Previous Page Next Page 
మమత పేజి 31

రెండు సార్లు ఫోను మోగటం ఆగటం అయింది. ఇంతవరకు నిన్ను ప్రేమించి గౌరవించాను. నీ మాట కోసం నా మనసు చంపుకున్నా- ఇక నీ యిష్టం నీది, నా యిష్టం నాది, నేనేం చేసినా ఎవరూ నోరెత్తడానికి వీల్లేదు. ఎందుకిలా చేసారు- అనడానికి వీల్లేదు- అర్ధమయిందా, ఇష్టమైతే వుండు- లేకపోతే వెళ్ళిపో...ఎక్కడికెళ్ళాలనిపిస్తే అక్కడికి!"
సుమతి గుడ్ల నీళ్ళు కక్కుకుని ఊరుకుంది.   
                                       *    *    *
"ఎక్కడా లేదండీ" అంది ఖంగారుగా జానకి.
"చూడు, ఆ మేడెక్కి కూచునుంటుంది" అన్నాడు మాధవరావు సిగరెట్టు కాలుస్తూ.
జానకి అంతటా వెతికింది. వీధిలో చెన్నమ్మ ముగ్గు పెడుతూ, "ఏంటీ.....వెతుకుతున్నారూ? -కారా, మీది మీ పోర్టికోలో వుంది అయ్యది.... అదిగో!" అంది అందమైన పెద్ద ముగ్గుపెట్టి.
"ఏమిటే- అదేదీ..?"
"ఎవరూ..?"
"బోడీ..!"
"బోడీ- లోపల పడుకునుంటుంది చూడండి!" అంది తాపీగా- ముగ్గు సరిగ్గా కుదరలేదని పాదం బొటన వేలితో తుడిచి మళ్ళా చుక్కలు పెడుతూ, చెన్నమ్మ.
జానకి ఎంత వెతికినా ఎక్కడా కనిపించలేదు బోడి. ఎక్కడికెళ్ళి వుంటుంది?- రాత్రి అన్నం తిని వరండాలో పడుకుంది చలేస్తోందని కప్పుకుని!
"చెన్నమ్మా....ఇది ఎక్కడికి పోయిందే!" అంది జానకి.
చెన్నమ్మ ఖంగారుగా ఆ ముగ్గు డబ్బా సందులో దాచివచ్చి, "ఏంటమ్మా.... ఎక్కడికి పోతుందీ!" అంది మళ్ళీ  అన్ని గదులు, సందు మేడమీద చూస్తూ.
"అవునమ్మా, ఏమీ" అంది ముక్కుమీద చెయ్యేసుకుని.
"ఎవరైనా ఫోను చేసారా?"
"నాకేం తెలుసమ్మా, మీరు, అయ్యగారు రాత్రి బయటకెళ్ళలేదని, నేను ఏడయేసరికి వెళ్ళిపోయాగా! అమ్మో... నాకు ఖంగారుగా వుందమ్మా, పిల్ల ఎక్కడికెళ్ళిపోయిందో" అంది అటూ ఇటూ హడావిడిగా తిరుగుతూ.
జానకి ముఖాన చెమటలు తుడుచుకుంటూ....
"ఏం చేద్దామండీ..!" అంది భర్తతో.
"ఎక్కడికి పోతుందీ, ఏ గుడికైనా పోయిందేమో, అదే వస్తుంది" పేపరు చూస్తూ అన్నాడు.
చెన్నమ్మ ఏడుపు లంకించుకుంది, "ఓ అమ్మో, ఆ పిల్ల ఎక్కడికి పోయిందో, ఏ దొంగ సచ్చినోడికి పుట్టిందో ఈ బుద్ది- లోకం తెలియని పిల్ల.... అయ్యో, అయ్యో..."
"ఏడుపు ఆపు- చెన్నమ్మా... ఆరోజు ఆ పాన్ దుకాణం కుర్రాడు...." ఏదో అంది జానకి.
"ఇప్పుడే చూసొచ్చా....లక్షణంగా కిళ్ళీలు కట్టుకుంటున్నాడమ్మా..! అయ్యా, అలా కూర్చుంటే ఎలా? ఎవరికన్నా ఫోను చేయండీ!" అంది చెన్నమ్మ.
చెన్నమ్మ ఏమిటో కన్నీళ్ళొత్తుకుంటూ- "దాని బతుకు ఎవరు పాడు చేసి పారేస్తారో, ఓ నాయనో, ఇదేం బాధరా, ఇంత చిన్న పిల్ల ఇల్లొదిలి పెడితే, మళ్ళీ వస్తుందా - ఈ రౌడీ వెధవలు రానిస్తారా?" పక్కకి తిరిగి ముఖం తుడుచుకుంది.
జానకకీ క్షణంక్షణం భయం పెరిగిపోయింది. ఈ పిల్ల ఎక్కడికెళ్ళి పోయి ఉంటుందీ-ఎలా తిరిగి వస్తుందీ- రాకపోతే రాజీవ్ కి ఏం చెప్తుందీ?
-జానకికి గుండెదడ హెచ్చిపోయింది. లోపలకెళ్ళి పడుకుంది.
"చెన్నమ్మా..!" మాధవరావు నెమ్మదిగా దగ్గరకెళ్ళాడు.
"ఎవరెవరు ఫోను చేస్తున్నారీ మధ్య?" అన్నాడు.
"ఏమో.... నాకేం తెలుసయ్యా! ఒక్కసారి మాత్రం ఆ సతీష్ బాబు ఫోను చేసాడని చెప్పింది.... అంతే!"
   
                                    *    *    *
సుధకి తెలుసు రాజీవ్ ఆదర్శాలు.
రాజీవ్ వ్యక్తిత్వం ఎంత గొప్పదో! ఆరోజునే చెప్పింది- అక్కతో అంత గొడవ చేయటం, అపార్ధాలు పెంచుకోవటం తగదని!
"నా ఇల్లు, నా మొగుడు, నా యిష్టం... ఇవి నీకేమర్ధమవుతాయి?" అంది పొగరుగా సుమతి.  ఆ తర్వాత ఎన్నోసార్లు రాజీవ్ వచ్చాడు. ఎప్పుడు ఏం జరుగుతోందో చెప్పాడు. ఈరోజు మమత వస్తోందని చెప్పాడు. ఎప్పుడెప్పుడు ఆ పిల్లని చూద్దామా.... అని ఎదురు చూస్తోంది సుధ.
సుధ జీవితంలో గొప్ప విషాదముంది. కాలేజీ చదువుకొనే రోజుల్లో అనిల్ ను ప్రేమించింది. ఇద్దరూ పెళ్ళి చేసుకుందామనుకున్నారు. కానీ, అతని పద్దతిలో చాలా మార్పొచ్చేసింది. పైగా... సుధ ధనవంతుల పిల్ల కాదు.
తను డబ్బున్న పిల్లని చేసుకుంటే జీవితమంతా సుఖపడొచ్చు. ఆ ఆలోచన పెరిగి వృక్షమైంది. అమెరికాలో ఉన్న తన క్లాస్ మేట్ రజని గ్రీనుకార్డు పొందింది. అంతే....తనెలా అమెరికా వెడతాడు - అలా కాకపోతే! అనుకుంటూ రజనీని పెళ్ళాడాడు.
ప్రేమ నిజమని నమ్మిన సుధ మనసు విరిగిపోయింది. ఆ తర్వాత ప్రేమమీద, పెళ్ళిమీద గౌరవం పోయింది. పెళ్ళిలేకుండా ఆడది ఎందుకు బతకలేదో చూస్తానంటూ అలాగే మిగిలిపోయింది. ఓ స్కూల్లో టీచరుగా చేస్తూ, సంఘసేవలో మునిగిపోయింది సుధ. జీవితంలో ఆ సేవ గొప్ప తృప్తినిస్తోంది. 'న్యాయానికి, ధర్మానికి, నిలయం సుధమ్మ' అంటూ బీదా, ముసలీ... సుధ చుట్టూ తిరుగుతూ, వారివారి ఆవేదనలు చెప్పుకుని ఊరట చెందుతున్నారు.
రాజీవ్ మనసులో సుదా మెదలగానే దగ్గర్లో ఉన్న ఫోను కనిపించింది. రైలు రావటానికి ఇంకా టైముంది.
"సుధా! నేను..."
"చెప్పండి!"
"ఓ గంటలోపున మీ యింటికొస్తున్నా.... లేకపోతే నువ్వే మా యింటికొచ్చేయి....సరేనా!"
"మీ ఇంటికొస్తా!" సుధ ఫోను పెట్టేసింది. ఆ రైలు స్టేషన్ సందడిలో మాటలు బాగా వినిపించటం లేదు.
రాజీవ్ టైము చూసుకున్నాడు. మనసులో ఉద్వేగం చాలా ఎక్కువైంది. మమత వచ్చేస్తోంది..... తిన్నగా ఇంటికి తీసికెళ్ళిపోతాడు. సుమతి గొంతు చించుకున్నా, ఏడ్చి మొత్తుకున్నా తనేం లక్ష్యపెట్టడు.
ఆనాడే ఆ పని చేయాల్సింది- చేయలేకపోయాడు. ఇప్పుడు సమయమొచ్చిందంతే!
రాజీవ్ ప్లాట్ ఫామ్ మీద నుంచున్నాడు. అటు ఇటు చూస్తూ రాజయ్య గబుక్కున దగ్గరకొచ్చాడు. పక్కన భయంభయంగా చూస్తూ నిలుచున్న మమత.
రాజీవ్ ఆ పిల్లని అప్రయత్నంగా ఎత్తుకున్నాడు. వెంటనే దింపేసాడు. ఆనాడు వరద వచ్చిన రాత్రి గుమ్మంలో వున్న పసిగుడ్డు కాదు!! అలా ఎత్తుకున్నందుకు సిగ్గుపడిపోయింది మమత. తనెక్కడకెడ్తోందో! తన భవిష్యత్తేమిటో ఏమీ తెలియని గమ్యం లేని బతుకులో మరోదారి యిది. తనని ఎవరైనా మీ అమ్మ ఎవరంటే తెలియదు అనాలి. నాన్న ఎవరంటే తెలియదు అనాలి. పేరేదంటే 'బోడి, ఛీ... కాదు, సుబ్బి' అనాలి.
మమత రాజయ్య చెయ్యి పట్టుకు నడుస్తోంది. "మా అక్కని కాదు కానీ, చెన్నమ్మ మహా ధైర్యస్థురాలండీ!" అన్నాడు రాజ్య. ఆ రాజయ్య వారం రోజులనాడొచ్చి రాజీవ్ ని కలిసాడు.
"నీకు ఎలా తెలుసు.... ఈ అంకుల్?" అంది మమత.
"నాకేం తెలుసూ, నువ్వు ఈయన దగ్గరాగితే, ఈయనే కామోను మీ అంకుల్ అనుకున్నా!" నవ్వాడు రాజయ్య.
రాజీవ్ వెంట రాజ్య, మమత నడిచారు. ఆటో ఎక్కాక "ఎక్కడికీ?" అంది.
"ఇంటికి..!" అనగానే రాజీవ్ గొంతు బొంగురుపోయింది.  
                                       *    *    *
పిల్ల దొరకలేదనే బాధే కాకుండా, రాజీవ్ కి ముఖమెలా చూపించాలనే బాధ ఎక్కువైంది జానకికి. తనేదో తప్పు చేస్తున్న భావం మనసుని కృంగదీస్తోంది. ఆరోజు రాజీవ్ వస్తానంటే రావద్దని ఏదో అబద్దం చెప్పేశాడు భర్త. మళ్ళీ ఫోను చేస్తే!!
ఫోను చెయ్యకుండా వచ్చేస్తే.... జానకి తల తిరుగుతున్నట్లయింది.
"చెన్నమ్మా, గుండెల్లో నొప్పిగా వుందే!" అంది.
"ఏంటమ్మా, బెంగపడుతున్నారు పిల్లకోసం, అంతేనా!" అంది తల నిమురుతూ.
"దొరుకుతుందంటావా?" అంది మంచంమీద లేచి కూచుని.
"నేను చెప్తున్నా.... దొరుకుతుంది, మొన్న మీకు చెప్పలేదామ్మా, ఓ కోయవాడొచ్చాడు. ప్రశ్న అడిగా- తప్పకుండా దొరుకుతుందన్నాడమ్మా. నా దగ్గర యాభై రూపాయలు తీసుకున్నాడు. పిల్ల దొరికితే నూటపదహార్లు ఇస్తానన్నాను" అంది ఎంతో ఉత్సాహంగా.
జానకి మంచంమీద నుంచే లేచి కూచుంది.
"చెన్నమ్మా... ఆ కోయవాడు మళ్ళీ ఎప్పుడొస్తానన్నాడు? నిజంగా చెప్పాడా.... పిల్ల దొరుకుతుందని!" అంది.
చెన్నమ్మ ఇంక చాలా ఉత్సాహంగా "కోయవాడు పిల్ల దొరుకుతుందనే కాదమ్మా. ఆ పిల్ల ఎక్కడుంటే అక్కడే అదృష్టం తీసుకొస్తుందిట. ఆ పిల్ల జాతకం గొప్పదటమ్మా. పెద్ద చదువు చదువుతుందట!"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS