ఎమర్జెన్సీలో అప్పారావ్!
రనచ: ముంగర
ఆలపాటి మునిసిపల్ మార్కెట్ లో అప్పడాలు, వడియాలు, మజ్జిగ, పెరుగు, పాలు లాంటివి అమ్ముతుంది ఆండాళ్, ఒడ్డూ, పొడుగూ, అందం, చందం ఆమె సొంతం కావటంతో సరుకుల్లో నాణ్యత, లేకపోయినా కమ్మని చూపుల్తో, తియ్యని మాటల్తో వ్యాపారం జోరుగదా సాగిస్తోంది - వయసు ఇచ్చిన ఒంపు సొంపుల్తో తన వయసులో వున్నవాళ్లను పల్టీలు కొట్టిస్తోంది.
అలా పల్టీకొట్టిన వాళ్లలో అప్పారావు ఫస్ట్ - తట్టుకోలేక ఆండాళ్ ను అడిగేశాడు కూడా - ఆమె తన తల్లి అంబుజమ్మను చూపించింది. ఆమె వాళ్ల గుడిసెకెదురుగా వున్న చిన్నసైజు బంగళా చూపించి అలాంటివన్నీ వుంటే ఆండాళ్ ను కట్టుకోవచ్చని అనుమతి మంజూరుచేసింది.
అప్పారావు తన హిప్పీ క్రాఫులో ఎడమచేతి అయిదు వ్రేళ్లూ దూర్చి, అప్పుడప్పుడు జుట్టుపీక్కుంటూ రత్నాటాకీస్ కెదురుగా వున్న పార్కులో కూర్చుని రేయింబవళ్ళు ఆలోచించాడు, తన మొబైల్ ఇస్త్రీ బండితో అంబుజమ్మ గారాల కూతుర్ని చేపట్టం కష్టమన్న తీర్మానానికి వచ్చేశాడు.
కాని అతని ఊహల్లో ఆండాళ్ జయమాలినిలా డాన్స్ చేస్తుంది. 'చలివేస్తుంది - చంపేస్తోంది' అని పాడినట్లు విన్పిస్తోంది - "తిక్క రేగిందా - తిమ్మిరణిగిందా" అని అడిగినట్లునిపిస్తోంది - అతని కళ్లకు ఆండాళ్ అర్దనగ్నంగా, అప్పుడప్పుడు నగ్నంగాను కూడ కన్పించసాగింది. అతనికి యమగోలలోని చిలుక కొట్టుడు గుర్తుకొచ్చి ఉక్కిరిబిక్కిరి కాసాగాడు.
ఇది ఇలా వుండగా -
మరి అప్పారావు దురదృష్టమో అదృష్టమోగాని పార్కులో పడుకున్న అతన్ని ఒకనాడు ఎమర్జెన్సీ వాన్ ఎక్కించుకుంది - గవర్నమెంట్ హాస్పిటల్ లో డెలివరీ ఇచ్చింది - ఆపరేషన్ ధియేటర్ లో అతనికి సంజయ్ గాంధి కోతపడింది - నాలుగురోజుల తర్వాత అతన్ని గేటుదాటించి సాగనంపారు.
అప్పారావు మొబైల్ ఇస్త్రీబండిని అతడులేని సమయాల్లో మెయింటైన్ చేసే నహబ్ గేట్ లోనే పూలదండ వేసి స్వాగతం పలికాడు. అప్పారావు నిక్కరుజేబులో గవర్నమెంటు వారిచ్చిన రొఖ్ఖం హైరానా పడుతోంది. సరాసరి వెళ్లి ఆండాళ్ ను చూసి ఆమెకింకా పెళ్లి కాలేదని గ్రహించి సంతృప్తి పడ్డాడు - ఆమె కిసుక్కున నవ్వి అతని నరాలకు కసిపుట్టేలా చేసింది - అతనికి అంబుజమ్మ ఎదురింటి బంగళాను చూపించిన ఘట్టం గుర్తుకొచ్చింది - వెనక్కి మళ్లాడు -
ప్లాగ్ హోటల్ లో పరోటాలు, కబాబ్ లు తిని టీలు త్రాగి అప్పారావు. వహాబ్ గాంధిచౌక్ కు వచ్చారు - లాటరీ టిక్కెట్లు అమ్మే షాపుకు వెళ్లారు - రేపే జరిగే డ్రాలో అయిదులక్షలు ఫస్ట్ ప్రైజ్ వచ్చేట్లుగా టిక్కెట్టిమ్మని అడిగాడు అప్పారావు - షాపువాళ్ళు తమతో తాము నవ్వుకొని ఓ టిక్కెట్టిచ్చారు.
ఆ మరుసటిరోజు సాయంత్రం వాళ్లనుచూసి వహాబ్, అప్పారావు పడీ పడీ నవ్వారు. అప్పారావు టిక్కెట్టును బ్యాంక్ వాళ్లకు అప్పగించి అయిదులక్షల్ని తెప్పించే ఏర్పాటు చేయమన్నాడు - డబ్బు రాగానే బంగళా తాళం చెవుల్ని, కారును,బొచ్చుకుక్కను తీసుకొని అంబుజమ్మ గుడిసెముందు ఆగి కారుహారన్ మ్రోగించాడు.
అంబుజమ్మ మాట నిలబెట్టుకుంది - అప్పారావుకు ఆండాళ్ కు వైకుంఠపురంలో వైభోగంగా వివాహం జరిపించింది హాయిగా వుంటున్నారు - నాలుగు సెంటర్లలో నాలుగు డ్రై క్లీనర్స్ షాపుల్ని తెరిపించి వహాబ్ కు అప్పగించాడు అప్పారావు -
ఇంతలో అయిదు క్యాలెండర్లు పాతబడిపోయాయి - అప్పారావు బంగళాలో పసిపిల్లల కేరింతలు వినబడలేక పోయాయి - ఆండాళ్ కు అమ్మ కావాలనుకున్న ఆశ అడియాస అయింది - అంబుజమ్మ అమ్మమ్మ ననిపించుకోవాలని నిరాశ పొందింది.
అప్పారావు అసలుసంగతి ఆండాళ్ కు చెప్పకుండా విజయవాడ వెళ్లి ఉత్తర దేశయాత్రకు రెండు టిక్కెట్లు కొనుక్కు వస్తానని వెళ్లాడు. ఆండాళ్ సూట్ కేసులు సర్దేప్పుడు వచ్చాడు వహాబ్. విషయం తెలిసికొని పడీ పడీ నవ్వాడు.
ఎన్ని తీర్దయాత్రలు చేసినా సంతానం కలగదనీ అప్పారావుకు ఆపరేషన్ జరిగిందనీ 'అసలు సంగతి' చెప్పాడు వహాబ్ - అంతేకాదు. ఆపరేషన్ చేయించుకున్నందుకు ఈనాముగా ఇచ్చిన డబ్బుల్తోనే లాటరీటిక్కెట్టు కొన్న సంగతీ, ఆ ప్రైజుడబ్బుతో అన్నీ కొన్నసంగతీ కూడ చెప్పాడు.
ఆండాళ్ విశ్వరూపం దాల్చింది - అంబుజమ్మ అగ్నిలో ఆజ్యం పోసింది - యాత్రాటిక్కెట్లు వాపస్ చేయబడ్డాయి - ఇంటి వాతావరణమే మారిపోయింది - కాని అప్పారావుకు మాత్రం ఏదీ సరిగ్గా బోధపడలేదు.
ఆండాళ్ విశ్వరూపం దాల్చినరోజున విడుదలైన ఓ తెలుగుసినిమా నూరురోజుల పండుగ జరుపుకొంది - ఆ వేడుకల్లో పాల్గొన్న అప్పారావు ఆలస్యంగా ఇంటికొచ్చాడు - అతనికి అత్తగారు అన్నం వడ్డించింది - అతను తినసాగాడు.
సరిగ్గా పెరుగు వడ్డించేప్పుడే అడిగాడు 'ఆండాళ్ ఎక్కడ?'అని.
"దానికి వాంతులవుతున్నాయి - అందుకే నేను వడ్డించింది" అంది అంబుజమ్మ.
"మరి డాక్టరుగారికి ఫోన్ చేయకూడదూ!" అన్నాడతను.
"ఇంతమాత్రానికే డాక్టరెందుకు? అయినా మూడో నెలలో వాంతులుకాని ఆడది ఎవరుంటుంది గనుక! అంది అంబుజమ్మ.
పెరుగన్నం తింటున్న అప్పారావుకు పొరమారి దగ్గువచ్చింది - "అసంభవం - అక్రమం - అన్యాయం - అధర్మం -" అంటూ వాపోయాడు.
వెండి చెంబులో మంచినీళ్లందించి చెప్పింది అంబుజమ్మ.
"అల్లుడూ! మన ఇంట్లో మజ్జిగా వున్నాయి - పాలూ వున్నాయి - మనం వాటిని రుచిచూస్తూనే వున్నాం - మన ఇంట్లో పాలను కాచి, మనఇంట్లో మజ్జిగతో తోడుపెట్టి పెరుగుజేసుకొని తినాలనుకోవటం గొంతెమ్మ కోరికేంకాదు - మన ఇంట్లో పాలు చిక్కగాను, స్వచ్చంగాను వున్నాయి - ఎటొచ్చీ మజ్జిగే నీళ్ళకన్నా కనాకష్టంగా వున్నాయి - అందువల్లే ఎన్నిసార్లు తోడుపెట్టినా తోడుకోలేదు - మనింట్లో మజ్జిగతో పాలు తోడుకోనప్పుడు ఎదురింట్లోనూ పక్కింట్లోనూ వున్న మజ్జిగతో ప్రయత్నించమా? ఇదీ అంతే? ఎలాగో మా ప్రయత్నం ఫలించింది - మా ఆండాళ్ కడుపుపండబోతోంది -" అంది సంబరంగా.
మొదట్లో కంగారుపడ్డా "ఏ మజ్జిగతో తోడుపెడ్తే ఏం? పెరుగు మనింట్లోనేగా తయారయ్యేది! తినేది మనమేగా!! అంతా అనేది కూడా అప్పారావుగారింటి పెరుగునేగా!! అని సంతృప్తిగా కంచంలో చెయ్యి కడుక్కున్నాడు అప్పారావు.
(ఇలాంటి కథలు వ్రాయమని సర్వదా ప్రోత్సహించే మిత్రులు, సహృదయులు 'సాహిత్యరవి' శ్రీ కె. రవీంద్ర ప్రసాద్ గారికి కృతజ్ఞతతో)
*
