Previous Page Next Page 
మిసెస్ కైలాసం పేజి 30


                                బ్రతుకు ఖరీదు

    ఆరోజు జడ్జీ విశ్వనాథంగారు యింటికి వస్తూనే ఆలోచనలో పడ్డారు.
    ఫైల్సు లోపలపెట్టి డ్రైవరు చేతులు కట్టుకొని నిల్చున్నాడు. "ఇక నువ్వెళ్ళొచ్చు" అన్నట్లు తల పంకించాడు జడ్జీగారు. లోపల కొస్తూనే ఈజీచైర్ లో చేరగిలబడి "లా" పుస్తకాలు తిరగేయటం మొదలుపెట్టారు. విశ్వనాథంగారి భార్య పార్వతమ్మ హార్లిక్సు కలుపుకొని గదిలోకి వచ్చింది.
    "ఒక్కక్షణం కూడా విశ్రాంతి తీసుకోకపోతే ఎట్లాగండీ? ఎప్పుడూ కేస్ స్టడీసేనా?" అంది భార్య పార్వతమ్మ గ్లాసు అందిస్తూ.
    "ఏంచేయమంటావ్? నా వృత్తి అలాంటిది!" లేని నవ్వు తెచ్చిపెట్టుకుంటూ హార్లిక్స్ గ్లాసు అందుకొన్నారు జడ్జీగారు. రెండుగుక్కలు హార్లిక్స్ చప్పరించి "ఇహ నువ్వు వెళితే బాగుంటుంది" అన్నట్టు భార్యకేసి చూశారు. పార్వతమ్మ తనను కానట్టే ఎదురుగా సోఫాలో చతికిలబడింది. దాంతో జడ్జీగారు హార్లిక్స్ మాట మర్చిపోయి మళ్ళీ పుస్తకాలు తెరిచారు.
    "ఆ కేసు జడ్జిమెంట్ రేపేనటగా?" అంది పార్వతమ్మ.
    హంతకుల్లో ఒకడు అప్రూవర్ గా మారినప్పుడు కూడా అదరిపడని విశ్వనాథంగారు నిజంగానే ఇంతెత్తున అదిరిపడ్డారు.
    "ఏ కేసూ?"
    "అదేనండీ! మీకు మరీ ఇంత మతిమరుపయితే ఎట్లా?"
    "నాకు మతిమరుపైతే నష్టం నీకూ నాకూ ఏంలేదులే!"
    "మరెవరికంటారు? లాయర్లకా?"
    "వాళ్ళ సొమ్మేంపోతుంది? కోర్టుకు న్యాయంకోసం వచ్చిన క్లయింట్లకు!" భార్య ముఖంలోకి సూటిగా చూస్తూ అన్నారు జడ్జీగారు.
    "అదే నేను చెప్పొచ్చేది!" పార్వతమ్మ చిటిక వేసినట్లు, కొమ్ములు తిరిగిన లాయరులా మాట్లాడింది.
    విశ్వనాథంగారు తెల్లమొహంవేసి, చల్లారిపోయిన హార్లిక్స్ గడగడతాగేసి, తెల్లమీసాలు తుడుచుకున్నారు.
    పార్వతమ్మ భర్త చేతిలోని గ్లాసు అందుకొని "ఇవ్వాళ బెంచి కొచ్చిందటగా? రేపు జడ్జిమెంటని...." ఆమె మాట పూర్తికాకుండానే జడ్జీగారు, "ఎవరు చెప్పారూ?" అన్నారు.
    "ఎవరు చెప్పటం ఏమిటండీ? మన ప్రకాశ్" భర్త పడకకుర్చీలోంచి నిలువునా లేవడం చూసి, మాట పూర్తికాకుండానే పార్వతమ్మ నోరు తెరచింది. చేతిలోవున్న గ్లాసు కిందకు జారిపోయింది. ప్రాణం లేని గ్లాసు తనంతటతను జారిపోదు కనక పార్వతమ్మే వదిలేసివుండాలి. "లా" దీన్ని గురించి ఏం చెబుతుందో, విచారించకుండానే, జడ్జీగారు, గదిలోంచి "రైజ్" అయి హాల్లోకి వచ్చారు. వంకెనవున్న చేతికర్రను అందుకొని వెనకేవచ్చి నిలబడ్డ భార్యకేసి చూశారు.
    "ఇవ్వాళ కూడా వాకింగ్ ఏమిటి, అబ్బాయి పుట్టినరోజని మర్చిపోయారా?" అన్నది.
    "సరే! అయితే కొంచెం ఆలస్యంగానే వస్తాలే!" అంటూ బయటకు నడిచారు విశ్వనాథంగారు.
    పార్వతమ్మకు ఈ లా పాయింట్ అర్థంకాక తన్నుకు చచ్చింది. ఇంట్లో శుభకార్యం చేసుకుంటూ బయటకు వెళ్ళటం ఏమిటంటే, ఆలస్యంగా వస్తానంటూ భర్త బయటకుపోవటం ఏమిటో ఆమెకు బోధపడలేదు. అయోమయంగా బయటకు వెళ్ళిపోతున్న భర్తకేసి చూసింది. "జిత్తులమారి లాయర్ని బోల్తా కొట్టించినంత సంతోషంగా విశ్వనాథంగారు, భార్యకేసి ఓసారిచూసి రోడ్డుమీదకు వచ్చారు.
    ఆయనగారి పెదవులపై విరిసిన హాసరేఖ వీధిమలుపు తిరిగేంత వరకూ వుంది. దానికి మూలమైన కథనాన్ని నెమరువేసుకుంటూ నడక సాగించారు విశ్వనాథంగారు. ఇంట్లో చినబాబు పుట్టినరోజు పండగని తనకు తెలియందికాదు. చుట్టుపట్ల అమ్మలక్కలూ, పిల్లాజెల్లా ఇంట్లో చేరతారు. ఆ గందరగోళంతో తనకేమీ తోచదు. అమ్మలక్కలు తన మొహాన ఏదో దోబూచులాడుతున్నట్లు తనను తొంగితొంగి చూడటం తనకు పరమ అసహ్యం. పిల్లల కాకిగోల తనకు మహాచిరాకు కలిగిస్తుంది. ఇంట్లో హడావిడి తగ్గేంతవరకూ తను హాయిగా, ప్రశాంతంగా షికారు చేసి తిరిగిరావచ్చు.
    అంటే తన కొడుకు పుట్టినరోజు సంబరం చూడటం తనకు ఇష్టంలేదని కాదు. తండ్రిని మించిన తనయుడవుతాడు తన కొడుకు. కాని తను ఎంతో కష్టపడి పైకివచ్చాడు. తన బిడ్డ తనకంటే చాలా అదృష్టవంతుడు. తనకు చిన్నతనంలో పుట్టినరోజంటూ ఒకటి వుంటుందనీ, ఆనాడు తల్లిదండ్రులు తన కోరికలు తీరుస్తారనీ తెలియదు. కటిక దారిద్ర్యంతో బాధపడే తలిదండ్రులకు, ఎప్పుడు ఏ పిల్ల పుట్టినరోజూ జ్ఞాపకం వుంచుకొనే తీరికా, ఓపికా వుండేవికావేమో! అంతవున్నా చెయ్యగలిగిందీ, సంతోషించతగిందీ ఏదీ ఉండేదికాదు.
    విశ్వనాథంగారు కాలిబాటన నడుస్తూ వుంటే, ఎంతోమంది తొలగి నిల్చొని నమస్కారాలు చేసి పోతున్నారు. అందరికీ, ఒకేరకం చిరునవ్వుతో తల పంకించి, చేయి పైకెత్తి నమస్కారంలాంటి అభినయం చేస్తున్నాడు. అలా చేసినప్పుడల్లా ఆ చేతిలోని కర్ర పైకీ కిందకూ ఆడుతుంది.
    జడ్జీ అయ్యాక ఎంతోమంది మిత్రులను తను పోగొట్టుకున్నాడు. అంతకుముందు సాయంకాలాలలో తనతోపాటు షికారుకొచ్చే లాయరు రామయ్యగారిని తప్పించుకోవటానికి కొన్నిరోజులపాటు వాకింగే మానేయాల్సి వచ్చింది.
    ఎప్పుడూ కదలకుండా కూర్చొని మెదడుతో పనిచేసేవాళ్ళకు గుండె జబ్బులు వస్తాయని ఆయనకు గట్టినమ్మకం. అందరిలా వట్టి మెదడే కాకుండా తను గుండెతో కూడా పనిచేస్తాడు. ప్రతిసారీ జడ్జిమెంటు చదివేప్పుడు తన హృదయం కుతకుతలాడిపోతుంది. తను న్యాయం ఇవ్వగలిగానన్న తర్వాతగాని హృదయం తేలికపడదు. తను జడ్జిమెంటుకు కూర్చున్నప్పుడు, వాదులూ, ప్రతివాదులూ, గుండెలు చిక్కపట్టుకొని తన మొహంలోకి చూస్తూ కూర్చుంటారు. ఆ చూపుల్ని తను భరించలేడు. ఆ చూపుల్ని తప్పించుకోవటానికి లాయర్ల మొహంలోకి చూస్తాడు. వాళ్ళ మొహాలు చూస్తుంటే మళ్ళీ తనకు ధైర్యం వస్తుంది. వాళ్ళ ఆలోచనలన్నీ కేసుల్లో క్లయింట్స్ నుంచి తాము వసూలు చేసిన డబ్బు ఇంకా రావాల్సిన డబ్బును గురించే తిరుగాడుతుంటాయి. కేసు గెలిస్తే లాయరు తన ప్రతాపాన్నీ, తెలివితేటల్నీ చాటుకుంటాడు. ఓడితే "ఆనరబుల్ జడ్జి పొరపాటు చేశారు" అంటాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS