Previous Page Next Page 
అతని లక్ష్యం పేజి 32


    ఇలా కొట్టుకు పోయింది రఘు ప్రాణం. సడి కాకుండా సుధ మంచం వద్దకి వెళ్ళి చేతుల్రెండూ వెనక్కి పెట్టుకుని నిదానంగా చూశాడు. ఆ నీలి వెల్తుర్లో పసిపాపలా నిష్కపటమైన ముఖంతో బరువుగా ఊపిరోదుల్తూ నిద్రిస్తుంది సుధ. 'హు, భారమంతా నా మీద వొదిలేసి నిశ్చింతగా నిద్రపోతుంది తను. అందుకే నాకు అసలు నిద్ర పట్టడం మానేసింది' అనుకున్నాడు రఘు. రఘు ఎంత జాగ్రత్తగా నడిచి అవతలి కెళ్లినా అలికిడి కి కళ్ళు తెరిచి చూసిన జానకి దబ్బున లేచి నిల్చుంది.
    'పడుకో అత్తయ్యా, మళ్ళీ పొద్దున్నే లేవాలీ' అంటూ అవతలి కెళ్లి డోర్ కర్టెన్ పూర్తిగా వేసేసి శర్మ గారితో కలిసి వారు దిగిన రూము లోకి వెళ్ళిపోయాడు రఘు.
    పొద్దున్న సుధ కాపరేషన్ జరిగే ముందు తృప్తి కోసరం రఘు కూడా వోసారి ఆ లలితాంబని మనసారా ధ్యానించుకుని ఆ తరవాతే ఆపరేషన్ టైము లో వేసుకోవలసిన కవచాల్ను ముక్కుకీ చేతులకీ ఒంటి కీ వెసుకుని బల్ల వద్ద కొచ్చాడు. ఎంతో అనుభవం వున్న ఆ డాక్టర్లు మొదట రఘు ని ఈ ఆపరేషన్ లో కల్పించు కొనిచ్చేందుకు ఆక్షేపించినా అంతకీ ముందు ఆ విషయాల్లో అతను వారికిచ్చిన అమూల్య సలహాల్నుద్దేశించి మళ్లీ అందుకు సమ్మతించారు. ఏదో ఒక గొప్ప ఆవేశం వచ్చినట్టుగానే రఘు తనకన్నా గొప్ప డాక్టర్లక్కడున్నా రన్నదే మరిచి త్వరపడడం మాటలా వుంచి అ తరవాత తన ప్రవర్తనని తల్చుకుంటే రఘుకు కూడా ఆశ్చర్య మేసింది.
    అందులోనూ ముడుచుకు పోయున్న కాల్ని సరిగా చాపి సరిచెయ్యడం లో కాలుకి సరిపడే చర్మం తక్కువై నందున సుధ రెండో కాలి చర్మాన్నే తీసి అందుకుపయోగించాలని డాక్టర్లు ముందుగానే ఏర్పాటు చేసి వుంచారు.
    అయితే అందువల్ల సుధ మరి కొంచెం ఎక్కువ బాధ పడవలసోస్తుందనుకున్న రఘు ఇంచుమించు అదే చాయ లో వున్న తన కాలి చర్మాన్నే అందుకు ఉపయోగించవలసింది గా పట్టు బట్టినందున అతని కాలుకి కొంత బాధ ఏర్పడే కూడా దాన్ని లక్ష్యం చెయ్యలేదు రఘు.
    మొత్తానికి వారందరి ప్రార్ధనలూ ఫలించాయన్నట్టు జయప్రదంగా సుధకి శస్త్ర చికిత్స ముగిసి డాక్టర్లంతా చేతులు కడుక్కోవడం అవగానే , ఒక్కొక్కరూ అతని సూక్ష్మ బుద్ది ని, పని చేతురతనీ, అతి సున్నితంగా అతడు కుట్లు వేసే గొప్ప చురుకుతనాన్నీ వర్ణిస్తూ అతని వీప్పీద ఆనందంతో తట్టారు.
    'అదేమిటి బాబూ?' రఘు తన వాళ్లకి ధైర్యం చెప్పేందుకు ఇవతలకి రావడం తోనే ముందుగా అతని కాలి కట్టును చూసిన జానకి గాభరా పడిపోతూ అడిగింది.
    'ఉష్ గొడవ చెయ్య కత్తయ్యా, సుధ కాలి కోసరం --'
    'అయితే నా కాలి చర్మం ఇచ్చే దాన్నిగా బాబూ' రంగు కూడా సరిపోయుండేది.
    'ఫరవాలేదత్తయ్యా --'
    'అందుక్కాదు బాబూ నువ్వు ఆరోగ్యంగా వుంటే ఇటువంటి వార్నేందర్నో ఉద్దరించ గలవు , నాదెం వుంది, ఏదో ఆ గాయం తగ్గేవరకూ వో వార కూర్చుంటే తీరిపోతుంది.
    'నాకిప్పుడోచ్చిన ఇబ్బందీ ఏమీ లేదు' గాని అమ్మా వాళ్ళ తోటీ, ముఖ్యంగా సుధ తోటీ ఈ సంగతి చెప్పకు' అన్నాడు పైకెత్తి పెట్టి క్లిప్పు చేసుంచిన పేంటు కాల్ని కిందికి తీసుకుంటూ రఘు.
    'రఘు కొంచెంగా కుంటూతున్నట్టు నడవడం చూసిన పార్వతమ్మ గారు 'కలుకు పట్టినట్టుంది' అని చెప్పి నిలబడ్డాన్ని నమ్మేసి ఊర్కున్నారు.
    నిజం తెల్సుకున్న శర్మగారూ, రామం, నళినీ మొదలైన వారంతా అతని ఔదార్యానికి అభినందించారు.
    'మొత్తానికి పట్టుదలతో మీ లక్ష్యాన్ని సాధించి తీరారండీ' అంది నవ్వుతూ రఘుతో నళిని        'అప్పుడే ఎక్కడండీ నాలుగింటి కోక పాలు అయిందంతే' అయినా ఇది దైవ నిర్ణయం మీద మాత్రమే అధారపడున్న సమస్య. మిగతావన్నీ మన ప్రయత్నం మీద సాధించవలసినవే. అంతే తేడా.
    'మరేం ఫరవాలేదు ఇంత లొంగుబాటు లేని సమస్య నే సాధించినప్పుడు ఇక మీ కవన్నీ వో లెక్క ఏం లెద్దురూ. అయినా తాడూ లేదు బొంగరమూ లేదు. ఏ ఆధారం చూశా ఈయన ఈ ప్రయత్నం ప్రారంభిస్తా' అని నేనూ మురళీ ఎప్పుడూ అనుకుంటూనే వుండేవాళ్ళం. అటువంటి సంగతికే ఆ ఆచూకీ లన్నీ పైకి తీసి మొత్తానికి సాధించి తీరారు అంటే మీ ప్రతిభ చరిత్ర లో సువర్ణాక్షరాలతో చిత్రించొచ్చు నెమో కూడా' అంటూ ఆనందాన్ని పట్టలేక ఒకే పోగడేసిన నళిని 'అన్నట్టు ఆపరేషన్ తృప్తి కరంగా జరగడం తోనే తమకి ట్రాన్స్ కాల్ చెయ్యవలసిందిగా వేణూ, మురళీ, ఇద్దరూ మరీ మరీ చెప్పారు. ముందు కెళ్ళి బుక్ చెయ్యాలి' అంటూ ఫోనున్న రూముకి పరుగెత్తింది నళిని.
    వారు నమ్మిన లలితాంబ కృప వల్ల, చాలా త్వరగానే కోలుకుంటుంది సుధ. ప్రమాదం అనుకునే గడువు దాటేవరకూ ఉన్నాక శర్మ గారూ, పార్వతమ్మ గారూ, నళినీ రైల్లో ఊరి కెళ్ళి పొతే , జానకీ, రామం మాత్రం సుధ వద్ద ఆగారు.
    'పాపం నీ కోసరం అక్కడ ఎందరెందరు రోగులు కనిపెట్టుకు నున్నారో ఏమో, నువ్వింక వేళ్ళు బావా' అంది వో రోజు సుధ తనే రఘుతో.
    'ఇహనేం ,' అంటూ నవ్వాడు రఘు.
    'అందుక్కాదు బావా, నావంటి వార్ని ఎందర్నో కాపాడి పుణ్యం కట్టుకోవలసున్న నువ్వు ఇలా నా కోసరం ఆగిపోవడం దేనికని అంటున్నా అంతే నాకు బాగా తగ్గిపోయిందిగా' అంది సిగ్గుతో సుధ    
    'అలాగే సుధా  నేనూ అదే అనుకుంటున్నా' అన్నాడు తనూ నవ్వుతూ రఘు.
    సుధ చెప్పిన మాట నిజమే ననుకున్న రఘు. ఆ వెంటనే ప్రయాణమై బొంబాయి కి వెళ్లి పొతే, దాదాపు రెండు మసాల వరకూ వుండి సుధ కాలు పూర్తిగా గుణం ఇచ్చాక రఘు సలహా ప్రకారం వారి సొంత కార్లో జాగ్రత్తగా సుధని తీసుకుని రామం, జానకి బయల్దేరి విశాఖ క్షేమంగా చేరుకున్నారు.
    మరో రెండు మాసాల కల్లా, సుధ కాలు బాగై అందరి లాగే నడవ నారంభించింది. సుధ కాలుకట్టు తీసే సమయానికి ఎలా గైనా రావాలనుకున్న రఘు కి కొన్ని ముఖ్యమైన పనులున్న కారణంగా, రాలేకపోయాడు సరి కదా, ఆ వేసవి లో సుధని మెడిసిన్ లో చేర్పించేందుకన్నా వెళ్ళగల్నో లేదో అనుకుని ఆ పూచీ కూడా నళినీ, మురళీ ల మీదనే తప్పనిసరిగా పెట్టాల్సోచ్చింది రఘుకి.
    రఘు మళ్లీ బొంబాయి చేరేసరికి అతని కోసరం ఎన్నో కేసులు కనిపెట్టుకు నుండడం వల్ల ఒక నెల పాటు బొత్తిగా తీరుబడే కాలేదు రఘు కి. ఆ తర్వాతే మురళి కి సుధని కాలేజీ లో చేర్పించడం గురించి రాశాడు. వరసగా నెలల తరబడి ఎక్కువ హైరానా పడ్డందువల్ల చాలా బడలిక పడిపోయిన రఘుని ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవలసిందిగా మిగతా డాక్టర్ల అంతా బలవంత పెట్టినందు వల్ల మధ్యాహ్నం భోజనానికి ఇంకోచ్చిన తర్వాత ఇక మళ్లీ హాస్పిటల్ కి వెళ్లకుండా కొంచెం రెస్టు లో వుంటున్నాడు రఘు.
    అలవాటు ప్రకారం సాయింత్రం అవగానే తోట ముందరి వేపున వున్నా 'లాన్' లో కుర్చీలు సిద్దంగా వుంచాడు తోటమాలి. ఏదో పుస్తకం చేత్తో పట్టుకుని వెళ్లి వో కుర్చీ లో కూర్చుని చదువు కుంటున్నాడు రఘు.
    చిన్న టీపాయి , ఒకటి తెచ్చి రఘు పక్కన వేసి, టీ కప్పుతో వున్న 'ట్రే' తీసుకొచ్చి దాని మీద పెట్టాడు గోవింద్.
    'హు' ఇదే ఇంటి దగ్గరయితే ఇలాంటి చల్లగా వున్న సమయాల్లో ఖారంగా కరకర్లాడే ఏ చిరుతిండన్నా పట్టుకొచ్చిచ్చుండేది సుధ. అనుకుంటూ టీ కప్పు నందు కున్నాడు రఘు. ఇందాకనగా ఇంటి కొచ్చేసిన రాధ ఇంకా ఇవతలికి రాలేదేవీ , అని మనసులో అనిపించినా, అ మాట గోవింద్ ని మాత్రం అడగలేదు రఘు.
    'ఇవాళ చాలా చలిగాలిగా వుంది కదూ' అంటూ రెండు గాజు ప్లేట్ల లో వేయించిన జీడిపప్పు పట్టుకొచ్చి బల్ల మీద పెట్టింది రాధ.
    'ఆ' ఇపుడే నేనూ వీటిని గురించి అనుకుంటున్నా' అంటూ వో ప్లేటు తను తీసుకున్నాడు రఘు.
    'మీరంత మాటనేస్తే అది వాస్తవికానికి దూరం అవుతుందేమో' అంది తనూ వో ప్లేటు తీసుకుంటూ రాధ.
    'అదేవిటి?' పలుకుల్ని కొరుకుతూ అన్నాడు రఘు.
    'ఎందుకా , మనసులోని మాట ఒక ఆత్మ బంధువులకి తప్ప మిగతా వారికి తెలియదనే సూత్రాన్ని వాస్తవంగా నమ్మే వార్లో మీరు ఒకరు గనకా.'
    'మీరు పొరబడుతున్నారు నిజం చెప్పాలంటే అసలు 'వాస్తవం' అన్న పదానికి అర్ధం కూడా మీకు సరిగ్గా తెల్సినట్టు లేదు' అన్నాడు నవ్వుతూ రఘు.
    'మైగాడ్' మరీ అంత కొట్టి పారేయ్యకండీ,' మరీ రఘు వేపు సవిలసంగా చూస్తూ అంది రాధ.
    'అయితే చెప్పండి మరి చూద్దాం,' సహజంగా అడిగాడు రఘు.
    'ఎంత మీ అంతగా తెలుగు లో ప్రవేశం లేకపోయినా ఆపాటి సాధారణ జ్ఞానం కూడా లేదను కున్నారా?' వాస్తవికత అంటే . యదార్ధం అన్నమాట....అంతేగా.
    'అమ్మంటే తల్లి' అని అర్ధం చెప్పినట్టే వుంది మీరన్నది.
    'అయ్యో? అంటే అర్ధం చెప్పబోయి ప్రతినామం చెప్పినట్టున్నాను నేను' సిగ్గుగా నవ్వింది రాధ.
    'వాస్తవం అంటే యదార్ధం అన్నారు. అంటే ఆ ఎదార్ధమైన వాస్తవం ఏదీ?' అని నేనడుగుతున్నా అన్నాడు తన మాట మెలికే ని రాధ అర్ధం చేసుకోలేనందుకు నవ్వుకుంటూ.
    'మొత్తానికి గట్టి చిక్కు ప్రశ్నే వేశారే?' ఆలోచన్లో పడింది రాధ.
    'అందుకే దాని అర్ధం మీకు తెలుసా' అని అడుగుతా. నే చెప్తా వినండి. ఎవరి తత్వానికి తగ్గ పని వాళ్లకి వాస్తవికం గానూ, అలా కానిది దూరం గానూ తోస్తూ వుంటుంది. ఉపమానానికి నా మట్టుకు నాకు ముభావత వస్తావమైనది గానూ, నిర్మోహమాటం వాస్తవానికి దూరంగానూ అనిపి--'
    'నూటికి నూరు పాళ్ళు నిజమైన మాట చెప్పారు.' గబగబా నవ్వింది రాధ.
    'అలాగే ఆ మొహమాటం కారణంగా ధారాళం గా అందరితోనూ మనసిప్పి మాట్లాడలేక పోవడం మీ మట్టు మీకు వాస్తవికానికి దూరమనే అనుపించవచ్చు ఏమంటారు?'
    'ఆ ఇదీ నూటికి నూరు పాళ్ళు నిజమే; అసలు మీరింత బాగా మాట్లాడగలరని కూడా ఇప్పుడే నాకు తెలిసోస్త' అంది.
    'అది మీ తప్పు కాదు లెండి. మీరన్నట్లు నాకొచ్చిన ఆలోచనలనీ బయటికి వాగేసేయ్యటం నాకెప్పుడూ అలవాట్లేదు. ఎందువల్ల నంటే, ఇందాక చెప్పినట్టూ మనస్తత్వాన్ని బట్టి భావాలూ తోస్తూ వుంటాయి గనక. కొంతవరకూ తెలిసి నప్పుడే తప్ప ఎదుట వారి భావం నా కవగాహనం కావడానికి న్యాయం లేదు గనుక. అలా తెల్సుకోగల్గెవరకూ పరిచయం పడడం నాకిష్టం లేదు. అందువల్లే నేనీ ముభావాన్ని ఆచరించడం' అంటూ వో పిల్ల ప్రసంగాన్నిచ్చేశాడు రఘు. కొంతవరకన్నా తన తత్వం రాధకి తెలిపెయ్యడం అన్ని విధాల మంచిదనుకుంటూ.
    'వో. అయితే, మీ మనసులో అ మీవంటి వారికే తెల్పాల్సి వున్న భావాలింకా ఎన్నెన్నో వున్నాయన్న మాట' అంది అదోలా చూస్తూ రాధ.
    'ఒక్క నాకంటూ ఏవిటి ఎవరి అభిరుచులకి తగ్గ భావాలు వారి వారి మనసుల్లో అందరికీ వుంటాయి కాదంటే కొందరికి పరిస్థితుల్ననుసరించి, బహు కొద్దయితే మరి కొందరికి ఎక్కువా వుంటాయి అంతే.'
    'హు, పూర్వకాలం లో ఆడవారి మనసూ, సముద్రపు లోతూ ఎవ్వరూ తెల్సుకోలేరని అనేవారుట. అయితే, ఇప్పుడా సామెత మొగవారికే వర్తిస్తుందేమో' అంది విరసంగా నవ్వుతూ రాధ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS