Previous Page Next Page 
ఏటి ఒడ్డున నీటిపూలు పేజి 30


    శ్రీదేవి వింటూ ఊరుకుంది.
    "మా బావగారిని, అదే భానక్క భర్తని చూశావుగా! ఆయనే పాపం, తిరిగి అవస్థపడుతున్నారు. శంకరం వచ్చేలోగా ఏదో ఒకటి స్థిరపరిచేస్తే, వాడు ఉండగానే పెళ్ళి చేసెయ్యవచ్చును. మళ్ళీ మళ్ళీ వాడు అంత దూరంనించి ఎక్కడ రాగలడు?"
    "భగవతి పెళ్ళి, మాలతి పెళ్ళి ఒకసారే చేసేస్తారా? ఖర్చుకూడా కలిసివస్తుంది" అంది శ్రీదేవి.
    "ఏమో! నా పెళ్ళి అయితేకాని మాలతి పెళ్ళి చేసుకోదట. నాకోసం ఆగవద్దని చెబుతున్నాను నేను."
    "పోనీలే! మాలతికేనా అక్కని గురించి దిగులు ఉంది."
    శ్రీదేవి, చారుమతి మాట్లాడుకుంటూ ఉండగా పద్మ వచ్చింది. ఎన్నాళ్ళ తరవాతో ముగ్గురు వారి కిష్ట మైన మామిడి చెట్టుకింద కూర్చుని మాట్లాడుకోవడం సంతోషం కలిగించింది.
    పద్మ ఎదురుగా పెళ్ళిళ్ళ విషయాలు, కుటంబ విషయాలు మాట్లాడకూడదనుకున్నారు శ్రీదేవి, చారుమతి. కాస్సేపు పుస్తకాలను గురించి, సినిమాలను గురించి మాట్లాడుకున్నారు, పరిగెడుతూ, పడుతూ, లేస్తూ తిరుగుతున్న అమర్ తో ఆడుకున్నారు కొంత సేపు. ఇంతలో శ్రీదేవి లోపలికి వెళ్ళి ఒక పుస్తకం తెచ్చి చారుమతి చేతిలో పెట్టి, "ఇందులోది ఒకటి పాడు" అంది.
    చారుమతి ఆ పుస్తకాన్ని అందుకుంది. అది శ్రీదేవికి తను పెళ్ళిలో ఇచ్చిన కానుక. అది చూస్తూ, "ఈ పుస్తకం ఇక్కడే మరిచిపోయావా?" అంది.
    "ఇక్కడ మరిచిపోతానా? అది నాతోపాటు ఎల్ల ప్పుడూ ఉంటుంది. నేను ఎక్కడికి వెళితే అక్కడికి వస్తుంది" అంది శ్రీదేవి.
    చారుమతి బసవరాజు అప్పారావుగారి గేయం పాడింది.
    "ఎద మెత్త నౌటకై
    సాదగుంహదరా, అంత
    మది గల అహమ్మెల్ల
    వదలిపోవునురా."
    "కొత్త పాటలు ఏమీ నేర్చుకోలేదా? ఏదైనా కొత్తది పాడు" అంది పద్మ.
    చారుమతి తను గోపాల్ దగ్గిర నేర్చుకున్న పాట పాడింది.
    "శివ శివ శివ యనరాదా!
    శివనామము చేదా!"
    "ఈ పాట రేడియోలో వస్తూ ఉంటుంది. నాకు చాలా ఇష్టం" అంది శ్రీదేవి.
    చీకటి పడగానే ఇళ్ళకి వెళ్ళిపోవడానికి పద్మ, చారుమతి లేచారు. పద్మ రిక్షా కట్టించుకుని రామారావు పేట వెళ్ళిపోయింది. చారుమతి నడిచే ఇంటికి బయలుదేరింది. దారిపొడుగునా ప్రతి ఇంటిముందర నీళ్ళు చల్లి ముగ్గులు తీరుస్తున్నారు ఆడవాళ్ళు. రకరకాలైన ఆ ముగ్గులు చూసుకుంటూ మెల్లిగా నడుస్తూ ఇల్లు చేరింది చారుమతి.
    శ్రీదేవి సంక్రాంతి పండగ వెళ్ళేదాకా కాకినాడ లోనే ఉంది. పండగ ముందురోజు ఆమె భర్త వచ్చాడు. ప్రతి రోజు పద్మని కలుసుకుని కొన్ని గంటలు గడిపేది శ్రీదేవి. పద్మలో రెండవసారి వివాహేచ్చ కలగ చేయాలని శ్రీదేవి ఆశయం. పద్మలో కొత్త ఆశలు చిగురించ ప్రారంభించాయి.
    భోగినాడు కొడుక్కి భోగిపళ్ళు పోసి, పేరంటానికి అందర్నీ పిలిచింది శ్రీదేవి. ఆ రోజు మాలతి ఒక చక్కటి "బేబీ సెట్" తెచ్చి అమర్ కి ఇచ్చింది. శ్రీదేవి పుచ్చుకోడానికి అడ్డుచెపితే, "ఆ రోజు నాకోసం ఎస్. ఎస్.ఎస్.ఎల్.సి. పుస్తకాలు పంపితే నేను వద్దన్నానా? నీవల్లే ఆ పరీక్ష పాసయ్యాను. ఇవాళ నా ఆనందం కొద్దీ బాబుకి చిన్న కానుక ఇస్తే వద్దంటున్నావా, అక్కా" అంది.
    "బదులు తీర్చేసుకుంటున్నావా?" అంటూ నవ్వింది శ్రీదేవి.
    పండగ వెళ్ళగానే హైదరాబాద్ వెళ్ళిపోయారు శ్రీదేవీ,భర్తా.

                                   28

    శంకరం రెండు నెలలు తీసుకుని మార్చి పదిహేనవ తారీఖున కాకినాడ వచ్చాడు. శంకరాన్ని కలుసుకోవడానికి ఇంటిల్ల పాదీ స్టేషన్ కి వెళ్ళారు.
    శంకరం తల్లిని, చెల్లెళ్ళని, అక్కని చూడగానే కౌగలించుకున్నంత పని చేశాడు. స్టేషన్ లోనే తల్లికి, శారదమ్మకి వంగి నమస్కారం చేశాడు.
    "ఇతను గోపాల్" అని గోపాల్ ని పరిచయం చేసింది చారుమతి.
    గోపాల్ తో ఆప్యాయంగా కరచాలనం చేసి, "నీ గురించి అంతా ముందుగానే తెలుసునులే" అన్నాడు శంకరం.
    ఇంతలో దూరంగా నవ్వుతూ నిలుచున్న రామారావుగారిని చూసి, "మీరూ వచ్చారా, మాస్టారూ?" అంటూ నమస్కారం చేశాడు.
    "మాస్టారు కాదు, మన బావగారు, భానక్క భర్త" అంది మాలతి.
    మాస్టారు బావగారైపోయారని తెలిసిన శకరం ఆనందం పట్టరానంత అయింది. "బావగారూ!" అంటూ రామారావుగారి దగ్గిరికి వెళ్ళి రెండుచేతులూ పట్టుకున్నాడు.
    "పదవోయ్, బావమరిదీ నువ్వు చూస్తే స్టేషన్ లోనే రోజంతా గడిపేసేటట్టున్నావ్" అంటూ చనువుగా శంకరం వీపుమీద చరిచారు రామారావుగారు.
    అందరు రిక్షాలు కట్టించుకుని ఇల్లు చేరారు. శాంతమ్మ రాత్రి కొడుకు కోసం పాయసం చేసి, విందు చేసింది. శాంతమ్మ, శారదమ్మ వడ్డిస్తూంటే రామారావుగారు, పిల్లలు వంటిల్లంతా నిండుగా కూర్చుని భోజనం చేశారు. భోజనాల దగ్గిర శంకరం తను వెళ్ళిపోయాక ఇంట్లో జరిగిన మార్పులు, భానుమతి పెళ్ళి, మామ్మ చనిపోవడం - అన్నీ అడిగి తెలుసు కున్నాడు.
    "ఇంటి సంగతులు అలా ఉంచు. నీ కీ ఉద్యోగం ఎలా దొరికిందో చెప్పు" అన్నారు రామారావుగారు.
    శంకరం తన కథ చెప్పాడు.
    "ఆ రోజు మీదగ్గిర ఇరవై రూపాయలు, నావి రెండు జతల బట్టలు, దుప్పట్లు తీసుకుని వెళ్ళి పోయావా? రాత్రి తిన్నగా స్టేషన్ కి వెళ్ళి ఫ్లాటుఫారం మీద ఉన్న రైల్లో ఎక్కి కూర్చున్నాను. అది ఎక్కడికి వెళుతుందో కూడా తెలియదు. అసలు నాకు నా గమ్యమే తెలియదు. 'ఎక్కడికి వెళ్ళాలి? ఏం చెయ్యాలి?' అన్నని ప్రశ్నలుగానే ఉండిపోయాయి నాకు.
    నేను ఎక్కిన రైలు సామర్లకోటలో ఆగిపోయింది. అక్కడ కనుక్కుంటే వాల్తేరు-విజయవాడ పాసెంజరు ఒకటి అప్పుడు వస్తుందని తెలిసింది. నేను విజయవాడకి టిక్కెట్టు కొని ఆ రైలులో ఎక్కాను. రాత్రి ప్రయాణం. ప్రయాణీకులంతా నిద్రపోతున్నారు. నేనుమాత్రం కిటికీదగ్గర కూర్చుని, ముందుదారిని గురించి ఆలోచిస్తున్నాను.
    'ఎక్కడికి వెళతారు?' నా ఎదురుగుండా కిటికీ దగ్గిర కూర్చున్న ఆయన ప్రశ్నించాడు. అతను మంచి బట్టలు వేసుకుని, పెద్ద ఉద్యోగస్థుడిలాగే ఉన్నాడు.
    నేను ఆయనవైపు తిరిగి, 'విజయవాడ' అని చెప్పి, మళ్ళీ కిటికీలో నించి చూస్తూ కూర్చున్నాను.
    అతనూ ఇంకేం మాట్లాడలేదు.    
    నాకే కాసేపు ఉన్నాక తోచింది. నలుగురితో మాట్లాడి, నాలుగు విషయాలు తెలుసుకుంటే మంచిదని.
    ఆయనవైపు తిరిగి అడిగాను:
    'మీ రెక్కడ పని చేస్తున్నారు?'
    'సెంట్రల్ గవర్నమెంటులో, మైన్స్ లో' అన్నాడు ఆయన.
    నాకు నిరాశ కలిగింది. నా గ్రూపు సైన్స్ కాదు. నేను చదివింది ఇంజినీరింగ్ కాదు, మైన్స్ లో పని దొరకటానికి. మళ్ళీ మౌనంగా కూర్చున్నాను.
    "మీరేం చేస్తున్నారు?' ఆయన అడిగాడు. చిన్నవాడినైన నన్నుకూడా మన్నించి 'మీరు' అనడం ఆయన సంస్కారవంతుడని తెలుపుతూ ఉంది.
    'నేనేం పని చేయడం లేదండీ. బి.ఎ. పాసై ఊరికే ఉన్నాను. ఎక్కడేనా ఉద్యోగం దొరికితే బాగుండును' అన్నాను.
    'బి. ఎ. లో ఏ గ్రూపు తీసుకున్నారు?' అన్నాడు అతను,
    'లెక్కల గ్రూపు.'
    అతను మళ్ళీ మాట్లాడకుండా కూర్చున్నాడు.
    'నేను మీకంటే చిన్నవాణ్ణి. నన్ను 'మీరు', 'మీరు' అని సంబోధించకండి. మీరు నాకేదైనా సహాయం చేస్తే కృతజ్ఞున్ని. నాకు ఉద్యోగం లేక మా సంసార ఆర్దిక పరిస్థితులేం బాగా లేవు' అంటూ నాన్నగారు పోవడం, మన అప్పులు అన్నీ చెప్పాను.
    అన్నీ విని అతను చివరికి ఇలా అన్నాడు:
    'నీకు మా డిపార్టు మెంటులోనే ఉద్యోగం ఇప్పించ గలను. కాని అది చెయ్యటానికి నువ్వు సిద్ధపడాలి' అన్నారు.
    'ఏమీ లేనివాడికి ఎక్కడైతేనేం? ఏదైతేనేం? ఒక ఉద్యోగం అంటూ ఉంటే చాలు' అన్నాను ఆత్రంగా.
    'ముందర అన్నీ సావకాశంగా విని, ఒక నిశ్చయానికి రా. నేను డిల్లింగ్ డివిజన్ లో నీకు పని ఇప్పించగలను. అక్కడ నీకు మెషీన్స్ అవీ ఎలా నడపాలో నేర్పుతారు. క్రమంగా నువ్వు నేర్చుకొని, నీ అంతట నువ్వే నడప గలవు. పనికి రోజుకి ఇంత అని డబ్బు ఇస్తారు. అంటే నెలకి ఇంత అని జీతం ఇవ్వరు. ఎన్ని రోజులు పనిచేశావో అన్ని రోజులకి డబ్బు దొరుకుతుంది.'
    'అంటే, కూలీలలాగా!' అన్నాను నేను చిన్న బుచ్చుకుంటూ.
    'నువ్వు ఏమైనా అనుకో! కాని ఒక్క ఏడాదిలోనే నీకు మంచి ఉద్యోగం దొరుకుతుంది. జూనియర్ టెక్నికల్ అసిస్టెంటుగా అయిపోవచ్చును. నెలకి మూడు వందల రూపాయలదాకా వస్తాయి.'
    నేను మనస్సులో ఆలోచించుకున్నాను. ఒక్క ఏడాది కష్టపడితే తరవాత మంచి జీతం తీసుకోవచ్చును. ఉద్యోగంకోసం రోడ్లు పట్టుకుని తిరగ నవసరంలేదు.
    'సరే, నా కా ఉద్యోగం ఇప్పించండి' అన్నాను.
    'నాతో రా' అన్నారు ఆయన.
    'ఎక్కడికి?'
    'నేను మధ్యప్రదేశ్ లో 'బిజోరి' అనే చోట పని చేస్తున్నాను. అక్కడికే తీసుకువెళతాను.'    
    'కాని నాదగ్గిర అంత దూరం రావటానికి డబ్బు లేదండీ. నేను ఇంటినించి తెచ్చింది ఇరవై రూపాయలు. టిక్కెట్టు కొనగా చాలా తక్కువ మిగిలింది' అన్నాను సిగ్గుపడుతూ.
    'డబ్బు నేను సర్దుతానులే. మళ్ళీ నీకు సొమ్ము సమకూడాక తీర్చెయ్యవచ్చును' అన్నారు ఆయన.
    అలా భాస్కరరెడ్డిగారితో మధ్యప్రదేశ్ వెళ్ళాను. ఇంక చెప్పడానికి ఏముంది? రోజువారీ జీతంమీద ఏడాది కష్టపడిన తరవాత ప్రస్తుతం ఉన్న ఉద్యోగానికి సెలక్షన్ వచ్చింది" అన్నాడు శంకరం తన కథ ముగిస్తూ.

 

                             
    "ఆ భగవంతుడే ఆ భాస్కరరెడ్డిగారి రూపంలో తనకు కనిపించాడు. ఆయన సహాయం చేసి ఉండకపోతే నా పని ఏమౌనో?" అంది శాంతమ్మ కృతజ్ఞతాభావంతో.
    "ఆ భాస్కరరెడ్డిగారితోపాటు మన బావగారి పేరు కూడా తలుచుకో అమ్మా. మాస్టారి కథ విన్నాకే నాకు ఎలాగైనా కష్టపడి ఉద్యోగం సంపాదించుకోవాలన్న పట్టుదల కలిగింది" అన్నాడు శంకరం.
    "నువ్వు ఇంకొకరనికూడా తలుచుకోవాలి, శంకరం. తన చారు రోజు అంత ఘాటుగా మాటలు అని ఉండకపోతే, నువ్వు అసలు ఇల్లు కదిలేవాడివా?" అంది భానుమతి.
    "మళ్ళీ ఆ రోజు నా మాటలు జ్ఞాపకం చేసి, ఎందుకు నన్ను సిగ్గుపరుస్తావు, అక్కా! చిన్నతనంలో ఏదో అన్నాను" అంది చారుమతి సిగ్గుపడుతూ.
    "నువ్వు చేసింది చాలా మంచి పని, చారూ! భానక్క అన్నట్లు నువ్వు అలాంటి మాటలు అని ఉండకపోతే నాలో వేడి కలిగేదికాదు. నీ మాటలతో నా కర్తవ్యం గుర్తుచేశావు; నా కళ్ళు తెరిపించావు" అన్నాడు శంకరం.
    "మనం ఎంత? మన మాటలకి, చేతలకి ఉండే ప్రభావం ఎంత? మనం మహాత్ములమా? ఏదో సామాన్యులం. ఏటి ఒడ్డున బ్రతికే నీటిపూలవంటివి మన జీవితాలు" అన్నారు రామారావుగారు.
    అందులో ఉండే అర్ధం గ్రహించిన చారుమతి, 'మాస్టారు మన జీవితాలని ఎంత బాగా పోల్చారు! అతి సామాన్యులం మనం. పుట్టడం, ఇబ్బందులు పడటం, పెళ్ళి చేసుకోని పిల్లల్ని కనడం, చనిపోవడం - ఇదేనా జీవితం! ఏ ఒక్క గొప్ప పనీ చేయకుండానే, జీవితంలో ఏ ప్రత్యేకతా లేకుండానే తనువు చాలిస్తాం' అనుకుంది. '


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS