశాల భవనం అంతటిని మరమత్తులు చేయించారు.

    పిల్లలందరూ ఆ పాఠశాల ఆవరణలో బారులుతీసి నిలబడ్డారు. ఆ పాఠశాల కొత్త భవనంలా మెరిసిపోతోంది. ఆ ప్రాంగణం మధ్యలో జెండా కర్రపాతి దానికి జాతీయజెండాను కట్టారు. జెండాను ఆవిష్కరించటానికి సర్వోత్తమరావు వస్తున్నాడు.

    "మొత్తానికి మన ప్రెసిడెంటుగారు నిజంగా దేవుడిలా వచ్చి మన పాఠశాలను బాగుచేయించారు, పంతులుగారు....ఆ బాగుచేయించే పనికి పునుకోనట్లయితే మనందరం వానాకాలంలో తడిసి ముద్దయిపోయేవాళ్ళం" అన్నాడు ఫ్యూను శ్రీరాములు.

    "అవున్రా....! ప్రెసిడెంటుగారు నిజంగా దేవుడే" అన్నాడు పంతులుగారు.

    "మాస్టారు....మాస్టారు! ప్రెసిడెంటుగారు వస్తున్నారు" పిల్లలు పెద్దగా అరిచి చెప్పారు.

    పంతులుగారు కంగారుగా ఆయనకు ఎదురు వెళ్ళారు, శ్రీరాములు దండపట్టుకుని అయన వెంటే పరుగుతీశాడు.

    "రండి రండి ప్రెసిడెంటుగారూ" అంటూ ఆహ్వానించి మెడలో దండ వేశాడు పంతులుగారు.

    "ఏంటిదంతా పంతులుగారు....ఎందుకు ఈ దండలు?" అన్నాడు సర్వోత్తమరావు మందలింపుగా.

    "ఏదో ఉడతాభక్తితో మా చేతనైన రీతిలో కృతజ్ఞతలు చెప్పుకుంటున్నామండి" అన్నాడు పంతులుగారు.

    "పదండి" అంటూ జెండావేపు అడుగులు వేశాడు సర్వోత్తమరావు.

    అయన జెండాను ఆవిష్కరించగానే దాన్లోనుంచి పూలురాలిపడ్డాయి. పిల్లలంతా చప్పట్లు కొట్టారు.

    "శ్రీరాములు! పిల్లలకు ఈ చాక్లెట్లు పంచిపెట్టు" సర్వోత్తమరావు చిన్న డబ్బా అందించాడు. ఫ్యూను శ్రీరాములుకి. దానిని వినయంగా అందుకుని పిల్లలందరికీ పంచిపెట్టాడు. దాదాపు వందమంది వరకూ వున్నారు పిల్లలు.

    "ఏంటి పంతులుగారూ! మన పాఠశాలకు మొత్తం ఎంతమంది వస్తున్నారు?"  అడిగాడు సర్వోత్తమరావు.

    "మొత్తం నూటరెండుమందండి" అన్నాడు పంతులు వినయంగా.

    "అదేంటి? అంటే రెండువేల జనాభా కలిగిన మన గ్రామంలో వందమంది మాత్రమే పాఠశాలకు వస్తున్నారా? ఈసారి పంచాయితీ దగ్గిర అందరికి గట్టిగా చెప్పాలి. మీ పిల్లల్ని బడికి తప్పక పంపమని" అన్నాడు సర్వోత్తమరావు.

    "పిల్లలూ....మీకు గాంధీతాత ఎవరో తెలుసా?" అన్నాడు సర్వోత్తమరావు.

    "తెలుసండి" అన్నారు వాళ్ళు ముక్తకంఠంతో.

    "ఎవరో చెప్పండి" అన్నాడు.

    "గాంధీతాత మన దేశానికి స్వాతంత్ర్యం తెచ్చారండి" అన్నాడు ఓ పిల్లాడు.

    "భేష్....గాంధీతాతతో నేను కలిసి మాట్లాడాను తెలుసా! అన్నారు ప్రెసిడెంటుగారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS