Previous Page Next Page 
అతని లక్ష్యం పేజి 31

 

                                         13
    పొద్దున్న పూట తడి తలని అరబెట్టుకుంటూ రాధ వరండా ల్లో తిరుగుతుంటే దేవకన్య లా వుండే ఆ సౌందర్యాన్ని చూడకుండా వుండలేక పోయేవాడు రఘు. అందుకు ఆ వుండే ఒకట్రెండు శలవు రోజుల్లో కూడా హాస్పిటల్ కే వెళ్లి పోతుండె వాడు తను.
    రాత్రి భోజనానంతరం హల్లో కూర్చుని మౌనంగా ఏ పుస్తకమో చూసుకుంటుండే సమయాల్లో, ఏ విధమైన మాటల్తో రఘు మనసు నాకర్షిద్దామా?....అని రాధ ప్రయత్నిస్తుంటే , ఏవిధంగా ఈ చికకులునుండీ విముక్తుడ్నై నా లక్ష్యం నిలబెట్టుకో గల్గుతానా అన్న ధోరణి లో క్లుప్తంగా తప్పించు కుంటుండేవాడు రఘు.
    'మనం ఇక్కడి కొచ్చినప్పటి నుంచీ ఎంతసేపూ అందరూ పిలుస్తుండే పార్టీలకు వెళ్ళడం తప్ప. ఇంతవరకు మనం ఎవర్నీ పిలవనే లేదు. ఇలా వూర్కోవడం 'సిల్లీ' గా వుంటుందేమో' అంది అలాంటి సమయం లోనే ఒకసారి రాధ.    
    'నిజమే కావచ్చు. అయితే మన కటువంటి సందర్బాలేవీ రాలేదే మరి?'
    'దానికేం వుంది? ఏదన్నా కారణం కల్పించడమే?'
    'అదెలాగా' అన్నట్టుగా రాధ వేపు చూశాడు రఘు.
    'ఏదో , మీ పుట్టిన రోజంటే తీరిపోతుంది.' నవ్వుతూ అంది రాధ.    
    'అబ్బే, ఏ స్వాతంత్ర్యం దినం నాడో ఏర్పాటు చేస్తే బాగుందని నా అభిప్రాయం. అయినా దాని క్కావలసిన ప్రయ---'
    'దానికేం వుంది. వో మంచి హోటల్లో ఏర్పాటు చేసేశారంటే పూచీ ఉండదు.
    'ఇది వో ఐడియాయే?' అలాగే చేద్దాం...' పొడిగా అన్నాడు.
    'ఇదేవిటీ/ ఈ అరుమసాలు గా ప్రతి రోజూ పరిశీలిస్తున్నా దాని భావం నా కర్ధం కావడం లేదూ!.... అయినా ఇంత అందంగా మిగతా అన్ని సామగులన్నీ అమర్చిన వారు దృష్టి పరిహారాని కన్నట్టుగా ఈ పటం ఇక్కడెందుకు తగిలించారో' అంది. రెప్ప వాల్చకుండా ఎదురు గోడ కున్న ఒక చిత్రాన్ని తిలకిస్తూ రాధ.
    'ఒకవేళ అందుకే వుంచారేమో?' ఎందుకో రాధతో కాస్త మాట్లాడుదాం అనిపించిందా రోజు రఘుకి.
    'హా మీరనడం మరీ బాగుంది. దృష్టి పరిహరానికే గనక అయితే ఇంత ముఖ్యమైన స్థానం లో దాన్ని తగిలిస్తారా?' నవ్వింది రాధ.
    'పుర్రెకో బుద్ది జిహ్వ కో రుచి అన్నట్టు---'
    'అయితే మీరింత వరకూ ఈ పటాన్ని పరిశీలించనే లేదన్న మాట?' ఎదురుగా తిరిగే నన్నే లెక్క చెయ్యని నీకీ పాఠం వో లెక్కా, అన్నట్టుంది రాధ అడిగిన ధోరణి.
    'లేదు అయినా మామూలుగా అందరికీ అర్ధం కాలేనటు వంటి నిగూడమైన అందమో? భావమో ఆ చిత్రంలో ఇమిడి వుండొచ్చు' అన్నాడు చేతులోని పుస్తకం అలమారలో పెట్టేసి మరో పుస్తకం తీసి పేజీలు  తిరగేస్తూ అక్కడే నిలబడ్డ రఘు ఆ పటం వేపు పరీశీలనగా చూస్తూ.
    'ఏమో?-- వెయ్యింటి కే ఒక్కరికో ప్రత్యెక అభిరుచులంటూ వున్నా, మొత్తం మీద అందరికీ ఒకేలా తోచే పద్దతిలో 'ఇది అందం' 'ఇది వికృతం' అంటూ వో ప్రపంచ పద్దతంటూ ఉందిగా మరీ?'
    'చెప్పాగా కొందరు బాహ్య సౌందర్యాన్ని ఇష్ట పడితే కొందరు అంతర్ సౌందర్యాన్ని మెచ్చు కుంటారని , అది ఆ చూసే వారి బావాన్ని బట్టి వుంటుంది. ఈ చిత్రలేఖనం లోనూ అంతే.'
    'ఏమో నాకిన్ని విధాలైన అభిప్రాయా బెదాలుంటాయని కూడా తెలియదు. పోనీవ్వండి నా మట్టుకు నాకేవిధమైన అందమూ తోచని ఈ పటం లో మీకేదన్నా పట్టుపడుతుందేమో ప్రయత్నింఛి చూడండి ' అంది. తనూ లేచొచ్చి రఘుతో పాటు ఆ పటాన్ని పరిశీలిస్తూ , రాధ.'
    తనూ, పరిశీలించి చూడసాగిన రఘు , అర్ధంగా చిరునవ్వుతో 'మళ్ళీ మరోసారి ప్రయత్నించి చూడండి.' అన్నాడు రాధతో,
    'ఒకసారా! ఒక్కర్తేనే ఇక్కడ కూర్చునున్నప్పుడల్లా నాకిదే పని. ఊహు, ' అంది పెదవి విరుస్తూ రాధ. చెప్పడానికి వెనకాడుతున్న రఘు ని 'మీరు చెప్పండి చూద్దాం.' అన్నట్టుగా చూస్తూ.'
    'అదుగో ఆ ఏటి ఒడ్డున నిలుచున్నా యువకుణ్ణి , యువతి నీ, చూశారా? వారిద్దరి ముస్తాబుని బట్టి వారు చదువుకున్న నవనాగరీకులని తెలుస్తుంది. అతని పక్కనున్న ఆ యువతి అందగత్తె లా కూడా వుంది. అయినా ఆ యువకుడు ఆ వరి చేలు కోస్తున్న ఆ పల్లె పడుచు లోని ప్రకృతి సిద్దమైన సౌందర్యాన్ని క్రీ గంట ఎలా చూస్తున్నాడో చూడండి?' మొహంలోని భావాన్ని సమయానుకూలంగా మారుస్తూ, సవిలాపంగా ఆ పటం వేపే చూస్తూ చెప్పుకు పోతున్న రఘు వేపు రెప్ప వాల్చకుండా చూస్తున్న రాధ, 'ఇది తనకి బుద్ది చెప్పే నిమిత్తం గానే ఇక్కడుంచారేమో' అన్నంతగా రోష పడితే ; మన పరిస్థితుల కనుగున్యంగా ఈ పటం ఎందుకిలా అమిరిందా?' అనుకున్నాడు మనసులో రఘు. ఆ తరవాత ఎవరి మట్టుకు వారు మౌనంగా పుస్తకాలు తిరగేసుకుంటూ కూర్చున్ని కొంతసేపయ్యాక గుడ్ నైట్ చెప్పుకుని ఎవరి గదులకి వారు వెళ్లి పోయారు.
    అనుకున్న ప్రకారం స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించు కుని.... తమ పరిచయస్తులందరికీ వో తేనీటి విందు ఏర్పాటు చేసి ఆహ్వానాలు పంపారు వారు. విందు కొచ్చిన వారందరూ చాలా సరదాగానూ, సంతోషం గానూ కాలక్షేపం చేస్తుంటే, అందరి కన్నా ఎక్కువ తాపత్రయం చూపుతూ, సరిగ్గా అతిధుల్ని మర్యాద చెయ్యడం, సర్దుబాట్లు చెయ్యడం వగైరా ల్లో ఎంతో సాయపడ్డాడు చంద్రమౌళి. స్త్రీలకు సంబంధించిన ఒక ప్రత్యెక వ్యాధితో కొన్ని నెలల పాటు వారు పనిచేస్తుండే హాస్పిటల్ ల్లో చికిత్స పొందిన ఒక కన్నడ యువతి అన్న ఈ చంద్రమౌళి. చెల్లెల్ని చూసే నిమిత్తంగా తరచూ హాస్పిటల్ కి వస్తూ, అలాగే రాధతో పరిచయమవడం వల్ల, ఆ మూలకంగా రఘునీ పరిచయం చేసుకుని అప్పుడప్పుడూ వారి బంగ్లా కి కూడా రావడంతో ప్రారంభమైన అతన్ని స్నేహం. క్రమేణా స్నేహితులందర్లో కి ఇతనెక్కువ వాడన్నంత వరకూ అది ప్రబలింది.
    ఈ పరిచయాన్ని పురస్కరించు కునే అతనారోజు అంత శ్రద్ధ చూపెట్టాడన్నమాట.
    విశాఖలో లాగే రాధ, రఘు ల్నీ భావి దంపతులుగా భావించు కుంటున్న కొందరు స్నేహితులు, ఏవేవో, అర్ధంతో వీరిని గౌరవం గానే హస్యాల్చేసి మరీ వెళ్లారు. స్నేహితులంతా చేసిన హస్యాలకీ ప్రతి రోజూ వీరు బంగ్లా లో ప్రవర్తిస్తున్న విధానానికీ, ఏపాటి సంబంధం వుంటుందా , అన్న ఆలోచన్లో పడ్డాడు సహాయం కోసరం తనూ వచ్చిన వారి వంటవాడు గోవింద్.

                                      
    అంతవరకూ స్నేహితులందరి తోటీ అంత కులాసాగా కాలక్షేపం చేసిన రఘు టాక్సీ ఎక్కగానే నోటికి తాళం పెట్టుకోవడం చూసి, కోపంతో తనూ పెడ మొహం చేసుకుంది రాధ.
    ముందరి సీట్లో కూర్చుని ఇవన్నీ పరకాయిస్తున్న గోవిందు , 'ఇదెక్కడి ప్ర్రేమ పద్దతిరా' అనుకున్నాడు. పార్టీ లో మిగిలిపోయిన ఫలహారాలన్నీ బంగ్లా లోకి పట్టుకు నడుస్తూ.
    'నాకీ పూట రెండే రెండు రొట్టేల్చాల్ను గోవింద్' అని చెప్పి రఘు తన గదిలో కెళ్ళిపొతే, 'నాకు కప్పు పాలు మాత్రం చాలు' అంది తనూ తన గదిలో కెళ్లి కసితీరా 'ఫెడీ ' మని తలుపు మూసుకుంటూ రాధ. నవ్వుకుంటూ వంటింట్లో కెళ్లి పోయాడు గోవింద్.
    ఇలా అప్పుడప్పుడూ మధ్య మధ్య ఇటు వంటి సన్నీ వేశాలేవన్నా జరుగుతున్నా, మొత్తానికి యాంత్రికంగా కాలం గడిపెస్తున్నారనే చెప్పాలి రఘూ, రాధా కూడా.
    పగలల్లా, రోగులూ, వైద్యాలూ వీట్ల తో ఒకవిధంగా గడిపేస్తున్నా, రాత్రిళ్ళు మాత్రం తనా బంగ్లా లో ఎటు తిరిగినా మనసు మాత్రం సుధ మీదే ఉండేది రఘుకి. ప్రతిరోజూ కొంతసేపు సుధ సంగీతాన్ని వింటే తప్ప తనకి చదువులో బుద్ది పోయేదే కాదు. సుధని బక్కచిక్కి నట్టున్న పల్చది శరీరమైనా చక్కగా పలుకు మారినట్టుండే శరీర కట్టూ. అందమైన చామని చాయ రంగు, సుధ తల కట్టూ కళ్ళూ ఎంత అందమైనవి? ముక్కు కోన కొంచెం నేలవేపు కి వంగున్నా, కలకల్లాడే ముఖ వర్చస్సు కి అదో వింత అందాన్నే తెచ్చి పెడుతుంది.
    'తనంటే సుధ కెంత అభిమానం? విసుగూ, అసుగూ లేకుండా తన బట్టలన్నీ, గదినీ ఎంత ఓపిగ్గా ఎప్పటి కప్పుడు సర్ది పెట్టెదని? హు ఈ అవిటి తనవే లేకపోతె, మా సుదకి సుధే సాటన్నట్టుగా పేరు తెచ్చుకోపోయేదా నా సుధ?
    పాపం ఏ సంతోషమో, ఏ ఇబ్బందో తనతో చెప్పుకుంటేనే తప్ప సుధ మనసుకు అరుదలుండేది కాదు. బావా, బావా అని పిల్చు కుంటూ తన వెనకాల తిరుగుతుండే సుధ ఇప్పుడెం చేస్తుందో ఏమో? పాపం'
    ఏ కొంచెం పాటి తీరుబడి తనకి దొరికినా, ఇలా ఆలోచించు కుంటూ వుండేవాడు రఘు.
    ఈలోగా సుధ ఆపరేషన్ ని గురించి మురళి కీ, రఘు కీ వేల్లూరు లోని పెద్ద డాక్టర్ల కీ, రఘు కీ , మధ్యలో ఎన్నెన్నో ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతూనే వున్నందున, సుధ ఆపరేషన్ని ఉద్దేశించి తప్పనిసరిగా సెలవు పెట్టవలసోచ్చింది ...రఘు కి. అయితే ఈ విషయాలన్నీ గురించి రాధతో చెప్పాలా అవసరం లేదా... అన్న ఆలోచనలో పడ్డాడు రఘు. ఎంత చదువు కున్నదైనా దూర దేశంలో విడిగా ఆ బంగ్లా లో వుండడం అన్నది ఆలోచించాల్సిన ప్రశ్న గనక ఒకవేళ ముందుగా ఈ సంగతి తెలియజేస్తే తను ఏ స్నేహితుల్నన్నా, రప్పించుకోవడమో లేక మరే విధంగా నో ఏర్పాటు చేసుకుందుకు వీలుగా వుంటుందన్న భావంతో ఒకరోజు హాస్టల్ కేల్తూన్నప్పుడు ఈ విషయం విపులంగా రాధతో చెప్పేశాడు రఘు.
    ఆ సంగతి వినడం తోనే మొదటి మొహం అదోలా పెట్టినా తరవాత అ ఆపరేషన్ చెయ్యడాన్ని గురించిన వివరాలన్నీ రఘు నడిగి తెల్సుకుని, ఇక్కడ ఏమంత ముఖ్యమైన పని తొందర్లు లేవు గనక తను కూడా సహాయాని క్కావలసుంటే ఆ టైము కి వెల్లూరు వస్తానని చెప్పింది రాధ.
    రాధ అ విధంగా సహాయపడతా నన్నందుకు థాంక్స్ చెపుతూ, ఆసలు అక్కడుండే ఒకరిద్దరి పెద్ద డాక్టర్ల ప్రోత్సాహం వల్లనే ఈ ఆపరేషన్ అక్కడ చేసేందుకు ఏర్పాటు చేశారనీ, తను కూడా వున్నందున బహుశా అవసరం వుండదనీ చెప్పి ఆమర్నాడు తను బయల్దేరి వెళ్ళాడు రఘు.
    రఘు రాయ వెల్లూరు వెళ్ళేసరికే అంతకి మూడు రోజులకి ముందుగానే అక్కడి డాక్టర్లు చేసిన ఏర్పాట్ల ప్రకారం సుధా మొదలైన వారంతా విశాఖ నుంచీ వాళ్ళ కార్లో నే వచ్చారు. అంతవరకూ సుదకి తను ఇచ్చిన 'ట్రీట్ మెంట్ ' తెలియపర్చే నిమిత్తం గా, నళిని కూడా వాళ్లతో పాటు వేలూరు వచ్చింది.
    ఏర్పాటు చేసిన రోజు సుధని ఆపరేషన్ దియేటర్ లోకి తీసుకు వెళ్ళారు. వచ్చే ముందు ఆ లలితాంబ గుడి కెళ్లి ప్రార్ధించుకు వొచ్చిన పార్వతమ్మ గారు, ఆరోజు చీకట్నే స్నానానుష్టాలన్నీ తీర్చుకుని అ దేవినే ప్రార్ధించు కుంటూ వో బెంచీ మీద ముడుచుక్కూర్చున్నారు. శర్మ గారూ రామం చేతులు కట్టుకుని తలొంచుకును కాస్సేపు, పైకి చూస్తూ కాస్సేపూ , మౌనంగా పచార్లు చేస్తూన్నారు. కారు ప్రయాణం లోనూ, రాయవేల్లూర్లో నూ , ఏ అవసరాలోచ్చినా , పెద్ద వాడూ కొంచెం అనుభవము గలవాడు అయిన రామం కూడా వుండడం మంచిదనుకుని ఇంటి కాపలా కి శాంతని, వేణు నీ వుంచి రామాన్ని తమతో రమ్మన్నారు. శర్మ గారు తనకి పెద్ద తనం వచ్చేసిన కారణంగా. ఇక రఘు సంగతి చెప్పనక్కర్లేదు . ఎంతెంత కొత్త పద్ధతుల్ని కనిపెట్టినా ఎంతెంత పెద్ద అనుభవం వున్న డాక్టర్లు వైద్యం చేసినా పద్దెనిమిదేళ్ళు ముడురైన ఎముకల్ని సరిచేసి అన్నాళ్ళ బట్టే ముడుచుకు పోయి నిస్సార పడిపోయిన ఆసరా లన్నింట్లని చక్క జేసి కట్టు కట్టాలంటే, ఆ బాధ సాధారణ మైనదా? అసలు సుధ ప్రాణానికే విధమైన హాని కల్గకుండా ఈ శస్త్ర చికిత్స సరిగ్గా జరగాలి కదా. పాపం ఇందువల్ల సుధ ఎంత బాధపడాలో ఎన్నాళ్ళు మంచాన్నుండాలో ! అందుకే తను అనేక మార్లు ఈ విషయం గురించి సుధని అడిగాడు. అయితే ప్రతి ఒక్కసారీ 'తనకీ చికిత్స ఎంత త్వరగా జరిగి కాలు బాగువుతుందా' అన్న అదుర్ధానే సుధ చూపించింది గానీ ఎన్నడూ కొంచెమైనా భయపడ్డట్టు తనకి తోచనే లేదు. దారి పొడగునా రఘు ఆలోచనల్నీ విధంగానే పరవళ్ళు తొక్కాయి.
    హాస్పిటల్ కి చేరగానే తిన్నగా సుధ వున్న రూమ్ కి వెళ్ళి ఎన్నెన్నో ఉత్సాహకరమైన సంగతుల్ని చెపుతూ, సుధ కివ్వాల్సిన మందుల్నీ, ఇంజేక్షల్ననీ తనే స్వయంగా ఇస్తూ, తరుచూ ఆరోజంతా సుధ దగ్గరే వుండిపోయి, సుధ నిద్రపోయిన సమయాల్లోనే డాక్టర్ల ని కల్సుకుని సంప్రదించేవాడు రఘు.
    బావ తనయందు చూపుతున్న ఈ ఆదరాన్ని చూసి సుధ మనసు ఉరక లేసింది.
    మర్నాటి ఆపరేషన్ న్ని గురించి రాత్రి కొన్ని కొన్ని ఉప చికిత్స లు జరిపారు సుధకి. ఆ తరవాత రఘుతో సహా డాక్టర్ల అంతా మర్నాటి ఆపరేషన్, ఏవిధంగా చెయ్యాలీఅన్న విషయం పైన చర్చలు జరిపారు మరోసారి. అక్కడ్నుంచీ రఘు మళ్ళీ సుధ రూము లో కొచ్చేసరికి సుధ నిద్రపోతుంటే జానకి పక్కనున్న కుర్చీ లో కూర్చునుంది. శర్మ గారూ పార్వతమ్మ గారూ అవతలి వరండా లో నిలబడి, ఏదో మెల్లిగా మాట్లాడు కుంటున్నారు. జానకి ని చూస్తె రఘు కి చాలా బాధనిపించింది. కళ్ళు మూసుకుని ప్రశాంతంగా చలనం లేని బొమ్మలా కూర్చున్న ఆ మాతృహృదయం లో ఎంతటి తుఫాను లోలోపల విసురుతుందో , తన బిడ్డ క్షేమాన్ని కోరి ఎన్ని దేవుళ్ళ కు మొక్కు కుంటుందో , అసలే ఎన్నెన్ని కష్టాలో పడి ప్రాణాన్నంతా ఆ బిడ్డ మీదనే పెట్టుకున్న ఆవిడ కి దైవం ఏవిధమైన కష్టాన్నీ  మళ్లీ తెచ్చి పెట్టడు కదా? 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS