Previous Page Next Page 
నవ్వితేనవ్ రత్నాలు-2 పేజి 30

    "నువ్విహ మాట్లాడానంటే పీకపిసుకుతాం..."అందరూ కోపంగా అన్నారు అతని పీకవైపు చేతులు చాపుతూ.
    రాముడు నోర్మూ సేస్కున్నాడు.
    "ఆ... నువ్వు చెప్పవోయ్ అప్పారావ్?... తర్వాతేమైంది?" అన్నాడు సుబ్బారావు.
    "ఏముందీ?... రెస్టారెంట్లో వాళ్లిద్దరూ కోళ్ళూ కుక్కలూ మింగి ఉంటారు... అంతే"
    "ఇంతకీ ఆ అబ్బాయి ఎవరయి ఉంటాడు?"
    "ఎవరేంటి... లవర్ అయి ఉంటాడు..."అన్నాడు అప్పారావు.
    "ఎన్నోలవరో?" వీరాంజనేయులు నిట్టూరుస్తూ అన్నాడు.
    అందరూ ఘొల్లుమని నవ్వారు.
    అదే సమయంలో సుశీల డిపార్ట్మెంట్లోకి అడుగుపెట్టింది.
    "హాల్లో... గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి..."అందామె అటెండెన్సులో సంతకం పెడ్తూ.
    "గుడ్ మార్నింగ్ మేడమ్..."అన్నారు అందరూ మెలికలు తిరిగిపోతూ.
    సుశీల వెళ్లి తన సీట్లో కూర్చుంది.
    అప్పారావు అందరికీ కన్నుకొట్టి చూడండి ఇప్పుడేం చేస్తావో అన్నట్టుగా సైగచేసి మెల్లగా సుశీల దగ్గరికి వెళ్లాడు.
    "ఏమండీ..."మెల్లగా పిలిచాడు.
    సుశీల తలెత్తి చూసింది.
    "పోయిన వారం మీ చిన్న చెల్లెలికి జ్వరంగా ఉందని చెప్పారుగా... ఇప్పుడాపాపకి ఎలా ఉందండీ?" అని అడిగాడు.
    "జ్వరం మొన్ననే తగ్గిపోయిందండీ... కాస్త నీరసంగా ఉంది..."
    "కాస్త పళ్లరసాలు పడ్తూండండి... నీరసం తగ్గిపోతుంది..."
    సుశీల నవ్వింది.
    "డాక్టరులాగా సలహాలు బాగానే ఇస్తున్నారే!!"
    "హిహిహి..."మెలితిరిగాడు అప్పారావు.
    "ఇంకేంటి చెప్పండి?..."
    "అబ్బే... ఊర్కే... హేం లేదు...ఆ విషయం కనుక్కుందామనే... అదే మీ చెల్లి విషయం... ఇప్పుడు బాగానే ఉందిగా...హి...వస్తానండీ...హిహి..." అని అప్పారావు గుంపు దగ్గరకు వెళ్లాడు.
    అందరూ ఉత్సాహంగా అతన్ని చుట్టుముట్టారు.
    "ఏం మాట్లాడావ్ గురూ... చెప్పవా గురూ... చెప్పవా?..."
    అప్పారావు పీక పిసికేస్తూ ఉత్సాహంగా అడిగాడు వీరాంజనేయులు.
    "ఏవండి బాగున్నారా అని అడిగాను. బాగున్నాను అంది. మీ కళ్లు బాగుంటాయండీ అన్నాను.థాంక్సండీ అంటూనవ్వింది.మీ నవ్వు మరీ బాగుంటుందండీ అన్నాను.అలాగా అంటూ నవ్వింది.అప్పుడప్పుడూ వచ్చి మాట్లాడుతూండండి అంది..." అన్నాడు అప్పారావు కోతలు కోసేస్తూ.
    "అబ్బో... భలేగా మాట్లాడావే!!..."మెచ్చుకున్నారు అందరూ.
    "మాట్లాడ్డం ఏం కర్మ!నేను తల్చుకుంటే ఇంకా ఏమైనా చెయ్యగల్ను... సినిమాలకీ పార్కులకీ తీస్కెళ్ళగలను... ఆ హోటల్ రూమో బుక్ చేసి... హి... హిహి..."సిగ్గుపడ్డాడు అప్పారావు.
    "మరింకా ఆలస్యం దేనికి?" ఉత్సాహంగా అన్నారు అందరూ.
    "ఆ నాకిలాంటి విషయాల్లో పెద్దగా ఇంట్రెస్టు లేదు... మనకోసం పడి చచ్చేవాళ్లు అలా ఉంటూనే ఉంటారు.అందరితో వెళ్లిపోతే ఎలా?..."అన్నాడు అప్పారావు ఫోజులుకొడ్తూ.
    "హి... హిహి..."అన్నాడు ఆనందరావు మెలికలు తిరిగిపోతూ.
    "నీకేమైంది?" అందరూ ఆత్రంగా అడిగారు.
    "బి-డిపార్టుమెంట్లో అరవిందలేదూ?...హి!"
    "ఏంటో త్వరగా చెప్పి తగలడు"కుతూహలం పట్టలేక చుట్టూ చేరి అతని చొక్కాజేబుని సర్రున లాగేశారు.
    "ఆ అమ్మాయి నేనంటే పడిచస్తుంది. ఓట్రెండుసార్లు నా స్కూటర్ వెనకాల లిప్టుకూడా ఇచ్చాను..."మురిసిపోతూ అన్నాడు ఆనందరావు.
    "ఆ... నీ మొహంలే... ఆ అమ్మాయికి నేనుకూడా లిప్టు ఇచ్చాను... మరిహపోతే సి-డిపొర్టుమెంట్లో వనజ ఉందే... ఆ అమ్మాయి అయితే వంద రూపాయలిస్తే వచ్చేస్తుంది... ఇంకా..."
    అలా ఆఫీసులోని అందరు ఆడవాళ్ల గురించి తృప్తిదీరా ఎప్పట్లా సాయంత్రం దాకా మాట్లాడుకున్నారు.
    అఫీసవగానే సాయంత్రం విజిలేస్కుంటూ ఇంటికెళ్ళిన అప్పారావుకి ఎర్రగా ఉబ్బిపోయి ఉన్న కళ్లతో భార్య రమణి కనిపించింది అప్పారావుకి.
    "ఏంటి బాగా ఏడ్చినట్టున్నావ్?.... మీ ఆఫీసులో అఫీసరేమైన చివాట్లు పెట్టాడా?... నీకు రావల్సిన ప్రమోషన్ వేరే ఎవరికైనా ఇచ్చారా?" అడిగాడు.
    "అవేం కావు"అంది వెక్కుతూ రమణి.
    "మరి?"
    "మా ఆఫీసులో కొందరు పనికిమాలిన వెధవలు నా గురించి అడ్డమైన వాగుడు వాగుతున్నారని తెలిసింది. నాది చాలా లూజ్ క్యారక్టరటా.అందరు అబ్బాయిలతో తిరుగుతానట!!.. వందరూపాయలిస్తే చాలు పక్కన వెళ్ళిపోతానట... చెప్పుకుపోతోంది.
    అప్పారావు తెల్లమొహం వేసాడు.
                                                  *    *   *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS