"నీతో మాట్లాడాలి గోపాలం!"
గుమ్మంలో నిలబడింది వసంత.
అతనులేచి కూర్చుని, "కూర్చో వసంతా?" అన్నాడు కుర్చీ చూపుతూ.
ఆమె కూర్చుని, "ఈ వారంనుంచీ నువ్వు చాలా మారిపోయావు" అంది.
"అవును" అన్నాడు గోపాలం.
"ఇది శశిరేఖని చూశాక-"
"అదీ నిజమే కాని, కాకతాళీయం"
"అలాగ నమ్మేదా?"
"నీ ఇష్టం-"
"ఎక్కడికి వెళ్ళేవు ఈ నాలుగురోజులూ? శశిరేఖ ఇంటికా?"
"కాదు-"
"మరి!"
"బేలూర్ మఠానికి"
"హాస్యంగా అడగడం లేదు నేను"
"హాస్యంగా చెప్పలేదు నేను"
"అక్కడి కెందుకని?"
"మనశ్శాంతి కోసం"
"నాన్నగారు ఫోన్ చేశారు. ఉద్యోగానికి రిజిగ్నేషన్ ఇచ్చావట"
క్షణం నిరుత్తరుడయ్యాడు గోపాలం.
"అవును"
"నాతో ఎందుకు చెప్పలేదు?"
"నీకే తెలుస్తుందని"
"కంపెనీ దివాలా తీస్తుందని నిశ్చయించావా?"
నవ్వాడు గోపాలం
"మరి"
"ఇక్కడ ఉండాలనిపించలేదు"
"అంటే"
"కలకత్తాలో....ఈ ఇంట్లో....ఈ ఉద్యోగంలో"
"ఆఁ?"
ఈ పరిస్థితిలో - వసంతా! చాలా ఆలశ్యంగా తెలిసింది నాకు- నాలో ఆత్మ గౌరవం పూర్తిగా నశించిపోయిందని... ఈ జీవితం నాకు పడదని-"
"ఆదివారంనాడు తెలిసిందా?"
"అవును వసంతా! ఆ రోజు జ్ఞానోదయం ఐంది"
"శశిరేఖ వల్ల-ఏం?"
"అవును-"
ఆమె నిలబడి కిటికీ దగ్గరికి వెళ్ళి తలుపులు తీసింది. బయట వెన్నెలవర్షం లాగ కనిపిస్తోంది. ఆ కాంతి వెనకాల వసంత ఎంతో అందంగా కనిపిస్తోంది.
ఆమె మళ్ళీ అతనివేపు తిరిగి, "ఎక్కడికి ప్రయాణం?" అంది.
"ఇంటికి"
"ఎన్నాళ్ళు?"
"శాశ్వతంగా"
"గోపాలం?"
నిశితంగా అతన్ని పరీక్షించింది వసంత.
"నిజమే వసంతా! రేపు మెయిల్లో వెడుతున్నాను - ఈజీవితానికి గుడ్ బై-"
"నువ్వే మంటున్నావో నీకే తెలీదు గోపాలం!"
"తెలుసు వసంతా! నీకు స్వేచ్చకావాలి....తీసుకో. నాకూ స్వేచ్చకావాలి. తీసుకోనీ. మీ నాన్నగారు కావలసిన ఏర్పాట్లు చేస్తూనే ఉండి ఉంటారు....ఆ రాత్రి నీకు చెప్పేరుగా!"
"నువ్వు - నువ్వు మూర్ఖుడివి"
"అవును వసంతా ! - ఈరోజుదాకా, అది నిజం. కాని, నా మూర్ఖత్వం పోయింది. కలలన్నీ నిజాల వెలుతురులో కరిగిపోయాయి. నన్ను కట్టేసిన ఈ సంపదా, నీ అందమూ-అన్నీ ఇంక నన్ను వ్యామోహితున్ని చెయ్యలేవు -చూడు! ఎంత నిర్వికారంగా మాట్లాడుతున్నానో!"
"నిర్వికారం కాదు, మతిలేని మాటలునీని..."
"పోనీ- అలాగే అనుకో. ఈ చివరి గంటల్లో మనం వాదించుకోవడం దేనికి?"
"భగవాన్!" అన్నది వసంత కుర్చీలో కూలబడుతూ. అతను దీపంవేసి, "ఏమైంది?" అన్నాడు.
"ఏమీలేదు"
అతను మంచంమీద కూర్చున్నాడు.
"పన్నెండు దాటుతోంది - వెళ్ళిపడుకో"
"థాంక్స్ - నీ నిద్దర పాడుచెయ్యను"
ఆమె లేచి వెళ్ళిపోయింది. అతనికి నిద్రరావడంలేదు. మనస్సుతేలిక పడిపోయి ఉరకలు వేస్తోంది,
పుస్తకం తీసి చదవడానికి ప్రయత్నించేడు- సాగలేదు.
వెన్నెట్లో కూర్చుందామని వెళ్ళేడు.
ఆమె కూర్చుంది ఆకాశంలోకి చూస్తూ.
"నిద్రపోలేదా వసంతా?"
"లేదు"
అతను కూర్చున్నాడు- చాలాసేపు కొంచెం మంచు పడుతోంది.
"లోపలికి వెళ్ళి పడుకో - చలి వేస్తుంది"
"నువ్వు వెళ్ళు -నాకు వెళ్ళాలని లేదు"
అతను వెళ్ళి పడుకున్నాడు - ఈ సారి అతనికి నిద్రపట్టేసింది. ఉదయం లేచి రాత్రి జ్ఞాపకం వొచ్చి సిగ్గు పడ్డాడు- కాని. తన నవ జీవనం గుర్తుకి వొచ్చి తన స్థిరత్వానికి తానే గర్వపడ్డాడు-
* * *
31
మరునాడు ఉదయం లేచి త్వరగా తయారై గోపాలం మాధవరావు దగ్గర సెలవు తీసుకుని రావడానికి వెళ్ళాడు.
"ఇంత హఠాత్తుగా ఎందుకు వెడుతున్నారు" అని అడిగాడు మాధవరావు.
"ఉద్యోగం వొదిలేశాను-"
ఆశ్చర్యపడ్డా, అట్టే ప్రశ్నలు వెయ్యలేదు మాధవరావు బలవంతంగా కాఫీ ఇచ్చి, శుభాకాంక్షలతో పంపించేడు.
పన్నెండు అవుతూంటే అతను రామానంద్ ఇంటికి చేరుకున్నాడు చాలా ఆలోచించాక గాని అతను మళ్ళీ శశిరేఖనీ, రామానంద్ ని కలుసుకోవాలని నిర్ణయించుకోలేదు. కాని, చాలా కారణాలు కనిపించాయి-
ఆనందంగా ఆహ్వానించాడు రామానంద్. శశిరేఖ అతన్ని చూసి. కుశల ప్రశ్నలయాక "ఏదో చెప్పడానికి వొచ్చినట్టు ఉన్నావు. ఏమిటి సంగతి!" అంది.
రామానంద్ నవ్వి, "నిన్ననే అన్నాను. ఈమెని ఎక్స్ రే కళ్ళు అని- కాదని వాదించింది..." అన్నాడు.
గోపాలం ఏమీ అనలేదు.
శశిరేఖ మళ్ళీ, "చెప్పు గోపాలం?" అంది.
"మీ దగ్గర సెలవు తీసుకోడానికి వచ్చాను."
"ఇంటికి వెడుతున్నావా?"
"అవును"
"ఎన్నాళ్ళు సెలవు?"
"శాశ్వతంగా"
"అంటే?"
"ఇక్కడ ఉండాలని లేదు- ఉద్యోగం రిజైన్ చేశాను."
ఆశ్చర్యంగా చూశాడు రామానంద్. శశిరేఖ ఏమీ అనలేదు. చాలా సేపు తరవాత, "తొందర పడి ఏమీ చెయ్యకు" అంది.
"ఇంక చేసేదేమీలేదు..."
"ఎప్పుడు వెడుతున్నావు?"
"త్వరలోనే..."
"భోజనం చేసి వెళ్ళు-"
"వొద్దు శశీ. వెళ్ళనీండి నన్ను..."
"తొందరగా ఎక్కడికైనా వెళ్ళాలా?"
"లేదు - కాని..."
"వంట పదినిముషాలో ఐపోతుంది..."
శశిరేఖ లోపలికి వెళ్ళింది. రామానంద్ జాగ్రత్తగా అతని విషయాలు తప్పించి సంభాషణ లాంఛనంగా జరపసాగేడు. అంతలో శశిరేఖ పిలుపు విని అతను లోపలికి వెళ్ళివొచ్చి బయటికి వెళ్ళేడు.
వెనువెంటనే శశిరేఖ వొచ్చి, "గోపాలం! కిందటి ఆదివారం జరిగినదానికి ఫలితమా ఇది?" అంది.
"కాదు శశీ- అ రోజే నీకు చెప్పేను....ఆ రోజు జరిగిన దానితో నాకు జ్ఞానం కలిగిన సంగతి నిజం- కాని, దానికి కారణాలు మూడేళ్ళనించి పెరుగుతున్నాయి!"
"చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు.
"కావొచ్చు కాని, ఈ కొంచెం ఆత్మగౌరవం ఉండగానే నా జీవితం నేను జీవించడం నాకు మూర్ఖత్వంలాగ కనిపించదు."
"ఆత్మగౌరవం అంటే, సమస్యలనించి పారిపోవడం కాదు."
దూరంగా వెళ్ళి కూర్చోడం-ఏం?
తలవంచుకుంది శశిరేఖ "నిజం గోపాలం. నిన్ను విమర్శించే హక్కు నాకులేదు!" అంది.
"ఉంది- కనీసం స్నేహితురాలిగా కాని నిజాన్ని మరిచిపోయే హక్కు లేదు నీకు."
"ఈ చివరి గడియల్లో వాదించుకో వొద్దులే. గుడ్ లక్!"
ఆమె వెళ్ళి లోపల పనిచూసుకుంటూంది.
రామానంద్ బజారు నించి ఏవో తెచ్చాడు.
భోజనాలయే సరికి రెండు దాటింది. మళ్ళీ గుడ్ బై చెప్పి అతను ఇంటికి చేరుకున్నాడు.
వెళ్ళేసరికి శేఖర్ కనిపించేడు. గోపాలాన్ని చూసి, "వసంత చెప్తోంది నిజమేనా." అన్నాడు కోపంగా.
"నేను వెళ్తున్నానేనా?"
అవును.
"నిజమే"
"ఎంచేత? రిజిగ్నేషన్ ఎందుకిచ్చేవు? నాతో కాని. నాన్నగారితోగాని ఎందుకు చెప్పలేదు?"
"అవసరం అనిపించలేదు శేఖర్ - పొరపాటైతే క్షమించు" అతని ముఖంలోకి ఆశ్చర్యంగా చూశాడు శేఖర్. అతని కోపం చాలా తగ్గిపోయింది.

"ఇంత హఠాత్తుగా ఎందుకని, గోపాల్?"
"నీకు తెలుసు శేఖర్? - తెలియకపోతే చెప్పలేదు"
"వసంత- రాటెన్ గా కొన్ని పనులు చేసింది....కాని-"
"ఆమె ఏమీ చెయ్యలేదు శేఖర్?- ఈ పరిస్థితుల్లో ఇలాగ జరగడం అనివార్యం, పొరపాటు నాది. నువ్వు క్షమించు శేఖర్-"
"నాకు కర్తవ్యం బోధపడడం లేదు గోపాలం నాన్నగారు మొన్ననే బొంబాయి వెళ్ళేరు. ఎక్కడ ఉన్నారో కూడా తెలీదు. ఈ ఉదయం వసంత ఫోన్ చేసేదాకా తెలీలేదు..."
"ఆయనకీ నా క్షమాపణ చెప్పు."
"నీకు బుద్ధిచెప్పడం నా తరంకాదు గోపాల్!- కాని, మరొకసారి ఆలోచించు..."
"ఆలోచించాను శేఖర్ - వసంత మీద కోపం లేదునాకు - ఈ పరిస్థితి వొచ్చిందన్న బాధతప్ప..."
వాళ్ళిద్దరూ నిశ్శబ్దంగా కూర్చున్నాక గదిలో నించి బయటికి వొచ్చింది వసంత. ఆమెని చూడ్డంతోనే ఒక్కసారి నిశ్చయం చలించి నట్టయింది. కాని, సరిదిద్దుకున్నాడు గోపాలం.
"మధ్యాహ్నం- బోజనం చేశావా?" అంది సోఫాలో కూర్చుంటూ, వసంత.
"ఆఁ!"
"ఎక్కడ? - ఇంటికెందుకురాలేదు?"
"రామానంద్ ఇంట్లో"
నిర్లిప్తంగా అతన్ని చూసి అర్ధం ఐనట్లు తల ఊపింది వసంత.
"కాఫీ తాగుతావా?"
"ఆఁ"
ఆమె వెళ్ళి ట్రేలో మూడు కప్పుల్లో కాఫీ తెచ్చిఇచ్చింది. ఆశ్చర్యంగా చూసి, పార్టింగ్ గిఫ్ట్ అనుకుని, శేఖర్ కి ఒక కప్పు ఇచ్చి తానొకటి తీసుకున్నాడు.
ముగ్గురూ నిశ్శబ్దంగా కాఫీ తాగాక గోపాల్ వెళ్ళి స్నానంచేసి బట్టలు మార్చుకుని వొచ్చి, "ఆరు దాటింది. నేను బయలుదేరాలి" అన్నాడు.
ఎవ్వరూ మాట్లాడలేదు.
అతను కిందకివెళ్ళి ఐదు నిమిషాల్లో మీదికి వొచ్చి, రెండు సూట్ కేసులూ, బెడ్డింగూ కిందకి చేరవేసివొచ్చి, "వెళ్ళాను వసంతా? - నీకు ఎప్పుడు రావాలని ఉంటే అప్పుడు ఇంటికి రా...లేదా, నీ సుఖం కోసం ఏం కావాలన్నా చేస్తాను" అన్నాడు గోపాలం.
ఆమె మాట్లాడలేదు, కిందికి చూస్తూ ఉండిపోయింది.
"గుడ్ బై శేఖర్ - వసంతా?"
అతను వెనుదిరిగేసరికి శేఖర్ లేచి, "నేను డ్రాప్ చేస్తాను పద!" అన్నాడు.
"వొద్దు - ఉండు. టాక్సీఉంది..." అని తొందరగా మెట్లుదిగి వెళ్ళిపోయాడు గోపాలం.
స్ట్రాండ్ రోడ్ లో జామ్ అతను ఫ్లాట్ ఫారం మీదిక వెళ్ళేసరికి ఏడు ఐపోయింది. తన కంపార్ట్ మెంట్ తో సామాన్లు పడేసి, బయటికి చూసేసరికి, స్టెల్లా ఫ్లాట్ ఫారం మీద ఉంది.
"మీరెందుకు వొచ్చారు ఇంత శ్రమపడి?" అన్నాడు నొచ్చుకుని, గోపాల్.
"రాకూడదని ఎంత ప్రయత్నించినా కుదరలేదు. అందుకని మీకు గుడ్ బై చెప్పడానికి వొచ్చాను" అంది స్టెల్లా.
