Previous Page Next Page 
మట్టి మనిషి పేజి 30


    దున్నపోతులా వెనక్కి నిగడదన్ని నిలబడ్డ వెంకటపతి చెయ్యి వదిలి వీధిలోకివచ్చి అరిచాడు సాంబయ్య.
    "ఒరేయ్! నువ్వొస్తావా, రావా?" వీధిమలుపు తిరిగి రొప్పుతూ వెనక్కి తిరిగి చూశాడు. వెంకటపతి పిల్లిలా అడుగులో అడుగు వేసుకొంటూ నడిచి రావటం చూశాడు. సాంబయ్య గుండెల్లో మంటలు చల్లారాయి.
    "వెంకటపతి----నా కొడుకు---- నా మాట జవదాటడు!" అనుకొంటూ ముందుకు సాగిపోయాడు.
    పిత్రువాక్య పరిపాలనకోసం రాజ్యకాంక్షను చంపుకొని అడవుల కెళ్ళిన శ్రీ రామచంద్రుడిలా  వెంకటపతి తండ్రిమాట జవదాటలేక పెళ్ళాంమీది మోజును చంపుకొని సాంబయ్య వెంటే నడిచి ఇంటికి చేరాడు.
    వెంకటపతికి ముఫ్ఫై మూడు దాటినై. పెళ్ళయి మూడేళ్ళయింది. మళ్ళీ భార్యముఖం చూసే అవకాశం దొరకలేదు. బలరామయ్య, కూతురు పెళ్ళయిన ఆరునెలలకే పద్దెనిమిదెకరాల మాగాణినీ, తాకట్టు పెట్టుకొన్న కనకయ్యకూ, శేషావతారానికీ విక్రయించాడు. భూమిమీద తీసుకొన్న అసలూ వడ్డీ పోను బలరామయ్య చేతికి వచ్చింది పదివేలు మాత్రమే. వాపోతున్న బలరంయ్యను మరో నాలుగేళ్ళుపోతే అదికూడా వచ్చేది కాదని సమాధానపరిచాడు కనకయ్య. పదివేలు ఇచ్చి వరూధిన్ని కాపరానికి పంపటానికి ప్రయత్నించాడు. అందుకు సాంబయ్యససేమిరా ఒప్పుకోలేదు. పెళ్లినాటికే బలరామయ్య పొలం తాకట్టులోవున్న సంగతి పొలం అమ్మినాకగాని తెలియలేదు సాంబయ్యకు. బలరామయ్య తనను ధగా చేశాడని నమ్మాడు. ఆ కసిలోవున్న సాంబయ్య ఇరవైవేలకు ఒక్క దమ్మిడీ తగ్గినా కోడలు కాపరానికి రావటానికి వీలులేదని పట్టుపట్టాడు. అప్పటికి అతని మనస్సులో బలరామయ్య మెడ మెదులుతూ వుంది. అది దఖలు రాసయినా, అమ్మి అయినా తన బాకీ చెల్లించుకోవచ్చు గదా బలరామయ్య, అనుకున్నాడు సాంబయ్య. కూతురి కాపరం కోసమేనా ఆ పని చేస్తాడని ఎదురుచూసిన సాంబయ్యకు నిరాశే ఎదురైంది. పొలం అమ్మిన సంవత్సరానికే బలరామయ్య గుండెజబ్బుతో మంచాన పడ్డాడు. ఇక్కడవుంటే బతికే అవకాశం లేదని నాలుగోకొడుకు వచ్చి బస్తీకి తీసుకెళ్ళాడు. తండ్రికి చేసిన సహాయాన్ని పురస్కరించుకొని తండ్రి దగ్గరున్న డబ్బులో మూడువేలు పుచ్చుకొని మద్రాసు బండెక్కాడు చిన్నకొడుకు. బలరామయ్య భార్య పక్షవాతం వచ్చి మంచాన పడ్డది. ఆస్పత్రిలో గది తీసికొని వుండి తండ్రికీ, తల్లికీ కాచిపోస్తున్నది వరూధిని. బస్తీకి వచ్చిన బలరామయ్య బంధువులు ఆయన్ను వచ్చి చూసిపోతున్నారు. ఆయనకు మరీ ఎక్కువగా వుందని తెలిసినప్పుడు కూతుళ్ళూ, కొడుకులూ, కోడళ్ళూ, అల్లుళ్ళూ వచ్చి, కాస్త నెమ్మదించిందాకా వుండి పోతున్నారు. వరూధిని తండ్రికీ, తల్లికీ పరామర్శకు వచ్చేపోయేవాళ్ళకు ఊడిగం చెయ్యలేక సతమతమౌతూంది.
    బలరామయ్య కూతుర్నిచూసి జాలిపడేవాడు. అంతమంది సంతానంలో తన అవసానకాలంలో అక్కరకువచ్చింది వరూధినినేనని ఆలోచన వచ్చినప్పుడు మరీ కుంగిపోయేవాడు. హాయిగా భర్తతో కాపరం చెయ్యాల్సిన పిల్ల - దానికి ఎంత అన్యాయం జరిగింది అనుకొనేవాడు.
    అయితే వరూధిని భర్తను గురించిన బెంగ ఏ కోశానా వున్నట్టు కన్పించేది కాదు. తండ్రి యోగక్షేమాలతోపాటు అన్నీ తనే చూసుకొనేది. తండ్రిదగ్గిరవున్న డబ్బంతా వరూధిని అజమాయిషీలో వుండేది. అన్నలూ, అక్కలూ చూట్టానికి వచ్చినప్పుడు తల్లిదండ్రుల బాధ్యత తనమీద వేసినందుకు దెప్పిపొడిచేది. వాళ్ళు తమకుతోచిన డబ్బు వరూధిని చేతిలో పెట్టి, అంతకంటే తాము ఏమీ చెయ్యలేమన్నట్లు మాట్లాడేవారు.
    వరూధిని ఇరవై ఒకటో ఏడు వయసుకు తగ్గ కోరికలు ప్రజ్వరిల్లుతున్నాయ్. పైగా సర్వస్వతంత్ర అయింది. మంచానపడ్డ తండ్రికి వేళకు ఇంత తిండీ, మందూ దొరికితే చాలు. తల్లి మంచప్పుడే ఏమీ పట్టించుకోలేదు. పాతకాలపు అమాయకురాలు. మంచంలోపడి ఇప్పుడో కాసేపో అన్నట్లుండేది.
    బలరామయ్య వరూధిని మాటకు ఎదురు చెప్పేవాడు కాడు. వరూధిని కాలక్షేపానికి ఆసుపత్రి పనిమీద వచ్చిన ఇరుగుపొరుగుతో కలిసి సినిమాలకు వెళ్ళేది. అడపాదడపా చిన్నన్నయ్య రకరకాల స్నేహితుల్ని వెంటేసుకొస్తుండేవాడు. వాళ్ళలో అందగాళ్ళను చూసినప్పుడు వరూధిని మతిపోయినట్టు వుండేది. ఏదో పోగొట్టుకొన్నదానిలా నిట్టూర్పులు విడిచేది. వాళ్ళు వెళ్ళాక వారంరోజులదాకా వాళ్ళను గురించి రకరకాలుగా ఆలోచించేది.
    సాంబయ్య పెళ్ళికి ఖర్చుపెట్టినదానికి మూడింతలు కూడపెట్టాడు. మరో పద్దెనిమిది ఎకరాల పొలం కొన్నాడు. సాంబయ్యలో వెనకటి జవం లేదు. మనిషి  జారిపోతున్నాడు. వెంకటపతి యంత్రంలాగ పొలంపనులు చేసుకుపోతున్నాడు. మనిషిలో మందగొండితనం ఎక్కువయింది. దేనిమీదా శ్రద్దలేదు. సాంబయ్యకు వెంకటపతిని చూస్తుంటే ఒకోసారి అన్పించేది. "వాడ్ని ఇలా వదిలితే లాభంలేదు. ఏదో మార్గం చూడాలి. మళ్ళీ పెళ్ళి చేస్తేనో?"
    ఓరోజున సాంబయ్య బస్తీలో ధాన్యం అమ్మిన తాలూకు పైకం తీసుకొస్తుండగా బస్ స్టాండ్ లో కనకయ్య కలిశాడు. ఈ మూడేళ్ళుగా ఎక్కువగా కనకయ్య బస్తీలోనే వుంటున్నాడు. సాంబయ్యకు చాలా అరుదుగా కన్పిస్తున్నాడు. ఇప్పటికీ బలరామయ్య చేసిన దగాలో కనకయ్య పాలెంతో తేల్చుకోలేకుండా వున్నాడు సాంబయ్య. కనకయ్యను చూడగానే సాంబయ్యకు ప్రాణం లేచివచ్చింది. నిజం మాట్లాడితే కనకయ్య తనకు చేసిన అన్యాయం ఏమీలేదు. తన మేలు కోరే చేశాడు.
    సాంబయ్యను కనకయ్య అంత తేలిగ్గా వదులుకోలేడు. సాంబయ్యను చూడగానే కనకయ్య ఆప్యాయంగా పలకరించాడు.
    "ఊళ్ళోకేగా?"
    "ఆ! నువ్వూ వస్తున్నావా?"
    "అవును! రావాల్సిన పనేవుంది. రెండుమూడురోజుల్లో వస్తా. నిన్ను చూసి ఇటు వచ్చా. వెంకటపతి కులాసాగా వున్నాడా?" అడిగాడు కనకయ్య.
    సాంబయ్య జవాబు చెప్పలేదు. బయలుదేరబోయిన బస్ చెడిపోయింది. అదే ఆఖరి బస్. ఎలా యింటికి చేరాలా అన్న ఆలోచనలోవున్న సాంబయ్యను కనకయ్య వెంటబెట్టుకొని యింటికి తీసుకొచ్చాడు. కనకయ్య కొడుకు 'లా' ప్రాక్టీసు చేస్తూ బస్తీలోనే వుంటున్నాడు.
    కనకయ్య కొడుకు హోదా, ఇంటి హంగులూ, వచ్చేపోయే జనాన్ని చూసి మెచ్చుకొన్నాడు సాంబయ్య.
    రాత్రి భోజనాలు చేశాక యింటిముందు కుర్చీలు వేయించాడు కనకయ్య. ఇద్దరూ ఎదురెదురుగా కూర్చొని లోకాభిరామాయణం మొదలుపెట్టారు.
    కనకయ్య మనవణ్ణి ఒళ్ళోపెట్టుకొని కూర్చున్నాడు. కోడలు మంచినీళ్ళు తెచ్చి యిచ్చింది.
    "కనకయ్యా! మొత్తంమీద కొడుకుని ప్రయోజకున్నే చేశావయ్యా! బస్తీలో పేరు పేరున్న వకీలయాదు" అన్నాడు సాంబయ్య.
    "వెంకటపతికి మాత్రం ఏం తక్కువ? వంద ఎకరాల భూస్వామి, బుద్దిమంతుడు." అన్నాడు కనకయ్య సాంబయ్యను ఓదారుస్తూ.
    "ఎన్నుండి ఏం లాభంలేవయ్యా!" సాలోచనగా అన్నాడు సాంబయ్య.
    "నీకు కోసం రాకపోతే ఒకమాట చెప్తా. ఈమధ్య బలరామయ్యగార్ని చూట్టానికి వెళ్ళినప్పుడు మీ కోడలు కన్పించింది. పాపం, అమ్మాయిని చూస్తే జాలి వేసింది. ఆ అమ్మాయిచేత తండ్రి నానా చాకిరీ చేయించుకొంటున్నాడు. తల్లి తీసుకొని తీసుకొని పోయిన నెల్లోనే పోయింది. ఎప్పుడూ ఇద్దరో ముగ్గురో ఆయన్ను చూట్టానికి వచ్చినవాళ్ళు వుంటూనే వుంటారు. ఆ చాకిరంతా ఆ అమ్మాయే చేస్తుంది." ఆగి కనకయ్య సాంబయ్య కళ్ళలోకి చూశాడు. సాంబయ్య ఆలోచనలోపడి రెప్పవేయకుండా కనకయ్య ముఖంలోకి చూస్తున్నాడు.
    "చెప్పొద్దూ, నాకు చాలా బాధ కలిగింది. లక్షాధికారి సాంబయ్య కోడలికి ఏంగతి పట్టిందాఅని" అన్నాడు కనకయ్య.
    "దానికి కారణం కన్నతండ్రేకదా?" అన్నాడు సాంబయ్య.
    "ఆ మాట కాదని ఎవరంటారు? బలరామయ్య చేసిన మోసం ఎవరికి తెలియందీ? సాంబయ్యగారిదే తప్పన్నవాళ్ళెవరూ నాకింతవరకూ కన్పించలా. పోతే, ఆడపిల్లకు పెళ్ళయాక పుట్టింటితో సంబంధం ఏపాటిది? సాంబయ్యగారి కోడలంటున్నారుగాని బలరామయ్యగారి కూతురంటున్నారా?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS