త్వరగా ఇంటికి వెళ్ళాలి అనుకుంటూ వేగంగా అడుగులు వేస్తోంది లిఖిత.
టీ అంగళ్ళు మరో ఏడడుగుల్లో వున్నప్పుడు "హలో" అని వినపడితే అటు తిరిగి చూసింది ఆమె.
పక్కనున్న మామిడితోపులోంచి వస్తున్న జితేంద్ర కనిపించాడు.
అంత సడన్ గా అతను అలా కనిపించేటప్పటికి గుండె ఒక్కసారి రక్తాన్నంతా పంప్ చేసి ఖాళీ అయిపోయినట్టు గతుక్కుమంది.
"పందెం చెల్లించారన్న మాట. సబిత చెబితే తెలిసింది. ఎనీ హౌ థాంక్స్"
ఆమె ఏమీ బదులివ్వలేదు.
అతను కనిపిస్తే కటువుగా వుండాలన్న తన నిర్ణయం మేరకు ఆమె చిర్నవ్వును కూడా పెదాలపై వూహించలేదు.
"ఈ డ్రస్ లో ఎలా వున్నారో తెలుసా? ఇంత అందంగా చూశాక మరిక ఏమీ చూడకుండా ఈ కళ్ళను పొడిచేసుకోవాలనుంది"
ఆమె చప్పున తలెత్తి అతనివేపు చూసింది. ఇంత ఉన్మాదం అయితే ఎలా? ఇదిలా సాగదీస్తే అతను తన ముందు ఆత్మహత్య చేసుకోవచ్చు. అందుకే ఇకనుంచైనా అతనిని దూరంగా వుంచాలనుకుని నోరిప్ప లేదు. పైపెచ్చు కళ్ళల్లో కోపాన్ని ప్రదర్శించింది.
"ఈ డ్రస్ లో మీరు పెళ్ళి కాని అమ్మాయిలా వున్నారు. మీరు వివాహిత కాబట్టి అప్పుడు చెప్పాలనుకున్నది నోరు విడిచి బయటికి వచ్చేది కాదు. ఏదో అర్ధం లేని విలువలన్నీ గుర్తు వచ్చేది ఇప్పుడైతే అలాంటి భావాలు కలగడం లేదు. కాబట్టి మనసులోని మాట చెప్పేయాలనుంది" అన్నాడు.
అతనెంత గాఢతతో ఆ మాటలంటున్నది గొంతే చెబుతోంది.
ఆమె భయపడింది. ఏం చెబుతాడు ఇప్పుడు? ఏమైనా చెప్పాక తన రియాక్షన్ ఏమిటి? ఎస్ అనాలా? నో అనాలా? ఎందుకొచ్చిన కుంపటం, అతను ఏమీ చెప్పకుండా చేయాలి ఎలా?
ఆమె ఆలోచిస్తోంది.
అతను తనలో తానే ఏం చెప్పాలో రిహార్సల్స్ చేసుకుంటున్నట్టు కంఠంలోని నరాలు అదే విధంగా కదులుతున్నాయి.
ఆమెకి ఆ సమయంలోనే చిన్న ఐడియా తట్టింది.
ఆ విధంగా చేస్తే అతను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆ ఐడియా వచ్చినందుకు తనకు తానే అభినందించుకుంటూ "చూడు మిస్టర్ జితేంద్ర! నీవు నాతో మాట్లాడాలంటే పదానికి వంద రూపాయలు నా చేతుల్లో పెట్టాలి. సరేనా"అంది.
ఇదంతా చాలా సీరియస్ గానే చెబుతున్నట్టు సీరియస్ నెస్ తప్ప మరో భావం లేదు ఆమె ముఖంలో.
సడన్ గా ఆమె అలా షరతు విధించేటప్పటికి అతను కుంగిపోయాడు. చాలా చెప్పాలని బలం పుంజుకున్న గుండె ఒక్కసారిగా డొల్ల అయిపోయింది. నాలుకలోని చెమ్మంతా గడ్డ కట్టుకుపోయింది. గొంతు కడ్డంగా కరెన్సీనోట్ల కట్ట ఇరుక్కుపోయినట్టు గిలగిల్లాడిపోయాడు.
లిఖితకు ఇదంతా ఆశ్చర్యం కలిగించలేదు. అతని చేతిలో చిల్లిగవ్వ వుండదని తెలుసు. అందుకే తాను అలాంటి షరతు విధించింది. తనతో ఏమైనా మాట్లాడాలంటే ఖచ్చితంగా వంద రూపాయలు ఇవ్వాలి.
ఎలా ఇవ్వగలడు-? అతని అవస్థ చూసి నవ్వుకూడా వస్తోంది. కానీ నవ్వు కనిపించకుండా జాగ్రత్త పడింది. నవ్వితే సీరియస్ నెస్ అంతా నవ్వులో కొట్టుకుపోతుంది.
అతను పిచ్చిపట్టినట్టు జేబులన్నీ తడుముకుంటున్నాడు.
అందులో ఏమైనా వుంటే కదా చేతులకు తగలడానికి ఖాళీ జేబుల్ని తిరగేశాడు. అవి తెల్లగా నవ్వుతున్నట్లు తెల్లటి గుడ్డ తప్ప మరేం కనిపించలేదు.
ఆమె మౌనంగా ముందుకు నడుస్తోంది.
అతను ఎక్కడివాడు అక్కడే ఆగిపోయాడు.
అతను రాడని ఆమెకు తెలుసు....అందుకే తను చిన్నగా అడుగులేస్తోంది.
ఆమెను అలా చూస్తూ నిలబడ్డాడు అతను. ఇన్నిరోజులు గుండెలో దాచుకున్నది చెప్పే టైమ్ వస్తే ఖర్మ కాలి జేబు పర్మిట్ చేయటం లేదు.
టీ అంగడి యజమాని సుబ్బరామయ్య అతని చూసి "టీనా? కాఫీనా" అని అడిగాడు.
"రెండూ కాదు- డబ్బు" అన్నాడతను సీరియస్ గా అతని కళ్ళు ముందు డబ్బు తప్ప మరేం కనిపించడం లేదు.
"డబ్బా!"
"ఆ"
"ఇక్కడ తినుబండారాలు అమ్ముతారు. కాఫీ, టీ ఇస్తారు. అంతే తప్ప డబ్బును ఇడ్లీలను పాత్రల నుంచి దించినట్టు చెట్ల నుంచి దించరు"
"అది తెలుసు. నువ్వు డబ్బివ్వాలి- వూరికే కాదు"
సుబ్బరామయ్య కళ్ళు మెరిసాయి. ఖరీదైన వస్తువుల్ని చౌకగా కొట్టేసే ఛాన్స్ వచ్చిందన్న మాట.
"వెండి మొలతాడును అమ్మేస్తున్నాను. నీ ఇష్టం వచ్చినంత ఇవ్వు" అని మొలలోంచి అతి కష్టం మీద వెండితాడును తీసి ఆయన చేతికిచ్చాడు.
అది అయిదువందల పైనే విలువ చేస్తుందని తెలుసు.
అంత డబ్బు ఇచ్చేస్తే తన లాభం మాటేమిటి? అందుకే ఆయన దాన్ని అటూ ఇటూ తిప్పి "రెండు వందలిస్తాను" అన్నాడు.
"బంగారు నగల వ్యాపారం చేసినవాడిని దాని విలువ నాకూ తెలుసు మరో వంద ఇప్పించండి. నేను మాట్లాడాల్సింది మూడు పదాలున్నాయి"
"మాటలు అనవసరమయ్యా- ఇష్టం వుంటే తీసుకో- లేకపోతే మానెయ్" ఏమిటి నస బేరం అన్నట్టు ముఖంపెట్టి అన్నాడు సుబ్బరామయ్య.
అటు చూస్తే లిఖిత దూరమైపోతూ వుంది.
"సరే ఇవ్వు" అన్నాడు.
ఆయన రెండు వందల రూపాయల నోట్లను చేతిలో పెట్టాడు.
వాటిని తీసుకుని జితేంద్ర ఆమె వెనుకపడ్డాడు.
ఆమెకి ఆశ్చర్యం వేసింది. రోడ్లో డబ్బు ఎలా పుట్టించాడు.
వారం రోజుల్లో లక్ష రూపాయల్ని సంపాదించిన అతనికి ఇది ఒక పెద్ద కష్టమేమీ కాదు. ఇంకా ఏదైనా కష్టమైన షరతు విధించాల్సింది. తన తెలివిలేని తనానికి తననే నిందించుకుంది.
ఆమె తన నడక వేగాన్ని మరింత హెచ్చించింది.
ఇతను పిలవకపోతే ఆమె ఆగదని అతనికి తెలిసిపోయింది.
వెనక పరిగెత్తడాన్ని ఎవరైనా చూస్తే ఎబ్బెట్టుగా వుంటుంది.
"ఏమండీ" గట్టిగా పిలిచాడు.
ఆమె ఆగింది.
