Previous Page Next Page 
శ్రీ శ్రీ సంసార ప్రస్థానం పేజి 30


    అమ్మా, నేనూ మాటల్లో పడ్డాం.
    "శ్రీశ్రీగారు దొరలా వున్నారు. ఆవిడ కూడా ఫరవాలేదు. పెద్ద తెలుపు కాకపోయినా, చామన ఛాయే మారా పిల్లెమితి నల్లగా వుంది?" - అంది అమ్మ.
    "మరీ అంత నలుపుకాదులే అమ్మా! ఆవిడ ఛాయకన్నా బాగా తక్కువే అనుకో" అని అమ్మా, నేనూ మాట్లాడుకుంటున్నాం.
    మా మాటలు వింటున్న డ్రైవర్, "పాప వాళ్ళ స్వంత బిడ్డ కాదమ్మా పెంచుకున్నారంట" - అన్నాడు.
    "నీకెలా తెలుస"ని అడిగాను.
    "నేనిక్కడకి చాలాసార్లు వచ్చానమ్మా! నాకూ మీలాగే సందేహం వచ్చి, ఈ యింటిగలావిడ్ని అడిగాను. తెలిసిన వాళ్ళమ్మాయిని పదమూడు రోజుల పిల్లప్పుడే తీసుకొచ్చి పెంచుకున్నారని ఆవిడ చెప్పింది" - అన్నాడు డ్రైవర్.
    "అలా చెప్పు!" - అన్నాను.
    "పోలికలు చెప్పవుటే?" - అని మా అమ్మ అంది.
    'ఈ డిస్కషన్ అంత అవసరమా" - అంది మా అమ్మ.
    "అంటే వీళ్ళకి పిల్లలు లేరన్నమాట" - అంది మా అమ్మ.
    "రామయణం అంతా విని, రాముడికి సీత ఏమవుతుందన్నట్టుందమ్మా నీ ప్రశ్న?"
    "అది కాదే! భార్యాభర్తలిద్దరూ ముచ్చటగా వున్నారు. 'కంటే ఖర్మంగానీ, పెంచుకుంటే ప్రారబ్ధమా' అన్నట్టు ఎలాగూ పెంచుకోవడమేగా, కాస్త చక్కటి పిల్లని చూసి పెంచుకోరాదూ?" - అంది.
    ఆ మాటే నేనూ అనుకున్నాను సుమండీ అంటూ.
    మా మాటలకి వంత పాడాడు డ్రైవర్.
    "మధ్యాహ్నం మూడు గంటలకి వస్తా"నని చెప్పాడు.
    "మూడు గంటలకి మీ కంపెనీ కెందుకయ్యా" - అన్నాను. నా మాటకి శంకర్ సింగ్ గారి డ్రైవర్ -
    "లేదమ్మా అయ్యగారితోనూ ముందు మా కంపెనీకి మీరొచ్చిన తర్వాత మిమ్మల్ని నేనే జ్యోతీ ఆఫీసులో దింపేస్తాన"ని శంకర్ సింగ్ గారు చెప్పారని అన్నాడు.
    'నాకన్నా నీకే ఎక్కువ తెలుసు నాయనా!' - అనుకున్నాను.
    
                           *    *    *
    
                                        ఆవిడ గయ్యాళి
    
    మా పెద్దచెల్లి రామంతో శ్రీశ్రీగారి భార్యను, వాళ్ళమ్మాయిని చూసిన సంగతి చెప్పి, "శ్రీశ్రీగారి భార్య సింపుల్ గా, చాలా తమాషాగా వున్నారే రామా!" - అన్నాను.
    "మరి వాళ్ళమ్మాయో?" - అని అడిగింది మా చెల్లి.
    "ఎప్పుడైనా చూస్తావుగా! నో కామెంట్స్..." అన్నాను.
    మధ్యాహ్నం శ్రీశ్రీగారు మా యింటికి తిన్నగా మేడపైకి వచ్చేశారు.
    "కాఫీ తాగుతారా?" ని - అడిగాను.
    "ఉంటే...." అన్నారు. ఇచ్చాను.
    త్వరగానే బయలుదేరిపోయాం.
    శ్రీశ్రీగారు తీవ్రంగా ఆలోచిస్తున్నట్టున్నారు.
    "ఆ పాప మీ కూతురేనాండీ" - అని అడిగాను.
    "కాదు"
    "మరి....?"
    "పెంచుకున్నాం"
    నిజంగా ఆ క్షణంలో శ్రీశ్రీగారిని మెచ్చుకోకుండా ఉండలేకపోయాను. దాపూ మూపూ ఏమీ కనిపించలేదు. అబద్దం ఆడడం నిజంగానే చేతకాదేమోననిపించింది. ఇంకోరైతే అలా చెప్పుకుంటారా?
    ఆయన ఏదో ఆలోచిస్తున్నట్టు గమనించాను.
    "ఏమిటండీ ఆలోచిస్తున్నారు?" అనడిగాను.
    "ఏమీలేదు మనం మరోసారి మైసూరు వెళ్ళిరావాలి" అన్నారాయన.
    "ఎందుకు? పని అయిపోయిందిగా?" అన్నాను.
    "లేదు ఇంకా చాలా పవివుంది. ఇప్పుడు మనం చేసిన పిక్చర్ మైసూర్ లోనే ఫస్ట్ ప్రింట్ చూద్దా"వని చెప్పారు.
    "మరి ఇక్కడింకా కొత్త పిక్చర్ డబ్బింగ్ పూర్తికాలేదుగా?" అన్నాను.
    "ఇప్పుడు డబ్బింగ్ చేసే మూడ్ లో లేను"
    "మైసూరు వెళ్ళాల్సిన అవసరం ఏం వచ్చింది?"
    "అక్కడికి వెళ్ళి నాలుగు రోజులుండాలి. 'గంధర్వకన్య' సెన్సార్ స్క్రిప్ట్ రాసి ఆ పిక్చర్ చూసి వచ్చేద్దాం.
    "అలాగని మైసూరునుండి ఉత్తరం వచ్చిందా?"
    "అవును"
    "మరి ఆ మాట చెప్పలేదేం?"
    ఆయన ఏం మాట్లాడలేదు.
    కాసేపాగి, "ఈసారి మా ఆవిడకూడా వస్తోంది" అన్నారు.
    "వెరీగుడ్! మరీ మంచిది. రానివ్వండి. సరదాగా వుంటుంది" అన్నాను.
    "మేం యిద్దరం ఫస్ట్ క్లాసులో వస్తాం" అన్నారు.
    "ఓ ష్యూర్! ఏ క్లాసులో కూర్చుంటే ఏం? దిగడం అందరం ఒక్కచోటే దిగుతాం కదా? మాకేమీ అభ్యంతరం లేదు. అమ్మాయిని కూడా తీసుకొస్తున్నారా?" అనడిగాను.
    "లేదు" అన్నారు.
    "ఒక్కర్తే వుంటుందా?"
    "వంటావిడ వుంది. చూసుకుంటుంది."
    "దానికంత ఆలోచన ఎందుకు?" - అని ప్రశ్నించాను.
    "మా ఆవిడ వస్తున్నందుకు నీకు భయం వెయ్యలేదా?" అనడిగారు.
    "ఏడిసినట్టుంది. భయం ఎందుకు? ఆవిడేమైనా దెయ్యమా, దేవతా? పైగా నేనెందుకు భయపడాలండీ" అన్నాను.
    "ఆవిడ గయ్యాళి" అన్నారు.
    "కావచ్చు. అయితే మాత్రం నన్నేం చేస్తారు?" అనడిగాను.
    "అనవసరంగా ప్రశ్నలు వేసి నిన్ను వేధిస్తుంది" అన్నారు.
    "వెయ్యనివ్వండి. తెలిసినవాటికి సమాధానం చెప్తాను. ఇందులో వేధించడానికేం వుంది?" అన్నాను.
    "ఆవిడ సంగతి నీకు తెలీదు" అన్నారు.
    "మీ సంగతే నాకింకా తెలీడంలేదు. అలాంటిది ఆవిడ సంగతి నాకెలా తెలుస్తుంది?" అన్నాను.
    "ఫరవాలేదు సమాధానాలు చురుగ్గానే ఇస్తున్నావు?" అన్నారు.
    "ఇంకోమాట వినండి. ఈసారి నా రాకవల్ల మీకు ఇబ్బంది అనుకుంటే నేను వుండిపోతాను. ఆవిడని తీసుకుని వెళ్ళండి" అన్నాను.
    "నువ్వు రాకుండా ఎలా? సెన్సార్ స్క్రిప్ట్ ఎవరు రాస్తారు? అదేం కుదరదు. నువ్వు రావలసిందే! మా ఆవిడ వస్తోంది కనుక మీ అమ్మ గారుండిపోతారా" - అని అడిగారు.
    "మా అమ్మగారు రాకుంటే నేనూ రావడం కుదరదండీ" - అన్నా.
    శ్రీశ్రీగారి మాటల ధోరణితో నా బుర్ర ఆలోచనలో పడింది.
    'నన్ను ఆవిడ చూశాక యింట్లో  ఏమైనా గొడవలు జరుగుతున్నాయేమో' అనిపించింది.
    ఆఫీసుకి చేరుకున్నాం. ఆ రోజు పని అయిపోయింది.
    ఏ నిముషంలోనైనా మైసూరు వెళ్ళొచ్చు అని ఇంట్లో చెప్పేసాం.
    మర్నాడు ఉదయం మొదట కారు మా యింటికి వచ్చింది.
    "అదేమిటి మునుస్వామీ! మొదట కారు తీసుకుని నా దగ్గరికి వచ్చావేం? శ్రీశ్రీగారేరీ?" - అని అడిగేను.
    "ముందు అక్కడికే వెళ్ళానమ్మా! మిమ్మల్నే అక్కడికి తీసుకురమ్మన్నారని అయ్యగారి భార్య చెప్పారు" - అన్నాడు.
    "సరేలే ఇదీ ఒకందుకు మంచికే. ముందుగా పరిచయమై వుండడం కూడా మేలే' - అనుకుంటూ అమ్మతో కలిసి బయలుదేరి శ్రీశ్రీగారింటికి వెళ్ళాను.
    ఎవ్వరూ గుమ్మంలో లేరు సరికదా. తలుపులు కూడా మూసి వున్నాయి. డ్రైవర్ తలుపు తట్టాడు. ఇంటి గలావిడ వచ్చి తలుపు తీసింది.
    లోపలికి అమ్మతో అడుగుపెడుతూ, "శ్రీశ్రీగారు వుండేది ఎక్కడండీ" - అని అడిగాను.
    ఆవిడ ఎగాదిగా నన్ను చూస్తూ - "అదిగో - అక్కడే మెట్లున్నాయి చూడండి. అలా వెళ్ళండి. మేడమీద వుంటారు" - అంది.
    ఆవిడ ముదలియార్, గుమ్మటేనుగులా వుంది. చెవులకీ, ముక్కులకీ డైమండ్స్ తో, మెడలో బంగారంతో ధగధగా మెరిసిపోతోంది. ముఖం నిండా పసుపు పూసుకుని రూపాయంత బొట్టు పెట్టుకుంది. అరవం మాట్లాడుతోంది.
    మెట్లెక్కి పైకి వెళ్ళాను. ఓ గది వుంది. ఆ గదికి కుడిచేతిపక్క చిన్న వరండా.
    "లోపలికి రండి" - అని వాళ్ళమ్మాయి పిలిచింది.
    వెళ్ళాం.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS