Previous Page Next Page 
సూర్యుడు దిగిపోయాడు పేజి 30


    ఆఖర్న అతను జవాబుచెప్పే ఘట్టం వచ్చింది.
    మైక్ ముందుకు వెళ్ళి నిలబడ్డాడు.
    తన కృతజ్ఞతలు తెలిపాడు ముందుగా.
    "జీవితంలో ఎమన్నా సాధించావో లేదో నాకు తెలియదు. కాని జీవితంమాత్రం తృప్తిమేరకు జీవించాను.
    సభలో కరతాళధ్వనులు.
    "నాదికాని జీవితం జీవించటం నాకుచేతకాలేదు. నేను ప్రేమించేవ్యక్తి నా తల్లిదండ్రులు కానివ్వండి, భార్య కానివ్వండి, పిల్లలు కానివ్వండి నేను నేనుగా జీవించటానికి అడ్డువచ్చేలా ఎప్పుడూ చేసుకోలేదు."
    మళ్ళా హర్షధ్వానాలు.
    "నాకో అభిరుచివుంది. జీవితాన్ని ఆ అభిరుచి ప్రకారం తీర్చిదిద్దుకోవటానికి నేను శ్రమించాను. ఎవరు ఎన్ని అపార్ధాలు చేసుకున్నా చలించలేదు. నా మనసు ఆరోగ్యంగా వుందని తెలిసినప్పుడు , నేను రహదారి మీదనే ప్రయాణం చేస్తున్నాననే ఆత్మవిశ్వాసం వున్నప్పుడు, ఆ దారి ఎందుకు మళ్ళాలో నాకర్ధం కాదు. ప్రేమఅంటే వారికోసం మనజీవితాలని సార్ధకం చేసుకుంత్గూ వారిజీవితాలనికూడా వెలిగించాలి ఇతరులకోసం, వాళ్ళ సుఖాలకోసం మనల్ని మనం ఎందుకు పోగొట్టుకోవాలని మొదట "నేను" అంటే స్వార్ధంతో కాదు. అహంతో కాదు, జ్ఞానంతో కాదు. మూర్ఖత్వం తో కాదు, నన్ను వికసింపచేసుకుంటూ "నేను" నేను వికసించనిదే ఇతరుల్ని వికసింప చేయలేను."
    జనం ముగ్ధులై వింటున్నారు.
    "....తర్వాత మీ అందరి సమక్షంలో ఈ వేళ ఓ నిర్ణయం తీసుకుంటున్నాను."
    "మనిషి కొన ఊపిరి తీసేవరకూ  వృత్తి తాపత్రయంలొ వుండడం సమంజసం కాదు. యువతరం వస్తుంది. దూసుకుని మన నీడలో వాళ్ళని చూసుకుని ఆ నిషాలో ములిగిపోవటం కన్న మనం తప్పుకుని మన కళ్ళముందే ఆ యువతరం మన కన్నా ఎలా ఎదుగుతుందో చూడటం నాకు సంతోషం. అది నా కర్తవ్యం గా కూడా భావిస్తాను. ఈ చరమాంకంలో ఊపిరి సలపనట్టుగా కాకుండా, హాయిగా తీరిగ్గా ఊపిరితీస్తూ వొత్తిడుల మధ్య కాకుండా ప్రశాంతంగా ఆలోచిస్తూ, నా భావాలకు స్వరూపాలని ఇచ్చుకుంటూ నా రచనా కార్యక్రమాలని నిర్వహించాలి. ఇన్ని సంవత్సరాల జీవితానుభవంలో నాకిప్పుడు విరివిగా రాయాలనిపిస్తుంది. బుద్దిపుట్టినప్పుడు ఊళ్ళు తిరుగుతూ బుద్ది కుదిరినపుడు రాసుకుంటూ గడపాలని నా ఆకాంక్ష. అందుకు ఈవేళ నా ఉద్యోగ విరమణను ప్రకటిస్తున్నాను. ఈనాటి నుంచి యిన్నాళ్ళు నావద్ద అసిస్టెంట్ గా పనిచేసిన ప్రసాదరావు ఎడిటర్ గా తన బాధ్యతలు నిర్వహిస్తాడు?"
    తన సన్మానానికి కృతజ్ఞతలు చెప్పగానే చప్పట్లు...చప్పట్లు...చప్పట్లు.....సభా మందిరమంతా మార్మోగిపోయింది.
    అనంతమూర్తి చుట్టూ మూగిన వాళ్ళలొ నందన ఆమె భర్త, కుమారి ఆమె భర్తకూడా వున్నారు.
    "నాన్నా! నువ్వు మా యింట్లోనే వుండాలి. మాతో బాటే వుండాలి" ఆ కూతుళ్ళ హృదయాలు బాధపెడుతున్నాయి.
    కాని వాళ్ళకు తెలుసు అది నిరుపయోగమైన ఘోష అని.
    రాఘవమాత్రం కుర్చీలోంచి లేవకుండా చాలా సేపు వుండిపోయాడు. ఆ జనంలో అనంతమూర్తి కళ్ళు అతనికోసం వెతికాయి. ఎక్కడున్నాడో కనబడలేదు.
    అంతా వెళ్ళిపోయాక రాఘవ నెమ్మదిగా లేచి బయటకు వచ్చాడు.
    ఇల్లెక్కడో వుంది.
    నడుస్తున్నాడు. ఒక్కొక్క అడుగూ ఒక్కొక్క సత్యం చెబుతోంది నడవలేక అడుగు పడనప్పుడు సత్యం బాధగా మూలుగుతోంది.
    ఇంటికి వచ్చి తలుపు బాధగా బాధగా కోడలు వచ్చి తలుపు తీసింది.
    "అన్నం బల్లమీద వుంది." అని చెప్పి మళ్ళీ గదిలోకి వెళ్ళిపోయింది. రాఘవ తన గదిలోకి వెళ్ళి నెలమీద కూర్చున్నాడు. ఆ యిరుకు గదిలో గోడప్రక్కన ఓ పెట్టె వుంది. సంవత్సరాలనాటి పాతకాలపు ట్రంకుపెట్టె.
    దాని దగ్గరకు జరిగి వణికే చేతుల్తో మూత తెరిచాడు. పాత బట్టలున్నాయి. భార్యతో తీయించుకున్న పెళ్ళినాటి ఫోటో ఉంది.
    ఆమె చీరలున్నాయి. అన్నీ బయటకు తీశాడు.
    అడుగున...
    అలనాటి పిల్లనగ్రోవి వుంది.
    వణికే వ్రేళ్ళతో అందుకున్నాడు.
    ఏనాటి మాట?
    దగ్గరకు తీసుకొంటున్నాడు.
    ఎప్పటి సముద్ర తీరం?
    నోటిదగ్గర పెట్టుకుంటున్నాడు.
    ఎన్ని యుగాలయింది?
    అసలీ జన్మలో నేనా?
    పెదవుల కానించాడు.
    వణికే పెదవులు...
    కాని ఊదాయి.
    మురళి మ్రోగలేదు.
    మళ్ళీ ఊదాడు.
    ఉహూ ఏ ధ్వనీ రాలేదు.
    ముఖం వివర్ణమైపోయింది. కనులు చెమరుస్తున్నాయి.
    వేణువు చెడిపోయిందా!
    కాదు. చెడిపోయింది తన జీవితమే.
    ఆ తెల్లవారుఝాముననే అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు.
    
                                   * * *
    
    అనంతమూర్తి ఎక్కువ భాగం దేశ పర్యటనలో కాలం గడుపుతున్నాడు.
    ఈ మధ్యకాలంలో దేశంలో అనేక మార్పులు జరిగాయి.
    లోక్ సభ ఎన్నికలలో కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోయింది. ప్రపంచమంతా దిగ్భ్రమ చెందేవిధంగా జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS