కాని ఆమె కళ్ళలోని ఎర్రదనం నల్లద్దాల మాటున అతనికి కనపడక పోవటం వల్ల యింకా నవ్వుతూనే 'నీ అలంకరణ యెలా వుందో తెలుసా? అచ్చు నేటి ఆధునిక భారతీయ నాగరికత లా అస్తవ్యస్తంగా ఉంది.' అన్నాడు.
'అంటే మీ ఉద్దేశ్యం?' అంటూ కళ్ళకున్న అద్దాలను తీసేసి భర్త కళ్ళలోకి ఉరిమి చూస్తూ అడిగింది కళ్యాణి.
ఐతే కాంతారావు యింకా హాస్య ధోరణి లోనే ఉండటం వల్ల ఆమె కోపాన్ని గమనించకుండా యిలా చెప్పసాగేడు. 'చూడు కళ్యాణి! నీ కాళ్ళకు మట్టెలు, మెళ్ళో మంగళ సూత్రం, చేతికి మట్టి గాజులు, నుదుట కుంకుమ ఉన్నాయ్. అవి శుద్ధ భారతీయ సంప్రదాయానికి చిహ్నాలు. ఇక పొతే నాజూకైన నీ ఎడమ చేతి రిస్టు వాచీ నీ పెదిమల రంగు, కళ్ళకు తగిలించుకునే ఆ జోడు , కనుబోమలను దిద్దుతున్న తీరూ -- అదంతా పాశ్చాత్య పద్దతి. సో..... నువ్విప్పుడు అటు పూర్తిగా భారతీయ సాంప్రదాయానికి చెందకుండా, ఇటు పాశ్చాత్య సాంప్రదాయానికి చెందకుండా మధ్యస్తంగా ఉన్నావు. ప్రస్తుతం మన భారతీయుల సంస్కృతీ, ఆచార వ్యవహారాలు కూడా యిలాంటి సందిగ్ధా వస్థ లోనే ఉన్నాయ్. అటు పశ్చాత్యుల్లా టెర్లిన్ సూట్లూ, నైలెక్స్ చీరలు కట్టుకోవటం , సారా తాగటం , యిటు సత్యనారాయణ వ్రతాలు, శ్రావణ మంగళవారాలు నోములు చేస్తూ శేఖలు కూడా మారకుండా ఏరి చూసుకుని వివాహాలు చేసుకోవటమునూ. అందుకే అంటున్నాను. నీ యీ అలంకరణ ప్రస్తుత భారతదేశపు నాగరికత లా ఉందని...' అంటూ టక్కున ఆగిపోయేడు.
కళ్యాణి విసవిస నడిచి వెళ్ళి బస్సెక్కి తన సీట్లో కూర్చుంది. కాంతారావు తేరుకుని తాను కూడా బస్సెక్కి , వెళ్ళి ఆమె పక్కనే కూర్చున్నాడు. ఐతే అది ఇద్దరు కూర్చునే సీటు అవటం వల్ల ఒకరి నొకరు అంటుకుంటూ కూర్చోవలసి వచ్చింది. అందుకు చేసేదేమీ లేక ఒదిగొదిగి బస్సు నానుకుని సాధ్యమైనంత వరకు భర్త తొడలు తనకు తగలకుండా దూరంగా జరిగింది కళ్యాణి.
అవన్నీ కళ్యాణి కోప చిహ్నాలని కాంతారావు కి అనుభవ పూర్వకంగా తెలుసు కనుక మాట్లాడకుండా ఊరుకున్నాడు. 'ఇప్పుడు ఆమె కోపాన్ని పోగొట్టి , సంధి చేసుకోవటం ఎలా?' అన్న ఆలోచనలో పడి.
ఇంతలోకే మిగతా టూరిస్టు లు కూడా రావటం తో బస్సు కదిలింది.
బస్సు కుదుపుకి ఒక్కోసారి కాంతారావు శరీరం ఆప్రయత్నం గానే కళ్యాణి శరీరాన్ని తాకవలసి వచ్చింది. అలా తాకినప్పుడు 'కాస్త సరీగ్గా కూర్చోండి. వివరంగాచేప్పాలా, నన్ను ముట్టు కోవద్దని?' అన్నది ఆమె అతని వంక కొరకొరా చూస్తూ.
'వివరంగా నువ్వు చెప్పకుండానే సరీగ్గానే కూర్చున్నాను నేను. కాని ఈ బస్సు కుదుపుల వల్ల నిన్ను తాకవలసి వస్తోంది. నేనేం చెయ్యను?' అన్నాడు కాంతారావు.
'ఇంక అంతటితో ఆపండి. ఏదో రకంగా, సంభాషణ ని పొడిగించి , నాతొ మంచిగా మాటలు కలపాలని చూస్తున్నారేమో! ఆ పప్పులేమీ ఉడకవు . జాగ్రత్త!' అని యింకా బస్సుకు కరుచుకుని కూర్చుంది కళ్యాణి.
'ఐతే కోపం చాలా పెద్ద యెత్తులో నే ఉందన్నమాట!' అనుకున్నాడు కాంతారావు.
చేతి పనుల వస్తువులమ్మే షోరూము ముందు బస్సాగేసరికి భార్యా భర్తలిద్దరూ మిగతా టూరిస్టు లతో పాటు దిగి అక్కడకు వెళ్ళారు. హాండు బాగుల నుండి హైరాయిల్ వరకు, మంచి గంధంతో చేసిన అనేక రకాల వస్తువులు, బొమ్మలు ఉన్నాయ్ అక్కడ. కొంతసేపు చూట్టం అయినాక 'ఏమయినా కొంటావా యిక్కడ?" అనడిగేడు. కాంతారావు.
'అ సంగతి నాకు తెలుసు. కావలసివస్తే నేనే కొనుక్కుంటాను. మీరు యిందులో జోక్యం కల్పించుకోవలసిన అవసరం లేదు.' అంటూ అతనికి దూరంగా వెళ్ళిపోయింది కళ్యాణి.
కాంతారావు చేసేదేం లేక ఆక్కడున్న బొమ్మలన్నీటి ని చూస్తూ తాను కూడా ఒక బొమ్మలాగా నిలబడి పోయ్యేడు. కళ్యాణి ఒక హ్యాండ్ బాగు, అగరువత్తులు పెట్టుకునే బొమ్మ, ఒక ప్లవరు వేజ్, శాండల్ వుడ్ సెంటు, హేయిరాయిలు కొనుక్కుని బిల్ తెచ్చి అతనికిచ్చింది. వెంటనే మాట్లాడకుండా వెళ్ళి బస్సెక్కి కూర్చుంది. కాంతారావు బిల్లు చెల్లించి తాను కూడా వెళ్ళి ఆమె పక్కనే కూర్చున్నాడు. కళ్యాణి కొంచెం అవతలకు జరిగి, ముఖం పక్కకు తిప్పుకుంది.
'ఇంకా కోపం పోలేదా అన్ని వస్తువులు కొనిచ్చినా?' అనుకున్నాడు మనసులో కాంతారావు.
తరువాత సరాసరి బస్సు కామత్ హోటల్ ముందు ఆగింది . అక్కడ భోజనాలు చేస్తున్నంత సేపు కళ్యాణి భర్తతో మాట్లాడనే లేదు. అతను తనవంక చూసినప్పుడు మరింత నిర్లక్ష్యంగా తల తిప్పెసుకునేది. అతను ఎటో చూస్తున్నప్పుడు అతని ముఖంలోని ఫీలింగ్స్ ను చూద్దామనే కోరికతో అతని వంక దొంగచాటుగా చూసేది. అతను యిటు ముఖం తిప్పగానే మళ్ళీ ' జన్మలో ఎప్పుడూ నీ ముఖం చూడను.' అన్నట్టుగా ముఖం పెట్టి కూర్చునేది.
భోజనాలయ్యాక మోక్ష గండం విశ్వేశ్వరయ్య మూజియం , హిందూస్తాన్ మెషిన్ టూల్స్ వారి గడియారాల విభాగం . అసెంబ్లీ హాలు చూపించేడు గైడు. మ్యూజియంకి, అసెంబ్లీ కి భర్తతో కలిసి వెళ్ళి, అతనికి దూరంగా నడుస్తూ, అతనితో మాట్లాడకుండానే చూసింది కాని, కళ్యాణి గడియారాల దగ్గరకు మాత్రం రాలేదు. 'నాకు కాళ్ళు నొప్పులు పుడుతున్నాయ్. నేను పిల్లలతో యిక్కడే కూర్చుంటాను. మీరొక్కరే వెళ్ళి చూసి రండి.' అంది.
ఆ మాటలకు అర్ధం 'మీమీద నాకింకా కోపం పోలేదు. మీ వెంట నడవాలంటే నే నాకు వళ్ళు మంటగా ఉంది పొండి తక్షణమే నా కళ్ళ ముందు నుండి పొండి' అని కాంతారావు కి బాగా తెలుసు. ఇద్దరూ ఏకాంతంగా ఉన్నట్లయితే ఆవే మాటలని ఉండేది కళ్యాణి. కాని తాము నలుగురి మధ్యా ఉండటం వల్ల సభ్యత కోసం అలా అన్నదని అతను గ్రహించేడు.
కళ్యాణి కొంతసేపు ఒంటరిగా ఉంటె అప్పటికైనా కొంతవరకు పునరాలోచనలు చేసుకుని కోపం తగ్గించుకుంటుందన్న ఆశతో కాంతారావు మాట్లాడకుండా వెళ్లిపోయేడు.
బస్సు తిరుగు ప్రయాణం లో ఉన్నప్పుడు కుదుపు వచ్చినప్పుడల్లా కాంతారావు శరీరం కళ్యాణి ని తాకుతున్నా ఆమె జరగకుండా అలాగే కూర్చునేసరికి కళ్యాణి కోపం తగ్గిపోయింది కదా అని సంబరపడి పోయేడు కాంతారావు. కాని తీరా హోటల్లో తామున్న రూముకు వెళ్ళేక ఆమె ప్రవర్తనను చూసి తన అంచనా తప్పని తెలిసిందతనికి. బస్సులోని ఆమె ప్రవర్తన సంధికి సన్నాహాలు కావనీ అది కేవలం తుఫాను ముందు ఆవరించే ప్రశాంతత లాంటిదేనని గ్రహించేసరికి ఉసూరు మన్నాడు కాంతారావు.
రూములోకి వెళ్ళగానే కళ్యాణి పిల్లలను బడబడ యిడ్చి వాళ్ళకు బట్టలు మార్చింది తాను కూడా స్నానం చేసి బట్టలు మార్చుకుంది. అంతసేపూ వస్తువుల నెత్తెత్తీ పడేస్తూ పెద్దగా శబ్దం చెయ్యసాగింది. భర్త ఎటు పోతే ఆ దిక్కుకు దూరంగా నడవటం మొదలెట్టింది." ఇవన్నీ ప్రళయానికి చిహ్నలేనని తెలిసిన కాంతారావు చేసేదేమీ లేక , ఆమె చర్యలన్నీటినీ కేవలం ప్రేక్షకుడి లా తిలకిస్తూ ఉండిపోయేడు.
బోయ్ భోజనాలు తెచ్చేక మౌనంగా నే అంతా భోజనం చేసేరు. పిల్లలు ఆలసి ఉండటం వల్ల వెంటనే పాలు తాగి పడుకున్నారు.
ఇక కళ్యాణి యుద్దాన్ని డిక్లేర్ చేసే సమయం ఆసన్న మయిందని కాంతారావు అనుకున్నాడు, కల్యాణి భర్తతో ఎప్పుడు పోట్లాడాలనుకున్నా పిల్లలు పడుకున్న తరువాత తాము భోజనం చేసి పడుకో బోయే ముందు తీరికగా కూర్చుని అన్నీ విషయాలూ భర్తతో 'క్లియరాఫ్' చేసేసుకుంటుంది.
కాంతారావు అనుకుంటున్నట్లుగానే , టైము బాంబు ప్రేలినట్లు కళ్యాణి 'ఇంతకూ బస్సు దగ్గర మీరు నన్ను అవమానప్రచటంలో మీ ఉద్దేశం యేమిటి?' అనడిగింది భర్తని నిలదీసి.
'నిన్ను నేను అవమాన పరచలేదు. అలాటి ఉద్దేశ్యం కూడా నాకు లేదు కళ్యాణి!' అని సాధ్యమైనంత సౌమ్యంగా సమాధాన మిచ్చేడు కాంతారావు.
'అబద్దం! నా అలంకరణ గురించి అంత హాస్యంగా మాట్లాడేరంటే దాని అర్ధమేమిటి? నన్ను, నా అందాన్ని అవమానపరచటం కాదూ?' కళ్ళ నీళ్ళను బలవంతాన అణచుకుంటూ అడిగింది.
'ఎందుకు కళ్యాణీ! అంత పెడర్ధాలు తీసి ఆలోచిస్తావు? నేనేదో సర్దాగా అన్న దానిని సీరియస్ గా తీసుకుని నువ్వు బాధపడటం, నన్ను బాధ పెట్టటం యేమీ బాగా లేదు.' అన్నాడు.
'ఔను , నేనన్నదేమీ బాగా వుండదు మీకు. అసలు మీ కంటికి 'నేను' బాగుంటేగా , నే నన్నది బాగుంటానికి! మొత్తానికి మీ మగబుద్ది - పాడు బుద్ది- నీచ బుద్ది - జాతి బుద్ది పోనిచ్చేరు కాదు. 'నా పిచ్చి కాని, ఈ భూలోకం లో ఏ మగాడు తన భార్యను పూర్తిగా ప్రేమిస్తాడు?' ఈ ఆడవాళ్ళంతా వట్టి అమాయకులు. మగవాళ్ళ మాయ మాటలకు లొంగిపోయి , వాళ్ళను దగ్గరకు చేరనిస్తారు. మోజు కాస్త తీరి అతను అటు మొహం తిప్పగానే కూర్చుని ఏడుస్తారు. ఛీ ఛీ! పాడు బ్రతుకు. అడ పుట్టుక పుట్టటం కన్న అడవిలో మానై పుట్టటం మేలని పెద్దవాళ్ళు ఊరికే అన్నారా?' ముక్కు చీదేసింది కళ్యాణి.
