ఈజిప్షియన్ పిరమిడ్ సమాధుల్లో నిర్జీవమైన మమ్మీలా ఆమె అచేతనంగా వుండిపోయింది. ఆమె కళ్ళు తెల్లగా పాలిపోయి, అస్తిత్వాన్ని కోల్పోయినట్టు అయిపోయాయి. తనతో ఇప్పటివరకూ మాట్లాడింది తన భర్తేనా అన్నంత అనుమానంతో చూస్తూ వుండిపోయింది. ఆమె అభిప్రాయం గ్రహించినట్టు అతడు దగ్గిరగా వచ్చాడు.
"ఎన్నో సంవత్సరాల క్రితం నేను ఒక లాయరు స్నేహితుడితో కలిసి నీ దగ్గిరకు వచ్చాను. అతడిని చంపి నన్ను నీ గుప్పెట్లో పెట్టుకున్నావు. అప్పటినుంచీ నువ్వు నన్ను ఒక మనిషిగానే చూడలేదు. అందుకని 'వీడేమిటీ, ఇంత తెలివితేటల్తో మాట్లాడటమేమిటీ' అని నువ్వు అనుకోవటంలో హప్పులేదు. ఒక రైటరు ఒక పాత్ర గురించి వ్రాస్తున్నప్పుడు మిగతా పాత్రలని తొక్కిపట్టివుంచినట్టే, మనకి అవతలి వారిమీద ఒక అభిప్రాయం వున్నప్పుడు అదే అభిప్రాయం వున్నప్పుడు అదే అభిప్రాయం కొనసాగుతూ వుంటుంది. నామీద అదే తేలికైన అభిప్రాయాన్ని మొదటినుంచీ వుంచుకున్నావు తప్ప నేనెంత లోతుగా ఆలోచించగలనో వూహించలేదు నువ్వు ఎన్ని తెలివితేటలు లేకపోతే ఈ రాష్ట్రపు హోం మినిష్టర్ గా నేను ఇంతకాలం కొనసాగగలను? ఇప్పుడు అవసరం వచ్చింది కనుక అడుగుతున్నాను విను. నిన్ను నా అవసరాల కొం ఉపయోగించుకోవాలంటే నీ దగ్గిర చేతకానివాడిగా నటించి నీ అహాన్ని సంతృప్తిపరచాలి. ఇంతకాలం అలాగే నటిస్తూ వచ్చాను. నేను చాలాకాలం క్రితమే ఒకామెను రహస్యంగా వివాహం చేసుకున్నాను. పబ్లిసిటీకి భయపడి బయట పెట్టలేదు. అందువల్లే నీ చౌరసియా వ్యవహారం నాకేమీ ఆశ్చర్యం కలిగించలేదు. ఇప్పుడిక నీ అవసరం నాకేమీ లేదు. నాక్కావలసింది చౌరసియాతో కలిసి సాధించుకోగలను. దానికన్నా ముఖ్యంగా-" అతడు ఆగి, నెమ్మదిగా అన్నాడు. "....నీ అందంతో పనులు జరిపించుకోగల స్టేజీ నువ్వు దాటిపోయావని నా వుద్దేశ్యం."
ఆమె మొహం జేవురించింది. కళ్ళు విస్ఫులింగాలయ్యాయి. "ఇంత కుళ్ళు మనసులో పెట్టుకుని నాతో కలిసి వున్నావా?" అంది.
"నువ్వుండలేదూ? అలాగే" అన్నాడు. చెళ్ళున కొట్టినట్టయింది.
"నిన్ను నాతో పోల్చుకుంటావా? సిగ్గులేదూ?"
"కామినీ, ఈ ప్రపంచంలో మనుష్యులు మూడు రకాలు మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు, తాము మంచివాళ్లమానుకునే చెడ్డవాళ్ళు. ఈ మూడోరకమే తొంభైశాతం వుంటారు. నేను రెండో రకానికి చెందినవాడిని. నేను మంచివాడినని నేనెప్పుడూ చెప్పుకోలేదు. నువ్వు మూడోరకానికి చెందిన దానివి. చేసే పనులన్నీ చేస్తూకూడా వాటినెలా సమర్ధించుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటావు. నేను రాష్ట్రానికి విదేశాలకి అమ్మెయ్యటం నీకు దారుణంగా తోచింది. చౌరసియాతో అక్రమ సంబంధం నీకు దారుణంగా తోచలేదు. దాని కోసం నువ్వెన్ని కారణాలు చెప్పగలవో, నా చర్యని సమర్ధించుకుంటూ నేనూ అన్ని కారణాలు చెప్పగలను. స్వాతంత్ర్యయోధుడికి ఫించను ఇవ్వటానికి లంచం తీఉస్కునేవాడు కూడా దేశం గురించి మాట్లాడతాడు. అదే నవ్వొస్తుంది. మనని సంస్కరించుకోలేని మనం- పక్కవాడి గురించి మాట్లాడతాం. దేశభక్తి గురించి మాట్లాడతాం. మనందరం చెడ్డవాళ్ళమే కామినీ ఈ విషయం వప్పుకో!"
ఆమె అరిచింది. "నో.... నేనొప్పుకొను. ఈ దేశం నాశనమవటానికి నేనొప్పుకోను."
అతడు నవ్వేడు. "నువ్వేమీ చెయ్యలేవు కామినీ. గణేష్ నిమజ్జనం కాకుండా ఆపలేవు. అందులో గొడవలు జరక్కుండా ఆపలేవు. ఆ కారణంగా నేను రాజీనామా చేస్తాను. కేంద్రపు పార్టీతో కలిసి రాష్ట్రంలో అధికారాన్ని సంపాదిస్తాను దేన్ని ఆపగలవు నువ్వు?"
"నువ్వూ, చౌరసియా కలవటాన్ని, రాష్ట్రంలోకి టెర్రరిస్టులు ప్రవేశించటాన్ని, మన రాష్ట్రం మరో కాశ్మీరూ, పంజాబూ కాకుండా వుండటాన్ని....! మీ గురించి అందరికీ చెపుతాను."
"నీకు పిచ్చెక్కిందనుకుంటారు. పంజాబులో చాలా చిన్న గొడవ అతిపెద్ద దారుణంగా మారబోతుందని అధికారంలో వున్న రాజకీయ నాయకులకి పాతిక సంవత్సరాల క్రితమే తెలుసు. కాశ్మీరు కాష్టాన్ని ఆరనివ్వకుండా వుంచితే మంచిదని ఇప్పటికీ కొందరు పొలిటీషియన్ల భావం. ఇవన్నీ రాజకీయాలు కామినీ ఈ విషసర్పాల మందు అమాయకులైన ప్రజలు చీమలు లాంటివాళ్ళు పూర్తిగా నష్టపోయేవరకూ తామేం నష్టపోతున్నామో తెలుసుకోలేని అజ్ఞానులు అమాయకత్వం మీద తెలివైనవాడు ఆడుకునే ఆటే రాజకీయం" అని నవ్వి అతడు అక్కడినించి వెళ్ళిపోయాడు.
ఆమె ఎటూ కదలకుండా కూర్చుని వుంది.
అతడు చెప్పినదానిలో అబద్దమేమీ లేదని ఆమెకు తెలుసు.
ఆమెకు పూర్వపు రోజులు గుర్తువచ్చాయి. రెడ్డిని తనెంత తక్కువగా అంచనా వేసిందో అర్ధమవుతోంది. అతని స్నేహితుడిని తను చంపించినప్పటి నుంచీ అతడు మనసులో పెట్టుకుని వుంటాడు. పైకి తేలలేదు. తనని మెట్టుగా వాడుకుని పైకొచ్చాడు. తెలివితేటల్ని ఎక్కడా ప్రదర్శించలేదు. కావల్సినదంతా సాధించుకున్నాడు అవసరం తీరాక దెబ్బకొట్టాడు. చాలా దారుణమైన దెబ్బ.
ఆమెకు బిగ్గరగా నవ్వాలనిపించింది. అతడు చెప్పింది నిజమే. ఇంతకాలం తనవైపు నించే ఆలోచించింది. అవతలి వాళ్ళు కూడా తెలివైనవాళ్ళే అని గుర్తించలేకపోయింది తను, చౌరసియా, రెడ్డి, నాయుడు ఒక్కొక్కరు ఒక్కొక్క లెవల్లో తమ స్వార్ధం కోసం సాటిమనిషినీ, దేశాన్నీ, రాష్ట్రాన్నీ దోచేసుకోవటానికి ప్రయత్నిస్తున్నారు. నిజాయితీగా 'మంచి' కోసం యుద్ధం చేసేవాళ్ళు ఒక్కరూ లేరా?
ఆమెకు రాణా గుర్తొచ్చాడు.
ఒక క్రిమినల్ ని న్యాయపరంగా లాకప్ లో వుంచటం కోసం, మొత్తం రాజకీయ నాయకులందరితోనూ ఒంటరిగా పోరాడి, ఓడిపోయినా ఇన్ స్పెక్టర్.
చాలా చిన్న పోలీస్ స్టేషన్ లోని చిన్న అధికారి అయితేనేం ఆమెకతను చాలు. వయసు ఆమెని ఓడిస్తూంది. కానీ తెలివి తేటల్ని ఓడించలేదుగా.
ఓటమి అంటూ తప్పనిసరి అయినప్పుడు నరాలు చిట్లేలా ఆఖరి ఎత్తు వేయటమే నిజమైన ఆటగాడి లక్షణం.
ఆమె వెంటనే రాణాని కలుసుకోవటానికి బయల్దేరింది.
16
తన భవిష్యత్తు ఏమిటా అని రాణా రెండ్రోజుల్నుంచీ ఆలోచిస్తున్నా ఏమీ తోచలేదు. వీరదాసుకి దాదాపు ప్రతి సాయంత్రమూ అభినందన సభలు జరుగుతూనే వున్నాయి. వీరదాసు జైల్లో వుండటాన్ని కూడా ఒక గొప్ప కార్యంగా చిత్రీకరించి రాజకీయ నాయకులు యిచ్చే ఉపన్యాసాలు వింటూంటే మతి పోతూంది. ప్రజాభిప్రాయాన్ని మార్చటం ఇంత సులభమూ అనిపిస్తూంది.
తనని సస్పెండ్ చేస్తున్నట్టు హోం మినిష్టర్ చెప్పేసి వెళ్ళి పోయాక రాణా మరి పోలీస్ స్టేషన్ కి వెళ్ళలేదు. అఫీషియల్ ఆర్డర్స్ కోసం వెయిట్ చేస్తూ వుండిపోయాడు.
"ఏం జరిగింది?" అభిషిక్త అడిగింది.
అతడు చెప్పాడు.
ఆ అమ్మాయి చాలాసేపు ఏమీ మాట్లాడకుండా ఆలోచిస్తూ వుండిపోయింది. చివరికి "మనం తప్పు చేయకపోతే మనకేం జరగదన్నావ్ గా మరెందుకు దిగులు?" అని అడిగింది. ఆ అమ్మాయి ఇంతసేపూ ఏం గుర్తు తెచ్చుకోవటానికి ప్రయత్నించిందో అతడికి అర్ధమైంది.
మొట్టమొదటిసారి స్టూవర్ట్ పురం ట్రాన్స్ ఫరై వస్తూన్నప్పుడు ఆ పాప తల్లితో కలిసి ప్రయాణించింది. తండ్రి జైలులో వున్నాడని తెలిసి, తమ వాళ్ళకి ధైర్యం చెపుతూ ఆ మాటలు అన్నాడు. ఇప్పుడు అవి అబద్దమని తేలింది. పోలిటిక్స్ వర్సెస్ పోలీస్ లో మొదటిదానిదే ఎప్పుడూ పైచేయి అని ఋజువైంది. ఈ కథకి ముగింపు ఇంతే.
* * *
"ఇది ఇలా జరగటానికి వీల్లేదు" అలక్ నంద అంది. ఎప్పుడూ పూజలూ, పునస్కారాలు చేసుకునే ఆమె నోటివెంట అలాంటి మాటలు రావటం చూసి, అతడు ఆశ్చర్యంతో "మరింక ఎలా జరుగుతుంది?" అని అడిగాడు.
"నేను ఉద్యమం లేవదీస్తాను" అన్నదామె.
అంత విషాదంలో కూడా అతడికి నవ్వొచ్చింది.
"ఉద్యమమా?" అన్నాడు నవ్వుతూ ఆమె నవ్వలేదు. అతడి పక్కన వచ్చి కూర్చుంటూ, "రాణా, ఒకప్పుడు నువ్వు చెప్పావు గుర్తుందా- చైతన్యం అనేది ఎక్కణ్ణుంచో రాదు, ప్రజల్లోంచే వస్తుంది అని! మరి ప్రజలంటే ఎవరు? నువ్వు- నేను- మనమే కదా ఆగు అలా నవ్వకు. సుప్రభాతంతో మొదలు పెట్టి ఉపవాసంతో దినచర్య పూర్తిచేసే ఈ అలక్ నంద ఇలా మాట్లాడుతుందేమిటి అని ఆశ్చర్యపోకు నేను ప్రారంభిస్తాను. అది ఎక్కడికి వెళ్ళి ఆగుతుందో, లేక మొదట్లోనే చప్పబడిపోతుందో కాలమే నిర్ణయించనీ, ఝాన్సీరాణీలూ, రుద్రమదేవిలూ ఎక్కణ్ణుంచో పుట్టరు నీ మాటల్లో చెప్పాలంటే మనుష్యుల్లోంచి పుడతారు."
"నీ ఆవేశం చూస్తూంటే నాకు భయంగా వుంది. కానీ వాళ్ళు రాజకీయ నాయకులు. ప్రజల్లో ఆడుకునే సామర్ధ్యం కలవాళ్ళు జనాల్ని వాళ్ళే సమీకరించగలరు. కానీ, నువ్వూ నేను ఏమీ చెయ్యలేం."
"అలా అనుకుంటే ఏమీ చెయ్యలేం రాణా! నువ్వు నవ్వుకోనంటే నీకో ఉదాహరణ చెపుతాను. మొన్న మన ఊళ్ళో వరుసగా నాలుగురోజులు బంద్ లు జరిగాయి గుర్తుందా. ఏవేవో కారణాలు, ఆ నాలుగు రోజుల్లో ఒకటి ఏకాదశి, కానీ నేను గుడికి వెళ్ళటానికి కూడా వీల్లేకపోయింది. ఆ కసితో నేను ఏమనుకున్నానో తెలుసా? జనం అంతా కలిసి తలో పదిరూపాయలు చందా వేసుకుని, వీలైతే రౌడీలకి ఆ డబ్బు యిచ్చి ఒక సంవత్సరంపాటు ఈ ఊళ్ళో ఏ బందూ జరగకుండా చూసే ఏర్పాటు చేసుకుంటే ఎలా వుంటుందీ అని! ప్రస్తుత సామాజిక పరిణామాలవల్ల భక్తి లోంచే ఇంత కసి ఏర్పడుతూంటే, ఒక మంచి కారణం కోసం నేను చేసే ఈ పోరాటానికి చూద్దాం ఈ ఊళ్ళో ఎంతమంది నన్ను సపోర్ట్ చేస్తారో...."
* * *
ఆమె ఉపాధ్యాయ కాలనీ వాళ్ళని కలుసుకుంది. వాళ్ళు ఆమె భావాలను సపోర్ట్ చేశారు. ఆ సాయంత్రం గ్రంథాలయం హాల్లో ఒక మీటింగ్ జరిగింది. ఊహించని విధంగా జనం క్రిక్కిరిసి పోయారు. ఆ మరుసటిరోజు ప్లే గ్రౌండ్ లో సభ ఏర్పాటు చెయ్యాలని నిర్ణయించుకున్నారు. సభ విజయవంతమైంది. దాదాపు వెయ్యిమంది దాకా వచ్చారు. ఎమ్మెల్యే ఎం.పీలకి ఈ విషయం తెలిసినా పెద్ద పట్టించుకోలేదు. నవ్వుకున్నారు.
