పట్టు చీరె
రచన: మోటుమర్రి దుర్గా ప్రసాదరావు.
మా ఆవిడ నన్ను పట్టు చీరె కొని పెట్టమని పగలు ఎప్పుడూ అడగదు! వెన్నెల కురిసే పున్నమి రాత్రుల్లో, మల్లెలు విరిసే మధుర వేళల్లో, మత్తెక్కిన మనసుతో నా మనసుని అడుగుతుంది. "అలాగే - అలాగే" అంటూ కాలాన్ని కరగదీస్తున్నాను, నేను.
త్వరలో మాపెళ్లిరోజు రాబోవటంతో మాఆవిడ పట్టు పట్టడంతో కొన్ని పట్టుచీరెలు తీసుకు వచ్చి చూపించాను. ఆమె రెండు పట్టు చీరెలు కావాలంది. ఈ మధ్య వచ్చిన తుఫానువల్ల ఆర్దికంగా దెబ్బ తినడంతో ప్రస్తుతానికి ఒక చీరె తీసుకోమని ఒకటే కొన్నాను. మిగతావి ఇచ్చి వచ్చాను.
ఆరోజు రాత్రి పవళింపు వేళ తిరిగి మా ఆవిడ ఆ రెండో పట్టు చీరె కనండని మృదువుగా, మెత్తగా గోముగా, కాంక్షలు నిండిన కళ్లతో బ్రతిమ లాడింది. మంచులా నా మనసు కరిగినా, ఆర్దిక యిబ్బందుల ఆనకట్టతో ఆగింది.
ఆమె నిద్రలోకి జారిపోయింది. నాలోని నిద్ర ఎగిరి పోయింది విసుగెత్తి! మాకు వివాహం జరిగి పది వసంతాలయింది. ఈ సుదీర్ఘ కాలగమనంలో ఏనాడూ ఆమె నన్ను తన కోర్కెలతో వేధించలేదు, సాధించలేదు. కలలోని ప్రేయసిలా, కధ లోని భార్యలా నాతో కాపురం చేస్తోంది. మా మధ్య తరగతి వుమ్మడి కుటుంబం ఆర్దిక యిబ్బందులతో అలమటించే రోజుల్లో ఆమె ట్యూషనులు చెప్పి సహాయ పడింది. అయినా కష్టాలు మాతో కాపురం చేస్తూనే వున్నాయి. ఆడది అధికంగా ఆకాంక్షించేది, ఒకోసారి భర్తకంటే కూడా అధికంగా ప్రేమించేది నగలని. అయినా ఆమెకి వున్న వొక్క గానొక్క బంగారు గొలుసు అమ్మినా వ్యాపార అభివృద్దికి దోహదం చేసింది. మాశ్రమ ఫలించింది.
ఈనాడు మా పరిస్థితులు మారాయి. మా పరిమిత కుటుంబం పరమానందంగా గడిచిపోతుంది. నెలరోజుల క్రితం చీరెలన్నీ చినిగి పోతున్నాయని ఐదు చీరెలు రోజూ వాడకానికి కొన్నది. మధ్యతరగతి కుటుంబాలలోని అతివలకి, జీవితంలో ఒక్కసారే పెళ్ళయినట్టు పట్టు చీరెకూడా ఆ పెళ్లినాడు ఒక్కసారే కొనేది. తిరిగి జీవితంలో కొనేది లేకపోగా వున్న ఒక్కపట్టుచీరె వాడి వాడి వయసు తరిగిన వనితలా, కాంతి కరిగిన శరీరంలా వడిలి పోతుంది. మా ఆవిడకి ఈ అవస్థ లేకుండా పట్టు చీరె కొన్నాను. మరో పట్టు చీరె కావాలని అడుగుతోంది. ఆమెలో ఆకస్మికంగా పురివిప్పిన ఆకాంక్షలకి కారణాలు తోరణాలు వెదికినా, నాకంతు బట్టలేదు. ఆమెని నిద్రలేపి అడిగాను. ఆమె నవ్వి యిలాచెప్పింది "మొన్నీ మధ్య గుంటూరు నుండి వచ్చిన మీతమ్ముడిభార్య చీరెల ముందు నా చీరెలు సూర్యుడి ముందు దివిటీలా వెలా తెలా పోయాయి. వాళ్లకి మనకంటె ఆదాయం తక్కువ. అయినా మనకంటే ఎక్కువే కొంటున్నారు. విహారయాత్రలు చేస్తున్నారు. లేనప్పుడు లేక బాధపడ్డాం! ఈనాడు ఆబాధ లేదు. అందుకే యిన్ని చీరెలు కొన్నాను. మరో పట్టు చీరె కొనమన్నాను. మనస్థితికి మించినవి కావు యివి. ఆనందించటానికి కాకపోతే ఈ సంపాదన దేనికండి? జీవితం జీవించటానికే కాదు అనుభవించ టానికికూడా." "వేదాంతం చెప్పకు. చివరకి మిగిలేది అదేలే ఇహ నిద్రపో" అన్నాను.
'నిద్రపోంది మీరు. నిద్రపోవాల్సింది మీరు. మరో పట్టు చీరె కొనాల్సి వస్తుందని నిద్ర చెడగొట్టుకోకండి. మరో సారి కొందురు. మీ మరదలి చీరెల ప్రభావం నా మీద పడింది. నేను కొన్న జలతారు అంచుల జరీపట్టుచీరె ప్రభావం మీ మరదలిమీద పడింది. ఈ ప్రభావాలు, ప్రలోభాలు కాలచక్రంలా గుండ్రంగా తిరుగుతూ కాలంతో సాగుతూనే వుంటాయి' అని నామనో నేత్రాలు తెరిపించి, నా కన్నులు మూసింది.
********
