సార్ధక నామధేయుడు!
రచన: వి. వి. ఎస్. బి. కుటుంబరావు
సాంబయ్యంటే చాలా మంచివాడని నా వుద్దేశ్యం! ఎందుకంటే ... కాఫీ..... టిఫిన్.... సిగరెట్లు.... వక్కపొడి పొట్లం ఆఫీసు ఫైళ్లు తీసుకెళ్లటం ... ఇలాంటి పనులేవి చెప్పినా నిముషాలమీద హుషారుగా చేస్తాడు. విసుక్కోడు!నసుక్కోడు! ఎప్పుడూ చిరునవ్వుతో చిద్విలాసంగా వుంటాడు. అతనిలో విశేషంగా నన్నాకర్షించిందేమంటే... ఎప్పుడన్నా కాఫీ తాగమని ఓరూపాయో... అర్దో ఇచ్చినా ససేమిరా పుచ్చుకోడు. "నాకెందుకండయ్యగోరూ! ఏదో మీదయ నామీద చల్లగా వుండాలి గానీ " అంటూ మృదువుగా తిరస్కరిస్తాడు. పావలా ఇస్తానంటే పావుగంట కాకా పట్టే ఇతర ప్యూన్లకీ ఇతనికీ ఎంత తేడా? అనుకుని మనసులో అతన్ని ఎంతగానో అభిమానిస్తుంటాను.
ఇంతమంచివాడుగా, చలాకీగా, వుండే మనిషిని పట్టుకుని ... కొంతమంది "దొంగ సాంబయ్యఅనటం నాకు చాలా బాధ కలిగించే విషయం "వాడు వట్టి దొంగసన్నాసండీ!" అంటూ ఒకరిద్దరు నాదృష్టికి తీసుకొచ్చినా, నిర్లక్ష్యంగా తోసిపుచ్చాను నేను.
వాడు నాకు ఎంతగా నచ్చాడంటే ...ఆఫీసు నుంచి ఇంటికి.... ఇంటినుంచి ఆఫీసుకి వచ్చే సమయంలో తప్ప..... మిగతా సమయమంతా నా సైకిలుని అతని డిస్పోజలులోనే ఉంచేవాణ్ణి. నాపనులే చేస్తున్నాడు గదాని సంతోషం నాకు. దాని దుంపతెగ! అది ఓ గమ్మత్తుసైకిలు! ఎప్పుడూ ఏదో రిపేరు! దానికి ఎక్కువగా పంచర్లు!' ఇదిమార్చేసి మరో కొత్తదాన్ని కొనండయ్యా!' అని సాంబయ్య అన్నప్పుడల్లా చిరునవ్వు నవ్వేసి రిపేరుకయిన ఒకటో రెండో చేతిలో పెట్టేవాడు. అప్పుడు కూడా సాంబయ్య ఏదన్నా ఇవ్వబోతే పుచ్చుకునేవాడు కాదు. అతని సిన్సియారిటీకి చాలా సంతోషంగా వుండేది నాకు.
ఆరోజు వుదయం సాంబయ్య సైకిలు తీసుకెడుతూ పంచరు పడిందయ్యగారూ!"అన్నాడు. "బాగు చేయించుకురా!" అని రెండు రూపాయలనోటు ఇచ్చి పంపాను. పావు గంటలో తిరిగి వచ్చాడు సాంబయ్య.
'ఎక్కడ తొక్కారయ్యగోరూ! వరసగా మూడు పంచర్లయినాయి. బాషా షాపులో వేయించాను.' అన్నాడు మిగిలిన చిల్లర తిరిగి ఇచ్చేస్తూ.
ఎక్కడో పడి వుంటాయిలే! అని సర్దుకున్నాను.
మధ్యాన్నం సైకిలుమీద ఇంటికి భోజనానికి వెడుతూంటే సైకిలుషాపు భాషా కనిపించాడు. నమస్కారం పెట్టాడు. ప్రతినమస్కారం చేశాను, సైకిలాపి.
'ఈ మధ్య అయ్యగారి సైకిలు మాషాపుకి రిపేరుకే రావటం లేదు'అన్నాడు గమ్మత్తుగా నవ్వుతూ.
'అదేమిటి? పొద్దున్నే మూడు పంచర్లు వేశావటగా?' అన్నాను- ఆశ్చర్యంగా.
'అలా అని చెప్పాడా దొంగసాంబడు?'
భాషా పకపక నవ్వాడు. నాకు మనసులో ఏదో కలుక్కుమని .. .ఇక అక్కడ వుండలేక సైకిలు పోనిచ్చాను.
భోజనంచేసి ఆఫీసుకు రాగానే సాంబయ్య వినయంగా నిలబడి సైకిలందుకుని వరండాలో పైన పెట్టాడు. మధ్యాన్నం విషయం అతన్ని అడగాలనిపించినా ఎందుకో మనస్కరించలేదు.
ఓ అరగంట ఆఫీసు కాగితాలు రాసి.... బోరుగావుందని వరండాలోకి అడుగుపెట్టాను. ఆవరణలో సాంబయ్య తప్ప ఎవరూ లేరు. అతను చేస్తున్న పనిచూసి నిర్గాంతపోయాను.
ఇదా అసలు సంగతి? ఇదా తరచు పంచర్ల రహస్యం?
కాఫీ తాగమని డబ్బులిస్తుంటే, సాంబయ్య వద్దనేది ఇందుకన్న మాట ! ఓహ్!
ఇంతకీ సాంబయ్య చేసేపనేమిటో తెలుసా?
వెనక చక్రంలో గాలి తీసేస్తున్నాడు?!!
సాంబయ్య ... కాదు.... దొంగ సాంబయ్య... సార్దక నామ ధేయుడు!!!
*
