Previous Page Next Page 
అపస్వరం పేజి 30


    అయిదు రోజులు సరదాగా గడిచిపోయాయి.
    ఇక మైసూరికి వెళ్ళిపోతామని పట్టుబట్టింది నర్మద. మీర కెంత ఇష్టం లేకపోయినా ఇక ఒప్పుకోక తపప్లేదు, వెళ్ళేముందు నర్మద,
    "ఏమోయ్, వెళ్ళేముందు మీ శ్రీవారితో వెడుతున్నామని చెప్పొద్దూ" అంది.
    మీర శాము కూర్చున్న గది చూపింది. చంపా, నర్మదా, రాజూ లోపలికి వెళ్ళి,
    "వెళ్ళొస్తామండీ" అన్నారు.
    "మంచిది" అన్నాడు చేతులు జోడించాడు శాము.
    మీర స్టేషనుదాకా వెళ్ళి స్నేహితులకు వీడ్కోలిచ్చి వచ్చింది. ఆమె ఇంటికి తిరిగి వచ్చేసరికి శాము ఇంకా ఇంట్లోనే ఉన్నాడు. బండి ఆగిన చప్పుడు విని "మీరా అన్నాడు. మీర లోపల కొచ్చింది.
    "మీ స్నేహితులు వెళ్ళిపోయారా?"
    "ఆఁ"
    "నేను వల్ల నేమంత ఎక్కువగా పలకరించలేదు. దానికి వాళ్ళేమీ తప్పుగా భావించలేదు కదా?"
    "మీర వ్యంగ్యంగా నవ్వి "ఇంటి కొచ్చిన అతిధులను యజమాని పలకరించకపోతే అవమానంగా భావించటంలో తప్పు లేదనుకుంటా" అంది.
    శాము నొచ్చుకున్నట్లుగా,
    "ఆడపిల్లలతో మాట్లాడే అలవాటు లేదు నాకు" అన్నాడు,
    మీర వెక్కిరింపుగా "అవధానిగా రమ్మాయి వెంకువస్తే మాత్రం కబుర్లకు అంతే ఉండదు."
    "వెంకు, నేను ఎత్తుకుని ఆడించిన పిల్ల. మే మిద్ధరమూ ఇక్కడే పుట్టి పెరిగిన వాళ్ళం. నీ స్నేహితులు ఇంకా ఇప్పుడే ఇంగ్లండునుండి వచ్చిన వారిలా పంచదారలో రాళ్ళు కలిపినట్టు కన్నడమూ ఇంగ్లీషూ కలిసి మాట్లాడతారు. నేను సరిగ్గా అర్ధం చేసుకోలేక తప్పు తప్పుగా తెలుసుకోవటానికన్నా, దూరంగా ఉండటమే మంచిదికదూ?"
    భర్త మాటలవల్ల, భర్త తనకన్నా తక్కువ చదువుకున్నవాడన్న సంగతి స్పురించి మనసుకు గాయం కలిగించింది. పెళ్ళయినప్పటినుండి భర్త తగినంత చదువుకున్నవాడు కాదన్న విషయం ఆమెను పదే పదే బాధిస్తూనే ఉంది. అందరు ఆడపిల్లల్లాగా మీర తన భర్త తనకన్నా ఎక్కువ చదువుకున్నవాడవ్వాలని సహజంగానే ఆపేక్షించింది. ఇప్పుడు ఈ మాటలవల్ల అతనిమీద ఒక విధమైన తిరస్కారభావం ఉదయించిందామె మనసులో.
    తన స్నేహితురాళ్ళు వచ్చిన రోజు రాత్రి, శాము జరిపిన అత్యాచారంవల్ల దైహిక సంబంధం మీదనే జుగుప్స కలిగిందామెలో. మళ్ళీ తన స్నేహితులు వెళ్ళిపొయ్యేదాక గదివేపు తిరిగి చూడలేదామె. ఆ రోజున అతని ప్రవర్తన గుర్తుకొచ్చినపుడల్లా భార్యా భర్తలన్న ఈ బాంధవ్యాన్నే వదలిపెట్టి పారిపోవాలనిపించేది.
    రాత్రి మౌనంగానే భోజనాలయ్యాయి. వంటింటి పని ముగించుకుని వెంకమ్మగారు పడుకొన్నారు. మీరచేతిలో ఓ పుస్తకం పట్టుకొని, హాల్లోని దీపపు మంద ప్రకాశంలో చదువుతూ కూర్చుంది. బయట పెంకులమీద పడుతోన్న వర్షపు చినుకు శబ్దం వినిపిస్తోంది. శాము మీరకోసం కాస్సేపు ఎదురు చూశాడు. ఎంత సేపటికి మీర రాకపోయే సరికి ఆశ్చర్యంతో బయటికి వచ్చాడు. చలికి వణుకుతూ, శరీరాన్ని ముడుచుకొని జోగుతోంది మీర. శాము ఆమె దగ్గరగా వెళ్ళి భుజం తట్టి,
    "మీరా, వచ్చి పడుకోవూ?" అన్నాడు.
    "ఊహూఁ నేను చదువుకోవాలి."
    శాము ఆమె చేతిలోని పుస్తకం లాక్కుని, చిన్నగా వెలుగుతూన్న దీపాన్ని వూది ఆర్పేశారు.
    "ఇక పదా."
    "ఉహూఁ.....నేను.....రాను. కథ చదువుకోవాలి."
    "చలిగాలి కొడుతోందిక్కడ."
    "నాకేం చలి వేయటంలా."
    "లేస్తావా లేదా?" కటువుగా అన్నాడు శాము.
    మీర రాను రానంటున్నా వినకుండా శాము ఆమెను లేవదీసి, గదిలో పడుకోబెట్టాడు. మీర బెదరిన పసిపాపాయిలా పడుకుంది. శాము ఆమెకు రగ్గు కప్పి, కిటికీ క్రింద రెక్కలు వేసేసి తన పక్క మీదున్న శాలువా భుజంమీదవేసుకొని తలుపు దగ్గరగా వెళ్ళి ఒకసారి మీర వేపుచూసి బయటికి వెళ్ళాడు.
    అతని ప్రవర్తన మీరను ఆశ్చర్యపర్చింది. ఆ రోజు పశువులా ప్రవర్తించిన భర్తకూ, ఈరోజు తనకు తానే గది విడిచి వెళ్ళిపోతూన్న భర్తకూ పోలికే లేదనిపించింది, అతని స్వభావపు తీరే అర్ధం కాలే దామెకు. శాము తన బుద్ది, వివేకాలకు లోబడి ప్రవర్తించటంకన్నా, భావోద్వేగం, అరిషడ్వర్గాలకు దాసుడై నడచుకుంటాడనుకుంది. తనకు ఆకలిగా ఉన్నపుడు, ఇంకొకరిని చంపేసి, వారి ఆహారాన్ని అపహరించేటంత క్రూరుడైనా తనకు ఆకలి వెయ్యనపుడు, తన ఆహారాన్ని ఇంకొకరికి దానంచేసే కరుణా హృదయుడు కూడ. అతను ఎంత మొరటుగా ఉండగలిగేవాడో అంతే మృదువుగా కూడా ఉండగలడు. అని తెలుసుకుంది, మీర. తనకు కావాలనిపించినపుడు నొప్పించి క్రూరంగా ప్రవర్తించిన మనిషి ఈరోజు తనకు అక్కర్లేనపుడు ఆమె అనుమానాన్ని గ్రహించి, చలిలో వణుకుతూంటుందని వూహించి కఠినంగా మాట్లాడి, లోపల పడుకోబెట్టి రగ్గు కప్పి వెళ్ళి పోయిన సన్నివేశం ఆమెను ఆశ్చర్య పరచింది.
    ఉదయం మీర లేచే సరికే శాము లేచి కాఫీ తాగుతున్నాడు. మీరను చూసి నవ్వుతూ.
    "రాత్రి బాగా నిద్రపట్టిందా?" అనడిగాడు.
    మీర అతనివేపు పరీక్షగా చూసింది. అతని కంఠంలోగాని మొహంలోగాని లేశ మాత్రమైనా వ్యంగభావం కనిపించలేదు.
    సంసార రధం ఎప్పటిలాగానే సాగిపోతోంది. జీవితంలో ఏ విధమైన వైవిధ్యతా లేకుండా నడచిపోతోంది. తాబేలు తన చిప్పలో తనే ముడుచుకపోయినట్టుగా,  మీర తన మనసులో కల్పనా సామ్రాజ్యాన్ని నిర్మించుకుని, దానికి రాణియై రోజుకో రకమైన పగటి కల కంటూ కలలోలా జీవించసాగింది. రోజు రోజుకూ ఎక్కువైపోతోన్న ఆమె పరాధ్యానాన్ని గమనించాడు శాము.
    శాము పొలం నుండి ఇంటి కొచ్చేసరికి మీర చేతిలో ఓ మాసపత్రిక పట్టుకొని కూర్చుంది. ఆమె కళ్ళు పుస్తకాన్ని చూస్తున్నా, మనసు అందమైన కల కంటోంది.
    పెద్ద ఆసుపత్రి. తెల్లటి వస్త్రాలను ధరించిన నర్సులు గంభీరంగా అటూ ఇటూ తిరుగుతున్నారు. ఆపరేషన్ థియేటర్ లో రోగిని పడుకోబెట్టారు. పెద్ద పెద్ద డాక్టర్లంతా ఆమెకు ఆపరేషన్ చేసే ధైర్యంలేక వెనుదీస్తున్నారు. డాక్టరు మీర తెల్ల జార్జెట్ కట్టుకొని, తెల్ల కోటు వేసుకొని వస్తుంది. డాక్టర్లంతా గౌరవంతో పక్కకు తప్పుకొని ఆమెకు చోటిస్తారు. మీర లోగిని పరీక్షించి జయప్రదంగా ఆపరేషన్ చేస్తుంది. సబ్బుతో చేతులు కడుక్కొని టవల్ కోసం అక్కడే టవల్ పట్టుకు నిల్చున్న నర్స్ వేపు చేయి చాస్తుంది.
    చాచిన చేతిని ఎవరో పట్టుకు లాగటంతో ఈ ప్రపంచంలో పడింది మీర. శాము ఆమె చేతిని పట్టుకొని "మీరా, మీరా" అని పిలుస్తున్నాడు.
    "ఏమిటి?"
    "ఏమిటి ఆలోచిస్తున్నావు?"
    "ఏం లేదే? చదువుతూ కూర్చున్నా."
    "అబద్ధం, పుస్తకమైతే చేతిలో ఉందిగాని, నువ్వు మాత్రం చదవటంలేదు."
    "లేదండీ, నిజంగా చదువుకుంటున్నా."
    "ఏమీ తోచటంలేదా?"
    "తోచకేం?"
    శాము ఆమె మాటలను నమ్మలేదు. కాని నమ్మినట్టు నటించి,
    "ఈరోజు నా స్నేహితులు శ్రీరాములు, వెంకటేశం వస్తున్నారు. రేపు వెళ్ళిపోతారనుకుంటా. పంటేం చేయిస్తావో చూడు."
    శ్రీరాములు, వెంకటేశం, పక్క పల్లెలోని వారు. శాముకు వారితో చాలా రోజులుగా స్నేహం. ఏదో పనిమీద ఆ వూరికివచ్చిన వారిని భోజనానికి ఆహ్వానించాడా శాము.
    పదింటికి శ్రీరాములు వెంకటేశాలను తీసుకొచ్చాడు. శాము భోజనాలయ్యాక ముగ్గురూ డ్రాయింగ్ రూములో కూర్చున్నారు, వాళ్ళమధ్య తమలపాకుల పల్లెంలో కట్ట తమలపాకులు పావుశేరు వక్కలూ ఉన్నాయి. కబుర్లు చెప్పుకుంటూ తమలపాకులు వేసుకోసాగారు. కట్ట తమలపాకులు ఎలా చాలుతాయి?
    "ఇంకాస్త తమల పాకులు తెప్పించవయ్యా శాము."    
    "మీరా, కాస్త తమలపాకులు వక్కలు పట్రా."
    శాము కూర్చున్న చోటినుండే కేకేసాడు.
    మీర ఆకులు, వక్కలు పళ్ళెంలో పెట్టుకుని డ్రాయింగ్ రూములో అడుగు పెట్టింది. అక్కడి దృశ్యంచూసి నోట మాటరాక అలాగే నిలబడి పోయింది.
    శ్రీరాములు, వెంకటేశం సోఫాలో తమ మురికికాళ్ళు పైన పెట్టుకుని కూర్చున్నారు. సోఫా కవర్ సున్నపు మరకలతోనూ, తాంబూలపు ఎర్రటి చుక్కలతోను, నిండివుంది. క్రింద నున్న తివాసిమీద తమలప్కుల ఈనెలూ, బీడీ ముక్కలూ పడిఉన్నాయి. ఒకచోట పీల్చి పారవేసిన బీడీ ముక్కలోనుంచి ఇంకా పొగ వస్తోంది. మీర దాని దగ్గరగా వెళ్ళి చూసింది. పూర్తిగా ఆరని బీడీ ముక్కలోని నిప్పు, రత్నకలబళిమీదున్న ఒక పువ్వు భాగాన్ని కాల్చివేసింది. మీర ఆ నిప్పును కాలితో రాచి, ఆర్పేసి, భర్తవేపు తీక్షణంగా చూసి వెళ్ళిపోయింది.
    శాము స్నేహితులు వెళ్ళిపోయాక, భర్తతో దెబ్బలాడింది.
    "చంపా, రాజు వచ్చినపుడు ఇంటి తలుపులూ, దూలాల కంతా 'జీవన సపనా టూట్ గయా' వచ్చే సింది, అన్నారే ఇప్పుడు చూడండి. సోఫా, తివాసీల జీవితాలకే ముప్పు వచ్చింది."
    "నన్నేం చేయమంటావు మీరా? వాళ్ళకు నే నెలా చెప్పను?"
    "క్రింద బీడీ ముక్కలు వేయకండని చెప్పే, సున్నం రాయడానికి మీ టవల్ ఇవ్వాల్సింది."
    "అలా చెప్పలేకపోయాను. రాక రాక వచ్చ్రారా? అలా చేయకు, ఇలా చేయకు అని చెప్పగలవా?"
    "నన్నడగ లేకపోయారా? ఒక రేకు పళ్ళెం ఇచ్చి ఇదే 'ఆష్ ట్రే!....." అనే దాన్ని-ఆర్పని బీడీ ముక్క క్రింద పడేస్తారని వూహించలేదు నేను."
    మీర కాలిపోయిన రత్న కంబళి భాగాన్నిచూసి "అన్యాయంగా పాడైంది." అంటూ గొణిగింది.
    వారం రోజులుగా మీర వంట్లో బాగుండటం లేదు. స్నానం చేసేటపుడు వేడి నీరు వంటిమీద పడేసరికి, కళ్ళు తిరిగి చీకట్లు కమ్మాయి. మెల్లిగా తేరుకొని ఎలాగో స్నానమయిందనిపించి బయటికి వచ్చింది. జడ వేసుకొని బొట్టు పెట్టుకోవటానికి అద్దంముందు నుంచున్నప్పుడు కంటిచుట్టూ నల్లగా ఏర్పడిన వలయాన్ని మొదటిసారిగా గమనించింది, మీర. వేలితో కంటిచుట్టూ ముట్టి చూసుకుంది. ఎర్రగావున్న వేలు, తెల్లగా పాలి పోయినట్టుండటం చూసి "ఇదేమిటి ఇలా అయ్యాను?" అనుకుంటూ తన చేతులమీదికి దృష్టి పోనిచ్చింది. తను చిక్కిపోయిందన్న సంగతిస్పష్టంగా తెలిసి వచ్చిందప్పుడు. బిగుతుగా వుండే చోళీ చేతులు ఒదులుగా ఉన్నాయ్.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS