Previous Page Next Page 
ఈ రేయి నీదోయి పేజి 32

 

    అతను ఆయాసపడుతూ ఆమె ముందుకి వచ్చి "మిమ్మల్ని" అని మరేదో అనబోయి, అంతలోనే పదానికి వంద రూపాయలు ఇవ్వాలని గుర్తొచ్చి, అంతటితో ఆగిపోయి రెండు వందరూపాయల నోట్లను ఆమె చేతిలో కుక్కాడు.
    
    ఇక అక్కడ వుండడం ఇష్టం లేక విసవిసా నడిచాడు ముందుకి.
    
    ఆమె అలానే వుండిపోయింది.
    
    లిఖిత నడుస్తున్నది గానీ ఆమె మనసు మాత్రం మనసులో లేదు. జితేంద్ర కనుచూపు మేరలో కనిపించటం లేదు. చేతిలో వున్న వందరూపాయల నోట్లను ఏం చేయాలో పాలుపోవడం లేదు. అతడ్ని ఇబ్బంది పెట్టి తన వెంట పడడం మాన్పించాలనుకుంది గానీ ఆమెకు డబ్బెందుకు?
    
    అతనికి అసలు విషయం చెప్పి డబ్బు తిరిగి ఇచ్చెయ్యాలనుకున్నది కానీ అతను వేగంగా వెళ్ళిపోయాడు. అదీగాక ఆమె షాక్ నుంచి తేరుకునేలోపు అతను చాలా దూరం దాటేశాడు. ఇక ఈ డబ్బు ఏం చేయాలి. అసలు ఈ డబ్బు ఎలా పుట్టించాడు. అప్పు తీసుకున్నాడా? లేక రక్తం అమ్మేశాడా? అతని దగ్గరే వుందా? ఇంతకీ అతను చెప్పదలుచుకున్నదేమిటి?
    
    ఇలాంటి ప్రశ్నలు ఆమె మనసుని శిలువ వేస్తున్నాయి. అలాంటి సమయంలో ఆమెకు ఠక్కున రంగనాయకి గుర్తొచ్చింది. ఆమెకి ఈ డబ్బిచ్చేస్తే సగం బాధ పోతుందనిపించింది. లక్కీగా రంగనాయకి ఇంటిని దాటి వచ్చెయ్యలేదు. ఇక ఏమీ ఆలోచించకుండా రంగనాయకి ఇంటివైపు నడిచింది.
    
    ఆమె వెళ్ళేటప్పటికి రంగనాయకి తుమ్మపూలను మాలగా కడుతోంది. అది దేవుడికి వేయటానికే.
    
    లిఖిత రెండోసారి తన ఇంటికి రావడంతో రంగనాయకి మొదట పడినంత హైరానా పడలేదు.
    
    "రా రా" అంటూ మాత్రం ఆహ్వానించింది.
    
    "ఏం చేస్తున్నావ్?" నవ్వును బలవంతంగా పెదవులపైకి తెచ్చుకుని అడిగింది.
    
    "ఈరోజు కార్తీక సోమవారం కదా, దేవుడికోసం మాల కడుతున్నాను. పొద్దుపోతుంది. త్వరగా దేవాలయానికి పోదామని"
    
    "అయితే రా వెళదాం. నేనూ అక్కడకే వెళుతున్నాను" అంది లిఖిత. తను అంతకు ముందే దేవుడ్ని దర్శించుకున్న విషయం చెప్పలేదు. అది చెబితే జరిగిందంతా చెప్పాల్సి వస్తుందేమోనని భయం వల్లే అబద్దం చెప్పింది.
    
    "ఒక్క నిముషం" అని రంగనాయకి కట్టినంత వరకు పూలను వుండగా చుట్టి బయల్దేరింది.
    
    ఇద్దరూ శివాలయం వైపు నడుస్తున్నారు.
    
    ఆ రోజు పండగ కాబట్టి రాత్రి పదిగంటల వరకు జనం అటూ యిటూ పోతుంటారు. రాత్రికి దేవాలయం దగ్గర హరికథా కాలక్షేపం కూడా వుంటుంది. కాబట్టి ఎవరూ తోడు వుండరన్న భయమేమీ లేదు. అందుకే నింపాదిగా నడుస్తున్నారు.
    
    తన చేతిలో జితేంద్ర డబ్బు వుండడం మహా ఇబ్బందిగా వుంది లిఖితకు. అతని డబ్బు తన దగ్గర వుండకూడదని కాదుగానీ అలా వసూలు చేయడమే గిల్టీగా వుంది.
    
    దాన్ని మరిచిపోవడానికే "నువ్వేదో కబుర్లు చెబుతావని వస్తే అలా మూగనోము పట్టావేమిటి రంగనాయకీ" అంది లిఖిత నొచ్చుకొంటున్న ధోరణిలో.
    
    "మనం శివాలయానికి వెళుతున్నాం కదా- పద్మజ గుర్తుస్తోంది" అంది సంజాయిషీ చెబుతున్నట్లు రంగనాయకి.
    
    "పద్మజా? ఆమెవరు?"
    
    "ఇప్పుడు మనం వెళుతున్న వూరు పద్మజది. నేను పట్టిన మూడో కేసు ఆమెదే"
    
    రంగనాయకి జరిగిందంతా మాటల్లో పేర్చుతోంది.
    
    ఆ ఊర్లో శివయ్య కూతురు పద్మజ. ఆయనకి మొత్తం ముగ్గురాడపిల్లలు.
    
    పద్మజ పెద్దది.
    
    ఆ పిల్ల పదవ తరగతి వరకు చదువుకుంది. ఆ పైన చదవాలని వున్నా ఆమెకు వయసొచ్చిందని ఆ ఊర్లో మగపిల్లలు శివయ్యకు పరోక్షంగా తెలియజేశారు.
    
    సాయంకాలమైతే చాలు ఊర్లో కుర్రకారంతా శివయ్య ఇంటిముందు గుమిగూడేవాళ్ళు. సొల్లు కబుర్లు చెప్పుకొంటూ మధ్య మధ్యలో పద్మజ మీదకి చూపుల బాణాలు విసిరేవాళ్ళు. అవి అప్పుడప్పుడు అనుకోకుండా శివయ్యకు కూడా తగిలేవి.

 

    యువకులంతా అక్కడకు చేరడానికి కారణం పద్మజ అందం.

 

    ఆమె కనురెప్పలు ఎత్తితే చాలు చారడేసి కళ్ళు కనబడేవి.... పక్కకు తిరిగితే చాలు పంపు తిరిగిన ముక్కు విల్లులా కనిపించేది. పైట జారితే చాలు ఎద ఎత్తులు ఎద్దు మూపురంగా తోచేది. ఓణి పక్కకి తప్పుకొంటే చాలు నడుం చెర్నకోల కొసలా వూగేది. పావడా బొందు కాస్తంత దిగితే చాలు బొడ్డు లోతుగా నీళ్ళు ఎండిపోయిన బావిలా కనిపించేది. కుచ్చిళ్ళు పైకెత్తి దోపుకుంటే చాలు పాదాలు తెల్లగా మెరిసిపోయేవి.
    
    అలాంటి పిల్లకోసం యువకులు పోటీ పడకుండా వుంటారా?
    
    ఇదంతా గమనించిన శివయ్య పద్మజ చదువును అంతటితో ఆపేశాడు.
    
    వాళ్ళది పెద్ద స్థిమితమైన కుటుంబమేమీ కాదు.... వున్న కాస్తంత పొలమే జీవనాధారం. అయితే పద్మజ కష్టపడి పనిచేసే గుణం కలది. ఆత్మాభిమానం కూడా ఎక్కువగానే వుండేది. ఎవర్నీ ఖాతరు చేసేది కాదు. తను మంచి అనుకున్నది ధైర్యంగా చేయగల పిల్ల.
    
    అందుకే తండ్రికి చేదోడు వాదోడుగా ఆపనీ, ఈ పనీ చేసేది.
    
    ఆమెకు పద్దెనిమిదేళ్ళు వచ్చాక శివయ్య పెళ్ళి సంబంధాలు చూడడం మొదలుపెట్టాడు.
    
    చివరికి పద్మనాభం కుదిరాడు. అతను షుగర్ ఫ్యాక్టరీ లో ఫీల్డ్ మ్యాన్ గా పనిచేసేవాడు. నెలకు పదిహేను వందల దాకా జీతం.
    
    ఈ సంబంధం కుదిరినందుకు శివయ్య ఎగిరి గంతేశాడు. అయితే సంతోషించకుండా ఈర్ష్య పడింది ఆయనకు మరదలు వరసయ్యే చిన్ని.
    
    చిన్ని స్వయానా శివయ్య తమ్ముడు రామయ్య భార్య. భాగాల పంపకాలప్పుడు శివయ్యకు, రామయ్యకు చెడింది. ఆ పగలూ, కక్ష్యలూ చాలా ఏళ్లదాకా వున్నాయి. ఈ మధ్య రామయ్య గుండెనొప్పితో చనిపోయాడు. దాంతో రెండు కుటుంబాల మధ్య ఘర్షణలు లేకపోయినా మాటల్లేవు.
    
    అందుకే పద్మజకు అంత మంచి సంబంధం కుదరడంతో చిన్ని ఈర్ష్యతో మండిపోయింది. కానీ ఒంటరి ఆడది ఏం చేయగలదు?
    
    పద్మజ, పద్మనాభం పెళ్ళి జరిగిపోయింది.
    
    వాళ్ళిద్దరూ హ్యాపీగా వుండడం మరింత నచ్చలేదు చిన్నికి.
    
    వాళ్ళ బంధాన్ని ఎలాగయినా విచ్చిన్నం చేసి తన బావ శివయ్య కూతురిని ఏడిపించాలన్నది ఆమె కోరిక.   


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS