Previous Page
సూర్యుడు దిగిపోయాడు పేజి 31


    ప్రజలు ఎంతో ఆశావాదంతో జనతాకు ఆహ్వానం పలికారు. దేశంలో ఎన్నో మార్పులు వస్తాయనీ, ప్రజానీకపు జీవన ప్రమాణాలు ఏదో కొత్తదనం, అభ్యుదయం ఆవిర్భవిస్తుందని ఎదురు చూశారు.
    నెలలు గడిచిపోతున్నాయి....నిజమే. జనతాపార్టీ సిసలైన ప్రజాస్వామ్య పద్దతుల్లో పయనిస్తోంది. కాని మనిషికి అది చాలదు. మామూలు మనిషికి కావలసింది కూడూ, గుడ్డా, నీడా రైతుల గురించి, కూలీజనాన్ని గురించి సిద్దాంతాలు, సానుభూతి వచనాలు చెబుతుంటే విని విని ప్రజానీకానికి విసిగెత్తిపోయింది. వాళ్ళకు కావలసింది వారాలు కాదు. కనీసావసరాల కొరత తీరటం. అది తీరని నాడు ఎన్ని ప్రణాళికలు రూపొందించినా అన్నీ వృధా.
    ఈ క్రొత్త ప్రభుత్వం లో నీతి వుంది. నిజాయితీ వుంది. నిగ్రహశక్తి కలిగిన త్యాగధనులైన నాయకులున్నారు. కాని ఆర్ధిక విధానానికి సంబంధించిన నిర్ణయాలు లేవు. అది ప్రజలకు సంతృప్తి కలిగించలేకపోతోంది.
    ఈ బలహీనతలు కనిపెట్టి కొన్ని నెలలపాటు నిశ్శబ్దంగా వున్న నాయలురాలు మళ్ళీ విజ్రుంభించింది. ఆడతనం ప్రదర్శించి తిరిగి ప్రజల సానుభూతి సంపాదించుకోసాగింది.
    ఇంతలో కొన్ని కొన్ని రాష్ట్రాలలో శాసనసభ ఎన్నిక లొచ్చాయి.
    జనతావాళ్ళు పాత ప్రభుత్వపు అఘాయిత్యాలు చెబుతున్నారు. కాని ప్రజలకు ఏమిచేస్తారో, ఏమి చెయ్యదలిచారో చెప్పలేక పోతున్నారు.
    ఫలితంగా దక్షిణాది రాష్ట్రాలలొ అది పరాజయం పొందింది. నాయకురాలిపార్టీ అధికారాన్ని హస్తగతం చేసుకుంది.
    అనంతమూర్తి బాధపడ్డాడు. ఈ ప్రజలకు ఆలోచనా శక్తి మందగించిందా? ప్రజాస్వామ్యం కన్నా అధికారమే ఉత్తమమని వాదిస్తారేమిటి? వీళ్ళు ఆటవిక యుగంలో వున్నారు. పాత పోయింది. ఓ కొత్త వచ్చింది. ఆ కొత్త సంతృప్తి కలిగించలేకపోతే మరో కొత్తవి వెతుక్కుంటూ పయనించాలి. అది నిరంతరాన్వేషణ. వెలుగు రేఖలు కనిపించేవరకూ ఈ అన్వేషణ సాగుతూ వుండాలి. అంతేగాని మళ్ళీ పాతవైపు పురోగమిస్తానంటారేమిటి? అసలు ఒకసారి ప్రజల మన్నన పోగొట్టుకున్నాక తిరిగి అధికారంలోకి రావటానికి అసహ్యమైన కల్లోలాన్ని సృష్టిస్తున్న వ్యక్తిమీద సానుభూతేమిటి?
    మనలో చైతన్యపూరితమైన మార్పు ఎప్పుడు వస్తుంది?
    అసలు వస్తుందా?
    అతనికి చెప్పలేనంత తపనగావుంది. అతను రాజకీయాల్లోకి దిగలేదు. కాని రాజకీయాలగురించి ఆలోచిస్తున్నాడు. మధనపడుతున్నాడు.
    ఈ ఆరాటాన్ని ఆధారంగా చేసుకుని ఊళ్ళు తిరుగుతూనే కొత్తా-పాతా అనే నవల రాస్తున్నాడు. అది కేవలం రాజకీయ నవలగానే గాక సాంఘిక సమస్యలని కూడా అందులో జోడిస్తున్నాడు.
    అలా ఊళ్ళు తిరుగుతూ చివరకు  కన్యాకుమారి చేరుకున్నాడు.
    
                                                                     * * *
    
    స్నేహితులిద్దరూ సూర్యునికేసి చూస్తున్నారు.
    నిప్పులుచిమ్మే అగ్ని గోళం నెమ్మదిగా నీళ్ళని సమీపించింది.
    కాస్త కాస్త చొప్పున దిగిపోతోంది.
    అనంత మూర్తి కళ్ళు పెద్దవి చేసుకుని ఆశ్చర్యంగా చూస్తున్నాడు.
    ఎంత అద్భుతంగా వుంది దృశ్యం.
    ఓ ప్రపంచం మరో ప్రపంచంలోకి జొరబడినట్లు.
    ఓ సృష్టి మరో సృష్టిలో లీనమైనట్లు...
    ఓ వెలుగు మరో వెలుగులో కలిసిపోయినట్టు, అనంతమూర్తి ఉలిక్కిపడ్డాడు.
    రాఘవ వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు.
    "వెళ్ళిపోయాడు తనవారిని తానే తీసుకుని నాకేమీ ఇవ్వకుండా."
    మూర్తి అతని భుజం మీద చెయ్యివేసి లాలనగా అన్నాడు "రాఘవ ఏమిటీ పిచ్చి"
    రాఘవ వినిపించుకోవటంలేదు. అతని కళ్ళముందు ఏవేవో రూపాలు మెదుల్తున్నాయి. తల్లిదండ్రులు, సీత, ఉద్యోగం, భార్య, పిల్లలు పిల్లల పిల్లలు పిల్లనగ్రోవి.
    "పోగొట్టుకున్నాను, పోగొట్టుకున్నాను. మళ్ళీ రానిది, రాలేనిది. దగ్గరకు వచ్చినప్పుడు రాలేకుండా, చెదిరిపోతూ మైకంలో మునిగిపోతూ అజ్ఞానానికి అనేక నిర్వచనాలు చెప్పుకుంటూ...పోగొట్టుకున్నాను."
    "రాఘవా! ఏమిటిది చంటిపిల్లాడిలా?"
    "అతని తప్పేంలేదు. ఉదయించాడు. వెలుగునిచ్చాడు ఎంతోసేపు అయినా చీకట్లోనే కూర్చున్నాను. ఇప్పుడు వెళ్ళి పోయాడు నిజంగానే చీకటిచేసి."
    రాఘవ ఏడుస్తున్నాడు. నిజంగానే చీకటి నలువైపులా వ్యాపించింది.   
    
            
                              ----* * * *----


 Previous Page

WRITERS
PUBLICATIONS