Previous Page Next Page 
పగలే వెన్నెల పేజి 31

   
    
    ఆరుగంటలైంది. వెలుగు బావుందిగానీ వేడిగా లేదు. చల్లటిగాలి ఆహ్లాదకరంగా వీస్తోంది. ఆకాశంలో అప్పుడే పుట్టిన నక్షత్రాలు లేతగా కనిపిస్తున్నాయి.  ఆమె ఇంటిముందు నులకమంచం వాల్చుకుని పడుకుంది. ఏవేవో ఆలోచనలు తలలో తిరుగుతున్నాయి. ముఖ్యంగా కుటుంబాన్ని పీడిస్తున్న ఆర్థిక సమస్యలు.


    ఇన్ని సమస్యలు పడుతూ. ఇన్ని ఇబ్బందులను ఎదుర్కొంటూ ఇక్కడ ఎందుకు సంసారం చేయాలో ఆమెకి అర్ధంకాలేదు. తన జీవితాన్నంతా ముందు పరుచుకుని లాభనష్టాలు, కష్టసుఖాల్ని ఆమె బేరీజు వేసుకుంటోంది. పెళ్ళివల్ల కష్టాలే తప్ప, బాధలు తప్ప అందంగానీ, ఆహ్లాదంగానీ వచ్చిన గుర్తులేం ఇంతవరకు లేవు.


    కనీసం జీవితం కంఫర్టబుల్ గా కూడా లేదనిపించింది. ఏదో అనీజీగా ఉంటోంది. పెళ్ళయిన ఇన్ని సంవత్సరాలలో గుర్తుంచుకోవాల్సిన క్షణాలంటూ ఏం లేవు. మరి దేన్ని గురించి కాపురం చేయాలో అర్థం కాలేదు.


    ఆమెకి పెళ్ళయి దాదాపు అయిదేళ్ళు అవుతోంది. మొదటినుంచీ ఏదీ పుష్కలంగా వున్న పాపాన పోలేదు. అన్నీ అందతుకులే. ప్రతిదానికీ వెదుక్కునే పనే.


    ఆమె పెళ్ళినాటికే దాసు ట్రాక్టర్ డ్రైవరే. అయితే అప్పట్లో టౌన్ లో ఉన్న ప్రతాపరాముడి ట్రాక్టర్ లో ఉండేవాడు. కాపురం మాత్రం ఆ వూర్లోనే వుండేవాడు.


    దాసూ తల్లిదండ్రులు కూడా అదే వూర్లో నివాసం వుంటారు. దాసూకి పెళ్ళయ్యేనాటికి వాళ్ళది ఉమ్మడి కుటుంబం. ఉమావాళ్ళు చాలా సింపుల్ గా పెళ్ళిచేసి పదివేల రూపాయలు డబ్బు ఇచ్చారు.


    అందులో అయిదువేలు పెళ్ళికి వాడుకుని మిగిలిన అయిదువేలకు ఇంటిస్థలం కొన్నాడు. మొదట్లో తల్లిదండ్రులతోనే వున్నా ఆ తర్వాత కొత్తగా కొన్న స్థలంలో పెద్ద అడ్డాపిల్లు వేశాడు. ముందు వంటకోసం నాలుగు గోడలు ఎక్కించాడుగానీ పైకప్పు వేసుకోలేదు.


    ఈఇల్లు రెడీ అయ్యాక ఇక్కడికి షిఫ్టయిపోయారు. ఓ పాప పుట్టింది. అంతకుమించి ఆర్థికంగా పుంజుకున్నది లేదు. ఇంటికి చేసిన అప్పు, పాప పుట్టినప్పుడు చేసిన అప్పు ఇంతవరకు తీరలేదు. వడ్డీ కట్టడానికే వచ్చింది సరిపోతోంది. ఆమె అప్పుడప్పుడు కూలీకి వెళుతుంది. దాంతో ఇల్లు గడుస్తుంది. అతనికి వచ్చే జీతం అప్పులు, వడ్డీలకే సరిపోతుంది.


    ఇరుకు ఇరుకుగా వున్న ఆ ఇంట్లో చెప్పుకోతగ్గ వస్తువు ఒక్కటంటే ఒక్కటి లేదు. పోనీ ఆమె ఎప్పుడైనా మంచి చీరలు కొనుక్కుందామంటే అదీలేదు. పెళ్ళికి తీసుకున్న చీరల్నే ఇప్పటికే కట్టుకుంటోంది.


    నగల విషయం ఇక చెప్పక్కర్లేదు. రెండు బుట్ట కమ్మలు తప్ప ఆమె ఒంటిమీద ఏమీ మిగల్లేదు.


    పోనీ షికార్లు, సినిమాలున్నాయా అంటే అవీలేవు. ఎప్పుడో సంక్రాంతికో, వినాయకచవితికో టూరింగ్ టాకీస్ కి వెళ్ళడం మహా గొప్ప విషయం.


    ఇక కష్టాలు, బాధలు గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈరోజు జరిగిన విషయాలే ఉదాహరణ.


    పెళ్ళికాకముందే తను సుఖంగా వున్నట్లు ఆమెకి చాలాసార్లు అనిపించింది. ఇప్పుడూ అలానే అన్పిస్తోంది. ఆమెకి తన పుట్టిల్లు గుర్తొచ్చింది. ఆ జ్ఞాపకాలు ఒక్కొక్కటీ మధురంగా మనసులో కదులుతున్నాయి.


    ఆమెది రోజువారీ కూలీనాలీ చేసుకునే కుటుంబం. తల్లీదండ్రీతో పాటు ఓ తమ్ముడు కూడా వుండేవాడు.


    ఆమెకు ఎలా వచ్చిందో ఏమోగానీ చిన్నప్పటినుంచీ చదువంటే ఇంట్రెస్ట్ వుండేది. అందుకే తన ఈడువాళ్ళు అయిదో తరగతి పాస్ కాగానే ఇక చదువుకు ఫుల్ స్టాప్ పెట్టేశాడు. కారణం ఆరులో చేరాలంటే రెండు కిలోమీటర్లలోని హైస్కూల్ కి వెళ్ళిరావాలి.


    ఆమె తండ్రి నాగరాజు ఆడపిల్లలకెందుకులే చదువన్నాడు. మనకులంలో చదువుకుంటే చదువు కున్నోళ్ళు దొరకడం కష్టమన్నాడు. తమతో కూలికివస్తే కుటుంబం సాఫీగా జరిగిపోతుందని చెప్పాడు. అందరం కలిసి చిన్నాడు గోపీని చదివిద్దామన్నారు. కానీ ఉమ ఒప్పుకోలేదు. తను హైస్కూల్ కి వెళ్ళి తీరుతానంది. చాలారోజుల ఏడుపు తర్వాత తండ్రి ఒప్పుకున్నాడు.


    ఆమె హైస్కూల్ లో చేరింది. అందరి అమ్మాయిల్లోకెల్లా ఆమె కళగా ఉండేది. అందంగా వుండేది. అందుకే అందరి అటెన్షన్ ఆమె మీదే వుండేది. ఆమె చిన్నపిల్ల కాబట్టి అలాంటివాటిని పట్టించుకునేది కాదు.


    టెన్త్ క్లాస్ కొచ్చింది.


    ఇప్పుడు ప్రపంచపు పోకడ ఎలా వుందో తెలిసింది. మగాళ్ళ ఆకలి చూపులు అర్ధంకావడం ప్రారంభించాయి. తనను ఆబగా చూస్తూ అల్లరి పట్టిస్తోంది రోడ్ సైడ్ రోమియోలేకాదు. హెడ్మాస్టర్ దగ్గర్నుంచి, ఊరి సర్పంచ్ వరకు అవకాశం వస్తే అలా చెయ్యి మీదేసి సవరించడానికి ప్రయత్నించేవాళ్ళేనని తెలిసొచ్చింది.


    స్కూల్ కి బయల్గేరినప్పట్నుంచీ ఈ ఇబ్బంది తప్పేదికాదు ఉమకి. ఓరోజు యధాప్రకారం బస్సెక్కింది. రష్ బాగానే వుంది. దాంతో వెనక్కి వెళ్ళి నిలుచుంది. ఆమెతో పురుషోత్తం కూడా వెళ్ళాడు.


    పురుషోత్తం ఆ ఊర్లో ఇటుకల వ్యాపారం చేస్తాడు. అతని ఊరు చిత్తూరు దగ్గిర ఎక్కడో వుంది.


    ఎస్.ఎస్.సి.లో లోన్ తీసుకుని ఇక్కడ ఓ రెండెకరాలు కొనుక్కుని ఇటుకలు కోస్తున్నాడు.


    నలభైఏళ్ళదాకా వుంటాయి. భార్యాపిల్లలు స్వగ్రామంలోనే వుంటారు. ఇతను ఒంటరిగా ఉంటూ స్వయంపాకం చేసుకుంటూ కాలక్షేపం చేస్తున్నాడు.


    అతను ఆమె ఎదురుగా నిలబడ్డాడు. పలకరింపుగా పళ్ళికిలించాడు. ఉమ తండ్రి నాగరాజు అతని దగ్గరికే పనికిపోతాడు గనక బాగానే తెలుసు.


    బస్సు కుదుపులకి లోనైనప్పుడంతా అతను ఆమెమీద పడిపోతున్నాడు. ఆమె వక్షస్థలం ఆ వయసుకే బాగా ఎదగడంవల్ల అతను మీద పడుతుంటే ఆ ప్రాంతమంతా నొక్కుకుపోతోంది. అతను కావాలని పడుతున్నాడని రెండోసారి కనుక్కుంది. జామెంట్రీబాక్స్ తీసి అందులోని కాంపాస్ ని పట్టుకుంది.


    ఆమె ఊహించినట్టుగానే అతను ఈసారి మరింత బలంగా మీద పడిపోయాడు. అప్పుడు కరెక్టుగా ఆమె తన చేతుల్ని ఎదకు అడ్డం పెట్టుకోవడంతో అది గుచ్చుకుపోయింది.


    దొంగకు తేలుకుట్టినట్టయిపోయాడు. ఆ రోజుకి ఆమె సేఫ్ గా టౌన్లో దిగిపోయింది. ఫస్ట్ బస్ దొరకడం వల్ల మరీ ముందయిపోయింది స్కూల్ కి.


    క్లాస్ లో పుస్తకాలు పెట్టి పేపర్ చదవటానికి టీచర్స్ రూమ్ లో కెళ్ళింది. గది తెరచిందిగానీ ఇంకా ఏ మాస్టారూ రాలేదు. పేపర్ తీసుకుని వస్తుంటే హెడ్ మాస్టర్ తన గదిలోకి వెళుతూ ఆమెను చూశాడు.


    ఆయన కళ్ళు ఒక్క క్షణం మెరిశాయి. "ఉమా! అంటూ పిలిచి తన రూమ్ లోకి అడుగుపెట్టాడు.


    ఆమె భయం భయంగా లోపలికెళ్ళింది. తను చేసిన తప్పేమిటో ఎంత ఆలోచించినా తెలియడం లేదు.


    అయితే ఆయన ముఖాన్ని చూస్తూనే భయం పోయింది. ఆమెను చూస్తూ చిన్నగా నవ్వాడు.


    "సార్" మెల్లగా అంది ఉమ.


    "ఇలా రా!" అంటూ ఆయన పక్కకు పిలిచాడు.


    నెమ్మదిగా వెళ్ళి నిలుచుంది.


    "ఏదీ పేపర్ ఇలా ఇవ్వు" అంటూ ఎద తగిలేటట్టు చేత్తో రాస్తూ ఆమె చేతిలోని పేపర్ తీసుకున్నాడు.


    "అరెరె! కళ్ళజోడు ఇంటి దగ్గర మరిచిపోయివచ్చానే- ఏదీ హెడ్ లైన్స్ చదువు" అంటూ పేపర్ ను తనముందు పెట్టుకున్నాడు హెడ్ మాస్టర్. ఆయనమీదకి వంగి పేపర్ చదవడం అనివార్యమైపోయింది ఉమకి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS