Previous Page Next Page 
చదువు పేజి 30

   

   సాంబయ్యగా రానాడు అన్నమాటలు వింటుంటే సుందరానికి ఇంగ్లీషువాళ్ళమీద చాలా అసహ్యం వేసింది. కొన్ని పాడుపనులు చేసేవాళ్ళని చూసి అందరూ అసహ్యపడతారు. ఈ ఇంగ్లీషువాళ్ళు అన్ని పాడుపనులూ చేశారు. వాళ్ళని ఎందుకు గొప్పగా చూడాలీ? సాంబయ్యగారన్నట్టు వాళ్ళ తెల్లతోలుచూసి మనం ఎందుకు గర్వపడాలి?

    ఇంగ్లీషువాళ్ళను గురించి సుందరమూ, నాగేశ్వరరావు  చాలాసార్లు మాట్లాడుకున్నారు.

    "ఈ వెధవ గవర్నమెంటుకింద పని చెయ్యగూడదురా. మా నాన్న చేస్తున్నందుకు నాకు చాలా కోపంగా  ఉంది" అన్నాడు నాగేశ్వార్రావు. ఈ ఆలోచన సుందరానికి కలగలేదు. కాని నాగేశ్వరరావు చెప్పినదాంట్లో నిజం ఉందనిపించింది. ఈ ఇంగ్లీషు ప్రభుత్వంకింద ఎవరూ పనిచెయ్యకుండాఉంటే సరి! అప్పుడు వాళ్ళేం ప్రభుత్వం చేస్తారు?
 
    తనూ, నాగేశ్వర్రావూ కలసి  చేసుకున్న ఈ నిర్ణయంతో  బ్రిటిషు ప్రభుత్వం పతనమైనట్టే సుందరం సంతోషించాడు. ఆ తరువాత వాడు బ్రిటిషు  పరిపాలన గురించి పూర్తిగా మరచిపోయినాడు. కొత్తగా కుంటిదొర ఒకడు స్కూళ్ళ ఇన్ స్పెక్టరుగా వచ్చినప్పుడు కూడా సుందరానికి మళ్ళీ బ్రిటిషు ప్రభుత్వం జ్ఞాపకంరాలేదు. ఈ దొర యుద్దంలో గాయపడ్డవాడే. దాదాపు ఏడడుగుల ఎత్తుండేవాడు. మోటారు సైకిలుమీద స్కూలుకు వచ్చేవాడు. గుర్రంమీద తిరుగుతూ  అడుక్కునే సిపాయల్లే ఈయనకు కాళ్ళు తెగిపోలేదు. రెండు కాళ్ళూ ఉన్నాయి. కాని ఒక కాలు కుంటి. కుంటుతూ నడిచేవాడు.
 
    ఆయన ఇంగ్లీషు  మాట్లాడితే మేష్టర్లు మాట్లాడినట్లు కాకుండా ఇంకోరకంగా ఉండేది. ఆయనకు నాలుగొందలు జీతమని ఎవరో చెప్పారు.
   
                                            ౧౨

    ప్రపంచంలో యుద్దానంతర సంక్షోభం ఎట్లా ఉన్నదీ తెలిసే అవకాశంలేక, తెలిసినా అది తమ జీవితాలను ఏవిధంగా స్పృశించేదీ అర్ధంకాని పీడిత భారత ప్రజలలో  చాలా తరగతులకు అవి మంచి రోజులు .జీవితం చాలారోజులు మంచానపడి తిరిగి కోలుకుంటున్నట్ట్లుగా ఉన్నది. అదివరకులేని కొత్తరకం వస్తువులూ, బట్టలూ వచ్చాయి. జీవితంలో కొత్త చైతన్యం కనిపించింది.

    సీతమ్మగారు, కొంత వ్యాపకం కోసమూ, కొంత డబ్బు ఆదా చూసుకునీ దొడ్డినిండా పాదులు పెట్టింది. తూర్పు వైపు కాళీస్థలంలో ఒకపక్క గుమ్మడిపాదులు  పెట్టింది. ఇంకోపక్క వేసిన పాకమీదకి సొరపాదు ఎక్కించింది. పాక వెనుకవున్న స్థలంలో బెండలూ, వంగలూ పెట్టింది. బావిసమీపంలో ఆకుమళ్ళు పెరుగుతోటకూరా, బచ్చలీ, మెంతీ కొతి మేరా_ వేసింది. గోరుచిక్కుడుకు చిన్న పాదొకటి చేసింది. వీటివేటికీ సబంధం లేకుండా పడమట వేపు పొట్లపాదుపెట్టి అది పైకివచ్చే సమయంలో దానికి పందిరి వేయించింది. "పొట్లకు పొరుగు గిట్ట" దని తల్లి చెప్పగా సుందరం తెలుసుకున్నాడు.
 
    ఇది అచ్చగా సీతమ్మగారికి మాత్రమే తట్టిన ఆలోచన  కాదు. దాదాపు ప్రతి ఇంటోనూ పాదులు వెలిశాయి. అదివరకున్న ఇళ్ళలో విస్తరించాయి. జీవితవ్యయం పెరుగుతున్నది. డబ్బులిచ్చి కూరలు కొనటమంటే ఎరగనివాళ్ళింకా జీవించి వున్నారు. రెండణాలకు బుట్టెడువచ్చే బెండకాయలు వీశె రెండణాలయాయి!

    మళ్ళు కట్టటం, పాదులు పెట్టటం, మొక్కలు పెంచటం, అవి కాయటం సుందరానికి చాలా ఉల్లాసంగా ఉండేది. బావి దగ్గర తల్లి నీళ్ళు తోడిపోస్తుంటే సుందరం చెంబుతో మళ్ళకు శ్రద్దగా పొద్దునా, సాయంత్రం నీళ్ళుపోసేవాడు. కాని, ఎందుచేతో, దొడ్లోకాసిన కాయలు ఇళ్లకు అమ్మవచ్చే కాయలంత బాగుండేవికావు. బోలెడంత ఆవరణ ఆక్రమించిన గుమ్మడిపాదు  పూలు పూసిందేగాని ఒక్క కాయకూడా వెయ్యలేదు. వంగలు ఒక కాపు బాగానేకాసి రెండోకాపుకు గిడసబారాయి. బెండలు బాగానే కాశాయి. అన్నిటికన్నా విరగకాచినవి గోరుచిక్కుళ్ళు.

    "వెధవ గోరుచిక్కుడు. పైత్యమూ, వేడీనూ. గుత్తులు గుత్తులుగా ఎట్లా కాచిందో, తెలీక వేశాను" అన్నది సీతమ్మగారు. వాటినావిడ ఎంతమందికి పందేరంచేసిందో లెక్కలేదు.

    ఈ పాదులు పెట్టుటలోగల చిక్కు సీతమ్మగారు గ్రహించింది. ఎంత తక్కువగా పాదులుపెట్టినా, కాచినవన్నీ తినటం అసంభవం దొడ్లోకాచిన పొట్లకాయలూ, బెండకాయలూ, వంకాయలూ, సొరకాయలూ, కాయలేదుగాని కాస్తే గుమ్మడి కాయలూ, గోరుచిక్కుడు కాయలూ కలిపి తనూ, పిల్లవాడూ, పిల్లా ఎట్లా తినేది? వాటిని ఎవరికన్నా ఇచ్చెయ్యాల్సిందే. లేదా అమ్మాలి. కాని కూరలు అమ్ముకోవడం అసహ్యంకాదూ? ఇంతా కష్టపడి పండించినవేమో పందేరం చెయ్యాలి. వీటికాపు   ఏ నాలుగునెల్లకో అయిపోతే మిగిలిన ఏడాదల్లా కూరలు కొనుక్కోవలసిందే. దొడ్లో కూరలు పండించటం ఒకందుకు మంచిదయింది. రోజూ ఇంటిల్లిపాదీ ఎక్కితొక్కినట్టు కూరలు తింటున్నారు. చిల్లర జబ్బులు తగ్గాయి.

    కూరలు వాళ్ళాకూ వీళ్ళాకూ ఇవ్వటంకూడా సీతమ్మగారికి సమస్యగా ఏర్పడింది. బాగా ఎరిగున్నవాళ్ళకూ. బంధువులకూ, ఇవ్వొచ్చు. కాని వాళ్ళూ కూరలు పండించేవాళ్ళే.

    ఎప్పుడూ ఇంతే. ఉన్నవాళ్ళకే పెట్టటం. పనివాళ్ళకిద్డామంటే వాళ్ళు తినరు. అమ్ముకుంటారు. మనం అమ్ముకోవడానికి భయపడి చస్తూ వాళ్ళకిచ్చి అమ్ముకోనివ్వటం ఎట్లా? పైగా పనివాళ్ళచేత అమ్మిస్తున్నారంటారు. ఆ జానికమ్మ అట్లాగే అమ్మిస్తుంది కూడానూ" అన్నది సీతమ్మ.

    "అమ్మా, మా క్లాసులో చాలమంది బీదపిల్లలున్నారు. కూరలువాళ్ళకిస్తే ఏం?" అన్నాడు సుందరం.

    "కొంతమందికిచ్చి మిగిలినవాళ్ళ కివ్వకపోతే బాగుంటుందిట్రా? అందరికీ ఇస్తే ఇంకా మనకేం ఉంటై?" అన్నది తల్లి.

    తల్లి చెప్పినమాట సుందరానికి సబబుగా కనబడింది.

   
                                        *    *    *    *
   
    మురికి గుంటలాగావున్న జీవితం జలియన్ వాలాబాగ్ కాల్పులతోనూ,  డయ్యర్ పేరుతోనూ ఒక్కసారిగా కదలబారిపోయింది. డయ్యర్ రాక్షసుడు. భారతీయులను కుక్కలకన్న అన్యాయంగా చూశాడు. యుద్ధం కాగానే బ్రిటీషు వాళ్ళు ఇస్తామన్న స్వరాజ్యం ఎటువంటిదో వాడు చూపాడు. జలియన్ వాలాబాగ్ లో సభచేసే ప్రజని, పారిపోకుండా చుట్టూముట్టి కాల్చటమూ, మనుష్యుల్ని పొట్టలమీద దేకించి అవాచ్యాలకు గురి చెయ్యటమూ వింటుంటే ప్రతివాడికీ మండిపోయింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS