"అవునూ! మొదటి కాల్ అని తెలీదుగాని.... మొత్తానికి వచ్చింది"
"అప్పుడు టైమెంతయింది శరత్ గారూ?"
"సరిగ్గా గుర్తులేదు.....పదకొండున్నర కావచ్చు."
"మీ ఫోన్ నంబర్ లు ఎంతమందికి తెల్సి ఉంటాయంటారు?"
"నా విజిటింగ్ కార్డులమీద ఉన్నాయి. అవి ఎందరికో ఇచ్చాను. నంబర్లు తెల్సిన వాళ్ళు కూడా బాగే! అబ్నాక్షియస్ కాల్స్ పంపేవారికి అవన్నీ అవసరమంటారా? టెలిఫోన్ డిక్షనరీ వుంటే చాలదూ..." సూటిగా చూస్తూ అన్నాడు.
ఎస్.ఐ. ఏమీ మాట్లాడటం లేదు.
"అలా కాదు మీ ఫోన్ నెంబర్ లు తెల్సిన మీ సర్కిల్ లో అలాంటి గొంతు ఎప్పుడైనా విన్నారా?"
శరత్ తెలీదన్నాడు. ఇంకా ప్రశ్నల పరంపరలు డిటెక్టివ్ గా....ఏ జవాబులోనయినా తీగె దొరక్కపోతుందా అని ప్రశ్నలు....ప్రశ్నలు_అన్నింటికీ ఓపిగ్గా జవాబులు చెప్పిన శరత్ నుద్దేశించి_
"థాంక్యూ సర్! మొట్టమొదటి కాల్ మీరుండగా వచ్చిందని తెలిసి మీ నుండి ఏమయినా వివరాలతో ఇన్వెస్టిగేషన్ మొదలెడదామని! చాలా చిత్రమైన కేస్ ఇది! బెదిరింపులే తప్ప...ప్రాక్టికల్ గా ఏమీ చేయటంలేదు. కానీ మా వివరాల కోసం ఆధారాలు శోధించాలి. తప్పదుగదా! అడ్డదారుల్లోనే గుమ్మడి తీగలు దొరుకుతాయి ఈ వృత్తిలో.
క్షున్నంగా శోధించటం మా బాధ్యత. అందుకే మిమ్మల్ని కూడా ప్రశ్నించాల్సి వచ్చింది. థాంక్యూ సార్" అన్నాడు అమితేష్.
"విష్ యూ ఆల్ ది బెస్ట్" చేయి కలిపాడు శరత్. ఎస్.ఐ. కూడా విష్ చేశాడు. వేణుకు కరస్పర్శ చేసినపుడు....మళ్ళీ అలాగే....అదే ప్రవర్తన.
వాళ్ళు వెళ్ళిపోయాక, సుగాత్రి వైపు తిరిగి "నా నిర్ణయం నీకు చెప్పటానికి ఇంకా ముహూర్తం రానట్టుంది. మూడంతా పాడయిపోయింది. ఇప్పుడేం చెప్పలేనుగాని, సేదతీర్చుదువు గాని పద" అని ఆమె భుజాల మీద చేతులేసి తీసుకెళ్ళాడు.
* * * * *
"గుడ్ మార్నింగ్ అంకుల్" లేస్తూనే చెప్పాడు బాబీ.
"వెరీ గుడ్ మార్నింగ్ బాబీ....రాత్రి బాగా నిద్రపట్టిందా?" డైలీ పేపర్ చదువుతూ అన్నాడు నిఖిల్.
"అవునంకుల్! నిద్ర బాగానే పట్టింది. కానీ ఓ అర్దరాత్రి తెలివొచ్చింది. ఇదిగో ప్రక్కనే ఉంది కదా ఫోన్! ఆ రాత్రిలో డాడీకి ఫోన్ చేసి మాట్లాడాను. డాడీ తొందరగానే రిసీవ్ చేసుకున్నారు. ఇంకా డాడీ అంతరాత్రి వరకూ నిద్రపోలేదేమో?"
"ఏదో నావెల్ రాస్తూ ఉండివుంటారు. లేకపోతే ఏదయినా కథ ప్లాన్ చేయటానికి ఆలోచిస్తూ ఉంటాడు. రైటర్ కదా"
ఇంతలో నిర్లిప్త వచ్చింది.
"ఆంటీ! ఒక క్వశ్చన్! సుఖం వస్తే మొహం కడుగతీరని సోమరిపోతులకు ప్రొద్దున్నే కావల్సిందేమిటి?" అన్నాడు ఫోజు పెట్టి.
నిర్లిప్త కాసేపు ఆలోచించి "బెడ్ కాఫీ..." అంది ఆన్సర్ తెలుసుకున్నందుకు ఆనందంగా.
"కరక్ట్ ఆంటీ! నీ మెదడు పాదరసం. బెడ్ కాఫీ తెచ్చివ్వవూ.... ప్లీజ్" అన్నాడు.
సమయస్పూర్తిగా బెడ్ కాఫీ సంపాదిస్తున్న వాడి చతురతకు నిఖిల్ కు నవ్వొచ్చింది.
"అంకుల్! పేపర్ చదువుతున్నావా? నీకో ప్రశ్న..."
"ఒరేయ్! నీ జీకేలూ, ఐక్యూలూ నా మీద ప్రయోగించకురా....అయినా అదేమిటో అడుగు."
"మన దేశంలో అత్యధిక సర్క్యులేషన్ గల వారపత్రిక?"
"ఆ మాత్రం తెలీదా...? మంగళం అనే కేరళ వారపత్రిక. దాని సర్క్యులేషన్ వారానికి ఆరు లక్షలు దాటుతుంది."
"సో! యూ ఆర్ వెరీ ఇంటలిజెంట్. సరే ఆంటీ బెడ్ కాఫీ తెచ్చేలోగా ఇడ్లీల మీద ఒక జోక్ చెప్పనా?" అన్నాడు బాబీ.
ఇక లాభం లేదని పేపర్ ప్రక్కన పెట్టి, "చెప్పరా" అన్నాడు నిఖిల్.
"ఇడ్లీల మీద జోక్ చెప్పి ఇడ్లీలు కూడా లాగిద్దామనా?" బెడ్ కాఫీ తెస్తూ నవ్వుతూ అంది నిర్లిప్త.
ఇడ్లీలు తప్పదని తెలుపుతూ సూచన యిచ్చినట్టున్నాడు బాబీ.
"సరే చెప్పు" అంది నిర్లిప్త కూడా.
"ఒక హోటల్ లో ఇడ్లీ తింటున్న వాడి సాంబారులో ఈగ వచ్చి పడింది. తినేవాడు సర్వర్ ని పిలిచి గయ్ మన్నాడు. సర్వర్ 'రా...అమ్మరా- బయటికి వచ్చెయ్' అన్నాడు లాలనగా. ఈగేమో కోపంగా 'ఎన్.టి.ఆర్. ఇడ్లీ తినే మొహం వీడూనూ. ఇలాంటి వాడు నీకేమైనా టిప్పు యిస్తాడా ఏమైనా? వెళ్ళుళ్ళు' అంది మరింత కోపంగా ఈతకొడుతూ..."
వాళ్ళిద్దరికీ నవ్వాగలేదు.
ఇంతలో ఫోన్ మ్రోగింది. నిఖిల్ ఎత్తి.... "బాబీ! మీ డాడీ చెపుతున్నాడు. తొందరగా తయారుచేసి స్కూల్ లో దించమని."
బాబీ రెడీ కావటానికి బాత్రూమ్ లోకి చొరబడ్డాడు.
* * * *
"హైదరాబాద్ సే బెంగుళూర్ జానేకా బోయింగ్ 707 వాయుదూత్ తోడీ సమయ్ మే రవాణా హోనేకే లియే రన్ వే ఫర్ తయ్యార్ హై..."
అనౌన్సర్ కంఠం వినిపించింది అదే ఇంగ్లీష్ లో తర్జుమా చేసి చెప్పింది.
ఆ తర్వాత కొద్ది సేపటికి రన్ వే మీద నత్తనడక నడిచి....వేగం పెరిగి గాల్లోకి ఎగిరింది బోయింగ్ 707.
బెల్ట్ తీసి పెట్టుకుంటున్న శరత్ కు "మీ జేబులో వుంది ఇంకుపెన్నా? అలా అయితే విమానం ఎగిరే కొద్దీ పీడనం తగ్గి ఇంకు బయటికొస్తుంది" అన్న మాటలు విని ప్రక్కకు చూశాడు. ప్రక్క సీట్లోనే డిటెక్టివ్ అమితేష్.
"నో నో...బాల్ పెన్నే....బెంగుళూరేనా?" అడిగాడు శరత్.
