Previous Page Next Page 
మధురమైన ఓటమి పేజి 31


    
    "ఫరవాలేదు" అందామె తిరిగి డైరీ చూడటానికి ఆమె సంస్కారం అంగీకరించలేదు. 'అమ్మయ్యా! ఆ బలహీనక్షణం గడిచిపోయింది కదా' అనుకుంది.
    
    మరుసటిరోజు ఆయనకీ జ్వరం జారింది. ధృతిని ఆఫీస్ కి వెళ్ళిపొమ్మని చెప్పారు.
    
    "అవసరమైతే ఫోన్ చెయ్యండి" చెప్పిందామె.
    
    ఆయన తలెత్తి ఆమెవైపు ఏదో చెప్పదల్చుకున్నట్లు ఓ నిమిషం చూసి, మళ్ళీ తల వంచేసుకున్నారు. ఆమె కదలబోతుండగా "ధృతీ!" అని పిలిచారు. ఆ గొంతు సౌమ్యంగా, మునుపెన్నడూ విననంత మృదువుగా, మంద్రంగా వినిపించింది.
    
    "ఏమిటీ?" అడిగింది దగ్గరకొచ్చి.
    
    "థాంక్యూ వెరీమచ్" అన్నారు ఆమెని ఆప్యాయంగా చూస్తూ.
    
    "మీరు థాంక్స్ చెప్పనవసరంలేదు. అది నా బాధ్యత" అంది ఆయన ఆప్యాయతకి కరిగిపోతూ.
    
    ఆపైన ఆయన మాట్లాడలేదు. తలవూపి వూరుకున్నారు.
    
    ధృతి ఆఫీసుకి వెళ్ళిపోయింది. లంచ్ టైంలో కారుదిగి లోపలికి వస్తున్న ధర్మానందరావుగారిని చూసి ఆశ్చర్యపోయింది. ఆయన రూమ్ లోకి వెళ్ళగానే తనూ వెనకాలే వెళ్ళింది.
        
    "ధృతీ! ఆ క్రేన్ మర్చంట్స్ ఫైల్ తీసుకురా! వెంటనే ఈ నెంబరుకి ఫోన్ చెయ్యి" అంటూ ఆమెకి చాలా హడావిడిగా పనులు పురమాయించారు.
    
    ధృతి ఆయనవైపు చూస్తూ "ఈ రోజు రెస్ట్ తీసుకోవచ్చుకదా! అప్పుడే ఆఫీస్ కి ఎందుకొచ్చారు?" అంది.
    
    ఆయన దిగ్గున తలెత్తి చూసి "చెప్పినపని చెయ్యి! క్విక్" అన్నారు కోపం, చిరాకూ కలగలిపి.
        
    ఆమె మొహం రక్తం లేనట్లు తెల్లగా పాలిపోయింది. చాలా అవమానంగా అనిపించింది. నువ్వు నాకు చెప్పేటంతదానివా? అన్నట్లు ఆయన చూసిన చూపు ఆమె మరిచిపోలేకపోయింది. ఆయన చెప్పిన పనులు మౌనంగా చెయ్యసాగింది. డిక్టేషన్ తీసుకునేటప్పుడు కూడా పరధ్యానంగా వుండి, మళ్ళీ తిట్లు తింది. ఆమెకి చాలా ఏడుపొచ్చేసింది. బలవంతంగా ఆపుకుంది. ప్రొద్దుటే టీచర్ ముందు పెట్టుకుందని సంతోషంగా వున్న పాపని, అకారణంగా టీచర్ పిలిచి తిడితే ఎంతబాదగా వుంటుందో అంత బాధగా అనిపించింది. రాత్రి అంతా కంటిమీద కునుకు లేకుండా పక్కన కూర్చుని జాగారం చేస్తే 'థాంక్స్' చెప్పి బదులు తీర్చేసుకున్నారు. ఇంకా నీకూ, నాకూ మధ్య ఏంలేదు అనుకుని వుంటాడు ఈ వ్యాపారస్తుడు అనుకుంది.
    
    సాయంత్రం ఇంటికొచ్చి అలాగే పడుకునిపోయింది. నిన్నటి రోజంతా ఎంతటి టెన్షన్ అనుభవించిందీ! ఆయనకీ జ్వరంగా వుంటే తను ఎందుకు అంత కంగారుపడినట్లు? బహుశా ఒక దగ్గర వుంటున్న అనుబంధానికేమో! అనుబంధం అన్నమాట అనుకోంగానే నవ్వొచ్చింది. అందుకే ఆయన భయపడుతున్నట్టున్నాడు. బంధాలు అనే పదం వింటేనే ఆ మనిషి ఉలిక్కిపడతాడు కామోసు.
    
    ఆమెకి ఒక్కసారిగా చాలా నిరుత్సాహం నిస్సత్తువా ముంచుకొచ్చేశాయి. ఆయనకీ ఆపేక్షలూ, అనురాగాలూ తెలియజెయ్యటం అంటే చెవిటివాడి ముందు శంఖం వూదడంలాంటిదే!
    
    తన పరిధిలోంచి ఆయన బయటికి రాడు. ఒకవేళ ఎవరైనా తను గీసుకున్న గిరిని దాటి లోపలికొస్తుంటే భరించలేడు. వెంటనే తాబేలు తన చిప్పలోకి ముడుచుకునిపోయినట్టు ముడుచుకుపోతాడు. ఆయన తను కావాలని ఏర్పరచుకున్న 'అహం' అనే అంధకారంలో హాయిగా వున్నానన్న భ్రమలో జీవితం గడుపుతున్నాడు. ఆ అహాన్ని జయిస్తే, ఆత్మ నిద్రలేస్తుందని ఆయన భయం కోపం బలహీనతనీ, అసహనం అపజయాన్నీ సూచిస్తాయి. బహుశా ఓడిపోతానన్న భయం కలగగానే ఆయన అలా మారిపోయాడేమో!" అనుకుని తనని తాను స్వాంతనపరుచుకుంది.
    
    ఆమె ఆ రాత్రి ఏమీ తినకుండా అలాగే పడుకుంది.
    
    గుండె దడదడలాడింది.
    
    తెల్లవారగట్ల ఉలిక్కిపడుతూ నిద్రలోంచి లేచి కూర్చుంది. నోరంతా తడారిపోయి, దాహంగా అనిపించింది. లేచి మంచినీళ్ళు తాగుతుంటే తన కొచ్చిన పీడకల గుర్తుకొచ్చింది.
    
    తను ఒంటరిగా పెద్ద మహల్ లో తిరుగుతోంది. ఎటు చూసినా కిటికీలూ, తలుపులూ కనిపిస్తున్నాయి. కానీ దగ్గరకెళ్ళి తీస్తే తియ్యబడటం లేదు. పైన ఎత్తుమీద ధర్మానందరావుగారు కూర్చుని పైప్ తాగుతున్నారు.
    
    ఆయనని అరచి పిలుస్తున్నా ఆయన వినిపించుకోవడం కానీ, తన్విపు చూడటం కానీ చెయ్యడంలేదు. ఆయన దగ్గరికెళ్ళాలని తాను మెట్లు ఎక్కుతున్నకొద్దీ అని ఎక్కువైపోతున్నాయి.
    
    ఆయన ఇంకా ఇంకా దూరంలో కనిపిస్తున్నారు. సగం మెట్లెక్కి ఆయాసంతో ఇంకా ఎక్కలేక అవస్థలు పడుతుంటే, క్రిందనుండి నవీన్ 'ధృతీ, ధృతీ' అని పిలుస్తున్నాడు. నవీన్ ని చూసిన ఆనందంతో గబగబా క్రిందకి దిగుతుంటే ఆ మెట్ల సంఖ్య కూడా పెరిగిపోతోంది.
    
    పైనుండి ధర్మానందరావుగారి 'ధృతీ!' అని పిలుస్తున్నారు. పైకి ఎక్కుదామా అని అటు చూస్తుంటే, క్రిందనుండి నవీన్ 'ధృతి'! అని ప్రేమగా పిలుస్తున్నాడు. ఎటు వెళ్ళాలో తేల్చుకోలేక అక్కడే కూలబడి తను హృదయ విదారకంగా ఏడుస్తోంది. ఏడ్చి, ఏడ్చి నోరు తడారిపోయింది.
    
    కల గుర్తు చేసుకోగానే మళ్ళీ గొంతు తడారిపోయింది. కళ్ళనుండి నీళ్ళు ఆగకుండా కారుతున్నట్లు గమనించి, కొంగుతో తుడుచుకుంది. ఏమిటీ కలకి అర్ధం? ఎందుకిలా బలహీనురాలినైపోతున్నాను? ఎటువంటి పరిస్థితుల్లోనూ కంటతడి పెట్టని తను ఇలా దుఃఖించడమేమిటీ? అని తనను తాను ప్రశ్నించుకుంది. ఆమెకి ఆ నిమిషంలో పరిగెత్తుకుంటూ నవీన్ దగ్గరికి వెళ్ళిపోవాలని బలంగా అనిపించింది.
    
                                                             * * *
    
    మహోన్నత శిఖరాలు నిర్మానుష్యాలు గొప్పవారెప్పుడూ ఒంటరివారే! జ్ఞానం, ధనం పెరుగుతున్నకొద్దీ మామూలు మనుషులనుండి వారు తమకి తెలియకుండానే దూరమవుతారు.
    
    "నవీన్! నాకు వచ్చిన కల....." చెప్పబోయింది ధృతి.
    
    "అదే చెప్పబోతున్నాను. ఆయన ఒంటరితనం అనే తలుపులనీ, కిటికీలనీ ఛేదించుకుని నువ్వు లోపలికి ప్రవేశించ చూస్తున్నావు. కానీ నీ ప్రయత్నం సరిపోలేదు. ఈ పోరాటంలో నా స్నేహితునికి దూరమవుతానేమోననే భయం కూడా నీ మనసులో ఏదో మూల కలుక్కుమంటోంది. అంతేకాకుండా ఇక్కడ ఇంకో విషయం కూడా తెలుస్తోంది....." అంటూ ఆగాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS