Previous Page Next Page 
అర్ధ మానవుడు పేజి 30


    తన స్వార్ధాన్ని సాధించకుండా తన స్నేహమయి మనసుని శాసిస్తోంది. ప్రకృతి సహజమయిన మనః ప్రవృత్తి మరొక వంక తన బాధను, ప్రతీకారాన్ని తీర్చుకోకుండా అడ్డు నిలిచే మాలతి.
    ఈ సందిగ్ధంలో తన కర్తవ్యాన్ని నిర్ణయించుకోలేకపోతున్న చిరాకు. దానినించి యింకా బయటపడలేదు అర్ధమానవుడు. వేట మీద మనసు పెట్టినప్పుడు కొంత బాధఆవిరి అయిపోయింది.
    కాని మాలతిని చూడగానే తిరిగిఅసంతృప్తి జ్వాలలు లేచినాయి. పక్షి ఆకాశంలో ఎగిరినట్లుగా, చేప నీటిలో ఈదులాడి నట్లుగా అతి సహజంగా జీవించాడు ఇంతకాలం. ఈ నాగరికులతో సంబంధాలు పెట్టుకున్నాక ప్రకృతి సహజమయిన నిర్మలమయిన జీవితానికి తిలోదకాలిచ్చుకోవలసిన పరిస్థితి ఎదురుకానున్నదని ఆ ప్రకృతి పుత్రునికి తెలియదు పాపం.
    అందునించి తన స్నేహమయిని ఆప్యాయంగా చేతులలోకి ఎత్తుకున్నాడు. తన అర్ధనజ్ఞావస్థను దాచుకునేందుకు ఆమె తొడిగిన కోటు అతనికి చిత్రంగా అనిపించింది.
    దాన్ని లాగివేయాలని అతడు చేసిన ప్రయత్నాన్ని విరోధించింది కెప్టెన్ మాలతి.
    "నాతో నగరానికి వస్తావా?" అని అడిగింది చిలిపిగా ఆమె నవ్వుతూ ఏదో శబ్దాలు చేయటం అతనికి అమితమయిన ఆనందాన్ని కలిగించింది.
    ఆమెలాగానే నవ్వుతూ "హక్ హతన్, హగళ్ ళ్ లక్ ల స్పష్టంగా అక్షరాలను పలక గలడని ప్రప్రధమంగా తెలిసిందామెకు.
    అతనికి భాష నేర్పించ వచ్చునని కూడా అనిపించింది. అతని బలాన్ని తన వంకకు త్రిప్పుకుంది. అర్ధమానవుని ఏకాగ్రత అంతటినీ తనమీద నిలిచేలా చేసింది.
    అతని కన్నులలోకి గ్రుచ్చిచూచింది. అతడు కూడా అమాయక మయిన లేడి పిల్ల మనిషి చూపుల్లో చూపు కలిసి నిర్ఘాంత పడినట్లు అయాడు.
    అలాగే ఆమె ముఖంకేసి ఏకాగ్రంగా చూడసాగాడు. కెప్టెన్ మాలతి తన విశ్వాసాన్ని బలపరచుకోవటానికి అన్నమాటనే అక్షరాలుగా విడదీస్తూ విస్పష్టంగా నెమ్మదిగా చెప్పింది.
    "నా.....తో.......నగ......రానికి......వ.....స్తా....వా?" ఆ మాటలు విని రెండు క్షణాలు మౌనం దాల్చాడు అర్ధమానవుడు. అతని మనఃప్రపంచంలో ఆ మాటలను అనుకరించే అద్భుతమయిన ప్రయోగం ప్ర్రారంభమయింది.
    నాగరికతకు ఆవలి తీరంనించి ఈవలి తీరాన్ని అందుకోవాలని ప్రప్రధమంగా ప్రయాణం ప్ర్రారంభించినాడతడు. అయితే పూర్తి మాటలను తిరిగి వల్లించలేని అశక్తుడుఅయాడు.
    "హ.....త్.....త్......హడక్......హళ్.......స్ స్ స్.....తా.....వ్ వ్" అన్నాడు. అతని నోటినుంచి వెలువడే అక్షరాలు కోసం అత్యంతాసక్తితో ఎదురు చూస్తున్న మాలతి ఆశలు చిగురించాయి.
    నేర్పిస్తే మాటలు వస్తాయి, అప్పుడామెకు తాను చేసిన పొరపాటు ఏమిటో అర్ధమయింది. సుదీర్ఘమయిన వాక్యాలతో ప్ర్రారంభిస్తే అతడు కంగారు పడిపోతాడు. అతడు నాగరిక మయిన ప్రవృత్తులకు నవాగతుడు.
    కేవలం పసిపాపాయిలాంటివాడు. పాపాయిని ఎత్తి ముద్దాడి లాలించి తల్లి తొలి అక్షరాలను పలికిస్తుంది. అలా చేయగలిగితే అతడు తప్పటడుగు వేయకుండా ముందడుగు వేయగలుగుతాడు.
    తన తప్పేమిటో తెలియగానే నిజంగా తల్లిగా మారిపోయింది మాలతి. అతని చుబుకాన్ని మునివ్రేళ్ళతో తాకి అతనికి ఆనందం కలిగేలా చేసింది.
    అతడు గిలిగింతలయి నవ్వసాగాడు. శరీరమంతా కితకితలు పెట్టింది. అతడు తన్మయుడయ్యేడు. ఆ తన్మయ రావంలోంచి బయట పడకుండానే అతనికి తెలియకుండానే విద్యాబోధన ప్ర్రారంభించిందామె.
    "ఆ.....ఆ" అంది నోరుతెరిచి.
    "ఆ.....ఆ" అంటూ అనుసరించాడు అర్ధమానవుడు.
    "ఆ.....మ" అంది.
    "ఆ......మ" సఫలీకృతుడయ్యేడు.
    "అమ్మ" అన్నాడర్దమానవుడు. మాలతి తన సాఫల్యానికి పరవశురాలయింది. ఆమె పదిసార్లు "అమ్మ" అనే పదాన్ని నొక్కి పలికితే అతడూ పలికాడు.
    "ఆకలి" అన్నదామె.
    "అక్లి" అన్నాడతడు. వెంటనే తన సహజ రీతిలో సంతోషాన్ని వ్యక్తీకరించుకుంటూ ఆమెను తిరిగి చేతులమీద ఎత్తేశాడు. ముందుకు అడుగేశాడు.
    ఎందుకయినా మంచిదని ఫిజో కన్పించకుండా చేసి ఆ రాత్రి అతనితో పాటుగా చమరీ మృగాల శయ్యమీద నిర్భయంగా పడుకుని హాయిగా నిద్రపోయిందామె.
    అర్ధమానవుడి తరలించుకు పోయేందుకు ప్రయత్నాలు ప్ర్రారంభమయినాయి. అందుగురించిన వ్యూహరచనలో తల మునకలు అవుతోంది కెప్టెన్ మాలతి. అతడిని బలవంతంగా తరలించుకు పోవచ్చు. వలలూ త్రాళ్ళూ వగైరాలు ప్రయోగించి లొంగదీసుకోవచ్చు.
    అమాయకుడయిన ఆ ప్రకృతి పుత్రుడు అమితబలశాలి అయినా మాయోపాయంతో బంధించవచ్చు. మనిషి ప్రధమంనించి ప్రకృతిలోని యితర ప్రాణులమీద ఈ విధంగానే ఆధిపత్యాన్ని సంపాదించాడు.
    ఏనుగు బలంలో మనిషి బలం ఎన్నోవంతు? అయినా గోతులు త్రవ్వటం ద్వారా ఒక్కమనిషి  అనేక ఏనుగుల్ని బంధించ గలుగుతాడు? బెబ్బులిని మంచెమీద మాటు వాచి ఎరపెట్టి బాణంతో కొట్టగలడు. సింహాన్ని అయినా వలలతో పట్టి బంధించి ఆడించ గలడు.
    ఆకాశంలో ఎగిరే రాబందుల్ని, నీటిలోపల తిరిగే చేపల్ని తన ఆలోచనలతో లొంగదీసుకోగలడు. అన్ని ప్రాణులకు ప్రకృతిలో ఉన్న ప్రధమ శత్రువు మనిషే!
    అలాగే మరొక మనిషి సాయం ఉన్నది కాబట్టి అర్ధమానవుణ్ణి బంధించటం అసాధ్యం కాదు. కాని అలా బంధించి తీసుకుపోతే అతణ్ణి యింక ఎన్నటికీ బంధించి ఉండాల్సిందే! తనమీద అతడు పెంచుకున్న ఆరాధనా భావం ఎగిరిపోతుంది. అతడు రెచ్చి పోతాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS