గోపి వాళ్ళవంక విసుగ్గా చూశాడు.
"ఎంత ఫ్రీగా రిక్షా కడుతున్నాననతెలిస్తే మాత్రం ఇంత ఇదిగా పరుగులు పెడ్తూ రావాలా? ఒకరి తర్వాత ఒకరికి కడ్తాను అడ్డు తప్పుకోండి" అన్నాడు.
"బాబూ! గోపీబాబూ!" జనంలోంచి ఓ ఆడకూతురు ఘొల్లుమంది.
"ఇదెక్కడి గోలమ్మా! నీక్కూడా రిక్షా ఫ్రీగా కడ్తానులే. ముందు ఈ తాతని అతని కొడుకు దగ్గర దించిరానీ."
"నువ్వు రిక్షాని త్వరగా పోనివ్వు బాబూ. లేకపోతే ఈ దిక్కుమాలిన సంత నన్ను రిక్షాలోంచి తోసేసి వాళ్లు ఎక్కేసేలా వున్నారు" అన్నాడు జనాన్ని కంగారుగా చూస్తూ తాత.
"ఊ....ఊ - మీరు అడ్డుతప్పుకోండి" అన్నాడు గోపి.
"అదికాదు గోపీబాబు, నువ్వు మమ్మల్ని అపార్ధం చేస్కున్నావ్ బాబూ. మేము నీరిక్షా ఎక్కడానికి రాలేదు బాబూ."
"మరి?" వాళ్ళవంక అయోమయంగా చూశాడు గోపి.
"చాలాపెద్ద ఘోరం జరిగిపోయింది బాబూ. చాలాపెద్ద ఘోరం జరిగిపోయింది!" ఘొల్లుమన్నాడు జనంలోంచి ఒకడు.
"రాధా!"
దిక్కులు పిక్కటిల్లేలా అరిచాడు గోపి. "హెంత పనిజరిగింది రాధా, హెంత పని జరిగింది?" జుట్టు పీక్కున్నాడు గోపి.
జనం తెల్లమొహాలు వేస్కుని గోపివంక చూశారు.
"అదేంటి బాబూ? రాధగోరికి ఏటైంది బాబూ?" ఒకడు గోపిని అడిగాడు.
"ఏమో నాకేం తెల్సూ? మీరంతా ఘోరం జరిగిపోయిందని అంటే నేను లేకుండా చూసి ఆ రాయుడు నా రాధని రేప్ చేశాడేమోనని అట్టా అరిచా!" వెర్రిమొహం వేస్కుని అన్నాడు గోపి.
"బాగుంది బాబూ, శానాబాగుంది. ఘోరాలు మీ ఒక్కింట్లోనే జరుగుతాయా బాబూ? ఘోరాలు మాక్కూడా జరుగుతాయి బాబూ..... మాక్కూడా జరుగుతాయ్" ఆవేశంగా అన్నాడు మరొకడు.
"ఇంతకీ అసలేం జరిగింది?"
తాము పొలంపనులు చేస్కుంటుంటే రాయుడు రౌడీలువచ్చి తమని పని చెయ్యనివ్వలేదనీ, ఇంక పొలంపనులకు రానవసరంలేదని తమని పంపించేశారనీ గోపికి చెప్పారు వాళ్ళు.
"ఆ.... రాయుడికి అంత పొగరెక్కిందా!"
"మిమ్మల్ని పొలంలోకి ఎలా అడుగుపెట్టనివ్వడో నేనూచూస్తాను." ఆవేశంగా అని రిక్షా దిగాడు గోపి. "పదండి, మనం పొలం దగ్గరికి వెళ్దాం"
"బాబూ! మరి నన్ను మా అబ్బాయ్ దగ్గరికి తీస్కెళ్తానని అన్నావ్?" రిక్షాలోని తాత గోలపెట్టాడు.
"ఇప్పుడు కుదర్దులే తాతా.... నీకు ఓపికుంటే నువ్వే యీ రిక్షా తొక్కుకుంటూ మీ అబ్బాయ్ దగ్గరకి ఫో - లేకపోతే వేరే రిక్షాలో ఫో. నేనిప్పుడు పొలందగ్గరికి వెళ్ళాలి. పదండిరా" అన్నాడు వేగంగా అడుగులు ముందుకువేస్తూ.
అందరూ గోపీని అనుసరించారు.
25
గోపీ వెనకాల అందరూ పొలోమని పొలం దగ్గరికి వెళ్ళారు.
రాయుడు రౌడీలు ఇంకా అక్కడే వున్నారు.
వాళ్ళు గోపీని చూడగానే కర్రలు పొజీషనులో పట్టుకుని నిలబడ్డారు.
"ఓహో... అయితే ఈడిని వెంటెట్టుకుని వచ్చారా? మేం అనుకుంటూనే వున్నాంలే" అంటూ వెకిలిగా నవ్వారు రౌడీలు.
"ఏంటా వెకిలినవ్వులు? ఏం? ఇదివరకు నాతో తిన్న టెంకిజల్లలు మర్చి పోయారా? ఆ?..." కోపంగా చూస్తూ అన్నాడు గోపి.
రౌడీలు బుర్రకాయ్ లు ఇబ్బందిగా తడుముకున్నారు.
"అసలు వీళ్ళు పొలంలో పనిచెయ్యనీయకుండా ఎందుకు ఆపారు?" అడిగాడు గోపి.
"రాయుడుగారు వీళ్ళని పొలంలోకి అడుగు పెట్టనివ్వొద్దని చెప్పారు" సమాధానం చెప్పాడు ఒక రౌడీ.
"ఎందుకు అలా చెప్పాడు?"
"వీళ్ళంతా నీ మనుషులు కాబట్టి"
వెంటనే గోపి మొహంలో ఫీలింగ్స్ టకటకా మారిపోయాయ్.
మొహం దీనంగాపెట్టి, కళ్ళలో నీళ్ళు నింపుకుని, ముక్కు పొంగించి ఇలా అన్నాడు.
"కేవలం నా ఒక్కడి గురించి ఇంతమంది పేదవాళ్ళ కడుపులుకొడ్తారా? ఆ రాయుడుకి నామీద కోపంవుంటే పగతీర్చుకోమని చెప్పండి. కానీ ఈ పేదవాళ్ళ కడుపులు కొట్టొదని మీ రాయుడికి చెప్పండి. ఒకపూట తిండివుంటే మరోపూట తిండివుండని ఈ ఎండుడొక్కల్ని చూడండి" గద్గదస్వరంతో ప్రక్కనున్న కూలివాడి పొట్టమీద చేయ్యేస్తూ అన్నాడు గోపి.
దెబ్బకు రౌడీలు పొట్టలుపట్టుకుని ఘొల్లున నవ్వారు. వాళ్ళతోబాటు గోపి వెంటవున్న కూలీలుకూడా పకపకానవ్వారు.
వాళ్ల నవ్వుల్ని చూసి గోపి కంగారు పడిపోయాడు.
"ఏంట్రా నాయనా... వీళ్ళంతా ఇలా నవ్వుతున్నారు...?" అనుకుంటూ తెల్లబోయాడు గోపి.
"బాబూ! గోపిబాబూ, ఓసారి మీరు ఎండుడొక్క అని ఎవరి పొట్టమీద చెయ్యేసారో చూడండి" నవ్వాపుకుంటూ అన్నాడు ఒకకూలి. గోపి ఒకసారి తన చేతివంక చూస్కుని కరెంట్ షాక్ తగిలినట్టు చేతిని వెనక్కి తీస్కున్నాడు.
ఎండుడొక్క అని తమ చెయ్యేసింది ఓ పెద్ద బొజ్జమీద.
"ఒరేయ్-నువ్వు నా ప్రక్కన ఎందుకురా నిల్చున్నావ్?.... వెళ్ళు" అంటూ వాడిని దూరంగా తోసేసి ఒక బక్కకూలీని బరబరా ముందుకు లాక్కొచ్చి. "చూడండి.... ఈ ఎండుడొక్క చూడండి" అంటూ వాడి చొక్కా ఎత్తి రౌడీలక చూపించాడు గోపి.
"ఏమో... మాకదంతా తెలీదు. వీడి డొక్కా మాకు నచ్చలేదు. ఇందాక ఎండుడొక్కంటూ చూపించావే, వాడిడొక్కెక్కే మాకు నచ్చింది" అంటూ ఒకరౌడీ ఘొల్లుమని నవ్వాడు. మిగతా రౌడీలుకూడా ఘొల్లుమని నవ్వారు.
"ఒరేయ్ వీళ్ళకి వేళాకోళంగా వుంది. మీరంతా పొలంలోకి వెళ్ళి దున్నుకోండి. వీళ్ళు మీకు ఎలా అడ్డుపడతారో చూస్తాను. ఇది అసలు రాయుడి పొలం కానేకాదు!" ఆవేశంగా అన్నాడు గోపి.
"అదేటి బాబూ అలా అంటారు....? ఇది రాయుడిగారి పొలమేకదండీ...?" వెర్రిమొహం వేస్కుని అడిగాడు ఒక కూలివాడు.
"ఓరి సన్నాసెదవల్లారా? మీరింత అమాయకులు కాబట్టే ఇలా వున్నారు. ఇది రాయుడి పొలంకాదురా, ఇది మీ పొలమే. దున్నేవాడిదే భూమి. ఈరోజునుండి పొలాన్ని మిఎరే దున్నుకోండి. పండిన పంటమొత్తం మీరే తీస్కోండి" అన్నాడు.
"హి..." అందరూ సంతోషంతో కేకలు వేస్తూ గెంతులేశారు.
"ఊ.... ఇంక పన్లోకి దిగండి" హుషారుగా అన్నాడు గోపి.
అందరూ పొలంవైపు ఒక్క అడుగు వేశారోలేదో అరడజనుమంది రౌడీలు "ఒరేయ్! ఆగండ్రా. ఇంకొక్క అడుగు ముందుకేసారో మీ పుచ్చెలు పగిలి పోతాయ్!" అంటూ కోరస్ గా హుంకరించారు
కూలీలంతా ఠకీమని ఆగిపోయి గోపీవంక దీనంగా చూశారు.
"మీరు ముందుకెళ్ళండెహె... వీళ్ళు మిమ్మల్ని ఎలా ఆపుతారో నేనూ చూస్తాను" అన్నాడు గోపి ఆవేశంగా.
అంతే. కూలీలంతా పొలోమని పొలంలోకి దూకారు. రౌడీలు వాళ్ళని ఆటకాయించేంతలో గోపి ఒక రౌడీదగ్గర కర్రలాక్కుని ఆ కర్రని గిరగిరా తిప్పుతూ రౌడీలందర్నీచితకబాది కాలువలో ముంచాడు.
వాళ్ళంతా కాలువలోంచి బయటికొచ్చి గళ్ళలుంగీలు పైకెత్తుకొని "హరహరా" అంటూ పరుగులు తీశారు.
"హెయ్ య్ య్ "
కూలీలంతా సంతోషంతో గంతులువేశారు.
"హయ్ య్..."
ఇంకా పెద్ద కేక.
కూలీ జనమంతా గెంతులాపి బిత్తరపోయి చూశారు. అది గోపి పెట్టిన కేక.గోపి.
ఎప్పుడందుకున్నాడో ఏమో! గోపి చేతిలో నాగలి వుంది.
"ఎహ్హెయ్. డుర్ ర్ ర్. ఎహె!" చర్నాకోలాతో ఎడ్ల వీపుమీద ఛెళ్లుమని ఒక్కటందుకున్నాడు గోపి.
అవి ఒక్కసారిగా పరుగందుకున్నాయ్. గోపి నేలదున్నుతూ పాటందుకున్నాడు.
"ఓ బక్క రైతన్నా....
నీ డొక్క మాడదురన్నా.....
ఈ నేల నీదన్నా...
ఈ పంట నీదిర కన్నా..."
వాళ్ళంతాకూడా నాగలిపట్టి దున్నుతూ విత్తనాలు చల్లుతూ గోపివెంట పాడడం మొదలుపెట్టారు.
* * *
