Previous Page Next Page 
ఆంతస్తులూ అంతఃకరణలూ పేజి 30

                        

                               19

    సుందరం ప్రక్కగా ఉన్న టేబిలు మీద గాగుల్సు కోసం చేత్తో తడమ సాగాడు.
    కాఫీ కప్పుతో వచ్చిన సుధీర హృదయం ఆ దృశ్యం చూచి ఆవేదనతో అలమటించి పోయింది. ఓ క్షణం తర్వాత తన్ను తాను సంభాలించుకుని -- "ఏం కావాలన్నయ్యా!'అంది.
    "నువ్వోచ్చావా సుధీ!నా గాగుల్సు ఎక్కడున్నాయో కాస్త చూడు"అన్నాడు కళ్ళను ఎడం చేత్తో కప్పుకుంటూ. నల్లగా, కాటుకలా చీకటి రాకాసిలా ఉన్న కనురెప్పలనూ, కంటి క్రింద భాగాన్నీ ఓ లిప్తకాలం పాటు చూసిన సుధీర చలించి పోయింది. తన ప్రయత్నం లేకుండానే కళ్ళల్లో నీళ్ళు చిప్పిల్లాయి. టేబిలు మీద ఉన్న గాగుల్సు తీసి సుందరం చేతికిచ్చింది.
    సుందరం గాగుల్సు పెట్టుకుని నవ్వుతూ -- "ఇదొక్కటే కష్టం సుధీ! అయినా నీలాంటి చెల్లెలు ప్రక్కనుంటే , ఆ కష్టం కూడా లేదనుకో" అన్నాడు.
    సుధీర హృదయంలో ఎవరో చెయ్యి పెట్టి దేవినట్లయింది. తను బాధ పడుతుందనేగా అన్నయ్యే యిలా మాట్లాడుతున్నాడు? తన సుఖమూ, తన సంతోషమే ప్రధానంగా భావించే అన్నయ్య ఈరోజు వాటిని తృణప్రాయంగా త్యజించాడు. ఇతరుల సుఖమూ, సంతోషమే తన జీవిత లక్ష్యంగా ఉంచుకొన్నాడు. అబ్బ! నిజంగా అన్నయ్య ఎంత మారాడు! తను అన్నయ్య కోపం ఏం చెయ్యలేదా?
    "ఏవిటి , సుధీ , ఆలోచన? నేచేప్పిన మాటలో అసత్యమేముంది?"
    "లేదన్నయ్యా! నేనెప్పుడూ నీదగ్గరే ఉంటాను. నీకే కష్టమూ రానివ్వను. కాఫీ తీసుకో" అంది కప్పు చేతి కందిస్తూ.
    సుందరం కాఫీ త్రాగి కప్పు సుధీర చేతికిచ్చి "నువ్వు కాఫీ త్రాగావా?' అన్నాడు.
    "ఊ.... " కుర్చీలో కూర్చుంటూ ఊ కొట్టింది.
    "అయినా ఎంత కాలం నిన్ను నాదగ్గర  పెట్టుకుంటాను? నన్నంత స్వార్ధ పరుడుగా అనుకోకు సుమా!" అన్నాడు ఎత్తుగా వేసి ఉన్న దిండ్ల నానుకుని కూర్చుంటూ.
    సుధీర మౌనంగా సుందరం ముఖంలోకి చూస్తుండి పోయింది.
    "భానుని చేసుకోవడం లేదని వ్రాశావుగా? బాగా ఆలోచించే ఆ నిశ్చయానికి కొచ్చావా?"
    'అవును." నిశ్చల కంఠం తో అంది.
    "నాకు డిల్లీలో ఇద్దరు స్నేహితులు ఉన్నారు. ఒకతనేమో ఐ.ఎ.ఎస్. ఆఫీసర్ . ఇంకొకతను ఫారిన్ రిటర్నడి ఇంజనీరు. ఇద్దరూ మన కులం వాళ్ళే. బాగానే వుంటారు. బుద్ది మంతులు . వింటున్నావా సుధీ."
    "ఊ....చెప్పు."
    "నీ ఫోటో చూచి నిన్ను చేసుకునేందుకు యిద్దరూ యిష్టపడ్డారు. నీకెవరు నచ్చితే వాళ్ళనే చేసుకో. భానుతో చెప్పి యిద్దరికీ ఉత్తరాలు రాయిస్తాను."
    "బావ కెందుకు లేనిపోని శ్రమ?"
    "అదేం ?' లేని ఆశ్చర్యాన్ని ముఖం మీదకు తెచ్చుకుని అడిగాడు.
    "ఇప్పుడా విషయాలన్నీ ఎందుకూ? నువ్వు విశ్రాంతి తీసుకో, అన్నయ్యా!"
    "ఫర్వాలేదు చెప్పు, ఎప్పుడో ఒకప్పుడు తెలుసుకోవలసిన విషయాలేగా?"
    సుధీర ఏం మాట్లాడలేదు. రెండు నిమిషాలు నిశ్శబ్దంగా గడిచిపోయాయి.
    "ఉన్నావా? వెళ్ళిపోయావా, సుధీ?" నిశ్శబ్ధతను భంగ పరుస్తూ అడిగాడు సుందరం.
    "ఉన్నాను."
    "ఏవిటా దీర్ఘాలోచన?"
    "ఏముంది?"
    "నాముందేమిటో దాస్తున్నావు. గుడ్డివాడు కదా అని మరీ అంత అన్యాయం చెయ్యకు!" నవ్వుతూ అన్నాడు.
    "అవెం మాటలు? నీముందు నేను దాచే విషయాలు ఏమున్నాయి?" విషాన్నవదనంతో అంది.
    "ఆడవాళ్ళంతా అంతే! చచ్చినా నిజం చెప్పరు!' అని నిటారుగా మంచం మీద కూర్చుని --"సుధీ! నాకు శేఖరాన్ని చూడాలని ఉంది" అన్నాడు.
    అ మాటతో సుధీర అప్రతిభురాలై పోయింది. నెమ్మదిగా తేరుకుని "ఎందుకూ?' అంది.
    "కవులేలా వుంటారో చూద్దామని."
    "ఎలా చూస్తానన్నయ్యా!" దోసిట్లో ముఖం దాచుకుని విలవిల్లాడిపోయింది.
    "పోనీ, ఎలా వుంటాడో నువ్వు చెప్పు. వింటాను."
    సుందరం ధోరణి వింతగా కనిపించింది సుధీరకు.
    "చెప్పు,సుధీ!"
    "సన్నగా , కాస్త పొడుగ్గా , చామన చాయలో ."
    "అందంగా?"
    "ఊహు.... అంత అందగాడెం కాదు."
    "నా స్నేహితుల్లో ఒకతనేమో దేవా నంద్ లా, మరొకతను జయ్ ముఖర్జీ లా వుంటారు."    
    'అయితే?' దానికీ దీనికీ సంబంధమేమిటో అస్పష్టంగా తెలుస్తున్నా, స్పష్టంగా తెలుసుకునేందుకు ప్రశ్నించింది సుధీర.
    "ఇంత మంచి సంబంధాలను కాదని....శేఖరాన్ని...."
    "అన్నయ్యా!" మధ్యలోనే అడ్డుపడింది.
    "అన్నయ్య కీవిషయాలన్నీ ఎలా తెలుసనేగా నీ ఆశ్చర్యం! భానును నువ్వు పెళ్ళి చేసుకోవడం లేదని వ్రాసిన రోజే యిలాంటిదేదో జరిగి వుంటుందని ఊహించను. ఈరోజు అంతా చూశాను. కళ్ళు లేని మాట నిజమే! 'మ!' అని అతను నిన్ను పిలిచడంటే మీ ఇద్దరి మధ్య ఎంతటి సన్నిహిత సంబంధముందో నేను ఊహించలేవనుకున్నావా? అదే నాన్నుంటే నీ ప్రవర్తన యిలా హద్దులు మీరిపోయేదా? అతని అంతస్తుకూ, మన అంతస్తుకూ సంబంధముందా?శేఖరమంటే నీకెందు కింత అభిమానమో నాకర్ధం కాదు, సుధీ! అంతస్తా? ఐశ్వర్యమా? పెద్ద చదువా? అందమా ? ఏం చూసి నువ్వు శేఖరాన్ని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నావు?"
    "మనసు."
    'అంత మంచి వాడా నీ శేఖరం?"
    సుందరం కంఠంలోని హేళనను సుధీర గమనించక పోలేదు.
    "నీ స్నేహితుల కంటే చాలా మంచివాడు" అంది కఠినంగా.
    "నా స్నేహితులతో పోటీ పెడతావా?" అన్నాడు సుందరం కోపంగా.
    "పోటీ పెట్టడం తప్పే!శేఖరం ముందు వాళ్ళు సూర్యుని ముందు దివిటీల్లా వెలవెలా పోతారు!'
    "అబ్బో! ఎంతోటి ఉపమానం!"
    'అంతంత చదువులు చదువుకున్నారన్నమాటే గాని ఒక ఆదర్శమా? పాడా? ఏముందీ ? ఛీ! ఛీ! ఏ అమ్మాయికి ఎక్కువ కట్నమిస్తే ఆంమాయిని చేసుకోవడం ! పోనీ నాకంటే అందమైన అమ్మాయిని, ఎక్కువ చదువుకున్నదాన్నీ , గుణ వంతురాల్ని చూపిస్తాను. మీ స్నేహితుల్లో ఒకరైనా చేసుకుంటారా?'
    "అంటే?' కట్నం లేకుండానా?"
    'అవును"
    "చేసుకోరు."
    "మరి డబ్బును చూసేగా నన్ను చేసుకోవడం?"
    "ఊ...."
    "కట్నం తీసుకోవడం నేరమని ప్రభుత్వం శాసించింది."
    సుందరం అదోరకంగా నవ్వాడు.
    'అంత పెద్ద చదువులు చదివి ఏం ప్రయోజనం? హృదయంలో సంస్కారం లేకపోయాక? అలాంటి వాళ్ళనెగా నువ్వు చేసుకోమనేది? శేఖరం కన్నా వాళ్ళు ఏ విషయంలో గొప్ప?"
    "మాటలు నేర్చావు సుధీ!" అన్నాడు సుందరం నవ్వుతూ.
    సుందరం నవ్వు చూశాక సుధీరకు మతి పోయినంత పనయింది. ఇంతకు ముందేగా ఎక్కడ లేని కోపాన్ని వెళ్ళగ్రక్కాడు? ఇంతలోనే ఈ నవ్వేమిటి? తన్ను పరీక్ష చేస్తున్నాడేమో? చేస్తే చెయ్యనీ. ఈమాత్రపు పరీక్షలో తను గెలవలేక పోతుందా? పొంగి పొర్లిన ఆవేశమంతా చప్పగా చల్లారిపోయింది.
    "ఇంతకూ ముందు, అంటే యుద్దానికి వెళ్ళక ముందు యీ విషయం తెలిసి వున్నట్లయితే నిన్ను గదిలో బంధించి, నా స్నేహితుడికి లక్ష రూపాయలు కట్నమిచ్చి నీకు పెళ్ళి చేసేవాణ్ణి. కానీ యిప్పటి పరిస్థితి వేరు."
    "ఊహు.... ఎప్పుడయినా సరే.... నువ్వు నన్ను బంధించలేవు! ఆ రోజులు పోయాయి." అంది తల అడ్డంగా త్రిప్పుతూ ఆప్రసన్న వదనంతో.
    "కానీ.... అమ్మ బాధ పడుతుంది."
    "మీనాక్షి వస్తోందన్నయ్యా! ఇక ఆ విషయాలన్నీ మాట్లాడకు." అంది ఆత్రంగా సుధీర.
    మీనాక్షి గది గుమ్మం దగ్గర నిల్చుని సుందరం వేపు కొన్ని క్షణాలు కనురెప్పలు కూడా ఆర్పకుండా చూసింది.
    "కూర్చో!" అంది సుధీర.
    మీనాక్షి మౌనంగా కుర్చీలో కూర్చుంది.
    ఎర్రగా వున్న మీనాక్షి కళ్ళ వేపు ఓరగా పరిశీలనగా చూసింది సుధీర.
    సుందరం అలాగే కూర్చున్నాడు చిత్తరువులా.
    "మీనాక్షి వచ్చిందన్నయ్యా!" అంది పరిస్థితి నర్దం చేసుకున్న సుధీర.
    "వచ్చిందా?"
    "ఊ...."
    "ఎందుకొచ్చిందో కనుక్కో!" అన్నాడు గోడ వేపు మళ్ళీ దోసిట్లో ముఖం దాచుకుని.
    అసలే ఎర్రబడినమీనాక్షి కళ్ళలో నీళ్ళు కదిలాడాయి.
    సుధీర నిశ్చేష్టయై అలాగే గోడ వేపు చూస్తుండి పోయింది కొన్ని క్షణాలు. "అదేమిటన్నయ్యా?' కాసేపటికి తడబడే గొంతుతో ప్రశ్నించింది.
    "నన్ను చూడ్డానికే వచ్చావు కదూ , మీనాక్షి? ఎందుకు నామీద అంత కనికరం? నీ బ్రతుకు బండలు చేశాననా? నీ హృదయంలో ఆరని చిచ్చు రగిల్చాననా? నువ్వు మునుపటి లాగే వుండు. ఆ కోపమూ, ఆ పగా అలాగే వుండనీ, నేను చేసిన అన్యాయానికి ప్రతీకారం చెయ్యి. కానీ యింత మంచిగా మటుకు వుండకు. అది నా హృదయం భరించలేదు." బాధగా , బరువుగా ఒక్కోమాటే మెల్లగా అన్నాడు సుందరం.
    మీనాక్షి బరువుగా విశ్వసించింది. చెమ్మగిల్లిన కళ్ళను పైట చెరగుతో తుడుచుకుంది. హృదయం నిండుకూ సుందరం పట్ల సానుభూతో నిండిపోయింది.
    మీనాక్షి పూర్తిగా మారిపొయిందన్నయ్యా!" అంది సుధీర సుందరం వేపు చూస్తూ.
    "మీనాక్షి నన్ను చిత్రహింస చెయ్యాలనుకుంటుందేమో?' అన్నాడు బరువుగా నిట్టూర్చి.
    మీనాక్షి హృదయం నుండి దుఃఖం పెల్లుబికిపొంగింది. ఇక ఏమాత్రం తన్ను తాను సంభాళించుకోలేక అధీరయై సన్నగా కంపిస్తున్న కంఠంతో "అలా అనకు బావా!జరిగింది జరిగిపోయింది. నా ముఖాన దేవుడు యిలాంటి రాతే రాశాడు! అందుకు ఎవరేం చేస్తారు? ఒకనాడు  అజ్ఞానం లో నా స్థితికి మీరందరూ బాధ్యులని భావించాను" అంది.
    "నీకు చేసిన అన్యాయానికి భగవంతుడు నన్ను సరిగ్గానే శిక్షించాడు!' విషాదంగా నవ్వి అన్నాడు సుందరం.
    'అలా ఎప్పుడు అనుకోకు. నన్నెవ్వరూ అన్యాయం చెయ్యలేదు."అందిమీనక్షి కన్నీళ్ళు తుడుచుకుంటూ వ్యధిత కంఠంతో.
    "మెట్రిక్కుకు వెళ్తున్నావటగా?" అన్నాడు మోచేతుల్లో గడ్డం ఆన్చి.
    'అవును. బ్రతికినంత కాలం అన్నయ్యకు బరువుగా వుండడం యిష్టం లేదు."
    ఆ మాటతో సుందరం హృదయం సుళ్ళు తిరిగి పోయింది. తనే మీనాక్షిని చేసుకోనుంటే మీనాక్షికి ఇలాంటి స్థితి ఎందుకు కలిగేది? మీనాక్షి హృదయంలో ఎన్ని అగ్నిపర్వతాలు మండుతున్నాయో? అయినా తనిప్పుడే విధంగానూ సహాయ పడలేని అసహాయుడు. భగవాన్! ఎందుకు జీవితాల నిలా అర్ధరహితంగా చేస్తావు? మీనాక్షి నీకేం అపకారం చేసిందని? ఆవేదనతో పరితపించింది సుందరం హృదయం.
    "ఊ..... అయితే బాగా చదువుతున్నావా?' అన్నాడు హృదయంలో కలిగిన అలజడిని బయట కనబడనీయకుండా.
    "ఆ మాట అసలు అడగనక్కర్లెదన్నయ్యా!" అంది సుధీర కుర్చీలో నుండి లేస్తూ.
    "ఇక వెళ్తాను , బావా!"అంది మీనాక్షి తానూ లేస్తూ.
    'అయితే నన్ను మనస్పూర్తిగా క్షమించి నట్లేనా?" అన్నాడు సుందరం సన్నగా నవ్వుతూ.
    'అవేం మాటలు?' మందలింపుగా అంది మీనాక్షి.
    "ఊ.... అయితే యిక వెళ్ళు" అన్నాడు గోడ వైపు తిరిగి పడుకుంటూ.
    మీనాక్షి, సుధీరా యిద్దరూ అక్కడి నుండి వెళ్ళిపోయారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS